వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్‌ఎస్‌యే : హరీశ్‌రావు

నవతెలంగాణ – హైదరాబాద్: మహిళలు మరింత బలోపేతమయ్యేలా కేసీఆర్‌ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. నారాయణపేట జిల్లా కోస్గిలో 150 పడకల ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాని మాట్లాడారు.”వచ్చే ఎన్నికల్లో గెలిచేది బిఆర్‌ఎస్‌నే. కేసీఆర్‌.. హ్యాట్రిక్‌ సీఎం అవుతారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్‌ నియోజకవర్గంలో లక్షా యాభైవేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. అధికారంలో ఉన్న కర్ణాటకలో.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్‌ తెలంగాణలో ఏం చేయగలదు? కాంగ్రెస్‌ పాలనలో ‘నేను రాను బిడ్డో.. సర్కార్‌ దవాఖానాకు’ అని పాడుకునే వారు. కోస్గిని రెవెన్యూ డివిజన్‌ చేయడం.. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో బిజెపి లేచేది లేదు, కాంగ్రెస్‌ గెలిచేది లేదు. మాటలు చెప్పే సర్కార్‌ కావాలా? చేతల సర్కార్‌ కావాలా? 3 గంటలు విద్యుత్‌ చాలు అనే రేవంత్‌ రెడ్డి కావాలా.. 24గంటలు కరెంట్‌ ఇచ్చే కేసీఆర్‌ కావాలా? కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు” అని హరీశ్‌రావు అన్నారు.

Spread the love