అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావలి  పాటించాలి: హరిచందన  దాసరి

– ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దు 
– ఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బోజ్జ
– ఖర్చుకు పరిమితి లేకున్నప్పటికీ  లెక్కలను నిర్వహించాలి 
– ఎన్నికల విధులలో ఉండే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ 
– ఉప  ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిచందన  దాసరి
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టబద్రుల ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టబధ్రుల శాసనమండలి ఉప ఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బోజ్జ అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో  ఎంఎల్సి ఉప ఎన్నికలో పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు.అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సులభంగా తీసుకోవద్దని, తప్పనిసరిగా ఎన్నికల నిబంధనలను పాటించాలని, ఎన్నికల సంఘం జారీచేసిన సూచనలు, నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించి ఒకటికి రెండుసార్లు చదువుకోవాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు తనను శాసనమండలి పట్ట బధ్రుల ఉప ఎన్నికకు పరిశీలకులుగా నల్గొండ జిల్లాకు నియమించడం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తాను ఎన్నికలను పరిశీలిస్తానని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇతర విషయాలకు సంబంధించి తనని సంప్రదించాలనుకునేవారు 9866377107 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. నామినేషన్లను మొదలుకొని ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇతర ఎన్నికల మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు సైతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఒకే విధంగా ఉంటుందని, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల నియమ నిబంధనల పరిధి దాటకుండా ఎం సి సి అమల్లో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు వారి ప్రచారంలో కులం, మతం, ఎదుటి వ్యక్తులను దూషించడం, ప్రార్థనా స్థలాలలో ప్రచారం వంటివి చేయకూడదని, ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని, ముందస్తు అనుమతి లేకుండా ఇతరుల ఇండ్ల గోడలపై రాతలు రాయటం, హోర్డింగులు ఏర్పాటు చేయడం వంటివి చేయవద్దని, ర్యాలీలు ఇతర వాటికి తప్పనిసరిగా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, ప్రజలకు సాధారణ జీవన పరిస్థితులకు ఆటంకం కలిగించవద్దని, ఎవరిని భయపెట్టకూడదని, ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో ఇచ్చే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం,నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు పార్లమెంటు ఎన్నికల ప్రచార సైలెన్స్ పీరియడ్ పూర్తయినందున పూర్తిస్థాయిలో ఎమ్మెల్సీ ప్రచారాన్ని నిర్వహించుకోవచ్చని, ఆయా జిల్లాలలో ప్రచారం నిర్వహించుకుంటే సంబంధిత ఏఆర్వోల ద్వారా అనుమతులు తీసుకోవాలని, నియోజకవర్గం మొత్తానికి సంబంధించి నల్గొండ రిటర్నింగ్ అధికారి ద్వారా తీసుకోవాలని తెలిపారు. అనుమతులు లేకుండా ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని, వారి ప్రసంగాలలో ఎలాంటి రెచ్చగొట్టే సందేశాలు, కులం, మతం, వంటివి లేకుండా చూసుకోవాలని, ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు చేయవలసి వస్తే 1950, 1800425144 నంబర్ల ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు. సి- విజిల్ ద్వారా మద్యం, నగదు వంటివి ఎక్కడైనా పంపిణీ చేస్తున్నట్లయితే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చుకు పరిమితి లేకున్నప్పటికీ తప్పనిసరిగా అభ్యర్థులు లెక్కలను నిర్వహించాలని, ఎన్నికల విధులలో ఉండే ఉద్యోగులకు మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఉంటుందని ఆమె వెల్లడించారు.ఈ సమావేశానికి స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, నల్గొండ ఆర్డీవో రవి, ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు, తదితరులు  హాజరయ్యారు.
Spread the love