‘సంకీర్ణ స్ఫూర్తి సాగేనా..!’

'సంకీర్ణ స్ఫూర్తి సాగేనా..!'సంపూర్ణ ఆధిపత్యం పోయి… సంకీర్ణ సర్కారు ఆదివారం కొలువుదీరింది. తమ మేనిఫెస్టో విడుదల సందర్భంలో ”పూర్తి మెజార్టీతో బలమైన ప్రభుత్వం అవసరం” అని మోడీ ఇచ్చిన పిలుపును ప్రజలు పట్టించుకోలేదు. ” ఇస్‌ బార్‌ చార్‌ సౌ పార్‌” నినాదాన్ని తిప్పి కొట్టి ”ఇస్‌ బార్‌ దోసౌ పార్‌” అంటూ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. తొలిసారి సంకీర్ణ సర్కారుకు సారధ్యం వహిస్తున్న మోడీ … మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లడంలో ఏమేరకు సఫలీకృతం అవుతారో వేచిచూడాలి. గడిచిన రెండు దఫాలు మందబలంతో తమ మాటే శాసనంగా సభలో చర్చకు సైతం ఆస్కారం లేకుండానే బిల్లులను చట్ట రూపంలోకి తీసుకొచ్చారు. కానీ, మూడోసారి అధికారం చేపట్టిన కాషాయ పార్టీకి తమ మాట నెగ్గించుకోవడం ఈ సారి నల్లేరుపై నడకైతే కాబోదు. అంతేకాదు, లోక్‌సభలో ఎన్డీయేకు ధీటుగా ‘ఇండియా’ బ్లాక్‌ ఉండటం కూడా బీజేపీకి కొరుకుడు పడని అంశం. సంకీర్ణ ప్రభుత్వాలను ఎన్నుకోవడమే మన ప్రజల మహా పాపమైనట్టు, అది దేశాభివృద్ధికి ఆటంకమైనట్టు ‘గోడీ’ మీడియా కథనాలల్లుతోంది. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ,ఆస్ట్రీయా, గ్రీస్‌ వంటి డజన్ల కొద్ది పశ్చిమ దేశాల్లో సంకీర్ణాలే ఉన్నాయి. జపాన్‌, ఇండోనేషియా వంటి తూర్పు ఆసియా దేశాల్లోను సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయి.
సంప్రదాయానికి భిన్నంగా తక్కువ స్థానాలిచ్చిన ఉత్తరాదితో పోలిస్తే…సగానికిపైగా స్థానాలిచ్చిన తూర్పు జోన్‌, ఆశించినదానికి మించి ఇచ్చిన తెలుగు రాష్ట్రాలు బీజేపీకి భుజాలు కాశాయి. పశ్చిమ జోన్‌లోని మహారాష్ట్రలో ఫిరాయింపులను ప్రోత్సహించి రెండు ప్రధాన పార్టీల్లో చీలిక తెచ్చినా అక్కడ ఎన్డీయే దెబ్బతిన్నది. సగం స్థానాలు కూడా సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇది బీజేపీని వణికిస్తోంది. ఎన్సీపీ(అజిత్‌) పోటీచేసిన అయిదింటిలో రెండు స్థానాల్లోనే గెలవడంతో ఈ గ్రూపునకి ఒక స్వతంత్ర మంత్రిత్వ శాఖే కేటాయిస్త్తామన్న బీజేపీ ప్రతిపాదనను అజిత్‌ పవార్‌ తిరస్కరించి క్యాబినెట్‌ హోదాకై పట్టుపట్టారు. బీజేపీ వాటిని ఉడత ఊపుడుగానే చూసిందే తప్ప పట్టించుకోలేదు. ఈ పరిణామం ఆదిలోనే హంసపాదులా ఈ సంకీర్ణ సర్కారు మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది.
ఎన్డీయే కూటమిగా ఇప్పటికీ 292 స్థానాలున్నా…నితీశ్‌ కుమార్‌, చంద్రబాబు వంటి ఊగిసలాట మనస్తత్వం గల భాగస్వాములున్న చోట ఏదైనా జరగొచ్చన్న భయాందోళనలు బీజేపీకి ఉండటం సహజమే. అందులోనూ నితీశ్‌ ఎప్పటి నుంచో కోరుకుంటున్నది ప్రధాని పదవి. దానికి నేడు ప్రత్యేక హోదా డిమాండ్‌ తెరపెకి తెచ్చారు. బాబు సైతం హోదా కోసం పట్టుబట్టే అవకాశం లేకపో లేదు. గతంలో లాగా అదే అంశంపై బీజేపీతో విభేదించి తమ మద్దతు వెనుకు తీసుకునే అవకాశమూ లేకపోలేదు. మొత్తానికి ‘అబ్‌ కీ బార్‌ మోడీ సర్కార్‌’ అన్న నినాదాన్ని సవరించుకుని ‘అబ్‌ కీ బార్‌ కూటమి సర్కార్‌’ అనక తప్పట్లేదు. ఆ పార్టీ కలలు కంటున్న ” ఉమ్మడి పౌరస్మృతి ” అమలు గానీ, ” జమిలి ఎన్నికలు” గానీ ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు భుజం కాసిన పార్టీలకు అవి ప్రాధాన్యతాంశాలు కానేకావు. కాబట్టి వివాదాల తేనె తుట్టెను కదపకుండా ముందుకు సాగాల్సిన అనివార్యత బీజేపీకి ఉండచ్చు.
చంద్రబాబు కానీ, నితీష్‌ కానీ ఇప్పటికిప్పుడు ఎన్డీయే నుంచి బయటకు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా నయానో భయానో ఆ పార్టీలను లొంగదీసుకోవడం బీజేపీ పరివారానికి కొత్తేమీ కాదు. అయిన ఎన్డీయే సర్కారుకు ఢోకా ఏమీ లేదని అనుకోలేం. ఈఏడాది అక్టోబర్‌లో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్‌, హర్యానా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు చాలా కీలకం. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ బలం పుంజుకుంటేనే… బీజేపీ బాగా దెబ్బతింది. ఇదే పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చోటు చేసుకుంటే కచ్చితంగా మోడీ ప్రభుత్వానికి కౌంట్‌ డౌన్‌ మొదలయ్యే అవకాశాలను కొట్టిపారేయలేం. అప్పుడు కమలదళంలో అలకలు, భాగస్వామ్య పక్షాలలో లుకలుకలు మొదలవుతాయి. డబుల్‌ కన్ఫర్మేషన్‌ కోసం ఎదురుచూసే రాజకీయ పార్టీలు ఇండియా బ్లాక్‌ వైపు చూసే అవకాశం లేకపోలేదు. ప్రశాంత్‌ కిషోర్‌ విశ్లేషణ సైతం ఇందుకు బలాన్ని చేకూరుస్తుంది. ఇండియా బ్లాక్‌ కూడా తన బలాన్ని కాపాడుకుంటూనే రాజకీయ నిబద్ధతతో వ్యవహరించాల్సిన సందర్భం ఇది.
మొత్తానికి ఉత్తరాదిలో భావోద్వేగాల కన్నా నిరుద్యోగం, అధిక ధరలు, పడిపోయిన జీవనప్రమాణాలు వగైరా అంశాలు చర్చలోకొచ్చాయి. ఓటింగ్‌ లోనూ వాటి ప్రభావం కనబడింది. ఇది ఆహ్వానించదగ్గ విషయం. వచ్చే ఏడాది రాబోయే 16 ఫైనాన్స్‌ కమిషన్‌ నివేదిక, ఆ మరుసటేడు లోక్‌ సభ నియోజకవర్గాల పునర్విభజన, ఫెడరల్‌ వ్యవస్థపై సాగే చర్చ కీలకమైనవి. ఈ అంశాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలకు బదులు అందరినీ సంప్రదించక తప్పని స్థితి ఏర్పడటం హర్షించదగ్గ పరిమాణం. దేశ ప్రజానీకం ప్రదర్శించిన విజ్ఞతనూ, దానివెనకున్న స్ఫూర్తినీ రాజకీయ పక్షాలన్నీ గ్రహించాలి.

Spread the love