కుల దురహంకార హత్య

Caste murder– మెదక్‌జిల్లా బడంపేటలో ఘటన
– అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకున్న రాకేష్‌
– తండ్రి నర్సింహపై పలువురి మూకుమ్మడి దాడి
– మెదడు చిట్లడంతో పరిస్థితి విషమించి మృతి
– దళితుని హత్య కేసు విచారణలో పోలీసుల అలసత్వం
– సాక్ష్యం లేదంటూ ఎస్‌ఐ నిర్లక్ష్యం.. పరారీలో పలువురు నిందితులు
– పెండ్లి చేసుకున్నందుకు రాకేష్‌ను జైల్లో పెట్టిన వైనం
– బేగరి నర్సింహ హత్యపై సమగ్ర విచారణ జరపాలి: కేవీపీఎస్‌
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్ని చట్టాలు వచ్చినా.. దళితుల పట్ల అగ్రకుల ఆధిపత్య దురహంకారపు ఆగడాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అగ్రకుల అమ్మాయిని దళిత యువకుడు ప్రేమించి పెండ్లి చేసుకోవడం నేరమైంది. అంతేకాదు, ఊర్లో అంబేద్కర్‌ విగ్రహం పెట్టడం, బుద్ధుడి పేర స్తూపం కట్టడాన్ని జీర్ణించుకోలేని అగ్రకుల పెత్తందార్లు అదును చూసి మాటు వేసి ప్రాణం తీశారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలంలోని బడంపేటలో యువకుని తండ్రి బేగరి నర్సింహను దారుణంగా కొట్టి చంపారు. ఆ దాడికి పాల్పడిన అగ్రకులస్తులను పోలీసులు కాపాడుతూ కేసును నీరుగార్చుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కుటుంబసభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా కోహీర్‌ మండలం బడంపేట గ్రామంలో వంద దళిత కుటుంబాలున్నాయి. ఊర్లో బలిజ, రెడ్డి, గొల్ల, తెనుగ, ముదిరాజ్‌ కులాలతో పాటు సేవా కులాలైన చాకలి, మంగలి వాళ్లు సైతం ఉన్నారు. మూడు నాలుగు గ్రామాలకు కూడలిగా ఉన్న బడంపేటలో దళితులు విద్యావంతులై చైతన్యమవుతున్నారు. ఊరి సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహంతో పాటు బుద్ధుని స్థూపం కోసం గద్దెను ఏర్పాటు చేశారు. దళితులు పెట్టిన అంబేద్కర్‌ విగ్రహం ఊరి సెంటర్‌లో ఉండటాన్ని ఓర్వలేని పెత్తందార్లు ఆ విగ్రహం కనిపించకుండా భారీ శివాజీ విగ్రహాన్ని పెట్టారు. దీన్ని దళితులు ప్రశ్నించడంతో ఊర్లో దళితులు, అగ్రకుల పెత్తందార్ల మధ్య గొడవలయ్యాయి. ఆ తర్వాత శివాజీ విగ్రహం పక్కనే బుద్ధుని కోసం స్థలం తీసి అక్కడ దిమ్మెను ఏర్పాటు చేశారు. దాన్ని అడ్డుకోవడం కోసం పెత్తందార్లు ప్రయత్నించడంతో బేగరి నర్సింహ అనే వ్యక్తి బుద్ధుని దిమ్మె కోసం గట్టిగా మాట్లాడాడు. ఆ కుట్రతో కొందరు అతనిపై తప్పుడు కేసులు పెట్టి పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి విచక్షణారహితంగా రక్తం కారేటట్లు కొట్టించారు. ఇదంతా నాలుగేండ్ల క్రితం సంగతి. ఇంత చైతన్యవంతమైన పాత్ర పోషించిన బేగరి నర్సింహ(45) కొడుకైన బేగరి రాకేష్‌ ఇంటర్‌ చదువుకుని సంగారెడ్డిలో ఉంటూ పని చేసుకుంటున్నాడు. నర్సింహ ఊర్లో తనకున్న చిన్న ఇంటిని సోదరుడికి అమ్మేసి తనకున్న వ్యవసాయ భూమి వద్దనే గుడిసె వేసుకుని కాపురం ఉంటున్నాడు. నర్సింహ పొలం పక్కనే ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో తాండూరు ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ, రాములు తన కూతురుతో వచ్చి పనిచేస్తూ అక్కడే ఉన్నారు. ఆ క్రమంలోనే రాకేష్‌, నందిని మధ్య పరిచయం ఏర్పడింది. క్రమంగా ప్రేమగా మారి ఇద్దరు కలిసి ఈ నెల 1వ తేదీన పెండ్లి చేసుకున్నారు. ఈ విషయం ఊర్లో వాళ్లందరికీ తెలియడంతో కొందరు అగ్రకుల పెద్దమనుషులు ఆ యువతిని తల్లిదండ్రుల్ని ప్రేరేపించి పోలీస్‌లకు ఫిర్యాదు చేయించారు. పోలీసులు ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చి ఎవరంతల వాళ్లు ఉండాలని చెప్పి పంపారు. మరుసటి రోజున కొందరు పెద్దమనుషులు పోలీసులపై ఒత్తిడి తెచ్చి రాకేష్‌పై మైనర్‌ను పెండ్లి చేసుకున్నాడనే నెపంతో కేసు పెట్టి చర్లపల్లి జైల్లో రిమాండ్‌ చేశారు.
కొడుకు దొరకలేదని తండ్రి హత్య
అగ్ర కులం పిల్లను దళితుడు పెండ్లి చేసుకోవడం ఏమిటనీ, వాడిని చంపేస్తే పీడ పోతదంటూ పలువురు నర్సింహని పట్టుకుని తిట్టారు. రెండు నెలల క్రితం ఊర్లో ఓ దళిత యువకుడు అగ్రకుల అమ్మాయిని ప్రేమించి పెండ్లి చేసుకుని ఊర్లోనే ఉంటున్నాడు. ఆ కక్షకు తోడు రాకేష్‌ కూడా అగ్రకుల అమ్మాయిని పెండ్లి చేసుకోవడంతో ఓర్వలేక రాకేష్‌ తండ్రి నర్సింహపై దాడికి పాల్పడ్డారు. ఈ నెల 18న సాయంత్రం పొలం నుంచి ఊర్లోకి వచ్చి సామాన్లు తీసుకుని వెళ్తుండగా 9 మంది నర్సింహపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఊర్లో వీధి దీపాలు లేని రాచన్నస్వామి గుడి ప్రాంతంలో విచక్షణారహితంగా కొట్టారు. తలపై బలంగా కొట్టడంతో పాటు కడుపు, కిడ్నీలపై కొట్టారు. గొంతు నులిమి చంపేందుకు పూనుకున్నారు. తీవ్ర రక్తస్రావం అవడంతో నర్సింహులు స్పృహ తప్పి పడిపోయాడు. రాత్రంతా ఎవరూ చూడలేదు. తెల్లవారి చెత్తఎత్తే సిబ్బంది ఒకరు రక్తంతో పడి ఉన్న నర్సింహను చూసి ఆయన భార్య అంజమ్మకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమె అక్కడికి చేరుకుని అతన్ని కోహీర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చికిత్స కోసం సంగారెడ్డికి పంపగా అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు ఉస్మానియాకు పంపారు. నర్సింహకు బ్రెయిన్‌, గొంతు, పొట్ట వద్ద తీవ్రమైన గాయాలయ్యాయని, కొన్ని ఆపరేషన్లు చేశారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ నెల 26న మృతి చెందాడు. దాంతో ఆగ్రహించిన దళితులు సోమవారం (27వతేదీ) రాత్రి దాడి చేసిన పట్లోళ్ల దయానంద్‌ ఇంటి ముందు శవం పెట్టి ఆందోళన చేశారు. పట్లోళ్ల సందీప్‌, పట్లోళ్ల రాహుల్‌, గొల్ల మల్లేశం, రాములు, శ్రీనివాస్‌, నాని, దయానంద్‌ ఇతరుల్ని అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ వందలాది మంది దళితులు ఆందోళన చేశారు.
నర్సింహులు హత్యపై సమగ్ర విచారణ జరపాలి: కేవీపీఎస్‌
దళితుడైన బేగరి నర్సింహను అగ్రకుల పెత్తందార్లు దారుణంగా కొట్టి చంపిన సంఘటనపై సమగ్ర విచారణ జరపించాలని, నిందితుల్ని కఠినంగా శిక్షించి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కేవీపీఎస్‌ డిమాండ్‌ చేసింది. మంగళవారం కేవీపీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, సహాయ కార్యదర్శి మహేష్‌, నాయకులు నరేష్‌, తుల్జారం, శ్రీనివాస్‌, నాగేందర్‌, జైపాల్‌ ప్రతినిధి బృందం మృతుడు నర్సింహ కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మాణిక్యం మాట్లాడుతూ.. కేసు విచారణలో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నందున ఉన్నతాధికారి చేత సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. దాడి చేసి పది రోజులైనా.. చనిపోయి మూడు రోజులవుతున్నా ఇప్పటి వరకు నిందితుల్ని అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. నర్సింహపై దాడి చేసిన 9 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ప్రభుత్వం నర్సింహ్మ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్‌గ్రేషియా, మూడు ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ముగ్గురు నిందితులపై కేసు : క్రిష్ణయ్య, ఎస్‌ఐ, కోహీర్‌
మృతుడు నర్సింహ తండ్రి బేగరి రాచయ్య ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశాం. దాడిలో ఎవరెవరు ఉన్నారనేది తేల్చేందుకు విచారణ కొనసాగుతున్నది. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర కేసులు నమోదు చేశాం. కేసు విచారణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు. నిష్పక్షపాతంగా విచారణ జరుగుతున్నది.

Spread the love