ఆచూకీ కానొస్తలే

నిశబ్దాన్ని పటాపంచలు చేసిన
ఆ పసిబిడ్డ ఏడుపే
నేను విన్న చివరాకరిది.

ఈ మధ్య కాలంలో నువ్వేపుడైన
బిగపట్టిన పిడికిలిని చూశావా ?
కాసిన్ని వేడి వేడి నినాదాలను
ఆ దోపిడిదారుల గుండెలపై విసిరేయడం
కనీసం కళ్ళారా చూశావా ??
నిద్రలేకుండా చేసేటి ఆ ప్రశ్నలేవి
విడమరిచి వివరించే వేధికలేవి
మొద్దుబారిన మెదళ్ళను
సానబెట్టిన ఆ మాటలేవి??

వేట మొదలైన అడవిలోనే
నాటకం షురూ అయినట్టు
దొంగలు దొరతనం మోస్తుంటే
పొదల సాటున సప్పిడి మాటలతో
సగ ప్రాణాలతో సాగుతున్న
పిరికి పందల వత్తాసు పాటలే
రాజ్యతంత్రమయినట్టుంది.

భగ భగ రగిలే
నిప్పుల జ్వాలలు
యుద్ధభూమిపై పారిన
ఎర్రఎర్రని రక్తపు అలలు
కన్నతల్లుల త్యాగాల కన్నీళ్లు
నిన్ను నన్ను నిలదీస్తుంటే
తల లేని మొండెం వోలె
ఇక తప్పించుకోకు !

నిశబ్దాన్ని నిలువునా చీల్చి
నింగిని తగిలేలా
కొత్త దరువు మొదలెట్టు
గతకాలపు గొంతుల
ఆచూకీ పట్టుకొని
సైన్యమై కదులు…
–  రామ్‌ పెరుమాండ్ల

Spread the love