ఫ్రీ జర్నీకి బస్సులేవి..?

Buses for free journey..?– నిత్యం తోపులాటలే..
– సీటు దొరకడం గగనమే..
– గంటల తరబడి నిల్చునే ప్రయాణాలు
– పెరిగిన ప్రయాణికుల సంఖ్య..సిబ్బందిపై పని భారం
– గ్రేటర్‌లో భారీగా తగ్గిన బస్సులు
– రద్దీకి తగ్గట్టు నడవని బస్సులు
మహాలక్ష్మి పథకం ఆర్టీసీకి వరంగా మారింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక రద్దీ విపరీతమైంది. రోజువారీగా ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆ మేరకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుండటంతో సంస్థ ఖజానాకు కూడా ప్రయోజనం చేకూరుతోంది. ఉచిత ప్రయాణం మహిళలకు కలిసొస్తుండగా.. ఆర్టీసీకి ఆదాయం సమకూరుతోంది. కానీ..! రద్దీకి తగ్గ బస్సుల్లేవని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. నిత్యం ప్రయాణించే వాళ్లు బస్సెక్కాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు రెండింతలు పెరిగితే బస్సులు మాత్రం పావొంతు కూడా పెరగలేదు. దాంతో రాష్ట్రంలో పల్లె వెలుగు మొదలు ఎక్స్‌ప్రెస్‌ ఇతర బస్సులన్నీ కాలుమోపే స్థలంలేకుండా కిక్కిరిసిపోయిన రద్దీతో నడుస్తున్నాయి. పురుషులకైతే సీటు దొరికే అవకాశమే లేదు. ఇక, ఆర్టీసీ సిబ్బంది అయితే ఒత్తిడితో చిత్తవుతున్నారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/సిటీ బ్యూరో
డిసెంబర్‌ 9న రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా మహాలక్ష్మి పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి బస్సుల్లో రద్దీ విపరీతమైంది. రాష్ట్రంలో మూడు జోన్లు, 11 రీజియన్ల పరిధిలో 95 ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 364 బస్‌స్టేషన్లున్నాయి. పాతవి, కొత్తవి కలిపి పది వేల బస్సులు నడుస్తున్నాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా రీజియన్‌ పరిధిలో 8 డిపోలున్నాయి. వీటి పరిధిలో 680 బస్సులు నడుస్తున్నాయి. నిత్యం 2.05 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు ప్రయాణిస్తూ 2.60 లక్షల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నది నిజమే అయినా ప్రయాణికులు మాత్రం నరకం అనుభవిస్తున్నారు.
పెరిగిన ప్రయాణికులు.. ఆదాయం..
మహాలక్ష్మి పథకం ప్రారంభం కాకముందు ఆర్టీసీ వేరు.. ఉచిత ప్రయాణం ప్రారంభమయ్యాక ఆర్టీసీ వేరు అని చెప్పాలి. గతంలో ఆర్టీసీ బస్సులు నడవడమే గగనమైంది. ప్రస్తుతం బస్సుల్ని నడపడం కష్టమవుతోంది. రాష్ట్రంలో ఉచిత ప్రయాణానికి ముందు ప్రతి రోజూ రూ.16 నుంచి 17 కోట్ల ఆదాయం సమకూరేది. అప్పట్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) 64 శాతముండేది. అప్పట్లో రోజుకు 30 లక్షల మంది వరకే ప్రయాణించేది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున 45 నుంచి 50 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అందులో 30 లక్షల వరకు మహిళలే ఉంటున్నారు. అంటే 62 శాతం మంది మహిళా ప్రయాణికులే ఉంటున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగినందున ఆర్టీసీకి రోజువారీగా ప్రస్తుతం రూ.20 కోట్ల మేరకు ఆదాయం సమకూరుతోంది. నగదు రూపంలో రూ.10 నుంచి 11 కోట్ల వరకు ఉంటుంది. దాంతోనే డీజిల్‌, నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలు నెట్టుకొస్తున్నారు. మహిళల ఉచిత టికెట్లకు సంబంధించిన రియంబర్స్‌మెంట్‌ డబ్బుల్ని ప్రభుత్వం క్యాటరీలుగా ఆర్టీసీకి చెల్లిస్తోంది. ఉమ్మడి మెదక్‌ రీజియన్‌ పరిధిలోనూ ఉచితానికి ముందు రోజు 1.80 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. ప్రస్తుతం 2.60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అంటే 80 లక్షల మంది ప్రయాణికులు పెరిగారంటే అది ఉచిత ప్రయాణం వల్లనే. ఆక్యూపెన్సీ రేషియో కూడా గతంలో 70 శాతం ఉండగా ప్రస్తుతం 98 శాతానికి పెరిగింది.
చాలని బస్సులు.. పెరగని రూట్లు
ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగినప్పటికీ రద్దీకి తగినట్టుగా బస్సుల్ని పెంచలేదు. ఇటీవల 1325 కొత్త బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వీటిలో పల్లె వెలుగు 712, ఎక్స్‌ప్రెస్‌లు 400, డీలక్స్‌లు 75, ఇతర బస్సులు 138 వరకు ఉన్నాయి. అయితే పాత బస్సుల్లో వేల బస్సులు నడపలేని స్థితికి చేరాయి. డిసెంబర్‌ 2023 నుంచి ఇప్పటి వరకు ఏడు నెలల కాలంలో ఉచిత ప్రయాణం వల్ల ప్రతి బస్సులో 45 మందికి బదులు 80 మందికిపైనే ప్రయాణిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రెండు మూడు గంటల పాటు నిల్చుండి ప్రయాణిస్తే తప్ప.. గమ్యస్థానం చేరలేని పరిస్థితి నెలకొంది. ఓవర్‌లోడ్‌ పడి బస్సులు దెబ్బతిన్నాయి. ప్రతి ఏటా కొన్ని బస్సుల కాలపరిమితి మీరి మూలకు పడేయాల్సి వస్తది. ఈ లెక్కన చూస్తే ఇటీవల పెరిగిన బస్సులు ప్రయాణికుల రద్దీని ఏ మాత్రం తగ్గించలేవు. ముఖ్యంగా హైదరాబాద్‌కు చేరుకునేందుకు 33 జిల్లా కేంద్రాల నుంచి ప్రదాన రహదారుల రూట్లల్లో నడిచే బస్సులు సరిపోవడంలేదు. అలాగే ఇప్పటికే అనేక మండల కేంద్రాల్లోనూ బస్సులు నడవట్లేదు. ఊర్ల విషయమైతే చెప్పనక్కర్లేదు. పిల్లలు బడికి సైతం బస్సుల్లేక ఆటోలు, ప్రయివేట్‌ బస్సుల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. పల్లెవెలుగులంటే ఊర్ల రూట్లలో తిరగాలి. కానీ..! బస్సుల కొరత వల్ల వాటిని సైతం ఎక్స్‌ప్రెస్‌లు నడిచే రూట్లలో నడుపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, రామాయంపేట వైపు నడిచే బస్సుల సంఖ్య పెరగకపోవడం వల్ల కిక్కిరిన జనాలతో బస్సులు నడుస్తున్నాయి. రద్దీని తట్టుకోలేక డ్రైవర్లు.. జనాలు బస్సు కోసం చెయ్యెత్తినా ఆపట్లేదు. విద్యార్థులు, ఉద్యోగులు బ్యాగులేసుకుని రద్దీలో ప్రయాణించడం నరకంగా మారిందంటున్నారు.
సిబ్బందిపై పని భారం
ఆర్టీసీలో రిటైర్‌మెంట్స్‌ తప్ప రిక్రూట్‌మెంట్స్‌ జరగట్లేదు. పైగా ఉచిత ప్రయాణం వల్ల ప్రయాణికులు రెట్టింపయ్యారు. 2024 మే నెలలో రాష్ట్రంలో 43,971 మంది ఉద్యోగులుండగా ప్రస్తుతం తగ్గారు తప్ప పెరగలేదు. ఫ్రీ బస్‌ తర్వాత ఒక రూట్‌లో నడిచే బస్సు అప్‌ అండ్‌ డౌన్‌ సమయం పెరుగుతోంది. నారాయణఖేడ్‌ నుంచి యాదగిరిగుట్టకు నడిచే బస్సుకు ఒక ట్రిప్‌కు గతం కంటే ప్రస్తుతం 2 గంటల అదనం సమయం పడుతుందని డ్రైవర్‌, కండక్టర్‌ చెబుతున్నారు. ఒక డ్యూటీలో మూడు నుంచి నాలుగు గంటలు అదనంగా పనిచేస్తున్నారు. పైగా బస్సులు ఓవర్‌లోడ్‌తో నడపడం వల్ల డ్రైవర్‌పై మానసిక ఒత్తిడి పెరుగుతోంది. కండెక్టర్‌కు టికెట్‌ ఇష్యూ చేయడంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంకట్‌రెడ్డి, లక్ష్మి పేర్కొన్నారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీగా తగ్గిన బస్సులు
హైదరాబాద్‌ నగర విస్తరణతోపాటు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గ్రేటర్‌లో ప్రజారవాణా మెరుగుపడకపోగా.. ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గింది. మహాలక్ష్మి పథకంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదు. ఫలితంగా బస్సుల్లో జనం కిక్కిరిసి ప్రయాణం చేయాల్సి వస్తోంది. గతంలో గ్రేటర్‌లోని 24 డిపోల పరిధిలో 3800 బస్సులు నడిచేవి. గడిచిన మూడేండ్ల కాలంలో వెయ్యి బస్సులు తగ్గిపోయాయి. ప్రస్తుతం 2850 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు గతంలో గ్రేటర్‌లో 11-12లక్షల మంది బస్సుల్లో ప్రయాణించేవారు. ప్రస్తుతం రోజుకు 21లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇదిలావుంటే చైన్నెలో 7వేలు, బెంగళూరులో 5,500 బస్సులు నడుస్తుండగా.. మన నగరంలో కనీసం 7వేల బస్సులు అవసరమని రవాణా నిపుణుల అంచనా. ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం 3500 బస్సులు సరిపోతాయని చెబుతున్నారు. త్వరలో 555 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కాలం చెల్లిన బస్సుల స్థానంలో మరో 500 కొనుగోలు చేయనున్నట్టు వివరించారు.
ఆదాయం పెరిగింది: ప్రభులత, మెదక్‌ రీజియన్‌ మేనేజర్‌
ఉచిత ప్రయాణం తర్వాత ప్రయాణికులు పెరిగారు. ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మెదక్‌ రీజియన్‌లో 87 కొత్త బస్సులొచ్చాయి. ఖాళీల్ని భర్తీ చేసే ప్రక్రియ కూడా జరగనుంది. ప్రయాణికుల ఇబ్బందుల్ని తీర్చేందుకు సంస్థ ప్రయత్నిస్తుంది.
నేడు హైదరాబాద్‌ బస్‌భవన్‌ ఎదుట ధర్నా
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఏండ్లుగా నడుస్తున్న సర్వీసులను సైతం రద్దు చేయడంతో జనం అవస్థలు తీవ్రమయ్యాయి. కొన్నిరూట్లలో నాలుగైదు బస్సులు నడిపేచోట ఒకటి రెండు మాత్రమే నడుపుతున్నారు. ఈ క్రమంలో నగరంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వేతోపాటు సంతకాల సేకరణ నిర్వహించారు. గ్రేటర్‌ అంతటా ఇదే పరిస్థితి నెలకొన్నట్టు బయటపడింది. సిటీ ప్రయాణికుల అవసరాలకు సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రజలు ప్రయివేట్‌ రవాణాను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండటంతో పాటు ట్రాఫిక్‌, కాలుష్య సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా అభివృద్ధి కోసం బస్సులు, రైళ్ల పెంపుదల కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గురువారం (నేడు) ఆర్టీసీ బస్‌ భవన్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు.

Spread the love