– నా ధైర్యాన్ని దెబ్బతీయలేరు
– మనీశ్ సిసోడియా ట్వీట్
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనను జైలులో పెట్టి ఇబ్బంది పెట్టగలరేమో కానీ అది తన ధైర్యాన్ని దెబ్బతీయలేదని పేర్కొన్నారు. ” సార్, మీరు నన్ను జైలులో ఉంచి ఇబ్బంది పెట్టగలరు. కానీ, మీరు నా స్థైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు. స్వాతంత్య్ర సమరయోధులనూ బ్రిటీషు పాలకులు ఇబ్బందులకు గురి చేశారు. కానీ వారి ఆత్మస్థైర్యం మాత్రం చెక్కు చెదరలేదు. జైలు నుంచి మనీశ్ సిసోడియా సందేశం” అని ముగిస్తూ ఉన్న సందేశం ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కనబడింది. మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆయనను సీబీఐ గతనెల 26న అరెస్టు చేసింది. సీబీఐ కోర్టులో తన బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న ఒక్క రోజు ముందే గురువారం నాడు మరొక దర్యాప్తు సంస్థ ఈడీ ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మనీశ్ సిసోడియాను ఈనెల 17వరకు ఈడీ రిమాండ్‌కు అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేయడంతో తీహార్ జైలులోనే ఆయన ఉండనున్నారు.