– హైడ్రా చట్టబద్ధతపై ప్రధాన చర్చ
– వరదలపై కేంద్ర సాయానికి తీర్మానం
– బీసీ రిజర్వేషన్, కులగణనపై సమాలోచనలు
– రైతు రుణమాఫీ, రైతు భరోసాపై కూడా చర్చించే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ నెల 20న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సచివాలయంలో .జరిగే క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఆవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా గ్రేటర్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన హైడ్రాపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం 99 జీవో ద్వారా హైడ్రా కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ చట్టం దీనికి ఏలా వర్తిస్తుందని పలువురు బాధితులు ఇటీవల కోర్టు మెట్లెక్కారు. హైకోర్టు సైతం హైడ్రా చట్టబద్దతపై అనేక అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఆస్తి, పంట, ప్రాణ నష్టంపై సహాయం కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర క్యాబినెట్ భావిస్తున్నది. మొదట్లో రూ.5వేల పైచిలుకు కోట్ల ప్రాథమిక అంచనా వేసిన సర్కార్ తాజాగా రూ.10వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని తుది నివేదికను రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందానికి అందజేసింది. వారితో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రాంతాలు, రంగాల వారీగా జరిగిన నష్టం, నిర్వాసితుల దుస్థితిని వివరించారు. దీంతో కేంద్ర బృందం సైతం రాష్ట్రంలో తీవ్ర వరదనష్టం జరిగిందని ఒప్పుకున్నారు..
ఈ క్రమంలో అత్యధిక నిధులు రాబట్టేలా అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రమంత్రులకు విజప్తులపై క్యాబినెట్ లో చర్చించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన విధానాలు ఖరారు చేయాలని క్యాబినెట్ యోచిస్తోంది. అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి మార్పులు, చేర్పులు చేయాలన్న ఆలోచనతో క్యాబినెట్ నిర్ణయం ఉండబోతున్నట్టు తెలుస్తోంది. హెల్త్ కార్డుల విషయంలో కూడా మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సాధారణ ప్రజలకు ఆరోగ్య సేవల విస్తరణను సులభతరం చేసేందుకు కార్డుల పంపిణీపై క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసా, రుణమాఫీ కాని రైతుల గురించి క్యాబినెట్ చర్చిస్తుందని అధికార పార్టీలో చర్చ జరుగుతున్నది. విద్యా కమిషన్, రైతు కమిషన్‌పై చర్చ జరిగే అవకాశముందని సమాచారం.