”బౌద్ధం… నైతిక మార్గం”

''బౌద్ధం... నైతిక మార్గం''ఇప్పుడు దాదాపుగా ప్రతి ఇంటిలోనే కాదు, కార్పొరేట్‌ ఆఫీసుల్లోనూ బుద్ధుని ప్రతిమనో, చిత్రమో వచ్చినవారికి కనబడేట్టు ఆకర్షణీయంగా పెట్టుకుంటున్నారు. ఇక వేడుక ఏమైనా వేదిక ఏదైనా అక్కడా బుద్ధుని బొమ్మ ఏర్పాటు చేయడం చూస్తూనే ఉన్నాం. చేగువేరా గురించి ఎటువంటి అవగాహన లేకుండానే ఆయన స్టిక్కర్లు వాహనాలకు అతికించుకుని, టీ షర్టులు ధరించి తిరిగే యువతకీ, బుద్ధుని గురించి,ఆయన బోధనల గురించి కనీస జ్ఞానం లేకుండా కేవలం అలంకరణకు బుద్ధుని బొమ్మను వాడుకుంటున్న వారికీ తేడా ఏమాత్రం లేదనుకోవచ్చు. బుద్ధుని చిత్రం అదృష్టానికో, ఆకర్షణకో, ఆడంబరానికో సంకేతం కాదు. బుద్ధుని పూజిస్తే పుణ్యాలు రావు, పాపాలు పోవు. అమెరికా వీసానో, విదేశీ ఉద్యోగమో కాదు కదా పదో తరగతి పరీక్షా ఫలితంలో కూడా మార్పు రాదు. మరి ఏ మార్పూ రానప్పుడు,మనల్ని ఏమార్చనప్పుడు ఇంకెందుకు ఈ బుద్ధుడు అనే ప్రశ్న వచ్చిందా? రావాలి! బుద్ధుడు చెప్పినదీ అదే. ప్రశ్నించమని, ప్రశ్నించుకోమని, స్వీయ విమర్శ చేసుకోమని, నిన్ను నువ్వు తెలుసుకోమని ఈ ప్రశ్నల పరంపరలోనే బుద్ధుడే కాదు, నువ్వు నమ్మే ఏ దేవుడూ నీ కోసం ప్రత్యేక పైరవీలు చేయడని తెలుసుకోగలుగుతావు.
తిష్ట వేసుకుని ఉన్న మూఢ నమ్మకాల ప్రభావం నుంచి మనుషుల్ని మేల్కొలిపి ప్రజలకు ప్రజ్ఞ, జ్ఞానం, శీలం, కారుణ్యాలతో కూడిన విలువల గురించి బోధించి సమభావం పెంపొందించింది బౌద్ధమే. దేవుడూ, అతీంద్రియ శక్తులు, అదృశ్య మహిమల స్థానంలో మనిషి నడవడికకు, నాగరికతకు, నియమాలకు, సంఘ జీవనానికీ ప్రాధాన్యత కల్పించినదీ బౌద్ధమే. బుద్ధుడు దైవభక్తికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దానికి బదులుగా ధర్మం, శరణం గచ్ఛామి అంటూ ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అలాగే స్వర్గలోక ప్రాప్తికి, పాప విముక్తికి సూక్ష్మ మార్గాలు తెలుపలేదు. కానీ సంఘం శరణం గచ్ఛామి అంటూ సంఘం లేదా సమాజం బాగుంటే అది నీకు స్వర్గసమానమని తెలియపరిచాడు. తాను దేవుడిననో, దేవదూతననో, మీ కోసం మనిషి జన్మనెత్తిన అవతార పురుషుడిననో, ప్రవక్తననో, యుగకర్తననో, బుద్ధుడు ఎన్నడూ చెప్పుకోలేదు.
రక్త కాసారాల్లా మారిన యజ్ఞ, యాగాది క్రతువులను నిరసించి అహింసాయుత పూజా విధానాలని రూపొందించి, ఈర్ష్యాద్వేషాలు, హింసోన్మాదాలు, భావోద్వేగాలు లేని మాననీయ సంస్కృతిని ఈ భూమి నుంచే ప్రపంచానికి అందించిన బౌద్ధం చైనా, జపాన్‌, సింగపూర్‌, తైవాన్‌, మయన్మార్‌, మంగోలియా, కంబోడియా, థారులాండ్‌, లానోస్‌, వియత్నాం, టిబెట్‌ లాంటి అనేక దేశాలకు విస్తరించింది. బౌద్ధం ప్రేరణతో క్రీస్తుకు పూర్వం 2200 సంవత్సరాల క్రిందట విదేశీ విద్యార్థులను ఆకర్షించే 18 విశ్వ విద్యాలయాలు ఇక్కడ ఏర్పడటంతో నాడు విశ్వగురువు అనిపించుకునే అర్హత మన దేశానికి దక్కింది.
మనుషులకు జరుగుతున్న అన్యాయాలకు కారణం సాటి మనుషులేనని, మనుషులు తమ మనసును, ఆలోచనా విధానాలను వాటి వల్ల ఏర్పడే నడవడికలను మార్చుకునే ప్రయత్నం చేయడం వల్లనే మానవ జీవితం ఆనందమయ మవుతుందని అంటుంది బౌద్ధం. హద్దులు లేని స్వేచ్ఛ, కడుపారా తినడం, తాగడం, కామ సంభోగాల్లో మునిగి తేలడమే సుఖవంతమైన జీవితమనేది కొందరి భావన. ప్రతిఫలాలు ఆశించి చేసే ఉపవాసాలతోను, సంసార బంధాలకు భయపడి ఇంకేవో ఆశించి సన్యసించి ఎక్కడో దూరంగా జీవించడం ఇంకొందరి దృష్టిలో గొప్ప జీవితం. ఆ రెంటికీ మధ్య మార్గంగా సంఘహి తంగా, నైతిక విలువలతో గడిపే ధర్మ బద్ధమైన జీవనం గురించి చెప్పినదే బౌద్ధం.
ఒక మనిషి కుటుంబ పరంగా మంచివాడయితే చాలు అతడ్ని చాలా గొప్పగా భావిస్తారు. పిల్లలు, వారి పిల్లల భవిష్యత్తు కోసం అంటూ తండ్రులు, భార్యల సంతోషం కోసం అంటూ భర్తలూ ఎటువంటి సంకోచాలూ లేకుండా సంపాదన కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి కానీ జీవన ప్రమాణాలు, జీవనంలో నాణ్యతలు దిగజారుతున్నాయి. అందుకే నిర్మాణాలు నాసిరకం, పాలనలు అవినీతిమయం, ప్రవహించే నదులు, పీల్చే గాలీ కాలుష్యమయంగా మారడమే కాదు మానవ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు కూడా అనుమానాస్పదంగా మారి పోతున్నాయి. ఎందుకంటే మనిషి తన సుఖవంతమైన జీవితానికి కావలసిన డబ్బుని ఎలాగైనా సంపాదించుకుని అవసరమైతే పాప పరిహారార్థం ప్రత్యేక పూజలు, దానాలు, సంభావనలు, సంతర్పణలూ చేస్తే సరిపోతుందని భావించడం, అదే నిజమని కొందరు నమ్మించడం. కానీ బౌద్ధం సమ్యక్‌ జీవనానికి సమ్యక్‌ ఆదాయం అన్నది అంటే సరైన జీవనానికి కావలసింది సరైన ఆదాయం అని, అది ధర్మ బద్ధమై ఉండాలనీ, నీ వల్ల మరొకరికి నష్టం జరగకూడదని అష్టాంగ మార్గాలలో పేర్కొంది.
ఆధునికత, నాగరికత పేరుతో ఆధునిక ఆటవికత నేటి సమాజంలో పెరిగి పోతోంది. సభ్యత మరవడం, విచక్షణ లేకపోవడం వంటివి నాగరికతగా భావించే పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. హక్కులు, వ్యక్తిగత గుర్తింపుల పేరుతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. మానవ సంబంధాలు అపహాస్యం అవుతున్నాయి. పశు సమాజం నుంచి మానవ సమాజాన్ని వేరు చేసేవి పరస్పర సహాయ సహకారాలూ, నైతిక నియమాలే. ప్రతి వ్యక్తీ నైతిక నియమాలకు బద్ధుడు కావడమే స్వేచ్ఛకు అర్థం, ఆ నియమాలు లేని స్వేచ్ఛ విశృంఖలత్వం ఇది ఆటవికత కంటే భయంకరమైనది. అదే నేడు నాగరికతగా రంకెలేస్తోంది, లింగం, కులం, మతం, జాతి, ప్రాంతం లాంటి అనేకానేక రూపాల్లో వ్యక్తమై అమానవీయతకు ఆనవాలమవుతోంది.
నాడైనా, నేడైనా సమాజానికి కావలసింది నైతిక నాగరికత కానీ భౌతిక నాగరికత కానే కాదు. మనుషుల అవసరాల్ని, బలహీనతల్ని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని నాగరికతకు నైతిక శిక్షణ గురించి దాని అవసరం గురించీ తొలిసారి బోధించినది బౌద్ధమే. ఆ బోధనలు, శిక్షణలతోనే ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమ భావం, సమాజంలో ఏర్పడతాయి. అందుకే అప్పుడే కాదు, ఇప్పుడైనా, ఎక్కడైనా సమాజానికి నైతిక శిక్షణ అవసరమని బోధించిన బౌద్ధమే శరణ్యం.
(రేపు బుద్ధ జయంతి)
నరసింహ ప్రసాద్‌ గొర్రెపాటి
9440734501

Spread the love