– ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు
– రాజ్యాంగ విరుద్ధమంటున్న ప్రతిపక్షాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’కు సంబంధించిన ముసాయిదా బిల్లుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గం సమావేశమైంది. ఈ ముసాయిదా బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఆ తరువాత సంబంధిత పార్లమెంటరీ కమిటీకి పంపే అవకాశం ఉంది. ఈ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల శాసనసభల స్పీకర్లను కూడా సంప్రదించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ ప్రణాళికతో ముందుకెళ్తున్న ప్రభుత్వం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నతస్థాయి కమిటీ చేసిన సిఫారసులకు సెప్టెంబరులోనే కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ దేశవ్యాప్తంగా అభిప్రాయాలను సేకరించిన తరువాత 11 సిఫారసులు చేసింది. కాగా జమిలీ రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
కమిటీ చేసిన 11 సిఫార్సులు
1. ప్రతి సంవత్సరం తరచూ ఎన్నికలు నిర్వహించడం ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ భారాన్ని తగ్గించడానికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.
2. మొదటి దశలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఖరారు చేస్తారు. అనంతరం, 100 రోజుల్లోపు మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
3. సార్వత్రిక ఎన్నికల తరువాత లోక్‌సభ సమావేశమయ్యే తేదీని ‘నిర్ణీత తేదీ’గా ప్రకటిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయవచ్చు.
4. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడే రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి తగ్గుతుంది.
5. ఈ సంస్కరణలను పర్యవేక్షించడానికి, విజయవంతంగా అమలు చేసేలా చూడటానికి ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫారసు చేస్తుంది.
6. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఆర్టికల్ 324ఏ సవరణను ప్రవేశపెట్టాలని, అన్ని ఎన్నికలకు ఏకీకృత ఓటరు జాబితా, ఫొటో ఐడీ కార్డును రూపొందించేందుకు ఆర్టికల్ 325కు సవరణ చేయాలని కమిటీ ప్రతిపాదించింది.
7. ఒకవేళ హంగ్ ఏర్పడితే లేదా అవిశ్వాస తీర్మానం ఏర్పడితే కొత్తగా ఎన్నికలు జరుగుతాయి. కానీ కొత్తగా ఎన్నికైన సభ కాలపరిమితి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు మాత్రమే ఉంటుంది.
8. తొలిదశలో లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో, లోక్‌సభ ఎన్నికలకు వంద రోజుల్లోనే రెండో దశలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
9. హంగ్ సభ లేదా అవిశ్వాస తీర్మానం విషయంలో కొత్తగా ఎన్నికలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఐదేండ్లు కొనసాగదు. గతంలో ఏర్పడిన సభకు సంబంధించి మిగిలిన పదవీకాలాన్ని మాత్రమే కొనసాగిస్తుంది.
10. సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు, వీవీప్యాట్ వంటి నిత్యావసర పరికరాల కొనుగోలుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించారు.
11. అన్ని ఎన్నికలకు ఏకీకృత ఓటరు జాబితా, ఓటరు ఐడి కార్డు వ్యవస్థను కమిటీ ప్రతిపాదిస్తుంది, దీనికి రాష్ట్రాల ఆమోదానికి లోబడి రాజ్యాంగ సవరణ అవసరం.