నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత మామపై కేసు..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మామయ్య రామ్ కిషన్ రావుపై పోలీసు కేసు నమోదయింది. నిజామాబాద్‌లోని ఆర్‌కేఆర్ అపార్ట్‌మెంట్ ఎదుట ఉన్న స్థలం విషయంలో కిషన్ రావుకు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు బంధువు నగేశ్ కుమార్ మధ్య వివాదం ఏర్పడింది. ఈ వ్యవహారంలో నిజామాబాద్‌ రూరల్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ఎస్‌హెచ్‌వో మహమ్మద్‌ ఆరీఫ్‌ వెల్లడించారు. రోడ్డు స్థలాన్ని కబ్జా చేశామంటూ ఆర్‌కేఆర్‌ అపార్ట్‌మెంట్‌ వాసులు చేస్తున్న ఆరోపణలు నిజం కాదని, అది తన సొంత స్థలం అని నగేశ్‌ కుమార్‌ చెబుతున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్‌ పత్రాలు కూడా తన పేరు మీద ఉన్నాయన్నారు. ఈ స్థలంతో రామ్‌కిషన్‌ రావుకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు నగేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామ్ కిషన్ రావుతో పాటు అపార్ట్‌మెంట్‌ వాసి గోపి అనే వ్యక్తితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Spread the love