– సుప్రీంలో వివేకానంద రెడ్డి కుమార్తె పిటిషన్
– 13న విచారిస్తాం : ధర్మాసనం
న్యూఢిల్లీ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 13న విచారణ జరుపుతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రాజేష్ బిందాల్‌తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన కుట్రదారు అని సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లుత్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రభుత్వం కూడా అవినాష్‌కు మద్దతిస్తోందని తెలిపారు. సీబీఐ విచారణను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఏప్రిల్ 24 తర్వాత సీబీఐ నాలుగు సార్లు సమన్లు జారీ చేసిందనీ, అవినాష్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని సునీత న్యాయవాది పేర్కొన్నారు. సీబీఐ విచారణకు సహకరించకుండా… తన తల్లి ఆరోగ్యం బాగోలేదని కర్నూలులో హంగామా చేశారని సిద్దార్థ లూథ్రా తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి అవునని సిద్దార్థ లూథ్రా సమాధానం ఇచ్చారు. వెంటనే విచారణకు తీసుకోవాలని సునీత తరుపు న్యాయవాది కోరారు. మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌ను సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసిన విషయం తెలిసిందే.