– నియోజకవర్గాల్లో అనేక సమస్యలు
– సంగమేశ్వర, బసవేశ్వర, గౌరవెళ్లి ప్రాజెక్టులకు నిధులు
– సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణ
– ఉమ్మడి జిల్లాలో త్రిబుల్ ఆర్ నిర్వాసితుల పరిహార సమస్య
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు
– ఇద్దరు మంత్రులు, ఇద్దరు మాజీ మంత్రులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర శాసన సభా సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కేంద్రం పెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిన నేపథ్యంలో అసెంబ్లీలో తీర్మానం పెట్టేందుకు జరిగిన చర్చలో అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు సాగాయి. అయితే ఈ సమావేశాల్లో సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, ఇతర సమస్యల పరిష్కారం వంటి ఆంశాలపై ఎమ్మెల్యేలు చర్చల్లో పాల్గొననున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజకవర్గాల్లోనూ వివిద సమస్యలున్నాయి. సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలు, జనం గోడును అధ్యక్షా..! అని వినిపించాల్సి ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తుండగా విపక్షం నుంచి మాజీ సీఎం, మాజీ మంత్రి కూడా సభలో ఉన్నారు. రెండు పక్షాల నుంచి బలమైన నాయకత్వం అసెంబ్లీలో ఉన్నందున అధిక నిధుల్ని సాధించి పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని జనం కోరుతున్నారు.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పలు తాగునీటి ప్రాజెక్టులున్నాయి వీటిల్లో కొన్ని ప్రారంభ దశలో ఆగిపోగా ఇంకొన్ని మధ్యలో నిలిచిపోయాయి. కొనసాగింపు పనులు సైతం పూర్తి కాలేదు. కరువు పీడిత ప్రాంతంగా సాగునీటి ఎద్దడి నెలకొన్ని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీటి ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. సింగూరు జలాల్ని లిప్టుల ద్వారా రెండు నియోజకవర్గాలకు నీరందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంఖుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలను కొనసాగిస్తామని చెప్పలేదు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రాధాన్యత తాగునీటి ప్రాజెక్టుల జాబితాలో సంగమేశ్వర, బసవేశ్వర రెండూ లేవు. అంటే వాటికి ఈ బడ్జెట్‌లో నిధులు ఇస్తారా..? ఇవ్వరా..? అసలు ఆ ప్రాజెక్టుల ఉనికి ఏమిటనేది తేల్చాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ రెండు ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం ద్వారా కరువు పీడిత ప్రాంతాలు సస్యశ్యామలం అయ్యే అవకాశ ముంటది. హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు కూడా అసంపూర్తిగానే ఉంది. నిర్వాసితుల సమస్యల, పెండిం గ్ పనులు ఆగిపోయాయి. సాగునీటిని ఇచ్చే స్థాయిలో ప్రాజెక్టును పూర్తి చేయలని రైతులు కోరుతున్నారు. సింగూర్ ప్రాజెక్టు అనుసందా నంగా పంట కాల్వల పనులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన పొన్న ప్రభాకర్ ప్రస్తుత ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. నిధులు సాధించి త్వరిత గతిన పూర్తి చేయాలి.
సంగారెడ్డి వరకు మెట్రో విస్తరణ
గత ప్రభుత్వం మెట్రోలైన్‌ను ఇస్నాపూర్ వరకు విస్తరిస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంగారెడ్డి వరకు విస్తరిస్తామని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టులో సంగారెడ్డి వరకు పొడగించేందుకు అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఐఐటీ, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఐదారు మెడికల్ కళాశాలలు, వందలాది పరిశ్రమలు విస్తరించిన సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు మెట్రో లైన్ విస్తరణ ఎంతో మేలు చేస్తుంది. మెట్రో విస్తరణ ఆంశాన్ని స్థానిక ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, గూడెం మహిపాల్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరముంది.
త్రిబుల్ ఆర్ నిర్వాసితులకు పరిహారం
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి మూడు జిల్లాల పరిధిలో త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు విస్తరించనుంది. మూడు జిల్లాల్లో కలిపి 110 కిలో మీటర్ల మేర త్రిబుల్ ఆర్ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఇందు కోసం వేలాది ఎకరాల భూముల్ని సేకరిస్తున్నారు. రైతుల భూములకు మార్కెట్‌లో కోట్లు పలుకుతుంది. ప్రభుత్వం మాత్రం అరకొర పరిహారమే ఇస్తుంది. దీంతో నర్సాపూర్, సంగారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లోని రైతులు భూ సేకరణ పనుల్ని అడ్డుకుంటున్నారు. రైతులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని రైతు సంఘాలు పోరాడుతున్నాయి. అదే విధంగా నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు కూడా మెరుగైన పరిహారం ఇవ్వాల్సి ఉంది. వీటికి అవసరమైన నిధుల్ని కూడా ఇవ్వాలని ఎమ్మెల్యేలు మాట్లాడితే మేలు చేకూరనుంది.
సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపు
ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలున్నాయి. అత్యధికంగా దళితులు, గిరిజునలు, బీసీలు, మైనార్టీలున్నారు. వీరి సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు నిధుల్లేవు. మూడేళ్లుగా నిధుల్లేక సంక్షేమ పథకాలకు విరామం పకలిరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన దళిత, బీసీ, మైనార్టీ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ కేటాయించి సంక్షేమ పథకాల్ని అమలు చేయాలి. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులో ఎస్సీ రిజర్వుడ్ నుంచి గెల్చిన దామోదర రాజనర్సింహ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అలాగే హుస్నాబాద్ నుంచి గెల్చిన పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇద్దరు మంత్రులు సంక్షేమ శాఖలకు అధిక నిధులు కేటాయించేలా చూడాలి.
ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తా
చింత ప్రభాకర్, సంగారెడ్డి, ఎమ్మెల్యే
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తం. పార్టీ పరంగా రాష్ట్ర వ్యాప్త సమస్యలపై కొట్లాడుతున్నం. కేంద్రం పెట్టిన బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. అవసరమైన ఢిల్లీ స్థాయిలో పోరాడేందుకు బీఆర్‌ఎస్ సిద్దంగా ఉంది. మెట్రో విస్తరణ, సంగారెడ్డిలో ఐటీ హబ్, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.
నారాయణఖేడ్ అభివృద్ధికి అధిక నిధులు తెస్త
పట్లోళ్ల సంజీవరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ పాలనలో నారాయణఖేడ్ అభివృద్ధికి నోచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధిని సాధిస్తాం. తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వెనుకబడిన ప్రాంతంలో వలసల్ని నివారించేందుకు పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహకాలిస్తుంది. పెట్టుబడుల్ని ఆకర్షించడం, భూములు, నీటి వసతి వంటి రాయితీలివ్వడం ద్వారా నారాయణఖేడ్ ప్రాంతంలో పరిశ్రమల్ని నెలకొల్పేలా ప్రయత్నిస్తాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు రోడ్లు, భవనాల నిర్మాణం కోసం అవసరమైన నిధుల్ని సాధిస్తా.