శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్‌ రావు కన్నుమూత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్‌ రావు) (75) కన్నుమూశారు. గురువారం మధ్యాహ్నం 3.30గంటల సమయంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. బీఎస్‌ రావు భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి విజయవాడలోని తాడిగడపకు తరలించారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు. ఆయన కుమార్తె సీమ విదేశాల్లో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.ఇంగ్లాండ్‌, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించిన బీఎస్‌రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్‌ కళాశాల ప్రారంభించారు. అక్కడి నుంచి
విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
చైతన్య దీప్తి.. డాక్టర్‌ బీఎస్‌రావు..
వైద్యమనేది బీఎస్‌ రావు వృత్తి అయితే.. విద్యావేత్త కావడం ఆయన అభిరుచి. గుంటూరు వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన ఆయన… ఇంగ్లాండ్‌, ఇరాన్‌లలో 15 ఏళ్ల పాటు వైద్యుడిగా సేవలందించారు. అనంతరం తన సతీమణి డా.ఝాన్సీ లక్ష్మీబాయితో కలిసి 1986 ఏప్రిల్‌లో భారత్‌కు తిరిగొచ్చి.. విజయవాడలోని పోరంకిలో బాలికల విద్యాసంస్థను స్థాపించారు. తొలుత 56మంది విద్యార్థులతో మొదలైన శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రస్థానం నేడు అంచెలంచెలుగా ఎదిగి దేశవ్యాప్తంగా లక్షలాది మందికి విద్యనందించే స్థాయికి చేరింది.
తాను ఇరాన్‌లో పనిచేస్తున్న సమయంలో భారత్‌కు వచ్చి తన కుమార్తెల విద్య కోసం ఓ మంచి స్కూల్‌ కోసం వెతికాననీ.. ఆ క్రమంలోనే బాలికల కోసం ప్రత్యేకించి కళాశాలలు తనకు కనిపించలేదని బీఎస్‌ రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పదో తరగతిలో మంచి ఫలితాలు సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్‌ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచలేకపోవడం కూడా విద్యాసంస్థస ఏర్పాటుకు మరో ప్రేరణ కలిగించే అంశంగా పేర్కొన్నారు. అందుకే ఇంటర్‌ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించగా.. అనతికాలంలోనే తమ విద్యా సంస్థకు చెందిన విద్యార్థులు ఐఐటీ, నీట్‌లలో మంచి ర్యాంకులు సాధించారని ఓ సందర్భంలో ఆయన వివరించారు.
శ్రీచైతన్య విద్యా సంస్థల ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు దాటి ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలకు చేరింది. 2006లో హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌, జార్కండ్‌, మధ్యప్రదేశ్‌లో ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న తన కుమార్తెలు సీమా, సుష్మా భారత్‌కు వచ్చి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చైతన్య విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.

Spread the love