నవతెలంగాణ – సిద్దిపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుల వృత్తులను ప్రోత్సహిస్తేనే వారికి మనుగడ ఉంటుందని, సమాజంలో ఆర్థిక, ఉద్యోగ, రాజకీయపరంగా కుల సంఘాలు ఎదిగితేనే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర కుమ్మరి సంఘం ప్రతినిధి ధరిపల్లి చంద్రం అన్నారు. పట్టణ కేంద్రంలో ఓ ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన శాలివాహన కుమ్మర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మన కులానికి కృషి చేసే విధంగా పని చేయాలని, కులవృత్తులను చిన్న చూపు చూడకూడదని, సమాజంలో కులవృత్తులకు విలువలతో కూడిన మంచి భవిష్యత్తు ఉన్నదన్నారు. కుమ్మర్ల కులాలలో నైపుణ్యం కలిగిన విద్యావంతులు, మేధావులు ఉన్నత స్థాయి కలిగిన వారు ఉన్నారని, అలాంటి వారు బయటకు వస్తేనే కుల బల నిరూపించుకునే శక్తి ఉంటుందని అన్నారు. రాజకీయపరంగా ఎదగాలంటే ముందుగా కుల సంఘాలు, విద్యార్థులతో సాధ్యమని అన్నారు. అనంతరం కుమ్మరి కుల ఉద్యోగులను, ప్రముఖులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల నాయకులు వేలాద్రి, లక్ష్మి, రాములు, సంతోష్, జిల్లా నాయకులు నాగరాజు, తరిగొప్పుల రామ చంద్రం, దరి పల్లి బిక్షపతి, సత్యం, నగేష్, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.