2025 నాటికి రూ. 40 వేల కోట్ల ఎగుమతులు లక్ష్యం

Ramkumar– రూ.1.50 లక్షల కోట్ల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి
– గరిష్ట స్థాయి నుంచి దిగొస్తున్న ధరలు
– వాల్డ్‌ స్పైసీ ఆర్గనైజేషన్‌ చైర్మెన్‌ రామ్‌ కుమార్‌ వెల్లడి
న్యూఢిల్లీ: భారత్‌లో సుగంధ ద్రవ్యాలను విరివిగా వాడటంతో పాటు ఎగుమతులతో భారీ ఆదాయం నమోదవుతుందని వాల్డ్‌ స్పైసీ ఆర్గనైజేషన్‌ ఛైర్మన్‌ రామ్‌కుమార్‌ మీనన్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో జాతీయ సుగంధ ద్రవ్యాల కాన్ఫరెన్స్‌ ప్రారంభమైంది. ”ఆహార భద్రతా సుగంధ ద్రవ్యాలు – స్థిరమైన ఆదాయానికి ముందుకు వెళ్ళే మార్గం” అను నేపథ్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ రంగానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై చర్చించారు. కాన్ఫరెన్స్‌ ప్రారంభోత్సవం అనంతరం రామ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. గతేడాది దేశంలో 10.3 మిలియన్‌ టన్నుల సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి జరిగిందన్నారు. వీటి విలువ రూ.1.50 లక్ష కోట్లుగా ఉందని అంచనా వేశారు. కాగా ఇందులో దాదాపుగా రూ.32 వేల కోట్ల (4 బిలియన్‌ డాలర్ల) విలువ చేసే ఎగుమతులు జరిగాయ న్నారు. మొత్తం ఉత్పత్తిలో 85 శాతం దేశీయంగా వినియోగించగా.. మిగితా 15 శాతం ఎగుమతులు అవుతున్నాయన్నారు. 2025 నాటికి 5 బిలియన్‌ డాలర్లు, 2030 నాటికి 10 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం వ్యాల్యూ యాడెడ్‌ ఉత్పత్తులపై దృష్టి పెట్టామన్నా రు. మరిన్ని రెడీ టు ఈట్‌, రెడీ టు కుక్‌కు వీలుగా ఉత్పత్తులను ఆవిష్కరించాల్సి ఉందన్నారు. ప్రతీ ఏడాది సగటు ఎగుమతుల వృద్థి 6 శాతంగా చోటు చేసుకుంటుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ – ఆగస్ట్‌ ఎగుమతుల్లోనూ ఆరు శాతం పెరుగుదల చోటు చేసుకుందన్నారు. గతేడాది వాతావరణ సమస్యలతో సుగంద ద్రవ్యాల దిగుబడి తగ్గిందన్నారు. దీంతో జీలకర్ర కిలో ధర ఓ దశలో రూ.250 నుంచి రూ.700కు ఎగిసింద న్నారు. క్రమంగా తగ్గుతూ ప్రస్తుతం రూ.400- 500 మధ్య పలుకుతుందన్నారు. మిర్చీ, పసుపు ఉత్పత్తి, ఎగుమతుల్లో ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కీలక వాటా కలిగి ఉన్నాయన్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరికీ మరింత స్థిరమైన ఆదాయానికి అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్‌ అఫ్‌ అరేకనట్‌ అండ్‌ స్పైస్‌ డెవలప్‌ మెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హోమి చెరియన్‌, స్పైసెస్‌ బోర్డు రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎబి రీమాశ్రీ, ఆ పరిశ్రమ నిపుణులు, రైతులు పాల్గొన్నారు.

Spread the love