కుక్క కాటుకు దూడ మృతి..గేదె పాలు తాగిన గ్రామస్తులకు వ్యాక్సిన్

నవతెలంగాణ-హైదరాబాద్ : కుమురం భీమ్‌ జిల్లా చింతల మానేపల్లి మండల కేంద్రంలో పిచ్చికుక్క హడలెత్తించింది. 15 రోజుల క్రితం పిచ్చికుక్క దూడపై దాడి చేసింది. పాడి రైతు దూడకు టీకా వేయించకుండా నిర్లక్ష్యం చేసి.. గేదె పాలు పట్టించడంతో వారం రోజుల క్రితం దూడ మృతి చెందింది. ఆ గేదెపాలు గ్రామంలోని పలువురికి విక్రయించడంతో ప్రస్తుతం వారంతా భయాందోళనకు గురై వైద్యులను సంప్రదించారు. ఈ విషయం అధికారులకు తెలియడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించి గ్రామస్థులకు టీకాలు వేశారు. పాడి రైతు నానయ్యపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. గ్రామంలోని దాదాపు 300 మంది ఈ గేదె పాలు తాగినట్టు గుర్తించడంతో వారందరికీ శనివారం వ్యాక్సిన్‌ అందించారు.

Spread the love