వీడని కులవివక్ష

Caste discrimination will not go away– డప్పు కొట్టనందుకు.. దళిత కుటుంబం బహిష్కరణ
– పంచాయితీ పెట్టి నిలదీసిన పెద్దమనుషులు
– డప్పు కొట్టకపోతే ఇనాం భూమి ఇచ్చేయాలని డిమాండ్‌
– ఆ కుటుంబంతో మాట్లాడినోళ్లకు 25 చెప్పుదెబ్బలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్మానం
– చదువుకుంటే డప్పు కొట్టరా అని నిలదీత, తిట్ల పురాణం
– బాధితుల పిర్యాదుతో మొక్కుబడి కౌన్సెలింగ్‌
– ఆలస్యంగా 18 మందిపై కేసు.. పరారీలో నిందితులు
– దోషుల్ని కఠినంగా శిక్షించాలి: కేవీపీఎస్‌
అంతరిక్షంలోకి అడుగుపెట్టే స్థాయికి ఎదిగినా.. తోటి మనిషిని మనిషిగా చూడలేని దుస్థితిలోనే ఉండిపోతున్నారు. కులాధిపత్య భావజాలంతో ఇంకా కుల వివక్ష చూపుతూనే ఉన్నారు. ఎక్కడో మారుమూల పల్లెల్లోనే కాదు హైదరాబాద్‌కు కూతపెట్టు దూరంలోని మనోహరాబాద్‌ ప్రాంతంలో డప్పు కొట్టడం వీలు కాదని చెప్పినందుకు ఒక దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. ”ఉన్నత చదువులు చదివినంత మాత్రానా డప్పు కొట్టడం మానేస్తారా..? డప్పు కొట్టకపోతే సర్కారిచ్చిన ఇనాం భూమిని తిరిగిచ్చేయండీ.. ఊర్లో చావు, పెండ్లిండ్లు, పండుగలాంటి శుభ, అశుభ కార్యమేదైనా సరే మీరు వచ్చి డప్పులు కొట్టాల్సిందే.. కాదంటే ఊరి నుంచి బహిష్కరిస్తం.. మీతో ఎవ్వరూ మాట్లడరు. ఎలాంటి సహాయం చేయరు. ఎవరైనా మాట్లాడితే వారికి 25 చెప్పు దెబ్బలతో పాటు రూ.5 వేల జరిమానా తప్పదు’ అంటూ ఊరంతా కలిసి తీర్మానించారు. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్న దళిత యువకులు ఆత్మాభిమానాన్ని చంపుకుని డప్పుకొట్టే వెట్టి వృత్తిని చేయబోమని తేల్చి చెప్పడం పెద్ద నేరంగా భావించిన కొందరు పెద్ద మనుషులు, మాజీ ప్రజాప్రతినిధులు కుల ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించారు.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
మెదక్‌ జిల్లా మనోహారాబాద్‌ మండలంలోని గౌతోజిగూడ గ్రామంలో దళిత కుటుంబమైన పంచమి శంకరయ్య, నరసమ్మ దంపతులకు చంద్రం, అర్జున్‌ ఇద్దరు కుమారులున్నారు. వీరు జేఎన్‌టీయూలో ఉన్నత చదువులు చదువుకుని హైదరాబాద్‌లో ప్రయివేట్‌ ఉద్యోగం చేస్తూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. ఊర్లో నివాసముంటున్నా హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. కాగా, ఆ ఇద్దరు యువకులు ఊర్లో చావులు, పెండ్లిండ్లు, పండుగలకు డప్పు కొట్టడం తమకు వీలు కాదన్నారు. వాళ్ల తండ్రి శంకరయ్య బతికున్నంత కాలం ఊర్లో డప్పు కొట్టేవారు. ఆయన చనిపోయాక పెద్ద కొడుకు చంద్రం కూడా కొంత కాలం డప్పు కొట్టాడు. అయితే ఉద్యోగం చేస్తూ ఊర్లోకి వచ్చి డప్పు కొట్టాల్సి రావడంతో ఇబ్బందిగా ఉండేది. అయినా ఊరి వాళ్ల ఒత్తిడితో ఇబ్బంది పడుతూ డప్పు కొట్టేందుకు మూడు రోజుల పాటు ఊర్లో ఉండటంతో ఇటీవల అతని ఉద్యోగం పోయింది. దాంతో ఊర్లో పాతకాలం నాటి వెట్టి వృత్తి అయిన డప్పు కొట్టడాన్ని మానేవేయాలని భావించారు. ఒక పక్క ఉద్యోగం వదిలొచ్చి ఊర్లో డప్పు కొట్టడం వీలుకాకపోవడం, మరో పక్క ఉన్నత చదువులు చదివి చావు, పండుగలు, పెండ్లిండ్లకు డప్పు కొట్టి చిన్నచూపునకు గురికావడం ఇష్టంలేని చంద్రం, అర్జున్‌ కొంత కాలంగా డప్పు కొట్టేందుకు వెళ్లడంలేదు. ఈ నెల మొదటి వారంలో ఊర్లో ఓ వ్యక్తి చనిపోయాడు. అంత్యక్రియలకు డప్పుకొట్టేందుకు శంకరయ్య కొడుకులు వెళ్లలేదు. దాంతో ఊర్లో ఉన్న బీసీ, ఎస్సీ ఇతర కులస్తులంతా నిలదీశారు. ఈ నెల 10 న పంచాయితీ పెట్టి చంద్రం, అర్జున్‌ను పిలిచారు. ఊర్లో ఎలాంటి కార్యమైనా తప్పని సరిగా డప్పు కొట్టేందుకు మీరు రావాలని పెద్ద మనుషులు హుకుం జారీ చేశారు. ఎంత చదివితే మాత్రం కుల వృత్తి మానేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డప్పు కొట్టకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఇనాం భూమిని తిరిగివ్వాలని డిమాండ్‌ చేశారు. చెప్పడానికి వీల్లేని బూతులు తిడుతూ అందరి ముందు అవమానపరిచారు. ఇష్టం లేని పనిని బలవంతంగా చేయాలని డిమాండ్‌ చేయడం సరైంది కాదని చంద్రం, అర్జున్‌ అన్నారు. దాంతో ఊర్లోని పెద్దమనుషులంతా కక్షకట్టి మాజీ సర్పంచ్‌ బొడ్డు వెంకటేశం, ఉప సర్పంచ్‌, ఇతర పెద్దమనుషులు ఆ ఇద్దరు దళిత యువకుల్ని బూతులు తిడుతూ మేం చెప్పినట్టు చేయకపోతే ఊర్లోంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. మీ కుటుంబంతో ఊర్లో వాళ్లెవ్వరూ మాట్లాడటం, సహాయం చేయడం చేయబోరంటూ బెదిరించారు. అన్నట్టుగానే పెద్ద మనుషులంతా కలిసి తీర్మానం చేశారు. శంకరయ్య, నర్సమ్మ కుటుంబాన్ని సాంఘీకంగా బహిష్కరిస్తున్నట్టుగా తీర్మానంలో పేర్కొన్నారు. ఎవరైనా ఆ కుటుంబంతో మాట్లాడితే 25 చెప్పు దెబ్బలు, రూ.5 వేల జరిమానా విధిస్తు న్నట్టు రాశారు. ఊరంతా ఒక్కటిగా ఉండి శంకరయ్య కుటుంబాన్ని ఊర్లోకి రాకుండా చేయాలని నిర్ణయించారు.
బాధితుల ఫిర్యాదు.. మొక్కుబడి కౌన్సెలింగ్‌
బాధితులైన అర్జున్‌, చంద్రం తమకు ఊర్లో జరిగిన అవమానం, అన్యాయం గురించి ఎక్స్‌లో మెదక్‌ ఎస్పీ ఉదయకుమార్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో స్థానిక తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, తూప్రాన్‌ సీఐ రంగాకృష్ణ, ఎస్‌ఐ సుభాష్‌గౌడ్‌ ఊర్లోకి వచ్చి పరిశీలించారు. ఫిర్యాదు దారుల్ని ఊర్లోకి రమ్మని చెప్పారు. ఊర్లోకి రావొద్దని బహిష్కరించాక తామెందుకు వస్తామని అర్జున్‌, చంద్రం చెప్పడంతో అధికారుల బృందం ఊర్లోని తాజా మాజీ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఇతర పెద్దమనుషులకు తూతూ మంత్రంగా కౌన్సెలింగ్‌ ఇచ్చి వెళ్లిపోయారు. సాంఘీక బహిష్కరణ చేస్తూ సమాజం అంగీకరించిన ఆంక్షలు పెట్టి తీర్మానం రాసి సంతకాలు చేసిన సంఘటనను చాలా సింపుల్‌గా తీసుకున్నారు.
18 మందిపై అట్రాసిటీ కేసు.. పరారీలో నిందితులు
డప్పుకొట్టబోమని చెప్పినందుకు దళిత కుటుంబాన్ని సాంఘీక బహిష్కరణకు గురి చేసిన వ్యక్తులపై కఠినంగా కేసు పెట్టి శిక్షించాల్సిన రెవెన్యూ, పోలీస్‌ అధికారులు మీన మేషాలు లెక్కబెట్టారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారు. అయితే బాధిత యువకులు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లుకావడంతో వాళ్లకు ఉన్న పరిచయాల వల్ల జేఎన్‌టీయూ ఎస్సీ, ఎస్టీ ప్రొఫెసర్ల ఫోరం, హైకోర్టు ఎస్సీ లాయర్ల ఫోరం, కేవీపీఎస్‌ వంటి ప్రజా సంఘాలు ఒత్తిడి చేయడం వల్ల కేసును పోలీసులు పట్టించుకున్నారు. చంద్రం, అర్జున్‌, నరసమ్మలను సాంఘీక బహిష్కరణ చేసిన ఉదంతంలో కీలకంగా వ్యవహరించిన 18 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో నలుగురు ఎస్సీలు కూడా ఉన్నారు. ఆధిపత్య కులాల పెద్ద మనుషులకు ఊర్లోని కొందరు దళితులు కూడా వత్తాసు పలికారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంత వరకు నిందితుల్ని అరెస్ట్‌ చేయలేదు. కేసు నమోదు చేసిన విషయం లీక్‌ చేయడంతో నిందితులంతా ఊర్లోంచి పరారై తలదాచుకున్నారు.

నిందితుల్ని కఠినంగా శిక్షించాలి
గౌతోజిగూడలో చదువుకున్న దళితుల పట్ల కుల వివక్ష చూపుతూ సాంఘీక బహిష్కరణ చేసిన నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్‌ శివార్లోనూ ఇంకా కుల వివక్ష, ఆధిపత్య పెఢదోరణులు కొనసాగుతున్నాయి. దళితులు చదువుకొని ఉన్నతంగా జీవించినా ఓర్వలేని తనంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. కులంపేరిట అరాచకం చేసే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి.
-అతిమేల మాణిక్యం, కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు

Spread the love