– పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం
– త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు వేస్తాం : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్టు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని మండిపడ్డారు. త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ సోమవారం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు, న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ను ఆశ్రయించే అంశంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో బీఆర్‌ఎస్ రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది సి.ఆర్యమా సుందరం, మోహిత్‌రావులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటుపై స్పీకరు నిర్ణయం తీసుకోకుండా ఎక్కువ రోజులు నాన్చలేరని రాజ్యాంగ నిపుణులు చెట్పట్ సి.ఆర్యమా సుందరం కేటీఆర్‌కు వివరించారు. మణిపూర్‌లో ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యే సహా సుప్రీం కోర్టు పలు తీర్పులు ఇచ్చిందన్నారు. అనంతరం ఇదే రీతిలో రాష్ట్రంలో పార్టీ మారిన ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టు ను ఆశ్రయించినట్టు కేటీఆర్ న్యాయ నిపుణులకు వివరించారు. అలాగే ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని అడ్వకేట్లతో చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్త్నునట్లు సమావేశం అనంతరం కేటీఆర్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వారిపై అనర్హత వేటు వేసే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. ఈ వ్యహారంపై కొద్దిరోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు తెలిపారు. సుప్రీంను ఆశ్రయించిన నెల రోజుల్లో అనర్హత వేటుపై స్పష్టత వస్తుందన్నారు. స్పష్టత వచ్చిన తర్వాత ఫిరాయింపులకు పాల్పడ్డ పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని ధీమా వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు నుంచి అనర్హతపై స్పష్టత వచ్చాక రాష్ట్రంలోని పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం అంటూ స్పష్టం చేశారు.