కారు ప్రచార జోరు

– లబ్ధిదారులను కలవడమే జగదీష్ రెడ్డి లక్ష్యం,

– ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మంత్రి,
– గడపగడపకు వెళుతూ ప్రచారంలో నిమగ్నం.
నవ తెలంగాణ-సూర్యాపేట:
శాసన సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో పలువురు అభ్యర్థులు దూసుకు పోతుండగా అధినేత కెసిఆర్ సభల ఏర్పాటు తో వచ్చిన జోష్ తో పాటు ప్రచారాల అస్త్రాలకు మరింత పదును పెట్టి స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో సియం కేసీఆర్ రూపొందించిన మేనిఫెస్టో తో పాటు అభివృద్ధి, సంక్షేమంను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అభ్యర్థులు కృషి చేస్తున్నారు. ప్రధానంగా విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్ రెడ్డి ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలలో పర్యటిస్తూనే తన నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి కూడా అన్ని స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందడానికి గాను ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో  అసమ్మతి ఉండడంతో గ్రామాలు, మండలాలలో పర్యటిస్తూ వారిని బుజ్జగిస్తూ మండలాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటు చేస్తూ వారిని చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో ప్రచారంపై బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచార గేరు ను మార్చారు. ప్రచార అస్త్రాలకు మరింతగా పదును పెడుతూ జగదీశ్ రెడ్డి ప్రజల్లోకి వెళుతున్నారు. అధినేత కెసిఆర్ ప్రచారంపై దిశా నిర్దేశం చేయడంతో అదే స్పీడ్ తో ఆయన గ్రామ గ్రామాన గడపగడపకు బీఆర్ఎస్ చేరే విధంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ప్రభుత్వం ద్వారా నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి ఇంటికి, ఇంటికి తిరిగి ఓటు అభ్యర్థించే దిశగా జగదీశ్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తూ నే సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ప్రచారంలో లోటు రాకుండా చూస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలలో సిట్టింగ్ లకె టికెట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులు వారి నియోజకవర్గాలలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నారు. నియోజక వర్గాలలో మండలాల వారీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, రహస్య సమావేశాలు నిర్వహించడంతోపాటు అలిగిన వారిని బుజ్జగిస్తున్నారు. మరికొంత మందికి జగదీశ్ రెడ్డి నేరుగా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది ని అవసరమైతే కేసీఆర్, కేటీఆర్ ల చెంతకు తీసుకెళ్లి బుజ్జగిస్తున్న విషయం తెల్సిందే. ఇది కాక ఎన్నికల ప్రచారం మండల, గ్రామస్థాయి బాధ్యతలను పార్టీ శ్రేణులకు అప్పగిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన తో ఒకటి రెండు నియోజకవర్గాలలో మొదట్లో అసమ్మతి ఉన్నప్పటికీ అభ్యర్థులతోపాటు అధిష్టానం అసమ్మతి, అసంతృప్త వాదులతో చర్చించారు. వారందరిని కలుపుకుంటూ ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీపరంగా అభ్యర్థులకు కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి ఉన్నట్లు తెలుస్తుంది.  ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున అభ్యర్థులు ప్రచారంపై మరింత దృష్టి సారించారు. ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కేసీఆర్ సూచించడంతో ఆ మేరకు అభ్యర్థులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రదానంగా అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రచారానికై ప్రత్యేక వాహనాలను సమకూర్చుకుంటూ నియోజకవర్గంలో కళాకారులతో కలిసి గ్రామ గ్రామాన ప్రచారం చేస్తున్నారు. తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులను ప్రజల ముందు ఉంచుతున్నారు. వారి వారి నియోజకవర్గాలలో ప్రత్యర్థులకు దీటుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ పనిలో పనిగా ప్రతి పక్షాల నాయకులను, కార్యకర్తలకు గాలం వేస్తున్నారు. ప్రధానంగా ఎన్నికలు అయిపోయేంత వరకు అభ్యర్థులు నియోజకవర్గాలను వదిలి బయటకు రావద్దని కెసిఆర్ ఆదేశించడంతో జిల్లాలోని జగదీశ్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, సైదిరెడ్డి లు నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. నియోజకవర్గంలో ప్రతిరోజు రెండు మూడు మండలాలలో గల గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట, తుంగతుర్తి లలో అభ్యర్థులను ప్రకటించకపోవడంతో జగదీశ్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్ లు ప్రచారానికి బ్రేక్ ఇవ్వకుండా కారు స్పీడును పెంచారు. కాగా జగదీష్ రెడ్డి ఆపరేషన్ ఆకర్శ్ పేరుతో ప్రధాన పార్టీలకు చెందిన వారిని ముగ్గులోకి లాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలకు చెందిన ముఖ్య నేతలు పార్టీలో చేరేందుకు సంసిద్ధమవుతున్నారు. ఇదే కాక పరిపాలనలో నాయకులు, కార్యకర్తలకు ఏమైనా లోటు పాట్లు జరిగి ఉంటే వాటిని పట్టించుకోవద్దని ఈసారి అందరికీ న్యాయం చేస్తానని జగదీశ్ రెడ్డి నేరుగా ఫోన్ లో  సంభాషిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ పోరు నెలకొనడంతో జగదీష్ రెడ్డి దానిని ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారిపై నిఘా పెట్టారు. అదేవిధంగా అన్ని పార్టీలలో అసమ్మతితో ఉన్నవారిని తనవైపు తిప్పుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కెసిఆర్ ఆదేశాలతో జగదీశ్ రెడ్డి జిల్లా కేంద్రంలో మకాం వేసి లబ్ధిదారులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగాక గ్రామాల్లో బుల్లెట్ పై తిరుగుతూ వినూత్న రీతిలో ప్రచారంలో దూకుడు పెంచారు. దీంతో పాటు ఆయన సతీమణి సునీత కూడా ప్రతిరోజూ వార్డుల్లో ఇంటింటికీ  తీరిగుతూ పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. వారు చేస్తున్న కృషి మరి ఏ మేరకు నెరవేరుతుందో వేచి చూడాలి.
Spread the love