– రెండుసార్లూ కలిసొచ్చిన రెండు ప్రధాన పార్టీల క్రాస్ ఓటింగ్
– 2019లో కాంగ్రెస్, ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయప్రతినిధి
కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ మరోమారు విజయం అందుకున్నారు. వరుసగా రెండు సార్లు విజయాన్ని అందుకున్న ఆయ నకు గతం కంటే ఈసారి మెజార్టీ పెరగడం గమనార్హం. ఇక్కడి ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న వైరం.. రెండుసార్లు ఆయనకు విజయాన్ని కట్టబెట్టింది. ఎన్నికల ప్రారంభం నుంచి మూడు ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించినా.. చివరి క్షణాల్లో పోలింగ్ నాటికి పరిణామాలు తారుమారవడం గమనార్హం. 2019లో బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్, 2024లో కాంగ్రెస్‌ను ఓడించాలని బీఆర్ఎస్ శ్రేణులు చేసిన క్రాస్ ఓటింగ్ ఫలితమే సంజరు గెలుపు నల్లేరు మీద నడకలా సాగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కరీంనగర్ ఓటర్లు ఎప్పుడూ విభిన్న తీర్పునే ఇచ్చారు. ఇక్కడి ఎంపీలను రెండోమారు ఎన్నుకున్న దాఖలాలు లేవు. అయితే 2019 ఎన్నికల నుంచి మాత్రం ఇక్కడి రాజకీయ పరిస్థితులు, రెండు ప్రధాన పార్టీల మధ్య వైరం బీజేపీ అభ్యర్థి సంజరుని రెండుసార్లు గెలిపించాయి. 2019 ఎన్నికల నాటి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే.. అంతకంటే ఆర్నెళ్ల కిందట ముందస్తు ఎన్నికలకు పోయి రాష్ట్రంలో భారీ మెజార్టీ సీట్లు సాధించి బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2014, 2018 రెండు ఎన్నికల్లోనూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలనూ క్లీన్ స్వీప్ చేస్తూ వచ్చింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆర్నెళ్లకే వచ్చిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ఆ సమయంలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్‌కు 4,08,768 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దాదాపు 60శాతం కాంగ్రెస్ ఓటింగ్ అంతా క్రాస్ ఓటింగ్ రూపంలో బీజేపీకి మళ్లింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ కనీసం ఖాతా తెరవని బీజేపీ.. ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజరుకి ఏకంగా 4,98,276ఓట్లు పోలై 89, 508 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు 2019 సీన్ మళ్లీ రిపీట్ అయిందనే చెప్పొచ్చు. అయితే, గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి క్రాస్ ఓటింగ్ సంజరుకి కలిసొస్తే.. ఈసారి బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్రాస్ ఓటింగ్ విజయాన్ని కట్టబెట్టింది. అందుకు మొన్నటి అసెంబ్లీలో ఆయా పార్టీలు సాధిం చిన మొత్తం ఓట్లు.. ఇప్పుడు పార్లమెంట్లో పోలైన ఓట్ల తేడానే అద్దం పడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి కాంగ్రెస్‌కు 5,12,352ఓట్లు రాగా నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీకి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి 5,17,601ఓట్లు రాగా.. మూడు స్థానాల్లో గెలిచింది. బీజేపీ ఏ ఒక్క స్థానం లోనూ ఖాతా తెరవకపోగా.. ఏడు సెగ్మెంట్లలో కలిపి 2,50,400ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, సరిగ్గా ఆర్నెళ్ల తరువాత జరిగిన పార్లమెంట్ పోలింగ్‌లో ఆయా ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్ల తేడాను చూస్తే ఈసారి బీఆర్ఎస్ నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ ఎన్నికల్లో ఏకంగా 5,85,116ఓట్లు సాధించి.. 2,25,209ఓట్ల మెజార్టీతో సంజరు మరోమారు విజయం సాధించారు. అయితే నలుగురు ఎమ్మెల్యేలు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వంటి పరిస్థితుల్లో అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో పని చేసినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లూ సాధించకపోగా 3,59,907ఓట్లు మాత్రమే సాధించింది. ఇదే సమయంలో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించిన బీఆర్ఎస్ చివరి నిమిషంలో పోలింగ్ సమ యానికి చేతులెత్తేసిందిజ ఈ పార్టీ అసెంబ్లీ పోరులో సాధించిన 5,17,601ఓట్లలో 2,82,163 ఓట్లు మాత్రమే సాధించి మూడోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను పార్లమెంట్లో ఓడించాలని భావించిన క్షేత్రస్థాయి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున బీజేపీకి క్రాస్‌ఓటింగ్ చేయించారన్న విమర్శలకు ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతుండటం గమనార్హం.