ఆకలిలేని లోకం చూడగలమా..?

ఐక్యరాజ్యసమితి ప్రధాన శాఖలైన ప్రపంచ ఆహార సంస్థ (యఫ్‌ఏఓ), యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), ఇంటర్నేషనల్‌ ఫండ్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ డెవలప్‌మెంట్‌ (ఐయఫ్‌ఏడి), వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ (డబ్ల్యూయఫ్‌పి)లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల ఆధారంగా ఆహార నివేదికను విడుదల చేశారు. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో(యస్‌డిజి) భాగంగా 2030 నాటికి ప్రపంచంలో ఆకలి చావులు, పోషకాహార లోపం లేకుండా చూస్తూ, ‘జీరో హంగర్‌ (ఆకలిలేని లోకం)’ సాధించాలనే ఉన్నత, ఉత్తమ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో పోషకాహారలోపం అత్యధికంగా ఆసియా దేశాల్లో 418మిలియన్లు ఉండగా, ఆఫ్రికాలో 282మిలియన్లు ఉన్నారని తెలుస్తున్నది. ప్రత్యేక చర్యలు అమలు పరచని యెడల 2030 నాటికి 660మిలియన్ల పేదలు ఉంటారని, ఆకలిని అంతం చేయడం అసాధ్యమని తెలుస్తున్నది. కరోనా మహమ్మారి విజృంభనతో అదనంగా 30మిలియన్ల పేదలు ఆకలితో అలమటిస్తున్నారని అర్థం అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా 237కోట్లకు పైగా (ప్రతి ముగ్గురిలో ఒకరు) ప్రజలకు అవసరమైనంత ఆహారం లభించడం లేదని నివేదిక తెలుపుతున్నది. లింగ వివక్ష కారణంగా పురుషుల కన్న మహిళల్లో 10శాతం అధికంగా ఆహార అభద్రత అనుభవిస్తున్నారు. ఆహార ధాన్యాల అధిక ధరలు, ఆదాయం తగ్గడం వల్ల 300కోట్ల పేదలు పోషకాహారానికి దూరం అవుతున్నారు. పోషకాహారలోపం ప్రపంచ మానవాళికి శాపంగా వెంటాడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా 22శాతం (150 కోట్లు) ఐదేండ్ల లోపు పిల్లలు శరీర వృద్ధి నిలిచిపోవడం (స్టంటింగ్‌)తో, 6.7శాతం (4.54 కోట్లు) అభివృద్ధి తగ్గడం (వేస్టింగ్‌)తో, 5.7శాతం (3.89కోట్లు) అధిక బరువు (ఓవర్‌ వేయిట్‌) సమస్యలతో బాధపడుతున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో పిల్లల పోషకాహారలోపం అత్యధికంగా కనిపిస్తున్నది. ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో 15-49ఏండ్ల మహిళల్లో 30శాతం రక్తహీనత (ఎనీమియా) సమస్య కనిపించగా, అమెరికా, యూరప్‌లో 14.6శాతం మాత్రమే నమోదైంది. గర్భిణి మహిళల్లో రక్తహీనత, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, తల్లిపాల లభ్యత పడిపోవడం, తక్కువ బరువుతో శిశుజననాలు, ఓవర్‌ వేయిట్‌ పిల్లలు పెరగడం, వయోజనుల్లో స్థూలకాయం లాంటి సమస్యల మధ్య 2030 నాటికి ఆకలిని అంతం చేయడం అసాధ్యమని వివరించారు.
ఆహార అభద్రత, పోషకాహారలోపం పెరగడానికి కారణాలుగా వాతావరణ అసాధారణ ప్రతికూల మార్పులు, ఆర్థిక మందగమనం, ఆర్థిక అసమానతలు, లాక్‌డౌన్‌, కర్ఫ్యూలు లాంటి అంశాలు పేర్కొనబడినవి. ఆహార ధాన్యాల దిగుబడి తగ్గడం, మార్కెటింగ్‌ శృంఖలంలో లొసుగులు (ఉత్పత్తి, పంట కోత, ప్రాసెసింగ్‌, రవాణా, మార్కెటింగ్‌, సరైన ధర పలకడం), ఆదాయాలు తగ్గడంతో పోషకాహారానికి పేదలు దూరమవుతున్నారు. పోషకాహార ఆహార లభ్యత పెరగడానికి కారణాలుగా మానవీయతను పోషిస్తూ శాంతి స్థాపనలు, వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోగల ఆహార వ్యవస్థలు, ఆర్థిక కష్టాలను అధిగమించడం, ఆహార సరఫరా శృంఖలంలో నాణ్యతను పరిరక్షించడం, పేదరికంతో పాటు అసమానతలను తొలగించడం, పోషకాహారం పట్ల ఆరోగ్య అవగాహన కల్పించడం లాంటి అంశాలు పేర్కొనబడినవి. ఆర్థిక అసమానతలు పెరిగితే ప్రకృతి సహజ వనరులైన సారవంతమైన నేలలు, మత్స్యసంపద, అటవీ సంపద, నీటి వనరుల కోసం సంఘర్షణలు కలగడం సర్వసాధారణమని నమ్మాలి. సమాజంలో ఆదాయం, ఉత్పత్తి సామర్థ్యం, ఆస్తులు, టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో అసమానతలు పెరిగితే వాటి దుష్ప్రభావానికి అధికంగా మహిళలు, పిల్లలపై నేరుగా పడుతుంది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి నుంచి వినియోగం వరకు ఇమిడి ఉన్న పలు దశల్లో ఆహారం వ్యర్థం కావడం నేర సమానమని నమ్మాలి. ఆహారాన్ని ఆదా చేస్తే ఆహారం ఉత్పత్తి చేసిన దాని కన్న మిన్న అని తెలుసుకోవాలి. ‘యుయన్‌ ఫుడ్‌ సిస్టమ్స్‌ సమిట్‌’ సూచనల ప్రకారం ప్రపంచ దేశాలు తమదైన చర్యలను తీసుకుంటూ 2030 నాటికి ‘జీరో హంగర్‌’ దిశగా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన ఆహార అభద్రత (యస్‌డిజి టార్గెట్‌-2.1), పోషకాహారలోపాలను (యస్‌డిజి టార్గెట్‌-2.2) అధిగమించి, అనుకున్న సదుద్దేశ్యాలను సగర్వంగా చేరుకోవాలని ఆశిద్దాం.
– డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

 

Spread the love