– ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్నమోడీ
– రాజకీయ మార్పులను గుర్తించేందుకు నిరాకరణ
– చట్టసభలో ఇక ఘర్షణ వాతావరణమే
– ప్రతిపక్షాల దాడితో ఉక్కిరిబిక్కిరి తప్పదు
– సర్కారుకు దినదిన గండమే
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న రాజకీయ మార్పులను గుర్తించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిరాకరిస్తున్నారు. పది సంవత్సరాల తర్వాత లోక్‌సభలో తన పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదన్న వాస్తవాన్ని ఆయన జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోడీ రెండు గంటలకుపైగా సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తున్నంతసేపూ ప్రతిపక్ష సభ్యులు ‘మణిపూర్‌ను రక్షించండి’, ‘భారత్ జోడో’ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను రికార్డుల నుండి తొలగించాలని స్పీకర్ ఓం బిర్లా తీసుకున్న నిర్ణయం ఈ ఘర్షణ వాతావరణానికి కారణమైంది. ప్రతిపక్ష నేత ప్రసంగంలోని కొంత భాగాన్ని రికార్డుల నుండి తొలగించడం కూడా ఇదే మొదటిసారి. ప్రధాని మాటలకు ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్ష నేత మాటలకు కూడా అంతే విలువ, గౌరవం ఉంటుంది.
ఘర్షణ తప్పదేమో?
ఏకాభిప్రాయంతో పనిచేస్తామని అధికార, ప్రతిపక్ష సభ్యులు తొలుత హామీ ఇచ్చినప్పటికీ సమావేశాలలో ఎక్కడా ఆ వాతావరణం కన్పించలేదు. 18వ లోక్‌సభ తొలి సమావేశాల తీరును గమనిస్తే రాబోయే కాలంలో ఇరు పక్షాల మధ్య ఘర్షణ తప్పదన్న సంకేతం కన్పించింది. సభలో తరచుగా వ్యక్తిగత దూషణలు కూడా వినిపించాయి. ఇలాంటి పరిస్థితులలో రాబోయే కాలంలో సభ ఎలా నడవబోతోందని అంచనా వేయడం కష్టమేమీ కాదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి ప్రధాని ఎంత గొప్పగా మాట్లాడినప్పటికీ 16వ, 17వ లోక్‌సభలు ఎలా నడిచాయో ప్రస్తుత లోక్‌సభ కూడా అదే దారిలో నడుస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రోజూ గండమే
16వ, 17వ లోక్‌సభ సమావేశాలలో అంతరాయాలు, వాకౌట్లు, గందరగోళాలు, చివరికి బీజేపీ యేతర సభ్యుల సస్పెన్షన్లు వంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం తెలిసిందే. అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉండడంతో అప్పుడు దాని ఆటలు సాగాయి. అయితే ఇప్పుడు లోక్‌సభ పొందిక గతానికి భిన్నంగా ఉంది. అధికార పక్షం తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష ఇండియా బ్లాక్ 234 మంది ఎంపీలతో బలంగా ఉంది. కాబట్టి దాని గొంతు నొక్కడం అంత తేలిక కాదు. 17వ లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలు మహువా మొయిగ్రా సభా సంఘం బహిష్కరించింది. ఆ కమిటీలోని పలువురు సభ్యులు ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. సభలో బీజేపీకి ప్రస్తుతం 240 మంది సభ్యులు ఉన్నారు. అంటే ప్రతిపక్ష కూటమి కంటే కేవలం ఆరు స్థానాలు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. సంకీర్ణ భాగస్వాములతో కలిపి ఎన్డీఏ బలం 293. ఇది ఏ రకంగా చూసినప్పటికీ స్వల్ప మెజారిటీయే. అంటే ప్రభుత్వానికి ఇక దినదిన గండం తప్పదు. అయితే ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి మోడీ, బీజేపీ ఇష్టపడడం లేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు మోడీ ఇచ్చిన సమాధానాన్ని గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
అవి వికటించిన ఎత్తుగడలే
మోడీ తన ప్రసంగంలో అధిక సమయాన్ని రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై దాడికే వెచ్చించారు. మధ్యలో వికసిత్ భారత్, లక్‌పతి దీదీ ప్రస్తావన తెచ్చారు. హిందూ సమాజానికి తానే రక్షకుడిని అనే విధంగా వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇవే ఎత్తుగడలను ఆయన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అనుసరించారు. అయితే అది వికటించి బీజేపీ 63 స్థానాలను నష్టపోయింది. లోక్‌సభలో మ్యాజిక్ ఫిగర్‌కు ఆమడ దూరంలో నిలిచింది.
దాడిని తట్టుకోవడం ఈజీ కాదు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చకు మోడీ ఇచ్చిన సమాధానంలో ఈ అంశాలేవీ ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. పరీక్షా పత్రాల లీకేజీని గురించి మాట్లాడినప్పటికీ లక్షలాది మంది యువ విద్యార్థులకు ఆ మాటలు ఊరట ఇవ్వలేకపోయాయి. వారికి సాంత్వన కలిగించలేకపోయాయి. కాగా భవిష్యత్తులో ప్రతిపక్షాల వ్యూహం ఎలా ఉంటుందన్నది ఆయా పార్టీల నేతల ప్రసంగాలను బట్టి అర్థమవుతోంది. ఎన్నికల ప్రచారం సమయంలో ఇండియా బ్లాక్ లేవనెత్తిన నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పలు అంశాలను రాహుల్ తన ప్రసంగంలో లేవనెత్తి ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. పరీక్షా పత్రాల లీకేజీలు కూడా వారికి ఆయుధాలుగా మారాయి. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే రాబోయే కాలంలో మోడీ, బీజేపీలు ప్రతిపక్షాల దాడిని తట్టుకోవడం అంత తేలిక కాదని అనిపిస్తోంది. ఏదేమైనా గతంలో కంటే ఇప్పుడు భిన్నమైన వాతావరణం స్పష్టంగా కన్పిస్తోంది. రాహుల్‌పై వ్యక్తిగత విమర్శలకు స్వస్తి చెప్పి, కాంగ్రెస్‌ను అదే పనిగా నిందించడం మానేసి, ప్రజలు ఇచ్చిన తీర్పును సరిగా అర్థం చేసుకొని, తప్పిదాలను సరిదిద్దుకుంటే మంచిది. లేకుంటే ప్రజల దృష్టిలో మోడీ, బీజేపీ మరింత చులకన కాక తప్పదు.
అన్నీ వ్యతిరేకతలే
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీకి అన్నీ కుదుపులు, ‘అపశకునాలే’ ఎదురవుతున్నాయి. యూజీసీ-నెట్, నీట్ పరీక్షలు ప్రహసనంగా మారాయి. కుంభకోణాలు, లీకేజీలతో అవి రద్దు కావడమో లేదా వాయిదా పడడమో జరిగింది. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, వెడల్పాటి రోడ్లు, వందేభారత్ రైళ్ల రూపంలో మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. చివరికి అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో కూడా పైకప్పు లీకై నీరు కారింది. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌లో నిర్వహించిన ప్రార్థనా సమావేశంలో తొక్కిసలాట జరిగి 161 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు బిమోల్ అకోయిజామ్ లోక్‌సభలో చేసిన అర్థరాత్రి ప్రసంగం అధికార పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.