– అర్ధరాత్రి కాళ్లు, చేతులు కట్టేసి..కండ్లలో కారం చల్లి..
– ప్రయివేటు భాగాలపై డీజిల్ పోసి కాల్చిన వైనం
– పది రోజుల పాటు ఇంట్లోనే నిర్బంధం
– నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో అమానుష ఘటన
– దోషులను కఠినంగా శిక్షించాలి : సీపీఐ(ఎం) నేతలు
– విచారణ చేస్తున్నాం.. నిందితులను శిక్షిస్తాం : డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు
నవతెలంగాణ – మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
బయటి ప్రపంచం తెలియని చెంచు మహిళ. భర్తతో గొడవ పడి పుట్టింటికెళ్లింది. దుర్మార్గులు అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చి దారుణంగా హింసించారు. ఇంట్లో బంధించి వివస్త్రను చేసి ప్రయివేటు భాగాలపై డీజిల్ పోసి కాల్చారు. కండ్లల్లో కారం చల్లారు. కాళ్లు మొక్కుతా.. నన్ను వదలండి అంటూ ఏడ్చినా వదల్లేదు. ప్రయివేటు భాగాలపై ఇష్టానుసారంగా కొట్టారు. స్పృహ తప్పి పడిపోయినా కనికరం లేని నీచులు తమ ఇంట్లోనే ఎలాంటి వైద్యం లేకుండా పది రోజులు బంధించారు. బయటికి చెబితే.. కాల్చేస్తామని బెదిరించారు. ఈ అమానుష ఘటన నల్లమల అటవీ ప్రాంతంలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మొలచింతలపల్లి చెంచు పెంటకు చెందిన కాట్రావత్ ఈశ్వరమ్మపై బండి వెంకటేశ్వర్లు, అతని భార్య శివమ్మ, తమ్ముడు శివ కలిసి దాడి చేసి బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి చెంచు పెంటకు చెందిన కాట్రావత్ ఈశ్వరమ్మ- భర్త ఈదన్న. వారికి ముగ్గురు సంతానం. పది రోజుల కిందట భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో భార్య ఈశ్వరమ్మ పుట్టిల్లైన సుక్కాపూర్కు పోయి తలదాచుకుంది. అయితే, ఆమె భర్త ఈదన్న భార్య గురించి గ్రామంలో తెలిసిన వారిని అడిగాడు. జాడ తెలియకపోవడంతో ఈ విషయాన్ని తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న బండి వెంకటేశ్వర్లుకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో వెంకటేశ్వర్లు, అతని భార్య శివమ్మ, తమ్ముడు శివ కలిసి ఈశ్వరమ్మ ఎక్కడుందో తెలుసుకున్నారు. సుక్కాపూర్ వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. మార్గ మధ్యలోనే కొట్టి చిత్రహింసలు పెట్టారు. తర్వాత వెంకటేశ్వర్లు ఇంట్లో బంధించారు. కాళ్లు, చేతులు కట్టేసి పచ్చి మిర్చి కారాన్ని కండ్లల్లో, మర్మాంగాలపై పెట్టారు. బట్టలు ఊడదీసి ప్రయివేటు భాగాలపై డీజిల్ పోశారు. కట్టెకు బట్ట చుట్టి నిప్పంటించి తొడలు, మర్మాంగాలపై కాల్చారు. ఎంత రోధించినా వారు పట్టించుకోలేదు.
ఈశ్వరమ్మ భర్త అడ్డు వస్తే.. అతనిపై కర్రతో దాడి చేసి అక్కడి నుంచి తరిమివేశారు. తొడలు, వీపు వాచిపోయాయి. దాడి విషయం బయటికి పొక్కకుండా పది రోజులు ఇంట్లోనే నిర్బంధించారు. కనీసం చికిత్స కూడా చేయించలేదు. భర్త ఊళ్లో వారిని ఆరా తీసే క్రమంలో ఈ విషయం బయటపడింది. బుధవారం ప్రజా సంఘాలకు తెలిసి ఆందోళనకు పూనుకోగా, బాధితురాలిని కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే, సదరు నిందితులు చెంచు దంపతుల భూమిని కౌలుకు చేసుకుంటూ వారిని తమ వద్ద పనికి పెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు బుధవారం సాయంత్రం గ్రామానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి :ఆర్.శ్రీనివాసులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు
చెంచు మహిళపై దాడి అమానుషం. మహిళను వివస్త్రను చేసి డీజిల్ పోసి కాల్చడం అమానవీయం. ఈ దాడి సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. పోలీసులు వెంటనే నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి.
విచారణ చేస్తున్నాం.. దోషులను శిక్షిస్తాం : బుర్రి శ్రీనివాసులు- డీఎస్పీ, కొల్లాపూర్
మొలచింతలపల్లి గ్రామంలో జరిగిన అమానవీయ ఘటన పట్ల చింతిస్తున్నాం. ఇందుకు కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి రెండ్రోజుల్లోనే వారిని పట్టుకుంటాం. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స నడుస్తోంది. ఈ కేసు విషయంలో ఎవరికి ఎటువంటి అనుమానమూ అవసరం లేదు.