– ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ
– కులగణన పేరుతో బీసీలకు కాంగ్రెస్ అన్యాయం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బీఆర్‌ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి కావస్తున్న తరుణంలో పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించబోతున్నట్టు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ వైపు పార్టీ రజతోత్సవ సంబరాలను ఏడాదంతా నిర్వహిస్తూనే, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల తరుపున పోరాటాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఏప్రిల్ 10 నుంచి 27 వరకు సభ్యత్వ నమోదు, రెండో వారంలో ప్రతినిధుల సభ, 27న భారీ బహిరంగ సభ ఉంటుదని వెల్లడించారు. అ తర్వాత అక్టోబర్, నవంబర్‌లో పార్టీ అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని తెలిపారు. విద్యార్థి, మహిళా విభాగాలు సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్ట పరచాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు.. ఇందు కోసం త్వరలో పార్టీ సీనియర్ నేతలతో కూడిన సబ్ కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభిస్తామని వివరించారు. ”కాంగ్రెస్ ఏడాది పాలనలో 400 మంది రైతులు, 50 మంది గురుకుల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటో డ్రైవర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎండా కాలం రాకముందే తాగునీటి సమస్య, కరెంట్ కోతలు తలెత్తాయి. విద్య, వైద్యాన్ని పేదలకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది” అని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించడంలో ఎనిమిది మంది ఎంపీలున్న బీజేపీ, కాంగ్రెస్‌లు విఫలమయ్యాయని ఆరోపించారు. ఢిల్లీలో బీఆర్‌ఎస్ ఎంపీలుంటే గతంలో లాగా కేంద్రం మెడలు వంచేందుకు పోరాడేదని గుర్తు చేశారు. కులగణన పేరిట కాంగ్రెస్ సర్కార్ బీసీలకు అన్యాయం చేసిందని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇస్తారో చెప్పాలని కేటీఆర్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.