జోరుగా వడ్ల కొనుగోలు

– రైతు ఖాతాల్లో డబ్బులు
నవతెలంగాణ-నార్సింగి
మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు జోరుగా సాగుతుంది. రైతులు పండించిన వరి కొనుగోలుకుగాను ఐకేపీ, పిఎసిఎస్‌, ఎఫ్పీసీల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసారు. వానా కాలం పంట దిగుబడి అధికంగా ఉన్నా రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. వడ్లు కాంటా వేయడం, వెంటనే లారీలలో లోడ్‌ చేసి మిల్లులకు పంపడం, ఆన్లైన్‌ చేయడం, వెంటనే ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా తగు ఎర్పాట్లు చేశారు. గత 3-4 రోజుల నుంచి మబ్బులు కమ్ముకుని ఉండడంతో కొనుగోళ్లు మందగించినా ఆదివారం మళ్ళీ వడ్లను కంటా వేయడం మొదలు పెట్టారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఐకేపీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 126 రైతులకు చెందిన 15457 సంచులను కొనుగోలు చేశారు. 114 మంది రైతుల కొనుగోలు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయగా, వందకు పైగా రైతుల ఖాతాలలో డబ్బులు జమయ్యాయి. జమైన డబ్బులు కోటి పైనే అని నిర్వాహకుడు లక్ష్మణ్‌ తెలిపారు. 12 రైతులకు చెందిన 480 సంచుల వివరాలు ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందని, సంచులు మిల్లులో ఖాళీ అయిన వెంటనే ఆన్లైన్‌ చేయడం జరుగుతుందని తెలిపారు. నమోదైన 4-5 రోజులలో వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని తెలిపారు. ఫార్మర్స్‌ పర్చేసింగ్‌ కంపెనీ (ఎఫ్పీసీ)లో ఇప్పటి వరకు 234 రైతులకు చెందిన 21605 సంచుల కొనుగోలు జరిగిందన్నారు. 192 రైతుల ఆన్లైన్‌ నమోదు, ఖాతాలో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. 22 మంది రైతులకు డబ్బులు జమ అవ్వాల్సి ఉందని, 20 మంది రైతుల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయాల్సి ఉందని నిర్వాహకుడు హరీష్‌ వివరించారు. దాదాపు 10 లారీల వడ్లు కొనుగోలు జరగవచ్చన్నారు. ప్రైమరీ అగ్రికల్చరల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (పిఎసిఎస్‌)లో 179 మంది రైతులకు చెందిన 20583 సంచులను కొనుగోలు చేయగా, 155 రైతుల వివరాలు ఆన్లైన్‌ లో నమోదు చేశామని, 24 మంది రైతుల వివరాలు నమోదు చేయాల్సి ఉందని స్వామి తెలిపారు. మరో 10-12 లారీల వడ్లు కొనుగోలు జరగవచ్చన్నారు.

Spread the love