బజ్‌బాల్‌ ధనాధన్‌

Buzbal Dhanadhan– కాన్పూర్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ షో
– బంతితో బుమ్రా, సిరాజ్‌, అశ్విన్‌ మెరుపులు
– బ్యాట్‌తో యశస్వి, రాహుల్‌, విరాట్‌ దూకుడు
– రెండో టెస్టులో ఫలితం ఆశలు సజీవం
ఎడతెగని వర్షంతో తొలి మూడు రోజుల్లో 35 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. నాల్గో రోజు ఆటలో భారత క్రికెటర్లు గత రెండు రోజుల ఆకలి తీర్చుకున్నారు. బంతితో, బ్యాట్‌తో బంగ్లాదేశ్‌పై ముప్పేట దాడి చేశారు. బుమ్రా, సిరాజ్‌, అశ్విన్‌ దెబ్బకు బంగ్లాదేశ్‌ చివరి ఏడు వికెట్లను 121 పరుగులకే కోల్పోయింది.
సమయం లేదు మిత్రమా.. అంటూ యశస్వి, రాహుల్‌, కోహ్లి వీరవిహారం చేశారు. టెస్టు మ్యాచ్‌లో టీ20 తరహా ఇన్నింగ్స్‌లతో దంచికొట్టారు. 8.22 రన్‌రేట్‌తో పరుగుల వరద పారించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
ఆఖరు రోజు ఆటలో గెలుపే లక్ష్యంగా భారత్‌ బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో ఉదయం సెషన్లోనే ముగించేసి.. టెస్టు సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకోవాలని టీమ్‌ ఇండియా ప్రణాళిక. మరోసారి బౌలర్లు, బ్యాటర్లు బజ్‌బాల్‌ ధనాధన్‌తో రెచ్చిపోతే నేడు ఫలితం పెద్ద కష్టమేమీ కాబోదు!.
నవతెలంగాణ-కాన్పూర్‌
వర్షం ఆటంకంతో నిస్తేజంగా మారిన కాన్పూర్‌ టెస్టుకు టీమ్‌ ఇండియా జీవం పోసింది. మూడు రోజుల ఆటలో 35 ఓవర్లు మాత్రమే ఆడటంతో.. ఇక ఫలితం తేలటం కష్టమే అనిపించింది. కానీ భారత బౌలర్లు, బ్యాటర్లు దంచికొట్టడంతో గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో భారత్‌, బంగ్లాదేశ్‌ రెండో టెస్టు ఫలితం దిశగా సాగుతోంది!. బుమ్రా (3/50), సిరాజ్‌ (2/57), అశ్విన్‌ (2/45), ఆకాశ్‌ (2/43) రాణించటంతో బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 233 పరుగులకే కుప్పకూలింది. మోమినుల్‌ హాక్‌ (107 నాటౌట్‌, 194 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (72, 51 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెఎల్‌ రాహుల్‌ (68, 43 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీలు బాదగా.. విరాట్‌ కోహ్లి (47), శుభ్‌మన్‌ గిల్‌ (39), రోహిత్‌ శర్మ (23) ధనాధన్‌ ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 285/9 పరుగుల వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 26/2తో ఆడుతోంది. ఇస్లాం (7 నాటౌట్‌), మోమినుల్‌ (0 నాటౌట్‌) అజేయంగా క్రీజులో నిలిచారు. నాల్గో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్‌ 26 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది.
బుమ్రా ఉగ్రరూపం!
ఓవర్‌నైట్‌ స్కోరు 107/3తో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌ భారత పేసర్ల ధాటికి మరో 121 పరుగులకే చివరి ఏడు వికెట్లను కోల్పోయింది. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా ఉగ్రరూపం దాల్చాడు. ముష్ఫీకర్‌ (11), మెహిది (20), తైజుల్‌ (5) వికెట్లను పడగొట్టిన బుమ్రాకు.. సిరాజ్‌, అశ్విన్‌ జతకలిశారు. ఓ ఎండ్‌లో మోమినుల్‌ హాక్‌ (107 నాటౌట్‌) అజేయ సెంచరీతో బంగ్లా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించగా.. మరో ఎండ్‌ నుంచి వికెట్ల వేటను సాగించారు. లిటన్‌ దాస్‌ (13), హసన్‌ (1)లను సిరాజ్‌ ఖాతాలో వేసుకోగా.. ఖలీద్‌ (0) వికెట్‌తో రవీంద్ర జడేజా టెస్టుల్లో 300వ వికెట్‌ను సాధించాడు. 74.2 ఓవర్లలో 233 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ కుప్పకూలింది.
కలిసికట్టుగా కొట్టారు
వర్షంతో ఎనిమిది సెషన్ల ఆట రద్దు కాగా.. మ్యాచ్‌లో ఫలితం కోసం భారత్‌ టీ20 శైలిని అనుసరించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఎదుర్కొన్న తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. యశస్వి జైస్వాల్‌ బౌండరీల మోత మోగించాడు. దీంతో 3 ఓవర్లలోనే భారత్‌ 50 పరుగుల మార్క్‌ చేరుకుంది. రోహిత్‌ నిష్క్రమించినా.. శుభ్‌మన్‌ (39) తోడుగా జైస్వాల్‌ చెలరేగాడు. 10.1 ఓవర్లలోనే 100 పరుగులు పిండుకున్న భారత్‌.. ఎక్కడా జోరు తగ్గలేదు. రిషబ్‌ పంత్‌ (9) ఒక్కడే అంచనాలను అందుకోలేదు. విరాట్‌ కోహ్లి (47), కెఎల్‌ రాహుల్‌ (68) మెరుపు వేగంతో పరుగులు పిండుకున్నారు. 34.4 ఓవర్లలో 8.22 రన్‌రేట్‌తో పరుగులు చేసిన భారత్‌ 285 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లరేషన్‌ ప్రకటించింది. తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది.
అశ్విన్‌ మాయ
నాల్గో రోజు ఆఖర్లో చివరి 45 నిమిషాల ఆటలో అశ్విన్‌ మాయ చేశాడు. రెండు వికెట్లతో బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలో పడేశాడు. ఇస్లాం (7 నాటౌట్‌), మోమినుల్‌ (0 నాటౌట్‌) అజేయంగా నిలిచారు. జాకిర్‌ హసన్‌ (10), హసన్‌ మహ్మద్‌ (4)లను అశ్విన్‌ పెవిలియన్‌కు చేర్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో 26 పరుగులు చేసిన బంగ్లాదేశ్‌ 2 వికెట్లు చేజార్చుకుంది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు మరో 26 పరుగుల వెనుకంజలో నిలిచింది.
స్కోరు వివరాలు :
బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ : జాకిర్‌ (సి) యశస్వి (బి) ఆకాశ్‌ 0, ఇస్లాం (ఎల్బీ) ఆకాశ్‌ 24, మోమినుల్‌ నాటౌట్‌ 107, నజ్ముల్‌ (ఎల్బీ) అశ్విన్‌ 31, ముష్ఫీకర్‌ (బి) బుమ్రా 11, లిటన్‌ దాస్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 13, షకిబ్‌ (సి) సిరాజ్‌ (బి) బుమ్రా 9, మెహిది (సి) గిల్‌ (బి) బుమ్రా 20, తైజుల్‌ (బి) బుమ్రా 5, హసన్‌ (ఎల్బీ) సిరాజ్‌ 1, ఖలీద్‌ (సి,బి) జడేజా 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : 74.2 ఓవర్లలో ఆలౌట్‌) 233.
బౌలింగ్‌ : బుమ్రా 18-7-50-3, సిరాజ్‌ 17-2-57-2, అశ్విన్‌ 15-1-45-2, ఆకాశ్‌ 15-6-43-2, జడేజా 9.2-0-28-1.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : యశస్వి (బి) హసన్‌ 72, రోహిత్‌ (బి) మెహిది 23, గిల్‌ (సి) హసన్‌ (బి) షకిబ్‌ 39, పంత్‌ (సి) హసన్‌ (బి) షకిబ్‌ 9, కోహ్లి (బి) షకిబ్‌ 47, రాహుల్‌ (స్టంప్డ్‌) లిటన్‌ (బి) మెహిది 68, అశ్విన్‌ (బి) షకిబ్‌ 1, ఆకాశ్‌ (సి) ఖలీద్‌ (బి) మెహిది 12, బుమ్రా నాటౌట్‌ 1, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (34.4 ఓవర్లలో 9 వికెట్లకు) 285 డిక్లేర్డ్‌.
బౌలింగ్‌ : హసన్‌ 6-0-66-1, ఖలీద్‌ 4-0-43-0, మెహిది 6.4-0-41-4, తైజుల్‌ 7-0-54-0, షకిబ్‌ 11-0-78-4.
బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ : ఇస్లాం నాటౌట్‌ 7, జాకిర్‌ (ఎల్బీ) అశ్విన్‌ 10, హసన్‌ (బి) అశ్విన్‌ 4, మోమినుల్‌ నాటౌట్‌ 0, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (11 ఓవర్లలో 2 వికెట్లకు) 26.
బౌలింగ్‌ : బుమ్రా 3-1-3-0, అశ్విన్‌ 5-2-14-2, ఆకాశ్‌ 3-2-4-0.
రికార్డుల వరద!
కాన్పూర్‌ టెస్టులో భారత బ్యాటర్ల దూకుడుకు రికార్డులు మోకరిల్లాయి. యశస్వి జైస్వాల్‌, రోహిత్‌ శర్మ తొలి బంతి నుంచే బౌండరీ లైన్‌ లక్ష్యంగా దంచికొట్టగా.. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, కెఎల్‌ రాహుల్‌ అదే బాటలో నడిచారు. భారత బ్యాటర్ల మెరుపులతో టెస్టు క్రికెట్‌ రికార్డులు బద్దలయ్యాయి. అత్యంత వేగంగా 50, 100, 200 పరుగులు చేసిన జట్టుగా టీమ్‌ ఇండియా నిలిచింది. 10.1 ఓవర్లలోనే 100 పరుగులు, 24.2 ఓవర్లలోనే 200 పరుగులు, 18 బంతుల్లోనే (3 ఓవర్లు) 50 పరుగులు చేసి.. టెస్టు క్రికెట్‌ చరిత్రలో వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న ఘనత దక్కించుకుంది. నిరుడు వెస్టిండీస్‌పై 12.2 ఓవర్లలో 100 పరుగులు చేసిన భారత్‌.. స్వీయ రికార్డును 2.1 ఓవర్లతో మెరుగుపర్చుకుంది. 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసిన భారత్‌.. 8.22 రన్‌రేట్‌తో పరుగులు పిండుకుంది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో మరే జట్టు 8.22 రన్‌రేట్‌తో ఇన్ని పరుగులు చేయలేదు. పేసర్లు, స్పిన్నర్లు మెరవటంతో నాల్గో రోజు ఆటలో ఏకంగా 18 వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు కోల్పోగా.. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు సమర్పించుకుంది.

Spread the love