– అబూజ్‌మడ్‌లో 12 మంది మావోయిస్టుల మృతి
– నారాయణపూర్-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో ఘటన
నవతెలంగాణ-చర్ల
సరిహద్దు ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ అడవుల్లో మళ్లీ తూటా పేలింది. అటు దంతేవాడ జిల్లా ఇటు బీజాపూర్ జిల్లా సరిహద్దులోని అబూజ్‌మడ్ దండకారణ్యం రేఖ వాయ గ్రామ సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు దంతేవాడ ఎస్పీ గౌరవరై తెలిపారు. అయితే 15న కేంద్రహౌం శాఖమంత్రి అమిత్‌షా బస్తర్ పర్యటనకు ముందే ఈ కాల్పులు జరగటం చర్చనీయాంశంగా మారింది.
ఎస్పీ గురువారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున నారాయణపూర్, దంతేవాడ జిల్లాల సరిహద్దులోని దక్షిణ అబూజ్‌మడ్ అడవుల్లో ఇంద్రావతి ఏరియా కమిటీకి చెందిన 40 నుంచి 50 మంది పెద్ద క్యాడర్ మావోయిస్టుల ఉనికి ఉన్నట్టు సమాచారం అందింది. దీంతో దంతెవాడ, నారాయణ పూర్, కొండగావ్, బస్తర్ జిల్లాలకు చెందిన సైనికులు, డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు అడవిని చుట్టుముట్టాయి. ఈ క్రమంలో బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ఎస్పీ ధ్రువీకరించారు. కాంగ్రెస్ హయాంలో మరణించిన మావోయిస్టుల సంఖ్య కంటే, బీజేపీ ప్రభుత్వ హయాంలో కేవలం ఒక ఏడాదిలోనే 220 మంది మావోయిస్టులు హతమయ్యారు.
అమిత్‌షా పర్యటనకు ముందు ఎదురు కాల్పులు
కేంద్ర హౌంమంత్రి అమిత్ షా 15న బస్తర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా భద్రతా బలగాలను దింపారు. అయితే మాద్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వేయి మందికి పైగా సైనికులను ఆపరేషన్ కోసం రప్పించారు. మావోయిస్టులు సమావేశమైన ప్రాంతాన్ని చుట్టుముట్టారు. మావోయిస్టులకు, భద్రతా బలగాలకు జరిగిన ఎదురు కాల్పు లతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైందని స్థానికులు తెలిపారు. ఎన్‌కౌంటర్ అనంతరం మంత్రి విజరు శర్మ మాట్లాడుతూ మావోయిస్టులను నియంత్రించే చర్యలు కొనసాగుతాయని చెప్పారు.