డబుల్‌ ఇంజన్‌ పేరుతో పేదలపై బుల్డోజర్‌

మోడీ, యోగి ప్రభుత్వాలపై మండిపడ్డ బి.వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చేసిన ప్రసంగం, అభివృద్ధి గురించి చెప్పిన గొప్పలు గ్రామీణ ప్రాంతాల్లో భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌ విమర్శించారు. యూపీలో గ్రామీణ ప్రాంత ప్రజల స్థితిగతుల పరిశీలనకు వెంకట్‌ నాయకత్వాన మూడు రోజులుగా అనేక జిల్లాల్లో వ్యకాస బృందం పర్యటించింది. ఈ సందర్భంగా గత రెండు రోజులుగా మురదాబాద్‌, బరేలీ జిల్లాలలో పర్యటించిన అనంతరం ఈ బృందం గమనించిన అంశాలను వెంకట్‌ మీడియాకు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువై, బతుకు బరువై, పెరుగుతున్న నిత్యావసర ధరలతో జీవనం సాగించలేక దేశంలోని అనేక ప్రాంతాలకు యూపీ ప్రజలు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తినటానికి తిండి లేక, పస్తులుంటున్న కుటుంబాలు అనేకం కనిపించాయని, ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం పేదలకు అందుబాటులో లేదని అన్నారు. ఉపాధికి కేంద్రం రూ.1,50,000 కోట్లు నిధులు కుదించినందున గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులన్నీ అటకెక్కాయని ఫలితంగా మోడీ, యోగి ప్రభుత్వాల పట్ల గ్రామీణ పేదల్లో తీవ్రమైన ఆగ్రహావేశాలు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదారి పట్టించి, ప్రజలు ఐక్యం కాకుండా మతోన్మాద చర్యలను మోడీ, యోగి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రయోగిస్తున్నదని విమ ర్శించారు. పేదలపై తమ ప్రతాపం చూపె డుతున్న యోగి ప్రభుత్వం యూపీలో సంపదనంతా లూటీ చేసేందుకు కార్పొరేట్లకు లైసెన్స్‌ ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రతిఘటించిన ప్రజలను, ఉద్యమకారులను లాఠీలు తూటాలతో అణిచివేతకు పాల్పడుతున్నారని , పేదలను పిట్టలను కాల్చినట్లు అమానుషంగా కాల్చి చంపుతున్నారని విమర్శించారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య విచ్చిన్న చర్యలకు ఒడిగడుతున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 4 కోట్ల మంది దళితులు, 5 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, దేశంలోనే అనేక రాష్ట్రాల జనాభాకు రెట్టింపు సంఖ్యలో దళితులు మైనారిటీలు యూపీలో ఉన్నారని తెలిపారు. 80 శాతం దళితులు నేటికీ వ్యవసాయ కార్మికులుగానే ఉన్నారని, ఉపాధి కోసం వస్తున్న అరకోరా నిధులు కూడా వారికి దక్కటం లేదని అన్నారు. అధికారంలో ఉన్న బిజెపి, ఇతర నేత లు నకిలీ జాబు కార్డులతో ఉపాధి నిధులను దోచు కుంటున్నారన్నారు. చేసిన పనులకు కూడా వేతనా లు ఇవ్వకుండా వేధిస్తు న్నారని తెలిపారు. ఉపాధి హామీ చట్టం అమలు ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారు ణంగా ఉందని అన్నారు. ఈ అధ్యయన బృందంలో వెంకట్‌తో పాటు వ్యకాస నాయకులు బ్రిజ్‌ లాల్‌ భారతి, రాజీవ్‌, తాన్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love