2030 నాటికి మానవ మనుగడే ప్రశ్నార్థకం

2030 నాటికి మానవ మనుగడే ప్రశ్నార్థకం– భూమి ఎడారీకరణను నివారించాలి
– రిటైర్డ్‌ శాస్త్రవేత్త, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ కె.బాబురావు
నవతెలంగాణ-బంజారాహిల్స్‌
దేశంలో ఉష్ణోగ్రతలు ప్రస్తుతంలాగే పెరిగితే 2030 నాటికి మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని రిటైర్డ్‌ శాస్త్రవేత్త, ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్‌ కె.బాబురావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ జిందాబాద్‌, హైదరాబాద్‌ సిటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం నెక్లెస్‌ రోడ్డులోని లవ్‌ హైదరాబాద్‌ వద్ద మానవహారం నిర్వహించారు. ”సేవ్‌ హుస్సేన్‌ సాగర్‌ – సేవ్‌ హైదరాబాద్‌” నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ”మనభూమి – మన భవిత” నినాదంతో భూమి ఎడారీకరణను నిరోధించాలని, భూమిని కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ఎడారీకరణ 23 శాతంగా ఉండి, పెరుగుతున్న పరిస్థితి ఉందన్నారు. దీనిని నిరోధించాలన్నారు. గత ప్రభుత్వం విద్యుత్‌ అవసరాల కోసం విచ్చలవిడిగా థర్మల్‌ ప్లాంట్లను ప్రోత్సహించిందని, ఫలితంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడిందని తెలిపారు. దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ సమీక్షను ఆర్థిక దుర్వినియోగం అనే కోణంలోనే చూస్తున్నదని, పర్యావరణ కోణంలో కూడా పరిశీలన జరగాలని సూచించారు. నగరాన్ని ఫార్మా హబ్‌గా మార్చి పెట్టుబడిదారుల లాభాల కేంద్రంగా మారుతున్నారని, కానీ పర్యావరణపరంగా నగరం తీవ్ర ప్రమాదంలో ఉందన్నారు.
సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి మాట్లాడుతూ.. హుస్సేన్‌ సాగర్‌ మంచి నీటి సాగర్‌గా ఉండేదని, నేడు కాలుష్య కేంద్రంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వ్యర్థాలు ముఖ్యంగా ఫార్మా వ్యర్థాలు సాగర్‌లోకి వదులుతున్నారని, దాన్ని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హుస్సేన్‌ సాగర్‌ను ప్రక్షాళన చేసి మంచినీటి కొలనుగా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్‌ ప్రభుత్వం.. ఆచరణలో కొబ్బరిలా హుస్సేన్‌ సాగర్‌ను భక్షించారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మూసీ, హుస్సేన్‌సాగర్‌ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ”మనభూమి-మన భవిత” అనే ఐక్యరాజ్యసమితి నినాదాన్ని ప్రతిబింబించేలా చేసిన ”భూగోళం చిహ్నం” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌ జిందాబాద్‌ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అధ్యక్షత వహించగా, ఎం.శ్రీనివాసరావు వందన సమర్పణ చేశారు. హైదరాబాద్‌ జిందాబాద్‌ నాయకులు మల్లం రమేష్‌, పి.శ్రీనివాస్‌, మోహన్‌, సైదులు, సుకుమార్‌, రాజమౌళి, అస్మిత, సంగీత, మాధవి, శ్రీవల్లి, గోపాల్‌, నర్సింగ్‌రావు, రమేష్‌, రఘు, మల్లయ్య, బాబు పాల్గొన్నారు.

Spread the love