సీఏఏపై స్టే విధించాలి

సీఏఏపై స్టే విధించాలి– సుప్రీంలో కేరళ పిటిషన్‌
న్యూఢిల్లీ: సవరించిన పౌరసత్వ చట్టం (సీఏఏ) అమలుపై స్టే విధించాలంటూ కేరళ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఏఏ వివక్షాపూరితం, రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి అయిన లౌకికవాదానికి విరుద్ధం అని కేరళ ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. సవరించిన పౌరసత్వ చట్టం అమలుకు ఈ నెల 11న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 31, 2014 కి ముందు ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వాలి. అయితే, ఆ దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం పౌరసత్వం నిరాకరించబడుతుందని పేర్కొంది. సవరణకు ముందు భారత దేశ పౌరసత్వ చట్టం మతపరమైన గుర్తింపు ఆధారంగా పౌరసత్వాన్ని ఇవ్వాలని ఎక్కడా చెప్పలేదు. కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక మతపరమైన గుర్తింపు ఆధారంగా పౌరసత్వం ఇచ్చేలా సవరణను తీసుకొచ్చింది. సీఏఏ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, కేరళ ప్రభుత్వం, ”మత ప్రాతిపదికన పౌరసత్వం మంజూరు చేయడాన్ని సవాల్‌ చేసింది. కేరళ ప్రభుత్వం గతంలో ఒకసారి సీఏఏ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో కేసు వేసింది. తాజా పిటిషన్‌లో, ”బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ , ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు మాత్రమే సీఏఏ ఫాస్ట్‌ ట్రాక్‌ పౌరసత్వాన్ని అందిస్తుంది.’ కానీ, భారతదేశంలో శ్రీలంక, భూటాన్‌, మయన్మార్‌ వంటి పొరుగు దేశాల నుంచి వచ్చిన శరణార్థులు ఉన్నారు. వారి మాటేమిటి? చట్టంలో ఈ విషయంలో స్పష్టత లేదు. కేరళ ప్రభుత్వం తన పిటిషన్‌లో ఇంకా ఇలా పేర్కొంది, ”మతపరమైన గుర్తింపు, ప్రాంతీయ గుర్తింపు ఆధారంగా వర్గీకరణ పూర్తిగా వివక్షతతో కూడిన చర్య. దేశం చాలా కాలంగా అనుసరిస్తూ వస్తున్న న్యాయ సూత్రాల ప్రకారం, ఒక చట్టం వివక్షపై ఆధారపడి ఉంటే అది చెల్లదు. సీఏఏను సస్పెండ్‌ చేయాలని, రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వచ్చే శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు మొన్న తెలిపింది. కేరళ ప్రభుత్వ పిటిషన్‌ కూడా ఉంది. వివక్షాపూరిత సీఏఏకు వ్యతిరేకంగా 2019, 2020లో దేశవ్యాప్తంగా పెద్దయెత్తున నిరసనలు చోటుచేసుకున్నాయి.
అప్పుడు కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి చెందడంతో ఉద్యమం నిలిపివేయబడింది. ప్రభుత్వం కూడా దీనిపై ముందుకు సాగలేదు. అస్సోంతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే సీఏఏకి వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీఏఏను అమలు చేయబోమని చెప్పాయి.

Spread the love