నవతెలంగాణ హైదరాబాద్: సంక్రాంతి పండగ నేపథ్యంలో ఎగరవేస్తున్న పతంగులతో విద్యుత్ అంతరాయం ఏర్పడితే స్థానిక విద్యుత్ అధికారులను ఫోన్‌లో సంప్రదించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కిం) చైర్మన్ అండ్ మేనేజింగ్ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్ల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మెటాలిక్ మాంజాలు విద్యుత్ వాహకాలు కనుక అవి లైన్లపై పడితే విద్యుత్ షాక్‌తో పాటు, విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో సర్కిళ్ల వారిగా కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేశామని సీఎండీ తెలిపారు. సమావేశంలో టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్లు టి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్ రెడ్డి, సీజీఎం మేడ్చల్ జోన్ కె.సాయిబాబా, సీజీఎం రంగారెడ్డి జోన్ పి.అనంద్, సీజీఎం మెట్రో జోన్ నరసింహాస్వామి, సూపరింటెండింగ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ సరఫరా అంతరాయంపై టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ ఆదివారం ట్వీట్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు ప్రాతాల్లో వార్షిక నిర్వహణ, మరమత్తుల కార్యకలాపాల్లో భాగంగా 2 గంటల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగినందుకు చింతిస్తున్నాం. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని డిమాండుకు అనుగుణంగా నవంబర్ నుంచి జనవరి వరకు నిర్వహణ పనులు చేయాల్సి ఉండగా, అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాటిని చేయలేకపోయాం అని ట్వీట్ చేశారు. తర్వాత కొన్ని గంటలకు విద్యుత్ సరఫరా అంతరాయంపై సీఎండీ చేసిన ట్వీట్‌ను ఆయన తొలగించారు.
ఫిర్యాదులు ఇలా చేయండి:
ఎలక్ట్రిసిటీ కాల్ సెంటర్ 1912 Twitter:@tsspdclcorporat
Facebook:@gmcsc.
tsspdcl www.tssouthernpower.com
మొబైల్ యాప్ : TSSPDCL
డయల్ – 100