ఊపందుకున్న సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం

ఊపందుకున్న సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారంనవతెలంగాణ- చిట్యాల టౌన్‌/టేకులపల్లి/వైరా టౌన్‌/చండ్రుగొండ
సీపీఐ(ఎం) అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగిన నకిరేకల్‌ సీపీఐ(ఎం) అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు గెలుపును కాంక్షిస్తూ నిర్వహించిన ప్రచార సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బులు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసేటటువంటి నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోరని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అభ్యర్థులు సంపాదనే ధ్యేయంగా ఉంటారన్నారు. నిరంతరం పేదలు రైతులు మహిళల హక్కుల కోసం అహర్నిశలు పోరాడే కమ్యూనిస్టు అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాలతో ఓటర్లను మభ్య పెట్టడానికి వస్తున్నారని, ప్రజల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని భద్రాచలం మాజీ ఎంపీ డాక్టర్‌ మీడియం బాబురావు కోరారు. దుగ్గిరాల కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ టేకులపల్లి మండలంలో ఆయన పర్యటించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి భూక్య వీరభద్రంను గెలిపిస్తే కృష్ణా, గోదావరి, సాగర్‌ జలాలను వైరా రిజర్వాయరుకు తీసుకువచ్చి ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందించే బాధ్యత సీపీఐ(ఎం) తీసుకుంటుందని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రసాద్‌ తెలిపారు. వైరా మండలంలోని పలు గ్రామాల్లో భూక్య వీరభద్రం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అశ్వారావుపేట నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థి పిట్టల అర్జున్‌ రావు గెలుపుకోరుతూ శుక్రవారం చుండ్రుగొండ మండల ప్రజలు బైకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేసింది శూన్యమన్నారు.

Spread the love