– భగ్గుమంటున్న కూరగాయల ధరలు
– పెరిగిన నిత్యావసర సరుకులు
– ధరల్లో దడ పుట్టిస్తున్న ట’మోత’ కిలో రూ.100 దాటిన వైనం
– అదే దారిలో పచ్చిమిర్చి ధరలు
– పేద, మధ్య తరగతి ప్రజల ఆందోళన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో కూరగాయలు, నిత్యావసర సరకుల ధరలు భగ్గుమంటున్నాయి. రెండు నెలల క్రితం కురిసిన అకాల వర్షాలు, ప్రస్తుత వర్షాభావ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. దీంతో నెల రోజులుగా కూరగాయల రోజురోజుకూ పెరుగుతున్నాయి. జిల్లాలోని అన్ని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. ఏ కూరగాయలైన కిలో రూ.60 నుంచి రూ.వంద వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి, కార్మిక, కూలీనాలి చేసుకొని జీవించే సమాన్యులు అల్లాడుతున్నారు. కూరగాయలు కొనే పరిస్థితి లేక పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుంటున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో ఉద్యానవన పంటలు దెబ్బతిని దిగుబడి తగ్గడం, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు కూరగాయల దిగుబడి రాక పోవడంతో ధరలు పెరుగుతున్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. పె ట్రోల్, డీజిల్ ధరలు తగ్గకపోవడంతో రవాణా చార్జీలు పెరగడంతో ధరల ధరలకు పెంపునకూ ఓ కారణమని చెబుతున్నారు.
ఆగని ధరల అదుపు..
కొన్ని రకాల కూరగాయలు కిలో రూ.వంద.. ఆపైన ధరల పలుకుతోంది. టమాట కిలో రూ.వందకు చేరగా, పచ్చిమిర్చి రూ.100 నుంచి రూ.120 చొప్పున విక్రయిస్తున్నాయి. క్యారట్ రూ.100కు చేరింది. వీటితో పాటు ఇతర కూరగాయల ధరలు కిలో 60 నుంచి వంద వరకూ ధర పలుకుతోంది. పదిరోజులుగా టమాట, పచ్చిమిర్చి ధరలు భారీగా పెరిగాయి. నెల రోజుల క్రితం రూ.20 నుంచి రూ.30 కిలో ఉన్న టమాటా రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం వరకు కిలో మిర్చి రూ.30 నుంచి రూ.40 వరకు ధర నుంచి ప్రస్తుతం రూ.వంద నుంచి రూ.120కి చేరింది. అధికారులు చొరవ తీసుకుని పెరిగిన ధరలను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
కూరగాయల ధరలు
ఇదీలా ఉంటే నిత్యావసర సరుకుల ధరలతో పాటూ, కూరగాయల ధరలు భగ్గు మంటున్నాయి. నిత్యం ప్రతి కూరలో వాడుకునే టమోట మోత మోగుతోంది. కిలో రూ.100 దాట్టింది. ఇక బీరకాయ రూ.80, బెండకాయ రూ.60, దొండకాయ రూ.40-50, కాకరకాయ రూ.80, వంకాయ రూ.40, బీట్‌రూట్ రూ.70, క్యాప్సికమ్ రూ.80, ఇతర రూ.40-50 చొప్పున ధరలు పలుకుతున్నాయి.
పప్పులు.. నూనెలు పైపైకి..
కూరగాయల ధరలే కాదు.. పప్పు, నూనె ధరలు సైతం మండి పోతున్నాయి. కిలో కంది పప్పు రూ.150, పెసరపప్పు రూ.130, మినపపప్పు రూ.140, శనగపప్పు రూ.70, ఎర్రపప్పు రూ.100కిలో చొప్పున ఉన్నాయి. అలాగే, సన్‌ఫ్లవర్ ఆయిల్ కిలో రూ.120, పామాయిల్ కిలో రూ.95-100, పల్లి నూనె రూ.120 చొప్పున ధరల పలుకుతున్నాయి.