హిమాచల్ ప్రదేశ్ లో పేక మేడల్లా కూలిన భవనాలు…

నవతెలంగాణ – హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో కొండచరియలు విరిగిపడడంతో పలు ఇళ్లు కుప్పకూలాయి. పేకమేడల్లా కూలిపోవడం కెమెరాలో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకు 280 మందికి పైగా చనిపోయారు. మరికొంతమంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్లు బ్లాక్ అవుతున్నాయి. తాజాగా గురువారం కులూలో పలు ఇళ్లు కూలిపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కుప్పకూలడం వీడియోలో కనిపిస్తోంది. దీంతో భారీగా దుమ్ము ఎగసిపడింది. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ఆ ఏరియాలోని ప్రజలను రెండు రోజుల ముందే ఖాళీ చేయించినట్లు సమాచారం. దీంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు చెబుతున్నారు. బిల్డింగ్ ల శిథిలాల కింద ప్రమాదవశాత్తూ ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని, వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని వివరించారు. ఇప్పటికే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయని చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖూ ట్వీట్టర్ లో ఆవేదన వ్యక్తంచేశారు. అప్రమత్తంగా వ్యవహరించి ప్రాణనష్టం తప్పించారంటూ అధికారులను మెచ్చుకున్నారు.

Spread the love