మూడు రోజుల్లోనే నగదు జమ

– ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాం
– సన్న వడ్లకే రూ. 500 బోనస్‌
– మొలకెత్తిన ధాన్యాన్నీ కొంటాం
– ‘వరి వేస్తే ఉరే’ అన్న కేసీఆర్‌…నేడు డ్రామాలాడుతున్నారు : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే నగదును రైతుల ఖాతాల్లో జమ చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఈ విషయం రుచించడం లేదనీ, అందుకే రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టొదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. ‘రాష్ట్ర ప్రభుత్వం అసలు ధాన్యమే కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతుంది’ అంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వరి వేస్తే ఉరే అన్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌…నేడు డ్రామాలాడుతు న్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో అధికార ప్రతినిధి డాక్టర్‌ లింగం యాదవ్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నేతలు గాలి మాటలు మాట్లా డుతున్నారని విమర్శించారు. గతేడాది ఇదే సమయానికి తాను పాదయాత్ర చేస్తుండగా, రోడ్ల వెంట రైతులు ధాన్యాన్ని కుప్పలుగా పోశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయలేదనీ, వేలాది మంది రైతులు తన పాదయాత్ర సమయంలో తమ గోడును వెళ్లబోసుకున్నారని తెలిపారు. మొలకెత్తిన ధాన్యాన్ని సైతం మద్దతు ధరకే తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. వారికి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత తమదేనన్నారు. సన్నరకం వడ్లను రూ.500 బోనస్‌తో కొనుగోలు చేసేందుకు ప్రయత్నం మొదలు పెట్టామని భట్టి అన్నారు.
రాజీవ్‌ది ఎంతో ముందు చూపు
భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడేలా చేసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ దుష్టశక్తుల చేతిలో బలైపోయారని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. టెలీ కమ్యూనికేషన్‌ రంగాన్ని ముందు చూపుతో ప్రధానిగా రాజీవ్‌గాంధీ ఆచరణలో పెట్టారనీ, యువతను రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో ఏ పంటలు పండుతున్నాయో, ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నామనే సమాచారం క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నామని తెలిపారు. దీనికి కారణం రాజీవ్‌ గాంధీ చూపిన మార్గమేనన్నారు.ఆయన ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని ఆయన తెలిపారు.

Spread the love