Katha Archives - https://navatelangana.com/category/katha/ Sat, 04 May 2024 17:42:34 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.2 https://navatelangana.com/wp-content/uploads/2023/04/NavTel-36x36.png Katha Archives - https://navatelangana.com/category/katha/ 32 32 కంటగింపు https://navatelangana.com/contagion/ Sat, 04 May 2024 17:42:29 +0000 https://navatelangana.com/?p=283618 కంటగింపు”ఏమి జరిగిందండీ” అప్పుడే పొలం నుండి వచ్చి ఆరుబయటున్న మంచంపై విచార వదనంతో నడుము వాల్చిన రాజయ్యను ఆప్యాయంగా అడిగింది మణెమ్మ.
”ఏముంది పాత కథే” ముక్తసరిగా అన్నాడు.
”ఈ వయసులో మనకిది అవసరమా.. పిల్లలు చెప్పినట్లు..”
”మళ్లీ మొదలెట్టావా నీ భారతం” రాజయ్య గర్జింపులకు మణెమ్మ టక్కున మాటలాపింది.
‘ఉన్న ఊరు, కన్న తల్లి, కాళ్ళు చేతులు కాకర కాయలు అంటూ చాదస్తంతో ప్రాణం మీదికి తెచ్చుకున్నది చాలక అరుపులొకటి’ మనసులో అనుకుంటూ విసురుగా ఇంట్లోకి వెళ్లింది.
రాజయ్యకు వ్యవసాయం చేయడం అంటే చాలాఇష్టం. చిన్ననాటి నుండి వ్యవసాయం చేస్తూ ఇద్దరు అడబిడ్డల పెళ్ళి చేసాడు. ఇద్దరు మగ బిడ్డలకు మంచి చదువు ఇప్పించాడు. వారు కష్టపడి చదివి, ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు.
పట్టణాల్లో ఉద్యోగం చేస్తున్న కుమారులు రాజయ్య దంపతులను ఊరు వదిలిపెట్టి తమ దగ్గర ఉండమని వేడుకున్నారు. తాము ఊరు విడిచి రాలేమన్నారు. వయసు మీరింది కాబట్టి పనేమీ చేయకుండా, విశ్రాంతి తీసుకుంటూ ఇంట్లోనే ఉండమని కుమారులు చెప్పారు. ఖర్చులకు సరిపడా డబ్బులు తాము సర్దుబాటు చేస్తామన్నారు.
పొలం పనులు చేయడానికి అలవాటు పడిన రాజయ్య, మణెమ్మ దంపతులు తమకున్న నాలుగు ఎకరాల పొలం సాగు చేయడం మానలేదు.
”ఈ వయసులో మీకు వ్యవసాయం అవసరమా నాన్న. హాయిగా తింటూ కూర్చోండి” అన్నారు కుమారులు.
”వ్యవసాయం మనకు తల్లివంటిది. మాకు చేతనైనంత కాలం పని చేస్తాం. పొలం బీడుగా ఉంటే మంచిది కాదు. ఊరికే తిని కూర్చుండడానికి మనసొప్పడం లేదు” అన్నాడు రాజయ్య.
ఒకప్పుడు ఎద్దుల నాగలితో పొలం దున్నకం, పశువుల పేడతో ఎరువులు, పరస్పర సహకార పద్ధతిలో పనులు చేసుకోవడం వల్ల రైతులకు పంట గిట్టుబాటయ్యేది. వ్యవసాయం వల్ల వచ్చిన రాబడితో రాజయ్య తన పిల్లలను ప్రయోజకులుగా చేయగలిగాడు.
కాలం మారింది. ఇప్పుడు రైతుల దగ్గర పశువులు లేవు. యంత్రాలపై ఆధారపడే పరిస్థితి దాపురించింది. ట్రాక్టర్‌, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, కూలీల ఖర్చులు తడిసి మోపేడై, వ్యవసాయం కష్టతరమైనది. రైతులు ఇంకో పని చేయలేక, పొలాన్ని వదలలేక నిత్య సంఘర్షణకు లోనవుతున్నారు.
వ్యవసాయ పనుల వల్ల రాజయ్యకు లాభం కాని, నష్టం కాని లేదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర మాత్రం ఉన్నాయి. తమకు ఇంతకంటే ఇంకేమి కావాలని రాజయ్య దంపతులు సంతోషంగా జీవిస్తున్నారు. వీలైనంతవరకు తోటి వారికి సహాయం చేస్తున్నారు.
రాజయ్య మంచితనం, కష్టపడేతత్వం పొరుగున ఉన్న ఆరుగురు రైతులకు కంటగింపుగా మారింది.
‘కొడుకులకు ఉద్యోగాలున్నాయి. ముసలి వయసులో కూడా వ్యవసాయం చేయడమా?’ అని రాజయ్య దంపతులపై అసూయ, ద్వేషం పెంచుకుని, ఆరుగురు రైతులు రాజయ్య చేత వ్యవసాయం మాన్పించాలని కుట్రలు చేశారు.
కాలువకు గండి కొట్టి వరద ప్రవాహాన్ని రాజయ్య పొలం లోనికి మళ్ళించి పంటను ముంచడం, బావిలోని మోటారును పాడు చేయడం, పైపులు, వ్యవసాయ పనిముట్లు ఎత్తుకెళ్ళడం, చేతి కందిన పంటను తగుల పెట్టడం, కొట్టాల నుండి పశువులను విడిపించి పంటచేలో తోలడం, పచ్చని చెట్లు నరికేయడం లాంటి కుయుక్తులతో రాజయ్యకు తీరని శోకాన్ని మిగిల్చారు.
రాజయ్య తనకు జరిగిన అన్యాయం గురించి పెద్ద మనుషుల దగ్గర విన్నవించగా సాక్ష్యం కావాలని అడిగారు. రాజయ్య ఒంటరివాడు. ప్రత్యర్థులు ఆరుగురు. పలుకుబడి కలవారు. రాజయ్య కొడుకులు ఎక్కడో పట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. వారితో తమకు ఏం లాభము లేదని కొందరు పెద్ద మనుషులు ఆరుగురి వైపే నిలబడినారు.
కాలువకు గండి, పంట చేనులో మంట ప్రమాదవశాత్తు అని తేల్చి చెప్పారు. మిగతా వాటికి సరైన సాక్ష్యాలు చూపించమని ఎదురు దాడికి దిగారు. తాము ఎంతటి ఉన్నత విద్య చదువుకున్నా, పంచాయితీలో న్యాయాన్ని గెలిపించడం అంత సులభం కాదని రాజయ్య కుమారులకు బోధపడింది. సరైన ఋజువులు లేకుండా ఆరుగురిని ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసింది.
”మనకు ఈ గొడవలు వద్దు, ఇప్పటికే బాగా నష్టపోయాం. మేం దూరంగా ఉంటాం. మీరు ఒక్కరే. వారు ప్రమాదంగా ఉన్నారు. వ్యవసాయం మానేద్దాం” అన్నారు కొడుకులు.
”మన పని మనం చేస్తున్నాం. ఎవరిది తీసుకోవడం లేదు. ఆరుగురికి భయపడి మానేయమంటారా, వారు ఓర్వలేని దుర్మార్గులు” అంది మల్లమ్మ.
”నన్ను వారు ఏం చేసినా సరే” అన్నాడు రాజయ్య.
కొడుకులు ఏమి మాట్లాడకుండానే తిరిగి పట్నం వెళ్ళి పోయారు.
తమ పాచికలు పనిచేసాయని ఆరుగురు మురిసారు. కాని రాజయ్య మళ్ళీ పొలం పనులు చేస్తుండడంతో, వారు కొత్త పథకాలకు పదును పెట్టారు. కొన్ని రోజులు గడిచాయి.
రాజయ్య ఒకరోజు రాత్రి కరెంట్‌ మోటర్‌ పెట్టడానికి పొలం దగ్గరికి వెళ్ళాడు. టార్చిలైట్‌ వెలుగులో తెల్లని నాలుగు ఆకారాలు పొలంలో తిరుగుతున్నట్లు కనిపించాయి.
”ఎవరు” గట్టిగా అరిచాడు.
అవి విచిత్రంగా గోల చేస్తూ, వింత వింతగా ప్రవర్తిస్తూ రాజయ్య వైపు వస్తున్నాయి. దెయ్యాలున్నాయని వినడమే కాని రాజయ్య ఎప్పుడూ వాటిని చూడలేదు. మొదటిసారిగా భయం కలిగింది. వెనక్కి అడుగులు వేస్తూ, ఇంటి దారి పట్టాడు. మరుసటి రోజు పొలంలో దెయ్యాలు తిరుగుతున్న విషయం ఊరందరికి తెలిసింది.
ఆరుగురు రైతులు మరొక ఎత్తుగడ వేసి రాజయ్య కుటుంబాన్ని పంచాయతీకి పిలిపించారు. పొలంలో జరిగిన సంఘటనలకు దెయ్యాలే కారణమని, మాపై అనవసరంగా నిందలు మోపారని, అందుకు క్షమాపణ చెప్పాలని వితండవాదం చేసారు. పెద్ద మనుషులు వారికి వంత పాడారు. ఊరి జనం ఇది పద్దతి కాదన్నారు. రాజయ్యను దోషిగా నిలబెట్టి తీర్పు చెప్పడానికి పెద్ద మనుషులు తీవ్ర కసరత్తు చేసారు.
”మా అభిప్రాయం చెప్పుకునే అవకాశం ఏమి లేదా” అడిగారు రాజయ్య కుమారులు. లేదన్నట్లు సైగ చేసారు పెద్ద మనుషులు.
”అయితే ఇది చూడండి” అని ఒక వీడియోను ఊరి వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేసారు. అది సిసి టివి ఫుటేజ్‌.
ఆరుగురు రైతులు రాజయ్య పొలం దగ్గర కూర్చోని దెయ్యాల వేషాలు వేస్తూ, అతడిని ఏ విధంగా భయపెట్టాలనే పథక రచన చేస్తున్న వీడియో. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్ద మనుషుల నోటి నుండి మాట రావడం లేదు. ఆరుగురు ఇంకా షాక్‌ నుండి తేరుకోలేదు.
”మా పంటలకు నష్టం చేస్తున్న వారిని గుర్తించి, న్యాయం చేయమని అంటే, సాక్ష్యాలు కావాలని అడిగారు కదా! అందుకే మేము రహస్యంగా పొలంలో సిసి కెమెరాలు అమర్చినాం.ఇది సరిపోతుందా, ఇంకా కావాలా ”అన్నారు కుమారులు.
రాజయ్య నష్టపోయిన పంట మొత్తానికి సరిపడా డబ్బులను వడ్డీతో సహా ఆరుగురు చెల్లించాలని పంచాయితీ ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.
– దుర్గమ్‌ భైతి, 9959007914

]]>
ధరణికోట https://navatelangana.com/dharani-kota/ Sat, 27 Apr 2024 16:54:48 +0000 https://navatelangana.com/?p=278724 ధరణికోట”హారిక! నా జీవితంలో వెలుగులు నింపడానికి నా సహధర్మచారిణిగా మా యింట అడుగిడతావా..?” అంటూ హఠాత్తుగా హారికని ప్రతిపాదించాడు అర్జున్‌, గూగుల్‌ డ్యుయో వీడియో గ్రూప్‌ కాలింగ్‌లో యిరు కుటుంబాలు కూర్చుని నింపాదిగా ముచ్చటించుకుంటుండగా.
కోవిడ్‌ పరిస్థితుల దృష్యా మొదటిసారిగా దేశమంతా లాక్‌డౌన్‌లో వుండటంతో భాగ్యనగరంలోనే వుంటున్న అర్జున్‌, హారికల యిరు కుటుంబాలు యిదివరకటిలా కలుసుకోవడంలేదు. అందుకే ఇలా గూగుల్‌ డ్యుయో గ్రూప్‌ వీడియో కాల్లో కలుసుకుని మంచి చెడ్డలు మాట్లాడుకోసాగారు. అదిగో సరిగ్గా ఆ సమయంలోనే అర్జున్‌ అనూహ్యంగా అందరి ఎదుట హారికని ప్రతిపాదించి ఆశ్చర్యపరిచాడు.
రెండు నిమిషాలు అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
అర్జున్‌ లాప్‌టాప్‌ స్క్రీన్‌ మీద అందరి వైపు ఉత్కంఠంతో చూస్తున్నాడు, తన ప్రతిపాదనకి ఎవరు ఏ విధంగా స్పందిస్తారోనని.
హారిక ఈ ప్రతిపాదనకి ఆశ్చర్యపోలేదు. అందుకు కారణం లేకపోలేదు. యిద్దరూ ఒకనొకరు చాలా ఏళ్ళగా ఎరిగినవారే. వారి స్నేహం ఈ మధ్యే ప్రేమగా మారింది. హారికకి అర్జునంటే యిష్టం అన్న మాట పక్కన పెడితే, ముఖ్యంగా యిరువురి తండ్రులూ చాలా ఏళ్ళుగా మంచి మిత్రులు. అందుకే తమ బంధంతో వారి స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలని అనుకున్నారు. ముఖ్యంగా తమ పెద్దలకి తాము ఒకటి కావాలని వుందని వారికి తెలుసు. పెద్దలే తమ పెళ్ళి ప్రస్తావన తీసుకొస్తారని హారిక ఆశిస్తున్న సమయంలో, అర్జున్‌ చొరవ తీసుకుని ఈ విధంగా లైవ్‌ వీడియో కాల్లో విన్నూతనంగా ప్రతిపాదించి తమ ప్రేమ విషయం అందరికీ తెలియజేస్తాడని మాత్రం ఊహించలేదు.
అక్కడి నిశ్శబ్దాన్ని చీలుస్తూ ముందుగా చప్పట్లు కొట్టి హర్షించింది హారిక తండ్రి శంకరం. వెనువెంటనే చప్పట్లతో తన ఆనందం వ్యక్తపరచింది హారిక తల్లి భ్రమర. అప్పుడు ఒకింత సిగ్గుతో-
”అంకుల్‌.. ఆంటీలకి యిష్టమైతే, నీతో కలసి జీవితాన్ని పంచుకోవడానికి నాకేమి అభ్యంతరంలేదు..” అంటూ అర్జున్‌ ప్రతిపాదనని అమోదించింది హారిక.
ఒక్కొక్కరే తన ప్రతిపాదనని స్వాగతిస్తుండటంతో అర్జున్‌ మాటలకందని సంతోషాన్ని పొందాడు.
యిటు అర్జున్‌ తల్లి అరుంధతి పిల్లలిద్దరికీ గాలిలోనే ముద్దులు పెడుతూ తన అంగీకారాన్ని తెలిపింది.
అంతా సంతోషంగా చప్పట్లతో సందడిచేస్తుంటే, అర్జున్‌ తండ్రి వీరభద్రం మౌనంగా చూస్తున్నాడు.
”నాన్నా..! మొదట మీరే స్పందిస్తారనుకుంటే, మౌనంగా వున్నారేంటి? మాట్లాడండి” అన్నాడు అర్జున్‌, తండ్రి అంగీకారానికి ఎదురుచూస్తూ.
”అర్జున్‌ అన్నది నిజమేరా వీరా! పిల్లలకి నువ్వే మొదట అభినందనలు తెలుపుతావనుకున్నాను. గత కొన్ని నెలలుగా ఫోన్లోనూ నువ్వు సరిగ్గా మాట్లాడం లేదు. అనుకోకుండా ఈ విధంగా కలిసి అందరం మనసువిప్పి మాట్లాడుతుంటే, యిప్పుడేంటా మౌనం?” అన్నాడు శంకరం, వీరభద్రంతో.
అప్పుడు నోరు విప్పాడు వీరభధ్రం… ”నో..నాకీ సంబధం యిష్టం లేదు!” అంటూ అందరి ఉత్సాహం మీదా ఒక్కసారిగా నీళ్ళు జల్లాడు.
కాసేపు అక్కడ మళ్శీ నిశ్శబ్దం అలుముకున్నా, వెంటనే ఒక్కసారిగా అందరూ వీరభధ్రం మాటలకి పకపక నవ్వేసారు.
”నాన్నా! గుడ్‌ జోక్‌..! మీ మనసులోని అసలు మాట చెప్పండి..” బయటకి నవ్వుతున్నా, లోన కాసింత ఆందోళనతో అన్నాడు అర్జున్‌.
”ఒరే వీరా..! పిల్లల్ని ఏడిపించింది చాలు. నిజం చెప్పు” అన్నాడు శంకరం నవ్వుతూ.
”యస్‌.. ఐ యామ్‌ సీరియస్‌. ఈ సంబంధం నాకు యిష్టం లేదు” అంటూ బల్లగుద్దినట్టు చెప్పాడు వీరభద్రం.
ఊహించని విధంగా వీరభద్రం తన నిర్ణయాన్ని నొక్కివక్కాణించే సరికి యిటు పిల్లలే కాదు, మిగిలిన పెద్దలూ అప్పుడు విస్తుపోయారు.
యిక అర్జున్‌, హారికల ముఖాలలో నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనపడితే, ఏం మాట్లాడాలో తెలీని పరిస్థితి మిగిలిన వారి మధ్య నెలకొంది.
‘ఈ వీరభధ్రం కేమైంది? ఎందుకలా ‘నో’ చెప్పాడూ?’ మనసులోనే మదన పడ్డాడు శంకరం.
”అన్నయ్యగారికి ఒక్కసారిగా ఏమైంది..? మీరిద్దరూ మంచి మిత్రులు. పిల్లలిద్దర్ని ఒకటి చెయ్యాలని మన అందరి మనసుల్లో ఎప్పట్నుండో వున్నదే కదా. గతంలో ఈ విషయం మన మధ్య దొర్లినప్పుడు పిల్లల్ని కలపడానికి ముందుగా చొరవ చూపించింది అన్నయ్యగారే! మరిప్పుడు ఏమైంది?” ఏమీ పాలుపోకా అంది భ్రమర లాప్‌టాప్‌ వాల్యూమ్‌ మ్యూట్‌ చేస్తూ పక్కనున్న భర్తతో.
యిటు అర్జున్‌, హారికలు అయెమయానికి గురైతే, అటు అరుంధతికి తన భర్త ప్రవర్తన అంతుచిక్కలేదు. గత సంవత్సరమంతా, ఎప్పుడు తన స్నేహితుడు హారికని తన కొడుక్కి చేసుకోమని అడుగుతాడా? అని ఎదురు చూసిన యితడేనా ఈనాడు కాదంటున్నాడూ? అనుకుంది మనసులో.
కాసేపటికే హారిక, వీరభద్రం నిర్ణయానికి కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది. హారిక స్థితికి అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది.
”నాన్నా! అందరికంటే మీకే ఈ సంబంధం కలుపుకోవలని ఎక్కువగా వుందనుకుంటే, యిప్పుడు ఇష్టం లేదంటారేంటి? కారణమేంటో చెప్పండి?” అడిగాడు అర్జున్‌.
”అర్జున్‌! ఈ మేటర్‌ యిక్కడితో వదిలేయి. నాకు యిష్టం లేదన్నాను, అంతే..”అన్నాడు కోపంగా వీరభధ్రం.
ఇక చూస్తూ ఊరుకోలేక శంకరం, స్నేహితుడ్ని సూటిగా అడిగాడు.
”వీరా..! యిష్టంలేదంటే సరిపోదు. ఇది మనిద్దరి విషయమైతే నేనడిగేవాడినే కాదు. కాకపోతే పిల్లల జీవితానికి సంబధించింది కావడంతో నువ్వు హఠాత్తుగా ఎందుకొద్దంటున్నావో కారణం చెప్పల్సిందే”
”శంకరా! నే చెప్పాగా యిష్టం లేదని. యిక ఈ విషయం వదిలేరు. నా చేత ఎక్కువ మాట్లాడనీయకు”
”వీరా..! ఏదీ మనసులో దాచుకోక నిక్కచ్చిగా మాట్లాడే తత్వం నీది. యిప్పుడెందుకు వెనకాడుతున్నావ్‌? అసలు కారణం చెప్పి తీరల్సిందే..!” రెట్టించాడు శంకరం.
”అయితే.. విను. నీలాంటి దివాలాకోరుతో సంబంధం ఎలా కలుపుకోమంటావ్‌? నీ సర్వసం ఫణంగా పెట్టి అధిక ధరకి అమరావతి దగ్గర్లో ఎకరం స్థలం కొన్నావ్‌. యిప్పుడేమైంది? రాజధాని తరలిపోయింది. దాంతో నీ తలరాత తలక్రిందులైంది. ఒక విధంగా యిప్పుడు భికారివి. మన మధ్య అంతస్థుల తారతమ్యంతో పాటు అంతరాలూ పెరిగిపోయాయి. ఇక ఈ విషయం మరచిపో” కర్కశంగా కడుపులోని మాట కక్కేసాడు వీరభధ్రం. ఈ సమాధానానికి అక్కడున్న అందరూ కొద్దిసేపు స్థాణువులైపోయారు.
తనమనసులో మాట చెప్పి యింక అక్కడ ఒక్క క్షణం వుండక లేచి వెళ్ళబోతున్న వీరభద్రంని ఆపుతూ-
”నాన్నా.. మీరేనా యిలా మాట్లేది? నమ్మలేకపోతున్నా. ఆగండి ప్లీజ్‌..!” అన్నాడు అపనమ్మకంగా అర్జున్‌. ఆ వెంటనే శంకరాన్ని ఉద్దేశించి-
”అంకుల్‌..! మా నాన్న మాటలకి నొచ్చుకోవద్దు. నేను నాన్నతో మాట్లాడతా” అంటూ అర్జున్‌ శంకరంని అర్ధించాడు. యింతలో శంకరం వీరభద్రంనుద్దేశించి-
”వీరా! ఆగు. ఒక్కసారి నే చెప్పేది పూర్తిగా విను..” అంటూ మిత్రుడ్ని ఆపబోయాడు.
ఎవరి మాటలూ పట్టించుకోకుండా వీరభద్రం ఎస్కేప్‌ బటన్‌ నొక్కి వీడియో కాల్‌ నుండి ఎగ్జిట్‌ అయ్యాడు.
వీరభద్రం చర్యకి శంకరం హతాసుడయ్యాడు. చేసేది లేకా తాను కూడా వీడయో కాల్‌ క్లోజ్‌ చేసి ఉలుకూ పలుకూ లేకుండా కూర్చుండిపోయడు. ఆ తరువాత ఒక్కొక్కరే గ్రూప్‌ వీడియో కాలింగ్‌ నుండి ఎగ్జిట్‌ అయ్యారు.
‘దివాలాకోరు’.. ‘భికారి’.. అన్న తన స్నేహితుడి మాటలు పదే పదే శంకరం హృదయాన్ని గాయపరుస్తుంటే, లేచి మెల్లగా తన గదిలోకి పోయి వాలుకుర్చీలో కూలబడ్డాడు. అతడి మదిలో ఆలోచనల అలజడి మొదలైంది.
భ్రమరకి తెలుసు, తన భర్త ఎప్పుడు మనోవేదనకి గురైనా, పోయి వాలుకుర్చీలో సేదతీరితే కాసేపటికి మామూలు మనిషి అవుతాడని. అందుకే అతడ్ని కదపకుండా ఒంటరిగా వదిలేసింది.
వాలుకుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న శంకరంకి తన చిన్ననాటి జ్ఞాపకాలతో పాటూ ఆరేళ్ళ క్రింత జరిగిన ఓ ముఖ్యమైన సంఘటన పదే పదే గుర్తుకొచ్చింది.
***
ధరణికోట!
గుంటూరు పట్టణానికి దగ్గర్లో చారిత్రాత్మక, ఆధ్యాత్మికతల మేలు కలయికల ఊరే ధరణికోట! శంకరం పుట్టిపెరిగింది అక్కడే. దగ్గర్లోనే ఒకవైపుకష్ణానది పరవళ్ళు.. మరో వైపు పచ్చని పొలాలు. పాడిపంటలకి, కులవృత్తులకి పేరొందిందా ఊరు. కూతవేటు దూరంలో యిటు అమరలింగేశ్వర ఆలయం, మరోవైపు ధ్యానబుద్ధ విగ్రహంతో పాటూ అమరావతి బౌద్ధ మహా స్థూపంతో విరాజిల్లుతోంది. ఓవైపు సూర్యోదయాన్నే పశువులు మేతకోసం పొలాలకి పరుగిడే సమయంలో వీధిలో రేగే గోధూళిని చీల్చుకుంటూ పడే సూర్యరశ్మి ప్రకృతికి వింతరంగులని అద్దితే, మరోవైపు తలపాగాలతో సైకిళ్ళ మీద చెరోవైపు యిత్తడి పాలబిందెలతో కూనిరాగాలు తీస్తూ పాలుపోసే చిరు వ్యాపారస్తుల సందడి అక్కడి జీవనశైలికి అద్దం పడుతోంది. ఎంతో హృద్యంగా వుండే దృశ్యాలతో ఆ అచ్చ తెలుగు పల్లెటూరుని ఒక్కసారి చూస్తే చాలు, ఎవరికైనా చిరస్మరణీయంగా గుర్తుండిపోవలసిందే.
అలాంటి ఊర్లో పుట్టి పెరిగిన శంకరం పదవ తరగతి వరకు, మండల పరిషతఖ సాఠశాలలోనే చదువుకున్నాడు. సొంత గూడు కూడా లేని కులవృత్తి మీద ఆధారపడి జీవించే కుటుంబం నుండి వచ్చిన వాడు కావడంతో అప్పుడే నిశ్చయించుకున్నాడు, ఎప్పటికైన ఈ ప్రాంతంలోనే కొంత స్థలం కూడగట్టుకోవలని.శంకరంకి తన ప్రాంతమన్నా, ఆ ప్రాంత ప్రజలన్నా పిచ్చి ప్రేమ.
గుంటూరులో కాలేజి చదువులప్పుడు శంకరంకి పరిచయమైయ్యాడు వీరభద్రం. ఇద్దరూ చాలా కలివిడిగా వుండేవారు. ముఖ్యంగా మనసులో ఏ మాటని దాచుకోకుండా కుండబద్దలు కొట్టేటట్టు చెప్పే వీరభద్రం నైజం శంకరంకి నచ్చింది. ఏ విషయమైనా దాపరికం లేకుండా ఒకరికొకరు చెప్పుకోందే ఏ పనీ చేసేవారు కాదు. శంకరం మెరిట్‌ విద్యార్ధి కావడంతో చదువు పూర్తవుతూనే బ్యాంక్‌ పి.ఒ. ఎగ్జామ్‌ రాసి మొదటి ప్రయత్నంలోనే ఆఫీసర్‌ ఉద్యోగం సంపాదించాడు. వీరభద్రం మొదటినుండి స్థితిమంతుడు కావడంతో చదువు పూర్తిచేసీ, వ్యాపార నిమ్మితం భాగ్యనగరం బాటపట్టాడు. అలా విడిపోయిన వారు, శంకరం ఆరేళ్ళక్రితం ఏరియా మేనేజర్‌ పదవిని ప్రమోషన్‌ పొంది భ్యాగనగరానికి వచ్చినప్పుడు తిరిగి యిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు మళ్ళీ వారి స్నేహం పరవళ్లుతొక్కింది. ఏ ముఖ్య విషయమైనా, చివరికి సొంత విషయాలు కూడా వీరభద్రంతో చర్చించందే నిర్ణయం తీసుకోడు. శంకరంకి ఆరేళ్ళ క్రితం జరిగిన సంఘటన యిప్పటికీ గుర్తు.
”వీరా..! నాకు మా సొంతూరంటే ఎంత ప్రాణమో నీకు తెలీంది కాదు. ఎప్పటి నుండో నాకు అక్కడ కొంత స్థలం కొనాలనే కోరిక బలంగా వుంది. ఏవో కారణాల వల్ల యిప్పటికీ ఆ పని చెయ్యలేకపోయాను. నా ఉద్యోగం, కూతురి చదువూ అందుకు కారణం కావొచ్చు. అందుకే నేనొక నిర్ణయానికొచ్చా. మా ధరణికోటకి దగ్గర్లో ఓ ఎకరం భూమి అనుకోకుండా అమ్మకానికొచ్చింది. అన్నీ పరిశీలించాక నాకు చాలా నచ్చింది. అందుకే ఆ స్థలం కొనాలని నిశ్చయించుకున్నాను. నీకు తెలీదేంవుంది? రాష్ట్ర విభజన తరువాత అమరావతి రాజధానిగా కొత్త ప్రభుత్వం ప్రకటించాకా ఇప్పుడా ప్రాంతంలో స్థలాల విలువ అనూహ్యంగా పెరిగిపోయాయి. రెండు, మూడేళ్ళ ముందే అక్కడ స్థలం కొనుంటే బాగుండేది. కానీ అవకాశం రాలేదు. ఇప్పటికైనా మేలుకుని అక్కడ కొంత స్థలం కూడగట్టుకోకపోతే మునుముందు అక్కడ స్థలం కొనడం కలగానే మిగిలిపోతుంది. పెరిగిన ధరల కారణంగా ఎకరం రెండుకోట్లకి వస్తోంది. ఒక విధంగా ఆ ప్రాంతానికి యిప్పుడున్న డిమాండు దృష్యా ఈ ధర తక్కువే. అందుకే కొనాలని నిశ్చయానికొచ్చాను. యిన్నాళ్ళూ నేను దాచిందీ, మా ఆవిడకి ఈ మధ్యే కలిసొచ్చిన పుట్టింటివారి కొంత ధనం కలుపుకోగా, పి.ఎఫ్‌.లోను, వేరే లోన్లుకూడా తీసుకుంటే డబ్బు సమకూరకపోదు. ఇది కొంత సాహసమైన నిర్ణయమే కావొచ్చు కానీ యిప్పుడు ఓ నిర్ణయానికి రాకపోతే ఎప్పటికీ నా కల నెరవేరదు. నువ్వే మంటావ్‌..?” అడిగాడు శంకరం.
”ఇది చాలా పెద్ద విషయం. ఓ విధంగా యిప్పుడు అమరావతి చుట్టుపక్కల స్థలమంటే ఓ స్టేటస్‌ సింబల్‌. మంచి ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా. కానీ నా కెందుకో ఆ డబ్బేదో మన భాగ్యనగరం నడిబొడ్డులో ఇండిపెండెంట్‌ ఇంటిపై పెట్టుబడిగా పెడితే బెటరనిపిస్తోంది. నీ స్టేటస్‌కి ఏమాత్రం సూటుకానీ ఎప్పుడో యిక్కడ కొన్న చిన్నడబుల్‌ బెడ్రూమ్‌ యింట్లో ఎడ్జస్ట్‌ అవుతూ ఎన్నాళ్ళని కాలక్షేపం చేస్తావు? ఆలోచించుకో!” అన్నాడు వీరభధ్రం.
”లేదు. యిక ఇల్లూ, స్థలం అంటూ ఏదైనా కొంటే మా ప్రాంతంలోనే కొంటా. లేదంటే ఆ జోలికే పోను. యిది నా స్థిర నిర్ణయం” అన్నాడు శంకరం గట్టిగా.
”అలా అయితే, వచ్చిన అవకాశం వదులుకోకపోవడమే మేలు” అన్నాడు వీరభద్రం.
ఆ తరువాత శంకరం అనుకున్న ప్రకారం అమరావతికి దగ్గర్లో ఎకరం స్థలం కొనుగోలు చేయడం చకచక జరిగిపోయింది.
యిరుకుటుంబాల మధ్యా రాకపోకలు తరచుగా జరుగుతుండటంతో మొదట తమ పిల్లల్ని ఒకటి చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచన యిరువైపుల ఆడవారికే కలిగింది. మాటల్లో తమ భర్తల వద్ద పిల్లల పెళ్ళి ప్రస్తావన తెస్తే యిద్దరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పెద్దవారి ఉద్దేశాన్ని గ్రహించిన అర్జున్‌, హారికలు కూడా అందుకు తగ్గటుగానే నడుచుకున్నారు.
***
”ఏమండీ..! ఎంతసేపని యిలా ఒంటరిగా వుంటారు? లేచి మొహం కడుక్కోండి. వేడి వేడి కాఫీ తీసుకొస్తా, కాస్త రిలీఫ్‌గా వుంటుంది” అంటూ భ్రమర భర్తని తట్టి లేపడంతో ఈ లోకంలోకి వచ్చాడు శంకరం.
మొహం కడుక్కొచ్చిన భర్తకి వేడి కాఫీ అందిస్తూ- ”ఏంటండీ, యిప్పుడేమై పోయిందని అంతలా బాధ పడతారు? మన అమ్మాయికి ఈ సంబంధం కాకపోతే మరొకటి. ఈపాటిదానికే మీరింత దిగాలు చెందాలా?” అంటూ ధైర్యం చెప్పింది భ్రమర. అప్పుడు మాట్లాడాడు శంకరం.
”ఊు.. ఇన్నాళ్ళూ వీరభద్రం మన సంబంధం కలుపుకోవాలని కోరుకుంటే మా స్నేహనికి విలువిస్తున్నాడని భావించా. మనమన్నా మన కుటుంబం అన్నా వాడికి యిష్టమని తలపోసాను. కానీ ఇవాళ వాడు తేల్చేసాడు, వాడిలో దాగున్నాది సగటు మనిషేనని. అందరిలా వాడూ ఆస్థిపాస్తూలకీ, కట్నకానుకలకే విలువిస్తాడని అనుకోలేదు. ఆ… ఇప్పుడు నాకో విషయం అర్ధమౌతోంది. గత కొన్నినెలలుగా కలుసుకోకపోతే కరోనా పరిస్థితులే కారణమని యిన్నాళ్ళూ అనుకున్నాను. కానీ లోతుగా ఆలోచిస్తే వాడి కంటికి డబ్బు పొరలు కమ్మేయడంతో, రాజధాని తరలింపు ప్రకటన వెలుబడిన వెంటనే నన్ను దూరం పెట్టాడని అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా ఫోనులో కూడా పొడిపోడిగా మాట్లాడటానికి యిదే కారణం అని యిప్పుడర్ధమౌతోంది. అర్జున్‌ ఊహించని విధంగా ఈ రోజు ప్రపోజ్‌ చేసేసరికి వాడి అసలు రూపు బయటపడింది. ఇలాంటి మనిషినా యిన్నాళ్ళూ నావాడూ అనుకున్నాను? లేదు.. అవసరం లేదు. యిలాంటి స్నేహంగానీ, సంబంధంకాని అవసరంలేదు” నిక్కచ్చిగా చెప్పాడు శంకరం.
భ్రమర మౌనంగా వింటోంది. అక్కడే వున్న హారిక-
”నాన్నా! మీరు బాధపడకండి. నిజం చెప్పాలంటే మీ యిద్దరి స్నేహబంధాన్ని మా సంబంధంతో మరింత బలపరచాలనే మేం ఒకరినొకరు కోరుకున్నాం. అందుకే యిరు కుటుంబాలకి యిష్టమైతేనే ఈ సంబంధం కుదిరేది, లేకపోతే ఎవరిదారి వారిదేనని ముందే మేం నిశ్చయించుకున్నాం. మేమిద్దరం ఒకటవ్వడం ద్వారా మీ స్నేహాన్ని గెలిపించాలనుకున్నామే గానీ మాదేం మనసులు పెనవేసుకున్న ప్రేమ కాదు. ఒక విధంగా చెప్పాలంటే మా మధ్య కలిగింది పరిస్థితులు అనుకూలించిన ఆకర్షణ మాత్రమే! అందుకే అర్జున్ని మరిచిపోవడం నాకు పెద్ద విషయం కాదు. అలాగే అర్జున్‌ కూడా ఈ పెళ్ళి జరగకపోతే గెడ్డం పెంచేసుకుని దేవదాసేం అయిపోడు” తన అభిప్రాయాన్ని నిశ్ఛయంగా చెప్పింది తండ్రితో.
హారిక మాటలు శంకరంలో ధైర్యంతో పాటు ప్రశాంతతని నింపాయి.
***
”నాన్నా! మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెప్పి శంకరం అంకుల్ని హర్ట్‌ చేయడమే కాకుండా అతను మీతో ఏదో చెప్పాలని చూస్తే అవకాశమివ్వకుండా లేచి వెళ్ళిపోయారు. ఇది ఎంతవరకు న్యాయం? అంకుల్‌ ఏం చెప్పాలనుకున్నారో తెలుసుకోండి. మా పెళ్ళికి మీరు మనస్పూర్తిగా అంగీకరించకపోతే ఎట్టి పరిస్థితులలో జరగదు. కానీ అంకుల్‌కి ఒక్క ఛాన్స్‌ యిచ్చి అతని మాటేంటో వినండి ప్లీజ్‌. నా కోసం కాదనకండి” రిక్వెస్ట్‌ చేసాడు అర్జున్‌, తండ్రిని.
ఏ కళనున్నాడో యిష్టం లేకపోయినా సరేనన్నాడు వీరభద్రం.
వెంటనే అర్జున్‌, శంకరంతో మాట్లాడి సాయంత్రం అంతా వీడియో కాల్లో కలుసుకుందామని, ఒప్పుకోమని రిక్వెస్ట్‌ చేసాడు. దీనికి శంకరం వెంటనే ఒప్పుకున్నాడు. అందుకు కారణం లేకపోలేదు.
*****
సాయంత్రం అయిదు గంటలు!
గూగుల్‌ డ్యుయో వీడియో గ్రూప్‌కాల్లో యిరుకుటుంబాలు మళ్ళీ కలుసుకున్నాయి. అర్జునే చొరవతీసుకుని కుశల ప్రశ్నల ఆనవాయితీని ముగించాడు. అంత చిన్న స్క్రీన్‌ లోనూ వీరభద్రం అయిష్టంగా చర్చకి కూర్చున్నట్టు చెప్పకనే చెబుతున్నాయి అతడి ముఖకవళికలు.
అప్పుడు అందుకున్నాడు శంకరం.
”వీరా..! ‘మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే!’ అని ఓ విదేశి విజ్ఞుడు చెప్తే యిన్నాళ్ళూ ఏమో అనుకున్నా. కానీ నిజమేనన్న విషయం మొన్న మన మధ్య జరిగిన సంఘటన రుజువుచేసింది. నేను జీవితంలో ఎప్పుడైనా విఫలం చెందానంటే అది నిన్ను అంచనా వేయడంలోనే! అంతరిక్షంలోకి మానవుడు అడుగుపెట్టనా, ఆస్థులూ-అంతస్థులూ లాంటి తారతమ్యాల మధ్యయింకా మనిషి కొట్టిమిట్టాడుతూనే వున్నాడు. అమరావతి దగ్గర్లో స్థలాలు కొన్నవారంతా యిప్పుడు దిక్కుతోచని స్థితిలో వున్న మాట వాస్తవం. నీకు నా ఒక్కడి నష్టమే కనబడుతోంది. కాని అమరావతి అసలు బతుకుచిత్రం నీకు కనబడటంలేదు. గత ఫిబ్రవరి నెలలో నేను ఆఫీసు పని మీద అమరావతి వెళ్ళవలసి వచ్చింది. రాజధాని కొరకు భూములిచ్చిన ప్రజల ఆక్రోశం, ఆవేదనా కళ్ళారా చూసాను. ఒక్కొక్కరి వ్యధ వింటే ఎంత కఠిన హృదయమైనా కరగక మానదు. వేలాది ఎకారాల భూములిచ్చిన రైతులకి చివరికి మిగిలింది కడగండ్లు మాత్రమే” కాసేపు ఆగాడు శంకరం.
అసహనంతో వింటున్న వీరభద్రంతో మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు శంకరం.
”నాకు యిప్పుడు ఒక విషయం నిజమనిపిస్తోంది. బాగా చదువుకున్న నువ్వే, ఆస్థిపాస్తుల మీద ఆశతో, ఎన్నో ఏళ్ళగా కొనసాగుతున్న మన స్నేహబంధాన్ని కూడా దృష్ఠిలో పెట్టుకోకుండా, నా మొత్తం సంపాదనా అమరావతి దగ్గర కొన్న స్థలం మూలంగా మట్టిలో కలిసిపోయిందని నా కూతురిని కాదన్నావు. మరి అమరావతి కొరకు భూములిచ్చి యిప్పుడు సర్వం కోల్పోయిన కుటుంబాల ఆడపిల్లల్ని పెళ్ళి చేసుకోవడానికి, ఎవరు ముందుకొస్తారు? ఈ కారణంగా ఎందరి ఆడపిల్లల పెళ్ళిళ్లు ఆగిపోయాయో ఊహించగలవా? వేలాది ఎకరాలని సునాయాసంగా యిచ్చేసిన వందలాది రైతు కుటుంబాలు మన రాజకీయ పార్టీల వికృత క్రీడలో సమిధలైపోయాయి. ఒక్క పెళ్ళిళ్లేనా..? ఉన్నత చదువుల కోసం, హృద్రోగ చిక్సితల కోసం.. యిలా ఎన్నో అవసరాలకోసం ముందు చూపుతో అక్కడి రైతులేకాకా యితరులు ఎంతో మంది అమరావతిలో పెట్టుబడిగా పెట్టి యిప్పుడు రోడ్డునపడ్డ కుటుంబాల సంఖ్య నాలుగంకెలలోనే వున్నాయి. నేను కళ్ళారా చూసిన ఒకొక్క రైతు దీనగాధని ఏమని చెప్పమంటావు? తొంభైమంది అన్నదాతల ఆత్మహత్య, పదుల సంఖ్యలో రాజధాని తరలింపు వార్తకి ఆగిన గుండెలు.. యిలా వీరి మరణాలని తలచుకుంటే, మనకేం పట్టనట్టు వుండగలామా? అయితే యిందులో మనమేం చెయ్యగలమని అనుకోవచ్చు. కానీ చెయ్యవచ్చు. మనసుంటే ఏదైన చెయ్యొచ్చు. ఏం? తలచుకుంటే, పెళ్ళీడుకొచ్చిన ఓ ఆడపిల్ల కుటుంబంతో మనం సంబంధం కలుపుకోలేమా? ఇదేదో నా కూతురు వరకు వచ్చేసరికి యిలా మాట్లాడుతున్నాననుకోకు. అలాగే, సాధ్యమైన చేయుతనిచ్చి ఓ మంచి విద్యార్ధి వున్నత చదువుల బాధ్యతని తీసుకోలేమా..? ఆగబోయే గుండె శస్త్రచికిత్సకి చేయూత నందించలేమా? వారి బ్రతుకుల్ని అలా దైవానికి వదిలేయడమేనా..? మనలో మనిషి ఏమైపోయాడు? ఆవేశంగా మాట్లాడుతున్న శంకరం తనని తాను నియంత్రించుకునేందుకు కాసేపు ఆగాడు.
”అర్జున్‌లాంటి యువత అమరావతి బాధిత కుటుంబాల్ని ఆదుకునే అవకాశముండే అన్ని మార్గాల్ని సామాజిక మాధ్యమం ద్వారా ప్రచారం చేసి ఒకరి కష్టాలలో ఒకరు పాలుపంచుకునే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలి” ఆగి కాసింత మంచి నీళ్ళు తాగాడుశ ంకరం. మళ్ళీ అందుకుని-
”నేనేదో నీకు నీతి బోధ చేయాలని యిక్కడ కూర్చుని భాషణలివ్వడం లేదు. ముఖ్యంగా నీకు ధన్యవాదాలు చెప్పేందుకే, అర్జున్‌ నీతో మాట్లాడమంటే అంగీకరించాను. అర్జున్‌ ప్రపోజల్‌ తెరమీదకి రావడంతో నీవేంటో నాకర్ధమైంది. నీ తిరస్కారమే, నాలో అసలైన మనిషిని నిద్రలేపింది. నా ప్రాంత ప్రజలని అంతో యింతో అవకాశమున్న నేను కూడా ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారని తెలుసుకున్నాను. అందుకే నేనోక నిశ్చయానికొచ్చా. అమరావతి బాధిత కుటుంబాలకి ఆపన్న హస్తం అందించి తీరాలని తీర్మానించా. న ాపొదుపులో ప్రతి రూపాయిలో ఓ యాభైపైసలు బాధిత కుటుంబాల ఆడపిల్లల పెళ్ళి ఖర్చులకీ, వారి ముఖ్యమైన యితర అవసరాలకి వినియోగించడానికి నిర్ణయించా” మళ్ళీ ఆగాడు శంకరం.
”ఆ…యిప్పుడు నీ దగ్గరేముంది? బూడిద!” గొణుగుతూ వెటకారంగా అన్న వీరభద్రంమాట శంకరంతో పాటూ అందరికీ స్పష్టంగా వినిపించింది.
”హు…నీలో మార్పునాశించడం నాదే తప్పు. ఆఖరి మాట విను!” అంటూ ఒక్క క్షణం ఆగాడు శంకరం.
వీరభద్రం అనాసక్తిగానే వింటున్నాడు.
”వీరా..! ఏప్రభుత్వమైనా తీసుకోబోయే కీలకమైన, ముఖ్యంగా ఆర్థికపరంగా తీవ్ర ప్రభావాన్ని చూపే నిర్ణయాలు ఒక్కొక్కసారి మా బ్యాంకింగ్‌ సర్కిల్లో ముందుగా లీకవుతుంటాయి. నా అదృష్టమో, ఏమో.. రాజధాని తరలింపు ప్రకటన రాక ముందే ఆ విషయం నాకు తెలియడంతో, అప్పటికప్పుడే నేను అమరావతి దగ్గర కొన్న ఎకరం పొలం రెండింతల లాభానికి అమ్మి జాగ్రత్త పడ్డాను. ఇది చాలా కాన్ఫిడెంషియల్‌ మేటర్‌ కావడంతో అన్ని ముఖ్యమైన విషయాలూ నీతో చర్చించి నిర్ణయం తీసుకొనే నేను, ఈ విషయంలో మిన్నకున్నాను. అదే మంచిదైంది. నీ అసలు రూపు బయటపడటానికి బాటలు వేసింది. ఇదే నీకు చెప్పదలచుకున్న ఆఖరి ముక్క” అంటూ వీడియో కాల్‌ నుండి ఎగ్జిట్‌ అయ్యాడు శంకరం.
శంకరం చెప్పిన నిజానికి వీరభద్రం పరిస్థితి దారుణంగా తయారైయింది.
– కారంపూడి వెంకట రామదాస్‌,
9393232939

]]>
భద్రత-బాధ్యత https://navatelangana.com/responsibility-for-security/ Sat, 20 Apr 2024 16:17:01 +0000 https://navatelangana.com/?p=273682 Kathaభద్రతా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆ ఆడిటోరియం నిండిపోయింది ప్రేక్షకులతో. కోలాహలంతో నిండిన ఆ పండుగ వాతావరణాన్ని చూస్తున్నాను. ఇంతలో ఒక ఆర్గనైజర్‌ వచ్చి నన్ను ఆహ్వానించాడు.
”రండి సందేశ్‌ సారు. మీరు ముందు వరుసలో కూర్చోండి. ఈ సాంస్కృతిక కార్యక్రమం అవగానే స్టేజ్‌ మీద జి.ఎం.గా మీ మొదటి ఉపన్యాసం ఉంటుంది”
నేను నాకు కేటాయించిన కుర్చీలో కూర్చుండిపోయాను. అప్రయత్నంగా కళ్ళు చమర్చాయి. ఆనందభాష్పాలు కావు అవి, నిజమైన బాధతో కూడిన కన్నీరు. భద్రతా లోపం వలన జీవితం నేర్పిన పాఠం. అలా కూర్చునే గతంలోకి వెళ్ళిపోయాను.
మార్నింగ్‌ షిఫ్ట్‌ మొదలైంది. ఐలయ్య అన్న వస్తున్నాడని కార్మికులు గుసగుసలాడుతున్నారు.
నమస్తే అన్నా అని దణ్ణాలు పెడుతున్నారు.
ఐలయ్య : ఏరా పోచం మంచిగా ఉన్నావా? ఎవరైనా పరేషాన్‌ చేస్తుండ్ర, చెప్పు నేను చూసుకుంటా.
పోచం : ఎవరేమంటారు అన్న. ఐలయ్య మా యూనియన్‌ లీడర్‌. అయినా అన్న… నాకు చిన్న పరేషాన్‌ వచ్చింది. నాకు 5000 రూపాయలు అడ్వాన్స్‌ ఇప్పిస్తావా, అవసరం ఉన్నది.
ఐలయ్య : సరే, రా… ఆ సార్‌కి పోయి నా పేరు చెప్పు, ఇవ్వనంటే నేను వస్తా. తీసుకున్నాక సరిపోదు. నాకు సాయంత్రం బిర్యానీ తినిపియ్యాలి రా. లేకుంటే బిడ్డ…..
పోచం : సరే అన్న
ప్యూన్‌ : ఐలయ్య మిమ్మల్ని జీఎం గారు ఒకసారి కలవమన్నారు.
ఐలయ్య : వస్తాలే నాకు పురుసత్‌ ఉన్నప్పుడు వస్తా, నాకు చాలా పనులు ఉంటాయి.
ఒక గంట తర్వాత, జి యం రూమ్‌ లోకి వెళ్ళాడు.
ఐలయ్య : ఏం సారు రమ్మన్నవట
జిఎం : ఈయన కొత్త సేఫ్టీ జిఎం. ఆయన పేరు సలీం నీతో మాట్లాడతారట.
ఐలయ్య : ఎవరైతే నాకేంటి? ఏం మాట్లాడుతాడు. నేను లీడర్‌ అని సారుకు తెల్వదా.
సలీం : ఐలయ్య నా పేరు సలీం. కొత్త సేఫ్టీ ఆఫీసర్‌ ని. నీ గురించి విన్నాను, నీ వత్తి ఏంటి?
ఐలయ్య : ఓ సారు నా గురించి అడుగుతున్నావు, ఏడ నుంచి వచ్చావు. నా 30 ఏళ్ల సర్వీస్‌లో ఎవరు ఈ ప్రశ్న అడగలే. ఒక నాలుగు నెలల్లో నేను రిటైర్‌ అవుతున్నాను, ఇంకా గట్టిగా ఉన్నా చూసినవా. నన్ను ఎవరూ అడిగే ధైర్యం చేయలేరు. అయినా నువు అడిగనవు కాబట్టి చెప్తున్నా, నేను మిషన్లకు ఆయిలింగ్‌ గ్రీసింగ్‌ చేసేటోణ్ణి.
సలీం: ఎంతవరకు చదువుకున్నావ్‌?
ఐలయ్య : నేను సదువుకోలేదు, అయితే ఏంది 30 ఏళ్లు చేసిన, లీడర్‌ నైన.
సలీం : చదువుకోలేదు కదా మరి జీతం తీసుకునేటప్పుడు సైన్‌ చేస్తావా?
ఐలయ్య : లేదు, ఏలిముద్ర పెడతా. అయినా ఏంది బాగా అడుగుతున్నావ్‌.
సలీం : నీకు ఎంతమంది పిల్లలు?
ఐలయ్య : ఒక్కడే కొడుకు. వాడు సేఫ్టీ కోర్సు చేసిండు పాస్‌ అయ్యిండు.
సలీం : మరి నీతో పాటు నలుగురిని తీసుకుని తిరుగుతున్నావు కదా.
ఐలయ్య : మరి నా పని ఎవరు చెయ్యాల? వారితో చేయిస్తా.
సలీం : ఒక్క పనిని ఐదుగురు చేయాలా?
ఐలయ్య : ఓ సారు నన్ను భయపెడుతున్నావా, నన్ను చూస్తే అందరికీ హడల్‌. ఎక్కడైనా లీడర్లు చేస్తారా, చేయిస్తారు గానీ.
ఒక నాలుగు రోజులు గడిచిపోయాయి. ఉదయాన్నే ప్యూను వచ్చాడు.
ప్యూన్‌ : ఐలయ్య నిన్ను సలీం సార్‌ రమ్మన్నారు.
ఐలయ్య: మళ్లీ ఏంది లొల్లి. వస్తాలే పో. నాతో వచ్చే నలుగురు రాలేదు. నాకు చెప్పకుండా ఎలా డుమ్మా కొట్టిన్రు. రేపు వాళ్లకి నా తడాఖా చూపిస్తా.
ఏంది సార్‌ రమ్మన్నావట నాతోపాటు వచ్చేవాళ్లు రాలేదు, అందుకే లేట్‌ అయింది.
సలీం : మాకు తెలుసు. వాళ్లు వేరే ప్లాంట్లో పనిచేస్తున్నారు. అవసరం ఉండి పంపాను.
ఐలయ్య : గట్ల కుదరదు కదా, నాకు ముందు చెప్పాలి.
సలీం : అందుకే కొత్తగా నీకు ఇద్దరినిస్తున్నాం. వాళ్ళకి నువ్వు ట్రైనింగ్‌ ఇవ్వాలి.
ఐలయ్య: నేను లీడర్‌ని. నాకే పని చెప్తారా మీరు.
సలీం : లీడర్‌ వి కాబట్టే ట్రైనింగ్‌ ఇమ్మంటున్నాం.
ఐలయ్య : సరే మరి వీళ్లకు ట్రైనింగ్‌ ఇచ్చి నా దగ్గరే ఉంచుకుంటాను.
ఐలయ్య ఆయిల్‌ బాటిల్‌, గ్రీస్‌ బాక్స్‌ తీసుకుని మెట్లు ఎక్కి మిషన్‌ దగ్గరికి వెళ్తున్నాడు. నిర్లక్ష్యంగా వెళుతున్న క్రమంలో ఆయిల్‌, గ్రీస్‌ మెట్ల మీద పడుతున్నాయి.
సలీం: ఐలయ్య మెట్ల మీద ఆయిల్‌, గ్రీస్‌ పడుతున్నాయి. కొంచెం ఆగి వాటిని శుభ్రం చెయ్యి. చేతికి గ్లౌస్‌ వేసుకోలేదు. భద్రతా నియమాలు పాటించడం లేదు. వెనక్కి రా. భద్రతా నియమాలు అతిక్రమించకు. అది నీకే ప్రమాదం.
ఐలయ్య : జిఎం సార్‌, నాకు 30 ఏళ్ల సర్వీస్‌ ఉంది. పని మొదలుపెడితే వెనుకకు రాను నేను లీడర్‌ ని. తిరిగి చూసేదేలే.
సలీం : నీ ఆలోచనలను గర్వం అనే పొర నీ మెదడును కప్పేసింది. అది నీకే ముప్పు రావచ్చు. వెనుకకు రా.
ఐలయ్య చెవికి ఎక్కలేదు, ‘నాకెవరు చెప్పేది?’ అని భావించాడు. ఈ క్రమంలో ఆయిలింగ్‌, గ్రీసింగ్‌ చేసి మెట్లు దిగుతున్న సమయంలో, ఆయిల్‌ ఒలికిన ప్రదేశంలో కాలు వేసి జారిపడ్డాడు. మెట్ల మించి పడే క్రమంలో చేతులు భూమి మీద ఆన్చాడు. అబ్బా….. అని అరిచి కింద పడిపోయాడు. దెబ్బలు గట్టిగా తగిలాయి. ఐలయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు.
అన్ని పరీక్షలు నిర్వహించిన మరుసటి రోజు రిపోర్టులో అతని రెండు చేతుల బొట్టిన వేళ్ళు విరిగాయని, షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉండటం వలన వేళ్ళు సెప్టిక్‌ అయ్యాయని అవి తీసేయాల్సి వస్తుందని వైద్యులు నిర్ణయించారు.
ఐలయ్య మరుసటి రోజు స్పృహలోకి వచ్చాక డాక్టర్లు ”ఐలయ్య నీ రెండు చేతుల బొటనవేలు విరిగి సెప్టిక్‌ అవడం వలన తీసేయాల్సి వచ్చింది” అని చెప్పారు.
మొదటిసారిగా ఐలయ్య మనసులోకీ భయం మొదలైంది. అయినా అందరికీ కనబరచక గర్వంగా చుట్టూ చూసాడు. నన్ను చూడడానికి రాలేదు… నేను లీడర్నని మర్చిపోయారా? అందరి సంగతి చెప్తా, అని అనుకున్నాడు.
నాలుగు రోజుల అనంతరం డాక్టర్లు ఐలయ్యకు ఆహారం ఇవ్వమని సలహా ఇచ్చారు. భోజనం టేబుల్‌ మీద పెట్టగానే లేచి కలుపుకుందాం అని అప్రయత్నంగా ప్రయత్నించాడు, అతనికి రాలేదు, కష్టపడుతున్నాడు. అప్పుడు అర్థమైంది తనకి బొటనవేళ్ళు లేవు కదా అని.
మొదటిసారిగా అతని గర్వాన్ని భయం అధిగమించింది. నేను ఇక జీవితంలో కలుపుకొని తినలేను అని గ్రహించాడు. కళ్ళనుండి అప్రయత్నంగా నీళ్లు వస్తున్నాయి. కృంగిపోయాడు. నేను కొంచెం భద్రత పాటించి ఉంటే ఇది జరిగేది కాదు. ఈరోజుకి లీడర్‌లాగే ఉండేవాడిని, జీరో అయిపోయాను. ఒకరి మీద ఆధారపడ్డాను అని వాపోయాడు.
ఇంకా కృంగిపోయాడు, షుగర్‌ లెవెల్స్‌ పెరిగాయి. ఇది ఇలా ఉండగా ఒకటో తారీకు వచ్చింది జీతం రావాలని అనుకున్నాడు ఆయన. జీతం అందించడానికి వాళ్లు వచ్చారు.
”ఐలయ్య, ఈ ఫాం మీద సంతకం చెరు”
”నేను చదువుకోలేదు నిశానీ ఏస్తా”
వెంటనే గుర్తుకు వచ్చింది బొటనవేళ్లు లేవని. ఒక్కసారిగా స్థానువయ్యాడు. విలపిస్తున్నాడు. వేలిముద్ర లేనిదే నాకు జీతం కూడా రాదు కదా, నేను చేసిన చిన్న నిర్లక్ష్యం వల్ల నా కుటుంబానికి జీతం అందించలేను, చదువుకోలేదు, అన్నం కలుపుకోలేను, టీ కప్పు పట్టుకోలేను. ఇలాంటి భావాలు అతని మనసును ఉక్కిరిబిక్కిరి చేశాయి.
నేను ఆరోజు భద్రత పాటించలేదు. సార్‌ చెప్పినట్టుగా నాకు గర్వం కమ్మేసింది. ఇది నేను జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. నా వలన నా కుటుంబానికి ఇబ్బంది కలిగింది. నేను వాళ్ళ మీద ఆధార పడవలసి వచ్చింది. అభద్రత వలన కనువిప్పు కలిగినా ఆలస్యమైంది.
ఇలాంటి ఆలోచనలతో మంచానపడ్డాడు. మనోవ్యాధికి మందు లేదు కదా. అతని ఆలోచనలకు షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోయి, ప్రమాదపుటంచున పడేశాయి.
డాక్టర్లు ఐలయ్య కొడుకు సందేశ్‌ ని పిలిచి ”సారీ అన్ని విధాలా ప్రయత్నించాం మీ నాన్నగారిని రక్షించలేకపోయాం” అని చెప్పారు.
సందేశ్‌ బాగా బాధపడ్డాడు. ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు అతని మీద పడ్డాయి.
పలకరించడానికి వచ్చిన ఐలయ్య సహచరులు అతనికి అదే కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
”నేను ప్రయత్నించలేను. మా నాన్న చేసిన చిన్న భద్రతా నిర్లక్ష్యం వల్ల ఈ సంఘటన జరిగింది. నేను కూడా అడగలేను. నాకు సిగ్గుగా ఉంది వాళ్లు నన్ను పిలవరు. అందులో నేను చేసింది సేఫ్టీ కోర్స్‌, మా నాన్న నిర్లక్ష్యం వల్ల మూల్యాన్ని చెల్లించుకున్నాడు” అని వాపోయాడు.
సరిగ్గా 15 రోజుల తర్వాత ఐలయ్య ఇంటి తలుపు ఎవరో తట్టారు. తలుపు తెరిచి చూస్తే ఎదురుగుండా ఉన్న మనిషి ఇక్కడ సందేశ్‌ ఎవరు అని అడిగాడు.
”నేనే సందేశ్‌, మీకు ఎవరు కావాలి?”
”కంపెనీ యాజమాన్యం మీకు ఈ కవర్‌ని అందించి రమ్మన్నారు. ఈ కవర్‌ అందించడానికి వచ్చాను”
అందించి వెళ్ళిపోయాడు.
ఇది ఏమైనా అప్పుల వాళ్ళ కవరా? మా నాన్న ఎవరికైనా బాకీ ఉన్నారా, ఇలాంటి ఎన్నో ఆలోచనలు అతని మనసులో పరిగెడుతున్నాయి.
అప్రయత్నంగానే ఆ కవర్‌ తెరిచి చూశాడు, అపాయింట్మెంట్‌ లెటర్‌. అదే కంపెనీలో మరుసటి రోజు రమ్మని పిలుపు. ఒక్కసారిగా అతని కనుల వెంట ధారాపాతంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఒక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు.
మరుసటి రోజు ఆఫీసులో…
”మే ఐ కమిన్‌ సర్‌”
”ఎస్‌, కమిన్‌”
”నా పేరు సందేశ్‌ సర్‌. ఐలయ్య కొడుకుని. మా నాన్న చేసిన నిర్లక్ష్యానికి, మీరు నాకు ఉద్యోగం ఇవ్వరనుకున్నాను సార్‌”
”చూడు సందేశ్‌… తప్పు చేయడం మానవ సహజం. కానీ రియలైజేషన్‌ అనేది ముఖ్యం. ఈ సంఘటన నీకు ఒక పెద్ద పాఠం. నువ్వు ఇంకా ఇలాంటి నిర్లక్ష్యం చేయనీయవని గట్టిగా నమ్ముతున్నాం. యు కెన్‌ జాయిన్‌ ది డ్యూటీ”
”సార్‌, మీ పేరుకు తగ్గట్టుగా మా కార్మికులకు మంచి సందేశం ఇవ్వాలి. మా సాంస్కృతిక కార్యక్రమం ముగుస్తుంది సార్‌” అని అనగానే స్పృహలోనికి వచ్చాను.
కొన్ని నిమిషాల తర్వాత…
”ఇప్పుడు మాకు కొత్తగా జాయిన్‌ అయిన సేఫ్టీ జిఎం సందేశ్‌ గారు మీకు వారి సందేశాన్ని వినిపిస్తారు” అని అనగానే కరతాళ ధ్వనుల మధ్య సందేశ్‌ స్టేజ్‌ మీదకు వెళ్లి మైక్‌ దగ్గర నులుచున్నాడు.
”వేదికనలంకరించిన పెద్దలకు నా వందనములు. ప్రతి మనిషికి జీవితంలో భద్రత అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకు మానవ శరీరం తీసుకోండి, బోన్స్‌, స్కెలిటన్‌ స్ట్రక్చర్‌ లేకపోతే శరీరం ఒక ముద్దలా సంచిలో ఉండేది. ఈ శరీరాన్ని అందంగా ఉంచడానికి భగవంతుడే మన శరీరంలో స్కెలిటన్‌ స్ట్రక్చర్‌ అమర్చి నిలబెట్టాడు. ఇది భగవంతుడు మనకి ఇచ్చిన సేఫ్టీ. అలాగే కళ్ళలో ఏదైనా డస్ట్‌ గాని నలుసు గానీ పడితే, అప్రయత్నంగా కళ్ళలోకి నీరు వచ్చి ఆ నలుసును కంటి చివరి వరకు ప్రవహించేలా చేస్తాయి. ఇది భగవంతుడు సమకూర్చిన సేఫ్టీ.
అలాగే మన శరీరంలో ప్రధానమైన భాగం గుండె, అది రిబ్‌ కేజెస్‌, వెన్నెముక మధ్యలో చక్కగా అమర్చబడి, భద్రపరచబడి ఉంటుంది. దానికేమీ దెబ్బ తగలదు. ఇది భగవంతుడు మనకు చేసిన మరొక సేఫ్టీ. మన బ్రెయిన్‌ కూడా స్కల్‌ మధ్యలో పటిష్టంగా భద్రపరచబడి ఉంటుంది. ఇవన్నీ భగవంతుడు మనకు అమర్చిన సేఫ్టీ. కానీ ఎన్ని సమకూర్చినా నిత్యజీవితంలో మన భద్రతకు కావలసిన నియమాలు పాటించకుండా ప్రమాదాలకు లోనవుతున్నాం. మన పై అధికారులు చెప్పినా పాటించక ప్రమాదానికి లోనవుతున్నాం. మనకు ప్రమాదం జరిగితే మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా జీవితాంతం బాధపడవలసి వస్తుంది. ఇది మనం గ్రహించాలి. భద్రతే భవిష్యత్తుకు బంగారు బాట”.
కరతాళ ధనులతో ఆ ప్రాంగణం మారుమోగి పోయింది. ”నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను సజీవంగా నిలబెట్టిన యాజమాన్యానికి నేను నా కతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సేఫ్టీ డే సందర్భంగా బెస్ట్‌ స్లోగన్‌ బహుమతి” అని ఒక కవర్‌ తెరిచి అందులో ఉండే స్లోగన్‌ను చదివాడు మైక్‌ లో ‘నీరు వధా చేస్తే మిగిలేది కన్నీరే
అది మన దాహాన్ని తీర్చలేదు’
”ఈ స్లోగన్‌ పంపిన రమణ కష్ణ గారిని వేదిక వైపుకి ఆహ్వానిస్తూ వారు బహుమతిని గ్రహించవలసిందిగా కోరుతున్నాను”
చక్కటి కరతాళ ధ్వనుల మధ్య ఈ కార్యక్రమం ముగిసింది. తనను జీవితంలో నిలబెట్టిన యాజమాన్యాన్ని తలుచుకుంటూ సంతోషంగా ఇంటికి చేరాడు సందేశ్‌.

– పెద్దాడ నాగరాజు, 98668 74367

]]>
ప్రేమానుబంధం https://navatelangana.com/love-affair/ Sat, 13 Apr 2024 17:08:22 +0000 https://navatelangana.com/?p=269042 ప్రేమానుబంధంధర్మరాజు స్కూటర్‌ మీద ఆఫీస్‌కి వెళ్లి వస్తుంటే తన ఇంటి మూల మీద చిన్న కుక్క పిల్ల స్కూటర్‌ కింద పడింది. ధర్మరాజు కంగారు పడ్డాడు. సడన్‌ బ్రేక్‌ వేసి స్కూటర్‌ని పక్కనపెట్టి కుక్క పిల్లని చేతుల్లోకి తీసుకున్నాడు. ముద్దుగా బొద్దుగా ఉంది. దాని చెవి పక్కకు కొంత గాయమైంది. ఇంటికి తీసుకెళ్లి, ఆ గాయానికి కొంత డెటాల్‌ రాసాడు. దానికి పెరుగన్నం కలిపిపెట్టాడు.
అప్పటికి గోడ దగ్గర పక్కింటి ఆవిడతో ముచ్చట పెడుతున్న ధర్మరాజు భార్య శ్యామల ఆ కుక్క పిల్లను చూసి ”ఏంటి శ్యామల.. మీవారు ఊరకుక్కని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. హైదరాబాదులో మా కూతురు, అల్లుడు ఇరవై ఐదు వేలకి ఫారన్‌ బ్రీడ్‌ కుక్కపిల్లను తెచ్చుకున్నారు. దానికి రోజు సెర్లాక్‌ పెడుతున్నారు తెలుసా? ఊర కుక్కకు ఎంత పెట్టినా అది కొంచెం పెరిగిందంటే పీతి బొందల దగ్గరికి వెళ్తుంది. ఊర కుక్కలు ఏమంత అందంగా, డిగ్నిఫైడ్‌గా ఉంటాయిగ ఆ కుక్క పిల్లలు చూస్తే చిరాకేస్తుంది” అంది.
దాంతో శ్యామల గుర్రుగా భర్త దగ్గరికి వచ్చి, ”ఈ కుక్కపిల్ల ఎక్కడిదండి… మనది అసలే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మధ్యతరగతి కొంప. మన దరిద్రానికి ఇంకొకటా… ఊర కుక్కని పెంచుకుంటామా ఏంటి?”
”నువ్వు దానికి ఏం పెట్టక్కర్లేదు. నాకు పెట్టిన దాంట్లోనే ఒక ముద్ద దానికి పెడ్తాను. పాపం స్కూటర్‌ కింద పడిందే… బుజ్జిముండ… ఎంత బాగుందో” అన్నాడు చేతుల్లోకి తీసుకుంటూ.
ఆ రోజు నుంచి అది వాళ్ళ ఇంట్లో ఒక ప్రాణిగా తిరుగుతోంది. ధర్మరాజు ఆ కుక్కపిల్లకి టామీ అని పేరెట్టుకున్నాడు.
”అన్నట్టు… సులోచన ఆస్ట్రేలియన్‌ నుంచి ఆరు గంటలకి వీడియో కాల్‌ చేస్తానంది. చేసిందా..?” అని అడిగాడు.
”సులోచన చేయలేదు కానీ, అమెరికా నుంచి ప్రసాద్‌ చేశాడు. వాళ్ళ పాపని స్కూల్లో జాయిన్‌ చేశారట. కెనడా నుంచి పాండు చేశాడు. వాడు కంపెనీ మారాడట. మారిన కంపెనీలో లక్ష జీతం ఎక్కువ అంట.. ఆ అలాగే పూనే నుంచి రాధిక చేసింది. దానికి ఈరోజు 9 నెలలు నిండాయంట. తొలికాన్పు లాగా సిజేరియన్‌ చేయించుకుంటా కానీ ఈ ***
పొద్దున లేవగానే ధర్మరాజు కాళ్ళ చుట్టూ టామీ తిరుగుతూ ఉంటుంది. తన పేపర్‌ చదువుతుంటే మెల్లిగా వచ్చి ప్రేమగా తన ఒడిలో పడుకుంటుంది. బయటకి స్కూటర్‌ తీస్తుంటే వెనకే పరిగెత్తుకొని వస్తుంది. కాళ్లకు అడ్డం పడుతుంది. అప్పుడైతే దాని బతిమాలి ఇంట్లోకి తీసుకెళ్లడానికి శ్యామలకి తల ప్రాణం తోకకు వచ్చేది. ధర్మరాజు వచ్చేంతవరకు గేటు దగ్గర ఎదురుచూసేది.
రోజులు గడుస్తుంటే వాళ్ళ బంధం విడదీయరానంతగా మారింది. ధర్మరాజు పిల్లల్ని కష్టపడి మంచి చదువులు చదివించాడు. పోటాపోటీగా వాళ్లంతా విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.
టామీని మొదట్లో శ్యామల అసహ్యించుకున్నా, ఇప్పుడు అదే తన గారాల పట్టీ అయింది.
ఆరు నెలలు గడిచాక… ధర్మరాజుకి సాయంత్రం పూట గుండె నొప్పి వచ్చింది. శ్యామల అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి, దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. అప్పటికే ధర్మరాజు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. బెడ్స్‌ ఖాళీ లేవని, పక్క బెడ్‌ వాళ్లు భయపడతారని ధర్మరాజు పార్థివదేహాన్ని మార్చరీలోకి తరలించారు ఆసుపత్రి సిబ్బంది.
శ్యామల బిగ్గరగా రోదించింది. గుండెను రెండు చేతులతో బాదుకుంటూ, దిక్కులు పిక్కటిల్లెల ఏడ్చింది. దు:ఖాన్ని అణిచిపెట్టుకుంటూ విదేశాల్లో వున్న పిల్లలకి ఫోన్‌ చేసింది. మొదట పెద్దోడికి ఫోన్‌ కలిపింది,
”మమ్మీ… ప్లీజ్‌… ఈసారి తమ్ముడిని రమ్మను. నేను మొన్ననే కంపెనీ మారాను. సెలవులు ఇవ్వరు మమ్మీ… అంత్యక్రియలు మాత్రం ఫోన్లో లైవ్‌లో చూపించవే…” అంటూ ఫోన్లో ఏడ్చుకుంటూ కాల్‌ కట్‌ చేసాడు.
వెంటనే ఏడుస్తూనే చిన్నోడికి ఫోన్‌ కలిపింది.
”చిన్నా… మీ నాన్నగారు వెళ్ళిపోయారు…” అని తల్లి మాట పూర్తిగా కాకముందే, ”ఇప్పుడే అన్నయ్య ఫోన్‌ చేసి చెప్పాడు. కానీ నాది అన్నయ్య కన్నా పెద్ద పొజిషన్‌… నాకెలా కుదురుతుంది. రేపు మా అత్తమామలు కూడా వస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్‌ చేసుకోవాలి. స్వప్నకి ఇప్పుడు ఏడో నెల. తనను విడిచి పెట్టి ఎలా రాను” అన్నాడు.
శ్యామలకి వాళ్లలో ఏ కొంచెం కూడా బాధ, జాలి, ప్రేమ కనపడలేదు. చిన్నోడి కాలేయం చెడిపోతే నాన్ననే ఇచ్చాడని ప్రేమ కూడా లేదు అనుకుంది. శ్యామల గుండె దిటవు చేసుకుని ఫోన్‌ పక్కకు పెట్టేసింది. తర్వాత రెండు మూడు మిస్డ్‌ కాల్స్‌ వచ్చినా ఫోన్‌ ఎత్తలేదు. కెనడా నుంచి పెద్ద కూతురు చేస్తే మాత్రం లిఫ్ట్‌ చేసింది.
”మమ్మీ ఇప్పటికిప్పుడు మేము రావాలంటే ఎలాగమ్మా. అన్నయ్యలకు కూడా కుదరదు కావచ్చు. ఒక పని చెరు. గూగుల్‌లో సెర్చ్‌ చేసి మహాప్రస్థానం వాళ్ళకి ఫోన్‌ చేసి చెప్పు. వాళ్లే అంతా చూసుకుంటారు” అంది.
శ్యామల ఫోన్‌ కట్‌ చేసింది. ఇంక పూనేలో ఉన్న చిన్న కూతురుకి ఫోన్‌ చేయాలనిపించలేదు.
‘మీ నాన్న ఆదివారం మటనో చికెనో తెస్తే మీకు సరిపోతదో లేదో అని… నేను నాన్‌ వెజ్‌ మానేశానని అబద్ధాలు చెప్పేవాడు. ఏదైనా పండక్కి స్వీట్లు తెస్తే… అది పిల్లలు నలుగురికి సరిపోతుందో లేదోనని, డాక్టర్‌ నాకు షుగర్‌ ఉందని చెప్పాడని స్వీట్లు ముట్టేవాడు కాదు. ఇంత చేసిన కూడా మీకు కృతజ్ఞత లేదురా’ అని మనసులో అనుకుంది.
టామీ కళ్ళల్లో కూడా నీళ్లు. మూసి ఉన్న మార్చురి తలుపు దగ్గరే ముడుచుకొని కూర్చుంది. ధర్మరాజు వీధిలో ఉండే బంధుమిత్రులు ఆఫీస్‌ కొలీగ్స్‌ వచ్చారు. శ్యామలను ఓదార్చారు. అందరు కలిసి ధర్మరాజు శవాన్ని మహాప్రస్థానంకి తరలించారు. ఆ గందరగోళంలో టామీకి ధర్మరాజు కనబడలేదు. ఆ మార్చురీ వద్దే కురు కురు మంటూ అటు ఇటు తిరుగుతుంది. ధర్మరాజు అంత్యక్రియలు అయిపోయాయి.
***
మార్చురి దగ్గరనే కూర్చున్న టామీ, ఎవరైనా మార్చురి గది తలుపులు తీస్తే చాలు ధర్మరాజు వస్తాడని ఆశగా చూస్తోంది. అలా నాలుగు రోజులు గడిచాయి. ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా వెళ్లగొట్టడానికి వస్తే కదలక మెదలక అరిచి పడుకునేది.
మూడు రోజుల నుంచి ఇదంతా గమనిస్తున్న ఆస్పత్రి అటెండర్‌ నారాయణ… దానికి తాను తెచ్చుకున్న టిఫిన్‌ డబ్బా ముందు పెట్టిన తినలేదు. వాసన చూసి మల్ల ముడుచుకుని పడుకునేది.
దాన్ని చూస్తే నారాయణకి తన చిన్నప్పుడు పాటల రికార్డర్‌ హెచ్‌ఎంవి లోగో గుర్తుకొచ్చేది. చిన్నప్పుడు ఎక్కడో చదివినట్టు గుర్తు, ఓ సారీ మార్క్‌ అనే సింగర్‌ పాటల రికార్డింగ్‌ ముగించుకొని ఇంటికి వస్తుంటే అతని కార్‌ కింద కుక్కపిల్ల పడింది. కంగారుగా కారు దిగి కుక్క పిల్లని ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రోజు నుంచి అది ఆయన ఎటు వెళ్లినా అటు పోయేది. చివరికి అది ఆయన పాట రికార్డింగ్‌ గదిలోకి కూడా వెళ్ళేది. ఆ రికార్డింగ్‌ గదిలో చీమ చిటుక్కుమన్నా రికార్డు అయ్యేది. ఆయన ఆ కుక్కపిల్ల రికార్డింగ్‌ గదిలో కురు మని కూడా అనకపోయేదట. కొన్నాళ్లకా గాయకుడు చనిపోయాడు. ఆ విషయం కుక్క పిల్లకు తెలియదు. గాయకుడి తమ్ముడు ఫ్రాన్సిస్‌ ఆ కుక్క పిల్లని తెచ్చి పెంచుకుంటున్నాడు. అతనొక మంచి పెయింటర్‌. ఒకసారి తన టేప్‌ రికార్డర్‌లో వాళ్ళ అన్న పాటలు పెట్టాడు. ఆ కుక్క పిల్ల వెంటనే వచ్చి దాన్ని చుట్టూ తిరిగి పక్కకు కూర్చుని వింది. వేరే పాటలు పెట్టగానే పట్టించుకోనట్టు వెళ్ళిపోతుంది. మార్కు పాటలు వినగానే మళ్లీ వచ్చి కూర్చునేది. అది గమనించిన ఫ్రాన్సిస్‌, ఆ సందర్భాన్ని ఒక బొమ్మగా గీశాడు. తర్వాత మార్క్‌ రికార్డింగ్‌ థియేటర్‌కి His Masterμs Voice (HMV) ని పెట్టి ఆ బొమ్మనే లోగోగా పెట్టారట… అప్పటి నుండి మార్కు పాటలు ఎక్కడ వినబడినా ఆ కుక్కపిల్ల అక్కడికి వెళ్లి కూర్చునేదట. ఇప్పుడు టామీ స్థితి చూసి నారాయణకు జాలేసింది.
అప్పుడే అటుగా వెళుతున్న స్వీపర్‌ సూరమ్మకు మార్చురీ దగ్గర కుక్కపిల్లని జాలిగా, దయగా చూపిస్తూ చెప్పాడు.
సూరమ్మ చెప్పింది… ”నారాయణ… ఇప్పటి మనుషుల కన్నా కుక్కలే నయం రా. అందుకే వెనుకటి రోజుల్లో, మనిషి చనిపోతే భార్య గడప దాకా వస్తుంది, కొడుకు కాటిదాకా వస్తాడు, కానీ ఒక భైరవుడొక్కడే స్వర్గం దగ్గరకో, నరకం దగ్గరకో కూడా వస్తాడట అననేవారు”
”నేను కూడా కుక్క పిల్లని రెండు మూడు సార్లు కట్టెతో తరిమేసాను. గేట్‌ దాకా వెళ్లి మళ్లీ మార్చురీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. పాపం అన్నం నోట్లో కూడా పెట్టట్లేదు. ముందటనే పడుకొని ఆ గది వైపే చూస్తుంటుంది” అంది సూరమ్మ.
అప్పుడే లోపలికి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ఇందుమతి ఖరీదైన కారు వచ్చి ఆగింది. నారాయణ లేచి నిల్చున్నాడు.
డాక్టర్‌ ఇందుమతి దిగింది. ఆమె వెనకాలనే నల్ల చిరుత పులి లాంటి జర్మన్‌ షెఫర్డ్‌ కుక్క. అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది దాని శరీరం ఎంతో హుందాగా ఉన్నా కళ్ళు మాత్రం నిప్పులా ఉన్నాయి. నోరు తెరిచి నాలిక చాచి సెక్యూరిటీ గార్డుల చుట్టూచూస్తుంది.
చిన్న తోక… నలుపు రంగు… చండ్ర నిప్పుల కళ్ళకు ముట్టుకుంటనే ఒళ్లంతా చీల్చి చెండాడేటట్టు దాని పళ్ళు. దాని మెడకి ఎర్ర రంగు పట్టి. ఇందుమతి పక్కనే నడుస్తుంది. ఈ మధ్యనే దాన్ని మూడు లక్షలు పెట్టి తెప్పించారట.
ఆ కుక్క చూపు మార్చురి ముందు పడుకున్న టామీ మీద పడింది. అంతే..! ఒక్క ఉదాటున పులి గాండ్రించినట్టు టామీ మీద పడింది.
డాక్టరమ్మ తీరుకొని.. ”ఏరు ఉజ్వల్‌… కమాన్‌ రే… కమ్‌ బ్యాక్‌ … ప్లీజ్‌… అది ఊరకుక్క. దాన్ని తాకొద్దు. నారాయణ… ఆ ఊర కుక్క ఎలా హాస్పిటల్‌ లోపలికి వచ్చింది. నువ్వేం చేస్తున్నావ్‌… ఉజ్వల్‌ ఇటురా”
అప్పటికే డాక్టర్‌ గారి కుక్క టామీ మీదికి అరిచి, ఒక మూడు చోట్ల కరవసాగింది. టామీ లేచి పరిగెత్త లేకపోయింది. నారాయణ సిలిండర్‌ స్టాండ్‌ పట్టుకుని వచ్చాడు.
”నారాయణ తొందరగా పో… అది ఊరకుక్కైతే ఇన్ఫెక్షన్స్‌ ఉంటాయి.. ఉజ్వల్‌కి అంటుతాయి. అది పిచ్చికుక్క అయితే మరీ డేంజర్‌. సూరమ్మ… మణీ… నాగయ్య… వీళ్లంతా ఎక్కడ చచ్చారు” డాక్టర్‌ అరుస్తోంది.
టామీ తిరగబడుతుంది, కానీ ఒంట్లో సత్తువ లేక ఓడిపోతుంది. నారాయణ వచ్చి గేటు బయటకి టామీని తరిమి కొట్టాడు. పరిగెడుతూనే అది మూడు, నాలుగు సార్లు మార్చురి గది వైపు చూసింది. నారాయణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బలవంతంగా దాన్ని గేటు బయట వరకు తరిమికొట్టాడు.
డాక్టరమ్మ ఉజ్వల్‌ మొఖం మీద ముద్దులు పెడుతుంది.
టామీ కొంత దూరం పరిగెడుతూనే ఉంది. ఆయాసంతో ఉన్నప్పుడు మరికొన్ని ఊరకుక్కలు వెంట పడసాగాయి. మిగతా కుక్కలు వెంబడిస్తున్నాయని టామీ వీధులు దాటుతూ పరిగెడుతూనే ఉంది. ఆయాసంతో గేట్లు తెరిచే ఉన్న మహాప్రస్థానం లోపలికి వెళ్ళింది. చెట్ల నీడలో సేద తీరుతూ కాసేపు అక్కడే తిరిగింది.
అక్కడ ఒక సమాధి మీద ధర్మరాజు ఫోటో కనిపించింది. పక్కనే తెల్ల చీరలో శ్యామలమ్మ. ఒక్కసారిగా ఎగిరి గంతేసి అరచుకుంటూ ధర్మరాజు సమాధి దగ్గరికి వెళ్ళింది. శ్యామల చుట్టు తిరుగుతూ, ఫోటోలో ఉన్న ధర్మరాజును చూసి కురు మంటూ ఆమె ఒళ్ళో పడుకుంది. శ్యామల దు:ఖాన్ని ఆపుకుంటూ…ప్రేమగా టామీ తలను నిమిరింది.
– కె. వి. నరేందర్‌. 9440402871 

]]>
పరివర్తన https://navatelangana.com/transformation-2/ Sat, 06 Apr 2024 17:57:01 +0000 https://navatelangana.com/?p=263907 Transformation”రెడ్డిగారు చెప్పండి” అన్నాడు యంకన్న మోగుతున్న సెల్‌ఫోన్‌ తీసుకొని. ”ఏం లేదురా. పక్క వూరికిపోయి పది అమ్మోనీయ, పది యూరియా సంచులు వేసుకొని రా. తొందరగా రా” అన్నాడు రెడ్డి అవతల నుండి.
”సర్లే రెడ్డిగారు వస్తా” అని ఫోన్‌ పక్కనబెట్టి భార్య పెట్టిన గొదుమరవ్వ ఉప్మా తింటున్నాడు.
”ఏంది? ఎవరు ఫోన్‌ చేసింది? రెడ్డేనా? యదవ. సిగ్గులేదు వాడికి. మళ్ళీ మందు కట్టలు వేసుకురమ్మన్నాడా? ఐనా మళ్ళీ ఎలా ఒత్త అన్నవు? మొన్న నీకు జరిగిన అవమానం మర్చిపోయావా?” అన్నది కమల వంట గదిలో పొగలు కక్కుతున్న టీని కప్పులో పోస్తూ.
యంకన్న ధీమాగా ఒక చూపు చూసి, అవమానం ఏంటే? అదంతా మాములే. వాళ్ళు అనేవాళ్ళు మనం పడేవాళ్ళం. అవన్నీ నెత్తికి ఎక్కించుకుంటే ఎలానే? బతుకు ఎలా గడుసుద్ది?” మాట పడకుండా ముద్దెట్టా వస్తది? అన్నాడు చెయ్యి కడుక్కుంటూ.
”ఊరిలో వాడొక్కడు కిరాయికి పిలవకపోతే ఏమి నష్టం? ఊరంతా గొడ్డు పోయిందా? ఐనా పిలిచిన వెంటనే పోతావు. ఒక్కడివే అన్నీ పొలం వరకు మోసుపోతావు. ఆటితో పాటు గొడ్లకి గడ్డి వేసే పని, ఆడి పెళ్ళాం చీరల ఇస్త్రీ పని… ఒకటేమిటి అన్ని పనులు చేయిస్తాడు. ఇంతజేసీ టీ నీళ్లన్న గుక్కెడు పొయ్యరు. ఎప్పుడైనా మంచినీళ్లు ఇస్తే గొడ్ల సావిట్లో పెట్టే గలాసుతో పోస్తాడు. పైగా అరే వెంకడు, రారా పోరా అనే మర్యాదలు. ఆళ్ల ముందు చెయ్యి కట్టుకొని నిలబడతావు? చీ… కొద్దిగన్నా పౌరుషం లేదు” అని కోపంగా ఒక చూపు చూసింది కమల.
ఇవేవీ పెద్దగా పట్టించుకోకుండా మూతి తుడ్చుకొని టీ తాగుతున్నాడు వెంకన్న. ”నా మాట నువ్వెప్పుడు విన్నావు గనుక నీ ఇష్టం. ఈ రోజు గుర్తుందా నీకు? ఇయ్యాల నీ పుట్టిన రోజు. నామాట విను. మందుకట్టలు రేపు తెస్తానని చెప్పు. పిల్లల్ని తీసుకొని బయటికి పోదాం” అన్నది కమల కాస్త అసహనంతో.
కమల చెప్పింది ఏమంత ప్రత్యేకమైన విషయమే కానట్టు మందుకట్టలు తెచ్చి అక్కడ పడేసోచ్చాక, సాయంత్రం పోదాంలే అని ఆటో తాళాలు తీసుకున్నాడు యంకన్న. ఆట్లాగే పో గానీ ఇదిగో ఈ కొత్త బట్టలన్నా తొడుక్కొని పో”
”వొద్దు వొద్దు సాయంత్రం వొచ్చాక కట్టుకుంటాలే” అంటూ ఆటోవైపు వెళ్ళాడు.
ఎప్పటిలానే తన మాట వినిపించుకోని భర్తని చూసి జాలి వేసింది కమలకి. ఆటో స్టార్ట్‌ చేసుకొని వెంకన్న రోడ్డు ఎక్కాడు.
ఆటోలో వెళ్తూ వెళ్తూ కమల అన్న మాటలు గుర్తొచ్చాయి. నిజమే కదా? ఆత్మాభిమానం ఉండాలి. నా కష్టం నేను పడుతున్నాను. నా బతుకు నేను బతుకుతున్నాను. దొంగతనాలు చేసి, మాయలు మోసాలు చేయటం లేదు. ఆ రోజు రెడ్డి ఏమన్నాడు?.. ‘ఏంట్రో యంకన్న కొత్త బట్టలు వేసి తలకూడా దువ్వినావు. ఆఫీసర్లాగా. ఏంటి సంగతి? ఆటో తోలుకునే వాడివి. ఆటో తోలుకునే వాడిలా ఉండాలి. ఇంకోసారి నాకు ఇట్లా కనపడమాకు. మాలాంటి వాళ్ళు నీకు కిరాయి ఇస్తేనే నీకు బతుకని గుర్తుపెట్టుకో. నేను ఈ సంగతి వూల్లో చెప్పానంటే ఇక అంతే. నీకు ఒక్క కిరాయి కూడా రాదు మరి. చెరపరా చెరుపు. తల చెరుపు ల… కొడక’ అనేగా అన్నాడు.
బూతులు కూడా తిట్టాడు కదా. ఏం కొత్త బట్టలు కట్టుకోవడం తప్పా? తల దువ్వుకొని నీట్‌గా ఉండటంలో ఏమి తప్పుంది?
రెడ్డి తలచెరుపు అన్నప్పుడు నేను తల ఎందుకు చెరిపాను? అంటే తల దువ్వుకోవటం, కొత్తబట్టలు ధరించటం తప్పని నేను ఒప్పుకుంటున్నానా? ఆలోచనలతో తల వేడెక్కింది. ఆటో వేగంగా ముందుకు దూసుకుపోతుంది.
రెడ్డి ఇట్లా అన్నడని కమలకి చెప్తే తాను ఏమన్నది? తల చెరుపుకోకుండా ఉండాల్సింది అని. మళ్ళీ కమలే కొత్త బట్టలు తొడుక్కోవటం ఎందుకు తప్పో నువ్వు ఎందుకు అడగలేదని గట్టిగా అడిగింది. నిజమే నేను ఎందుకు రెడ్డిని ప్రశించలేదు? నా రక్తంలో వేడి తగ్గిందా? అనుకున్నాడు.
ఆటో వేగం ఇంకా పెరుగుతుంది. మందుల కొట్టుముందు ఆటో ఆపి లోడ్‌ చేసుకొని తిరుగు ప్రయాణం మొదలు పెట్టాడు. మళ్ళీ అవే ఆలోచనలు. వొస్తూ వొస్తూ ఇంటి ముందు ఆటో ఆపి ”కమల, కమలా” అని పిలిచాడు.
ఇల్లూడుస్తున్న కమల యంకన్నని చూసి ”ఏంటి అప్పుడే వొచ్చవా? సరే, పోపో. పోయి మందు సంచులు ఆడేసి రా” అన్నది కమల.
”లేదు లేదు తర్వాత పోతాలే” అంటూ నీళ్ల గదిలోకి వెళ్లి తలారా స్నానం చేస్తున్నాడు యంకన్న.
ఏమయినాది ఈ మనిషికి అనుకొని చీపురు కట్ట పడేసి తుండుగుడ్డ తెచ్చింది. ముఖం నిండా ఆనందంతో వొచ్చి కొత్త బట్టలు తొడుక్కొని, తల దువ్వుకొని రెడ్డి ఇంటి ముందర ఆటోని ఆపాడు.
యంకన్న కొత్త బట్టలు, క్రాపు చూసి రెడ్డి విస్తుపోయి ”యారా యురియా కట్టలు తెచ్చి లోపలి ఎయ్యి” అన్నాడు కోపంగా.
”ఇయ్యాల నా పుట్టిన రోజు అండి. మందు సంచులు దించితే, నా కొత్త బట్టలు మురికి పడతాయి. ఇవాళ్టికి మీరే దింపుకొండి” అన్నాడు యంకన్న.
”ఏమిరో అహంకారం నెత్తికి ఎక్కిందా? నీయమ్మ. కుడితి గాబులో వేసి తొక్కేస్తా” అని మరో బూతుమాట ఏదో రెడ్డి మాట్లాడబోతుంటే మధ్యలోనే అడ్డుకొని ”మాటకి మాట అనగలను నేను కూడా. వొద్దండి. మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇంకో మాట, ఇక నుండి మీ మందుసంచుల పని నేను చేయను. ఇంకొకడ్ని చూసుకో. వస్తానండి” అని ఆటోలో ఉన్న సంచుల్ని రోడ్డుమీదనే డొల్లించి కాలర్‌ భుజం మీదనుండి రెండించలు పైకి ఎగరేసి వేగంగా ఆటో తొలుకుంటూ ఇంటి వైపు వొచ్చాడు.
పుట్టిన ఇన్నేళ్ళకి జన్మించడం అంటే ఏంటో అర్ధమైంది యంకన్నకి.

– పెద్దన్న, 9866881140

]]>
వైల్డ్‌ ఫ్లవర్‌ https://navatelangana.com/wild-flower/ Sat, 30 Mar 2024 17:53:35 +0000 https://navatelangana.com/?p=259178 నలుగురు యువకులు కాంక్రీట్‌ జంగల్ల నుంచి బయటపడి, కాసింత ఊపిరి పీల్చుకోవడానికి అడవిబాట పట్టారు. గ్లోబల్‌ అంగడిలో తప్పిపోయిన జీవితాల్ని వెతుక్కోవడానికి రాచకొండ లోయల్లోని సెలయేటి అంచుల్లోకి చేరుకున్నారు. పరుపుబండలమీద కూర్చుని, దారిలో లంబాడీ అక్క దగ్గర తెచ్చుకున్న జొన్నరొట్టెలు, గోంగూర పచ్చడి నంజుకుని తింటున్నారు. చుట్టూ చీకటి కమ్ముకున్న అడవి. కూలిపోయిన రాచకొండ రాజ్య ప్రాకారాల మీదుగా రొమ్ము విరుచుకుని కురుస్తున్న వెన్నెల. పురా జ్ఞాపకాలను తట్టి లేపడానికే అన్నట్లు చెట్ల కొమ్మలనుంచి జలపాతంలా దునుకుతున్న చల్లని గాలి. నల్లని ఆకాశంలో మిణుకు మిణుకుమంటున్న నక్షత్ర సౌందర్యం ఆ యువకుల్ని కవ్విస్తుంది. అందుకే అనేక జ్ఞాపకాలను తొవ్విపోసుకుంటున్నారు. కష్ట సుఖాలను పంచుకుంటున్నారు. యువకులు కనుక ముచ్చట సహజంగానే ప్రేమ కథల వైపు మళ్ళింది. ముందుగా ముగ్గురి లవ్‌ స్టోరీ చెప్పడం అయ్యాక, నాల్గోవాడి వైపు చూసి నవ్వుతున్నారు. ”హేరు నావైపు చూసి ఎందుకు నవ్వుతున్నారు?”
”మరి నవ్వరా! మేమంటే మా లవ్‌ స్టోరీలేవో చెప్పాము. నీవసలే ఉద్యమకారుడివి. నీకేం లవ్‌ స్టోరీ ఉంటుంది” అన్నారు నవ్వుతూ.. ”ఉద్యమకారులు మనుషులు కాదా! వాళ్లకు లవ్‌ స్టోరీలుండవా? వాళ్లకు రొమాంటిక్‌ థాట్స్‌ రావా? మీ అంత రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ కాకపోయినా, ఓ మాదిరి కథ చెప్పమంటే చెబుతాను”
”అవునా…! అయితే ఈ రోజు ఓ భిన్నమైన కథ వినబోతున్నామన్నమాట. చెప్పు చెప్పూ త్వరగా. ఏమిటా కథ? ఎలా ఉంటుంది తను?” కళ్లప్పగించి, చెవులు నిక్కబొడిచి అడిగారు.
”ఓ పొగమంచు కమ్మే కాలాన అందమైన రెల్లుగడ్డిలాంటి జుట్టును మునివేళ్లతో సరిజేసుకుంటూ నడిచొస్తుంది తనో జీవనదిలా. పాలనురగలాంటి మేఘాలను తుంచి తన ఎదమీద కప్పుకున్నట్టున్న తెల్లని చున్నీ కొసలు, గాలికి తూనీగలై నాట్యమాడుతున్నాయి. ద్రవిడవర్ణ ఛాయతో తన మేనిరంగు మేలిమి పుట్టమన్నులా నిగనిగలాడుతోంది. పాదరసంలాంటి ఆ కళ్ళు, పాలుగారినట్టుండే చెక్కిళ్ళు. మామిడి పూతలా, పజ్జోన్న కాతలా తన రూపురేఖలు. ఎంతో అందమైన హస్కీవాయిస్‌ ఆమెది. అది పంజాబీ నూరాన్‌ సిస్టర్స్‌ సూఫీ పాటను మించి ఒకడి గుండె పొరల్లో చెరగని సంతకం చేసింది. తొలకరి చినుకులతో అతని మదినల్లుకున్న ఆ మట్టిపరిమళం మరిచిపోలేనిది. ఇంతకీ అతనెవరు? పసిపిల్లల పిడికిటిలోనూ పోరాట పొద్దుని చూస్తూ విరిసిన మందార కేతనం అతడు. మోదుగుపూవు లాంటి ముఖారవిందంతో ఒకానొక ఉషోదయాన, తన ప్రతిబింబాన్ని ఆమెలో చూసుకుని మురిసినవాడు. యాదశ్చికంగా ఎదురై, అతనిలో రాగమైన జ్ఞాపకాల తీరంలో తిరగాడుతున్న ఉద్యమకారుడు. ఇతనూ తనూ కౌమారంలోనే పుట్టిన సుకుమారమైన ప్రేమికులు. ఒక పోరాటంలో కలుసుకుని విడిపోయిన ఉద్యమ సీతాకోక చిలుకలు. ఇప్పుడు మరో సమూహ బాటలో, సభాతోటలో మళ్ళీ అయిదేళ్ల తర్వాత కలుసుకోనున్నారు.
***
చీకటి మొకాన్నే రమ్మని చెప్పిన ఎమ్మెల్యే గారి మాట యాదికొచ్చి, లేచి దబదబా రెడీ అయ్యి ఎమ్మెల్యే గారింటికి పోయిండు తత్వ. ”ఆ.. తత్వ రారా. నీకోసమే చూస్తున్న త్వరగా టీ తాగు వెళదాం”
”ఎక్కడికండీ?”
”ఎక్కడికో చెప్తే తప్ప కారెక్కవా రా? నదిలో నుంచి తోటకు పైపు లైన్‌ వేసుకెళ్తున్నాం కదా అది చూసి, కూలోళ్ళు నాటుకు వచ్చే లోపు పొలంలో నారు పంచేసోద్దాం దబ్బున కారెక్కురా”
నేవీ బ్లూ కలర్‌, మహీంద్రా మార్షల్‌ 7171 కారు. సందులు గొందులు దాటి, పెట్రోల్‌ బంక్‌ పక్క సందులో నుంచి రోడ్డెక్కింది. చిక్కగా కురుస్తున్న మంచు ఎన్‌.హెచ్‌. నైన్‌ అని పిలవబడుతున్న రోడ్డును కమ్మేసింది. సరిగా కనపడడం లేదు. అయినా కారు ఆ మంచును చీల్చుకుంటూ పడమటి మొఖాన సాగిపోతుంది. ఆ లైటు వెలుగుల్లో ఎదురుగా అమ్మాయిల గుంపు వెళ్తుంది. పొద్దున్నే వాకింగ్‌ కోసం గ్రౌండ్‌కి వెళ్తున్నారనుకున్నారు. కానీ చీమల బారులా ఇద్దరిద్దరు అమ్మాయిలు, ఒకరి వెనుకాల ఒకరు లైనుగా, ఏదో పొద్దుని కోసుకొచ్చే పనేదో ఉన్నట్టు చాలా సీరియస్‌ వెళ్తూనే ఉన్నారు. ”శీనన్న కారు ఆపు” డ్రైవర్‌ కి చెప్పాడు తత్వ.
”ఒర్రెక్కో సడెన్‌గా ఏమయిందిరో? కారెందుకు ఆపాలె?” అడిగాడు ఎమ్మెల్యే.
”వాళ్ళంతా స్టూడెంట్స్‌. ఇంత ఎర్లీ మార్నింగ్‌ ఇలా ఆరుద్ర పురుగుల దండులా వెళ్తున్నారంటే ఏదో జరిగిందనిపిస్తుంది. నేను వాళ్లతో వెళ్ళాలి” కారు దిగి వెళ్ళిపోయాడు తత్వ.
”ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం జరిగింది?” వాళ్లతో నడుస్తూ, ఇలా ఎన్ని ప్రశ్నలేసినా ఎవరూ ఏమి సమాధానం ఇవ్వడం లేదు. అయినా వారితోనే నడుస్తున్నాడు. ఇంతలో హేలీ తోక చుక్కలా మెరుస్తూ తన దగ్గరకు దూసుకొచ్చిందొక అమ్మాయి.
”హలో… ఏం కావాలి నీకు? ఎందుకు మాతో వస్తున్నావు? అసలు ఎవరు నీవు? ఈయనతో ఎవరూ మాట్లాడకండి, నడవండి.” తన ఫ్రెండ్స్‌ కి చెప్పి ముందుకు వెళ్ళిపోయింది. తన మాటల్ని ఆ అమ్మాయిలందరూ తూచా తప్పకుండా పాటిస్తూ నడుస్తున్నారు. ఈ లోపు ర్యాలీ ఎం.ఆర్‌.ఓ ఆఫీసు దగ్గరకు చేరుకుంది. తానే ఆ ర్యాలీని ఆర్గనైజ్‌ చేస్తుంది. ఆ హైవే మీద వాహనాల వలన ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ర్యాలీని గండు చీమల బారులా, క్రమశిక్షణగా, చాలా చక్కగా నడిపింది. అప్పటివరకూ నోరు విప్పని అమ్మాయిలు ఇప్పుడు నినాదాలు చేస్తున్నారు. ”విరు వాంట్‌ జస్టిస్‌, కలెక్టర్‌ రావాలి – సమస్యలన్నీ తీర్చాలి” కేవలం ఈ రెండంటే రెండే నినాదాలు. వర్కింగ్‌ డే రోజు పదిన్నర దాటితేనే అధికారులు ఆఫీసులకు వచ్చేది కష్టం. అలాంటిది ఆదివారం ఆఫీస్‌ దగ్గర ఎవరుంటారు? కలెక్టర్‌ కి ఎవరు చెప్తారు. అయినా ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న జిల్లా కేంద్రం నుంచి ఆయన రావడం ఇప్పటికిప్పుడు జరిగేపనేనా? వాళ్ళకేం న్యాయం కావాలో, ఏ సమస్యల్ని పరిష్కరించాలో చెప్పడం లేదు. కనీసం వాళ్ళ సమస్యల్ని కూడా వాళ్ళు స్లోగన్‌ చేయడం లేదు. మళ్ళీ ఒకసారి ఆ ఆర్గనైజ్‌ చేసే అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేసాడు తత్వ. కానీ ఆ అమ్మాయి పలుగురాళ్లను సర్రుమని విసిరినట్టు ఒక్క చూపు చూసి ”విరు వాంట్‌ జస్టిస్‌” అంటూ పక్కకు వెళ్ళిపోయింది. ఇంతలో జర్నలిస్టులు వచ్చారు.
”ఏంటమ్మా మీ డిమాండ్స్‌ ఏంటీ? ఎందుకు ధర్నా చేస్తున్నారు? చెప్పండి”
”మేము చెప్పం. మీకెందుకు చెప్పాలి. మేము ఒక్క కలెక్టర్‌ తో తప్ప ఎవరితో మాట్లాడేది లేదు” అక్కడ ఎప్పటి నుంచో స్లొగన్స్‌ ఇస్తున్న విద్యార్థుల నోళ్ళు ఎండిపోతున్నాయి. అది గమనించిన తత్వ వాటర్‌ ఆటోను తెప్పించి, వాళ్ళందరిని వాటర్‌ తాగమని చెప్పాడు.
”మా సమస్య పరిష్కారం అయ్యేవరకు మాకేం వద్దు” అన్నారు.
”మీరు గురుకుల పాఠశాల విద్యార్థులని మాకు తెలుసు. మాతో చెప్పకపోయినా ఫరవాలేదు. కానీ ఈ తత్వ మీ విద్యార్థి సంఘ లీడర్‌. ఆయన మీ కోసమే ఉన్నాడు. మీ వైపే మాట్లాడుతాడు. ముందు వాటర్‌ తాగి, ఆయనకైనా మీ సమస్యలు చెప్పండి. లేకపోతె మీకే నష్టం” అని చెప్పి విలేకర్లు దూరంగా వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు ఆ అమ్మాయి అందరినీ నీళ్లు తాగమని సైగ చేసింది.
”నీ పేరు ఏంటి?”
”వివిధ. అయినా నా పేరు ఏమైతే మీకెందుకు? మేం ఎవరితో మాట్లాడం”
”నా పేరు తత్వ. నేనూ మీలాంటి స్టూడెంట్‌ నే. ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న. నేను స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆర్గనైజర్‌ ను. మీ ప్రాబ్లమ్స్‌ చెప్తే నేనూ మీతో కలిసి ఫైట్‌ చేస్తా వివిధ”
”హలో తత్వా.. నీతో చెప్తే ఏం చేస్తావ్‌? నీవేమైనా కలెక్టర్‌వా? ఎమ్మెల్యేవా? మేము ఎవ్వరిని నమ్మేది లేదు”
”నేను ఆ రెండు కాకపోవచ్చు వివిధ. నాకు చెప్తే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరినైనా ఇక్కడికి రప్పించగలను”
”నువ్వూ నాలాంటి స్టూడెంట్‌ వే తత్వా. ముందు రప్పించు. అప్పుడు నమ్ముతా నిన్ను. విరు వాంట్‌ జస్టిస్‌” కోడెలేగ మూపురం అంత అందంగా, కొమ్ములంత బలంగా పిడికిలి ఎత్తి మళ్ళీ స్లొగన్స్‌ మొదలుబెట్టింది. చెట్టు కింద రెడ్‌ కలర్‌ హీరోహోండా సిడి హండ్రెడ్‌ ఎస్‌.ఎస్‌. బైక్‌ మీద, నున్నగా దువ్వుకుని కూర్చున్నాడు జర్నలిస్ట్‌ రమణబాబు. తత్వ ఆయన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఫోన్‌ కలుపమన్నాడు. సెల్యులార్‌ ఫోన్‌ లాంటి సెల్‌ ఫోన్‌ తీసి ఎమ్మెల్యే గారికి ఫోన్‌ కలిపాడు.
”హలో.. నమస్తే విలేకరి గారు చెప్పండి”
”నమస్తే ఎమ్మెల్యేగారు. తత్వ మాట్లాడుతా అంటే చేసిన. ఇస్తున్న ఇదిగో మాట్లాడండి”
”ఇక్కడ గురుకుల పాఠశాల విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. సమస్య ఏమిటని అడిగితే మాకేమి చెప్పడంలేదు. మీరు వస్తే తప్ప మాట్లాడరట. త్వరగా రండీ”
”ఒర్రెక్కో త్వరగా అంటే ఏందిరో! రమ్మనగానే ఇక్కడ లేచి అక్కడ వాలడానికి మాదేమన్న విమానమారా?”
”సరే. ఎప్పటి వరకు రాగలరు? అసలు వస్తరా? రారా?”
”అరేరు రాకుండా ఎట్లుంటరా? నువ్వు ఆర్డరేసినంక రాకుంటే తప్పుద్దారా? ఇగో స్టార్ట్‌ అయితనే ఉన్నం”
”సరిగ్గా పదహారు నిమిషాల్లో ఎమ్మెల్యే సిమ్మయ్య ఎమ్మార్వో ఆఫీసుకి చేరుకున్నాడు. తత్వ ఎదురెళ్ళి విద్యార్థుల దగ్గరికి తీసుకొచ్చాడు. అమ్మాయిలందరూ సిమ్మయ్యను గుర్తుబట్టి సంతోషంతో కేకలేశారు. అసలే తేజ టివిలో వచ్చే అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న కాలం అది. అసెంబ్లీలో ఎర్రజెండా తరపున వాడి వేడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే సిమ్మయ్య ఉపన్యాసాలు టీవీల్లో చూసినవారు. కనుకనే ఆయన రావడంతో ఆ కేకలు. కామంచి పొదల్లో ఓ వైల్డ్‌ ఫ్లవర్‌ విరభూసినట్టు విద్యార్థుల మధ్యలోంచి లేచి నిలబడింది వివిధ. అడవి చామంతిలాంటి కళ్ళతో తత్వ వైపే ఆశ్చర్యంగా చూస్తుంది వివిధ.
”ఎక్కడమ్మా మీది?” వివిధను అడిగాడు సిమ్మయ్య
”చలకుర్తి సార్‌”
”మరి మీ సమస్య ఏంటమ్మా? నన్ను పిలువనంపితే నేను మీ గురుకుల పాఠశాలకి వచ్చేటోన్ని కదా! ఇంత రిస్క్‌ ఎందుకు తీసుకుర్రు?”
”సార్‌ అదీ…”
”అది ఇది కాదుగాని, మీకు ఆకలైతున్నదని నాకర్ధం అయింది. మీ సమస్యలన్నీ పరిష్కరిద్దాం, ముందు గురుకుల పాఠశాల పోదాం పదండి. తిన్న తర్వాత మాట్లాడుకుందాం”
”అలా కాదు సార్‌. పరిష్కరిస్తామని హామీ ఇస్తేనే వెళ్తాం సార్‌”
”అదే చెప్తున్నానమ్మా. తప్పకుండా పరిష్కరిస్తాను. పదండి మీతో తత్వ వస్తాడు. ఇప్పుడు…”
”తత్వ కాదు సార్‌ మీరొస్తేనే వెళతాం”
”నేను కూడా వస్తనమ్మా. రాలేదనుకో, మీకంటే ముందు మీ లీడర్‌ వదలడు. నన్ను ఇక్కడికి ఉన్నఫలంగా రప్పించింది ఎవరు? తత్వనే కదా! అది మరిచిపోతే ఎలా? త్వరగా రమ్మన్నరని నేను పొలంలో నుంచి బురద కాళ్లను కడుక్కోకుండా డైరెక్టుగా ఇక్కడికే వచ్చిన. మీరు మీ గురుకుల పాఠశాలకు నడిచేలోపు నేను ఫ్రెష్‌ అయ్యి వస్తా. అరే తత్వ నువ్వెళ్లి ముందు వాళ్లకు తిండి పెట్టించు. వాళ్ళ ప్రిన్సిపాల్‌ కి నేనొస్తున్నా అని చెప్పు” సిమ్మయ్య పై నమ్మకంతో అందరూ ర్యాలీగా పాఠశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. కొంతమంది అమ్మాయిలు తత్వతో మాట్లాడుతూ నడుస్తున్నారు.
”అన్నయ్య మీరు మాకు తెల్సు. బాగున్నారా అన్నయ్య. గర్ల్స్‌ హాస్టల్‌ లో ఉన్నప్పుడు మీరు రెగ్యులర్‌ గా వచ్చేది. మీ వల్లనే మాకు అక్కడ మంచి ఫుడ్‌ పెట్టి, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేవారు. నేను చెప్పలేదూ.. స్టూడెంట్‌ ఫెడరేషన్‌ అన్నయ్యలు మా హాస్టల్‌ కి వచ్చేదని.. ఈ అన్నయ్యే.” అని తమ ఫ్రెండ్స్‌కు తత్వను పరిచయం చేస్తున్నారు.
”మీతో మాట్లాడితే వివిధ తిడుతుందని, అప్పటి నుంచి మాట్లాడలేదన్నా. ఆమెది మన దగ్గర కాదు. కాల్వకింద. అందుకే తనకు మీ గురించి తెలియదు”
”ఇంత పొద్దున్నే బయటకు ఎలా రాగలిగారు! మీ వార్డెన్‌ ఆపలేదా?”
”లేదన్నయ్యా. వివిధ వెళ్ళి ట్యాంక్‌ లో వాటర్‌ అయిపోయాయి, మోటర్‌ ఆన్‌ చేయమని వాచ్‌ మెన్‌ రాములును డైవర్ట్‌ చేసి పంపించింది. ఆయన అటు వెళ్ళగానే మేము మెయిన్‌ గేటు నుంచే వచ్చేశాం. ఆయన మోటార్‌ వేసి గేటు దగ్గరికి వచ్చేలోపు బయటకు రాలేకపోయిన కొంతమంది అమ్మాయిలు మాత్రం గోడ దునికొచ్చారు అన్నయ్య. నేను ఈ గురుకుల పాఠశాలలోకి అడ్మిషన్‌ తీసుకునేముందు, విద్యార్థి సంఘాలకు లోపలికి ప్రవేశం లేదు అనే బోర్డు గేటుకు చూసినప్పుడే ఇక మా పని అవుట్‌ అని అనుకున్నా. అడిగేవారెవరూ లేరు అన్నయ్య. చివరికి తట్టుకోలేక వివిధ ఇచ్చిన కాన్ఫిడెన్స్‌ తో ఎట్లైతే గట్లైద్దని రోడ్డెక్కాం. మీరు కన్పించనంతవరకు భయంగా ఉండే. ఎప్పుడైతే మీరు వచ్చారో నాకైతే ఫుల్‌ ధైర్యమొచ్చింది అన్నయ్య”
ఇంతలో గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. గేటు బయటనే ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, పీడీ, వార్డెన్‌ అందరూ తలా ఒక బెత్తం పట్టుకుని నిలబడ్డారు.
”స్టూడెంట్‌ ఫెడరేషన్‌ వాళ్ళు వచ్చారు. ఎమ్మెల్యేగారు వస్తున్నారు” అని వారికి వివిధ చెప్పడంతో, అందరూ లోపలికి వెళ్లిపోయారు. తత్వ దగ్గరుండి అందరికి భోజనాలు వడ్డించి, గ్రౌండ్‌ లోని యాప చెట్లకింద కూర్చోబెడుతుండగానే ఎమ్మెల్యే సిమ్మయ్య వచ్చాడు. వచ్చే రాకడతోనే ”విద్యార్థి సంఘాలు పాఠశాల లోపలికి రాకూడదు” అని గేటుకు తగిలించిన బోర్డు ఊడబీక్క రమ్మని చెప్పడంతో అటెండర్‌ వెళ్ళి తీసుకొచ్చాడు.
”అది తీసుకెళ్లి డస్ట్‌ బిన్‌లో వేసిరా” అని సిమ్మయ్య తత్వకు చెప్పాడు. వెంటనే తత్వ కిచెన్లోకి వెళ్ళి భగభగ మండుతున్న పొయ్యిలో వేసొచ్చాడు. చూసి రా అంటే కాల్చి వచ్చాడు అంటారుగా అలా. దాంతో ప్రిన్సిపాల్‌ వివిధ వైపు చాలా కోపంగా చూస్తున్నాడు. ఈ అన్నిటికీ తనే కారణమన్నట్టు.
”ఒకనాడు బడిలోకి ప్రవేశం లేదని శూద్రులకు చదువు నిరాకరించారు. ఆ నిషేధాన్ని ఎదుర్కొని పూలే, అంబేడ్కర్‌ అందరికీ చదువుకునే హక్కు సాధించారు. ఇప్పుడు గురుకుల పాఠశాలలోని విద్యార్థుల దగ్గరికి విద్యార్థి సంఘాలను రాకుండా ఆపడానికే ఈ బోర్డులు పెట్టి జ్ఞానాన్ని, ప్రజాస్వామిక హక్కులను నిషేధిస్తున్నారు. ఎక్కడైనా నిషేధాజ్ఞలు ఉన్నాయంటే అక్కడ తప్పకుండా ఏదో గూడుపుఠాణి జరుగుతున్నట్టే లెక్క. తల్లిదండ్రుల్ని కూడా లోపలికి రానివ్వకుండా, జైలులోలాగ ఆంక్షలు పెట్టే ప్రదేశం విద్యాలయం అవుతుందా ఆలోచించండి. మీ పనికిరాని పద్ధతులే వాళ్లను ఉద్యమింపజేశాయి” అని ప్రిన్సిపాల్‌, పీడీ, వార్డెన్‌ ల దుమ్ము దులిపాడు తత్వ.
ఇంకా విద్యార్థుల్లో ధైర్యం వచ్చింది. దాంతో విద్యార్థులంతా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యే సిమ్మయ్యకు తమ సమస్యలు చాలా ధైర్యంగా చెప్పడం మొదలెట్టారు. ”బాన్సువాడ నుంచి కొత్తగా వచ్చిన ప్రిన్సిపాల్‌ కి, ఇన్నిరోజులు ఇక్కడున్న అగ్ర కుల ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ కి పాఠశాల నిర్వహణలో గొడవలు వచ్చాయి. గురుకుల సొసైటీ సెక్రెటరీతో పైరవీ చేసుకుని పాత ఇంచార్జ్‌ ప్రిన్సిపాల్‌ రెగ్యులర్‌ ప్రిన్సిపాల్‌ ని బాన్సువాడకు పంపేలాగ చక్రం తిప్పి సర్క్యూలర్‌ తెచ్చారు. వచ్చిన పది రోజుల్లోనే అకారణంగా రిటర్న్‌ ట్రాన్స్‌ఫర్‌ అన్యాయం. కాబట్టి నేను వెళ్ళేది లేదని ఆయన పట్టుబట్టి కూర్చున్నాడు. సిబ్బంది అంతా రెండు గ్రూపులుగా చీలిపోయింది. తత్కారణంగా పాఠశాలలో విద్యా బోధన అంతా అస్తవ్యస్తమైంది. దానికి మించి వంట చేసే కాంట్రాక్టు, రకరకాల సరుకులు, నిత్యావసరాల సప్లరు ప్రయివేట్‌ కాంట్రాక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. వారు సరిపడా వస్తువుల్ని అందజేయరు. అందువల్ల భోజనం అస్సలు బాగుండదు, నాసిరకంగా ఉంటుంది. పైగా ఆ కాంట్రాక్టర్ల చేత వంటపనికి, సప్లరు పనికి నియమించబడ్డ యువకులు అమ్మాయిలపై అరాచకాలు చేస్తున్నారు. వీళ్ళు చాలరన్నట్లు పురుషులైన టీచర్స్‌ కూడా కొంతమంది అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు.” అని కొంతమంది అమ్మాయిలు ఎడతెగకుండా తమ సమస్యలను చెప్తూనే ఉన్నారు.
”టిఫిన్‌ సరిగా ఉండదు, అన్నం సరిపడా పెట్టరు. రుచి, శుభ్రత ఉండదు. సబ్బులు, నూనె ఇవేవి సరిగా ఇవ్వరు. ఇదేంటని అడిగితే చాలు. మీ ఇంటి దగ్గర ఇంతకంటే బాగుంటుందా? నోరుమూసుకుని తినండి, లేదంటే మానేయండి. అయినా మీరు తినడానికి వచ్చారా, చదుకోవడానికి వచ్చారా? ఈ మాల, మాదిగ ముండలు మా పాలిట దాపురించారు. అని మేడమ్స్‌ తిట్ల పురాణం మొదలవుతుంది” అని మరికొంతమంది అమ్మాయిలు చెప్తూ ఏడుస్తున్నారు.
”అయినా మా వాళ్ళే ప్రిన్సిపాల్స్‌, టీచర్లు, వార్డెన్లు అయితే మాకీ అవమానాలు పోతాయికదా అని ఇవన్నీ భరిస్తూ చదువుకుంటున్నాం. ఆ చదువయినా సరిగా చెబుతారా అంటే ఇప్పుడు అది కూడా పాడైపోయింది. ఇక మేమెలా ఓపిక పట్టగలం? అందుకే అందరం నాలుగు గంటలకు లేచి స్నానాలు చేసి ఎమ్మార్వో ఆఫీసుకి వచ్చాం. పాలు, కట్టెలు, గ్యాసు, కూరగాయలు, నిత్యావసరాలు, చికెన్‌, మటన్‌ ఇలా మాకు ఇవ్వాల్సిన అన్నింటిలో అవినీతే జరుగుతుంది. అలాగే పాఠశాల క్వార్టర్స్‌ లో ఉండే టీచర్స్‌ వాళ్ళ ఇళ్లలో పనులు కూడా మాతోనే చేయిస్తారు. వాళ్ల అగ్రకులాల పిల్లలతో అయితే ఇలానే చేయిస్తారా?” అంటూ ఆవేదనతో, ఆగ్రహంతో వివిధ ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలతో ఆ అధ్యాప’కుల’ ముఖాలు కాలిన మసి బొగ్గువలె మారిపోయాయి. తలకాయ కిందికి వేసి నేల చూపులు చూస్తున్నారు. అంతసేపు ఓపికతో విద్యార్థుల సమస్యలు విన్న ఎమ్మెల్యే సిమ్మయ్య జేబులో నుంచి ఫోన్‌ తీసి కలెక్టర్‌ కి, గురుకుల సొసైటీ కార్యదర్శికి, ఫుడ్‌ కాంట్రాక్టర్‌ కి ముగ్గురికి ఫోన్‌ చేసి మాట్లాడాడు.
”ఇక నుంచి ప్రతి నెల స్టూడెంట్‌ ఫెడరేషన్‌ లీడర్స్‌ వచ్చి విద్యార్థులతో మాట్లాడి, ఫుడ్‌ తిని చెక్‌ చేస్తారు. ప్రతి మూడు నెలలకొకసారి నేనొచ్చి ఇక్కడే ఫుడ్‌ తింటాను. ఇక 50 ఏళ్లలోపు ఉన్న ఏ పురుషున్ని కూడా కిచెన్‌లో పెట్టవద్దని, అమ్మాయిల్ని వేధించే నీ వర్కర్‌ ని నాల్గు తన్ని సాయంత్రం ఆఫీసు కు తీసుకురమ్మని, మంచి భోజనం పెట్టాలని, లేదంటే నీ కాంట్రాక్ట్‌ రద్దవుద్దని కాంట్రాక్టర్‌ కి చెప్పాను. వాళ్ళవైపు నుంచి అవి రిపీట్‌ కావు. ఇక అమ్మాయిల్ని లైంగికంగా వేధించే టీచర్స్‌ ని బట్టలూడదీసి టౌన్‌ సెంటర్లో నిలబెట్టిస్తాను. అలాంటి వారెవ్వరూ ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు. విద్యార్థుల్ని తమ ఇళ్లలో పని చేయించుకుంటూ కులం పేరుతో తిట్లపురాణం మొదలుపెట్టే నాగజెముడు ముల్లులాంటి ఆలోచనలున్న పటేలమ్మలు తట్టాబుట్ట సదురుకుని వెళ్ళండి. కాదంటే మీ కులం ముల్లులు అరిగేలా బండకు రాసే మహిళల్ని పంపిస్తా జాగ్రతా” అని సిమ్మయ్య ఘాటుగా హెచ్చరించాడు. స్కూల్‌ పీపుల్‌ లీడర్‌ గా పోరాటాన్ని నడిపిన వివిధలాంటి వారే ఈ సమాజానికి అవసరమని అభినందించాడు.
”మిగతా పాలసీ మ్యాటర్లు నేను అసెంబ్లీలోనే మాట్లాడుతాను. మీరు భయపడకండి” అని చెప్పి అక్కడే పిల్లలతో కూర్చొని భోజనం చేసి వెళ్లారు. రెండు రోజుల్లో గురుకుల సొసైటీ వారొచ్చి సంస్థాగతంగా చేయాల్సిన ఎంక్వైరీ చేసి కొంతమంది టీచర్స్‌ ని ట్రాన్సఫర్‌, మరో ఇద్దరిని సస్పెండ్‌ చేసేవరకు సిమ్మయ్య వదల్లేదు.
***
అయిదేళ్ల తర్వాత ఒకసారి జిల్లాస్థాయి మీటింగ్‌ జరుగుతుంది. ఆ మీటింగ్‌ లో తత్వను కలుసుకోవాలని పున్నమి కోసం వేచియున్న సముద్రంలా ఎదురు చూస్తుంది వివిధ. తత్వ కనిపించగానే నాగార్జునసాగరం గేట్లెత్తితే దునికే కష్ణమ్మవలె పరుగెత్తి అమాంతం తత్వ చేయి అందుకుంది. వివిధను చూసిన తత్వ పుట్టంగండి ఎత్తిపోతలతో ఎగువకు పారిన నీటి స్పర్శతో పులకించిన చెలకలా మురిసిపోయాడు. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. తనతో వచ్చిన మిత్రులంతా తత్వ ఎలా తెలుసని ఆమెనడిగారు.
”తత్వ ఈజ్‌ మై లీడర్‌. ఐ జాయిన్డ్‌ ఇన్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, విత్‌ హిజ్‌ ఇనిస్ప్రెషన్‌ ఓన్లీ” అని చెప్పింది.
”వివిధ ఈజ్‌ ఏ ఫైర్‌ బ్రాండ్‌ అండ్‌ గ్రేట్‌ గర్ల్‌. షీ ఈజ్‌ ఎ నాచురల్‌ ఫైటర్‌” అన్నాడు తత్వ. మీటింగ్‌ మొదలవడానికి కొంచెం సమయం ఉండడంతో అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు.
”నా ఎగ్జామ్స్‌ అయిపోయి రిజల్ట్స్‌ వచ్చాక మా అమ్మతో వచ్చి, నిన్ను కలిసి మాట్లాడాను. మా హోమ్‌ టౌన్‌ లో కాకుండా, అడ్మిషన్‌ ఇప్పిస్తే ఇక్కడే చదువుతానని అడిగాను గుర్తుందా తత్వా? నీవు సీటు ఇప్పించలేదు”
”నేను ప్రయత్నం చేశానో చేయలేదో, లేదా పొట్టకూటి ఇవ్వలేని పట్టాల చదువెందుకనే మూర్ఖత్వంలో అప్పుడు కూరుకుపోయానో గుర్తులేదు వివిధ. ఐయామ్‌ ఎక్స్ట్రీమిలీ సారీ”
”నాకు మీతో కలిసి చదవాలని అనిపించింది నీవల్లే. కానీ చదవలేక నా హోం టౌన్‌కి వెళ్ళింది కూడా నీ వల్లనే” ”మరి ఇప్పుడేం చేస్తున్నావు?”
”మా ఊరు వెళ్ళి డిగ్రీలో జాయిన్‌ అయినప్పటి నుంచి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ లో పనిచేస్తున్నాను. డిగ్రీ పూర్తి చేసి, ఇప్పుడు పీజీ చదువుతున్నాను. అయినా మిమ్మల్నేమీ మర్చిపోలేదు. యువర్‌ ఇన్‌స్పిరేషన్‌్‌ ఆల్వేస్‌ విత్‌ మి తత్వ”
”నేనూ నిన్నేమీ మర్చిపోలేదు. నీలాంటి తెలివి, తెగువ కలిగిన అమ్మాయిలు ఉద్యమానికి అవసరమని ఎంతో గుర్తు చేసుకునేవాణ్ణి. నీ గురుకుల పోరాటాన్ని చాలాసార్లు మన వాళ్ళకి చెప్తుంటాను వివిద.” అంటూ మాట్లాడుకుంటున్నారు. ఒకే కేసులో రెండు వేర్వేరు జైళ్లలో బంధించబడ్డ ఖైదీలు పెరోల్‌ మీద వచ్చి మాట్లాడుకున్నట్టుంది వారి మాటల తీరు. రెండు గుండెల చప్పుడును ఒకటి చేసి వినడం గురించి, రెండు ప్రపంచాల సరిహద్దులను చెరిపి ఒకే సరళరేఖ మీద నడపడం గురించి మాట్లాడుకుంటునే ఉన్నారు మౌనంగా. పూవుల సున్నితత్వపు పుప్పొడి తీరంలో కూర్చొని చర్చించుకుంటున్నారు ధ్యానంగా. గువ్వల్లా రివ్వున ఎగిరే స్వేచ్ఛ కలిగిన కమ్మని జీవితాన్ని కలగంటున్నారు నిశ్శబ్దంగా. కానీ వారి మానవీయ పెదవుల మత్తడి నుంచి ఒక్క తుంపర కూడా బయటికి చిలకడం లేదు. వాళ్లిద్దరూ ఒకే కళ్ళతో చూస్తున్నారు. ఒకే చెవులతో వింటున్నారు. అదేంటో తింటున్నప్పుడు వారి వేర్వేరు ప్లేట్స్‌ ఒకే ప్లేట్‌ లా మారిపోతున్నాయి. అలా మూడు రోజుల మీటింగ్స్‌ మూడు గంటల్లా కనురెప్పల అంచులమీదనే ఖర్చయిపోయాయి. ఇక ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఆ జంట, వీడ్కోలు మాటలేవో మాట్లాడుకోవడానికి అన్నట్టు కాలు, కాలు కదిపి అడుగులో అడుగేస్తూ అలా రోడ్డు వైపు యుద్ధ విరామంలో సైనికుల్లా ఏకాంతంగా నడుస్తున్నారు.
”నీకో విషయం చెప్పాలి వివిధ”
”లేదు నేనే నీకో విషయం చెప్పాలి తత్వ”
”నన్ను చెప్పనివ్వు వివిధ”
”లేదు లేదు అబ్బాయిలే ముందు చెప్పాలా! మేమెందుకు చెప్పకూడదు. నన్ను చెప్పనివ్వు తత్వ” అని మాట్లాడుకుంటూ లోపలికి ఉన్న మీటింగ్‌ హాల్‌ నుంచి రోడ్డు మీదకు అప్పుడే వచ్చామా అన్నట్టు వెనక్కి తిరిగి మీటింగ్‌ హాల్‌ చూస్తుంది వివిధ.
”సరే చెప్పు వివిధ నువ్వే ముందు…” అంటుండగానే పక్కనే చెట్లలో నక్కిన పోలీసులు చటుక్కున తత్వ నోరు మూసి, సర్రున వచ్చిన జీపులో వేసుకుని మెరుపు వేగంతో, గద్దొచ్చి కోడిపిల్లను తన్నుకపోయినట్టు ఎత్తుకెళ్లిపోయారు. ”తత్వ తత్వ తత్వా….” అని అరుస్తూ ఆ జీపు వెనుకాల పరుగెడుతోంది వివిధ..

– ఎం. విప్లవకుమార్‌, 9515225658

]]>
అగ్రిమెంట్‌ https://navatelangana.com/agreement/ Sat, 23 Mar 2024 17:20:15 +0000 https://navatelangana.com/?p=255219 అగ్రిమెంట్‌ఒకప్పుడు అది వెలివాడైనా, నేడు నాగరికత నవనిర్మాణ సౌదాలకు వేలాడదీసిన దిష్టిబొమ్మలాగా నగర నడిబొడ్డున బొడ్రాయి వేసుకుంది ఐదు పదుల ప్రాయాన్ని మోస్తున్న పేదలవాడ.
అర్ధాకలితో పేగులను ముడి వేసుకొని జయ అమ్మ నాయనలు ఆడపిల్లకు చదివెందుకని పలువురు పలువరించినా, అవేవీ పట్టించుకోకుండా నేటి అంటరాని ఈ ఆడపిల్లే రేపు వెలువాడల వేగుచుక్క కాగలదని కాలజ్ఞానాన్ని నమ్మి ముందడుగు వేశారు జయ తల్లిదండ్రులు. వారిచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అందరిలో అణచబడుతున్నా, గోడకు బలంగా కొట్టిన బంతి లెక్క వేగం పుంజుకుని జీవితాన్ని నిలదొక్కుకుంది జయ.
నాగరికత నడుముకు చుట్టుకున్నట్టు జీన్‌ ప్యాంట్‌ వేసి, జేబులో ఒక డబ్బా సెల్లు వేసి చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని పాటలు వింటూ తల అటూఇటూ పంపిస్తూ నడుస్తున్న పెద్ద మేతరి వీరయ్య కొడుకు నారయ్య జబ్బకు డప్పు తగిలించి, ఏడో తరగతిలోనే చదువును చంకదించి ఎత్తి అవతలపడేసి నవతరపు నాజోకులు తలకెత్తుకుని డడ్డనక….డం….డడ్డనక డం….డం… అంటూ చిటికెన పుల్ల డప్పు పై దరువులు వేస్తుంటే ”ఇన్నో లేవలో… ఇననో ల్లేవలో…. అందరూ ఇనుడ్లీ…. వచ్చే ఆదివారం నాడు వండకదిన పోవాలని గూడెం పెద్దలు చెప్పిండ్లుళ్ళో…. రానోళ్లను కులముల కెళ్ళి ఎలేత్తరాటుళ్ళో…. డడ్డనక…. నకా..నకా… డడ్డనకా నకా…నకా…” డప్పు ముగిస్తూ వెళ్తున్నాడు నారయ్య.
అప్పుడే పాల బాటిల్‌ పట్టుకొని విజయవాడలో ఇంటికి వచ్చిన నాగేష్‌ ”అక్కా మీరు ఎల్లుండి వండక తిన వస్తలేరా…!” అన్నాడు పాల బాటిల్‌ జయ చేతికి అందిస్తూ.
”వంటలకు అప్పుడే పోయినాము కదా తమ్మి, మళ్ళీ వంటలకు వెళ్లడం దేనికి” అంది జయ ఖాళీ బాటిల్‌ నగేష్‌ చేతికి అందిస్తూ.
”గదేందక్క ఏం తెలవనట్టు గట్ల అనబడితివి, రాత్రి నారిగాడు డప్పుసాటింపు ఏసిండు కదా వినలేదా” అన్నాడు ఆశ్చర్యంగా.
”అదే తమ్మి నాకు అర్థం కాకనే నిన్ను అడుగుతున్నా. ఎందుకు అంది” రెట్టింపుగా జయ.
”అదే అక్క.. నిన్న మన కులపు పెద్ద మేతర్లందరూ పంతులు గారి తానికి పోయిండ్రు. పంతులుగారు ఊరికి కీడు వచ్చిందని చెప్పిందట” అన్నాడు నాగేష్‌.
”కీడేంటి తమ్మి” అంది ప్రశ్నార్థకంగా జయ.
”అరే అక్క గింత సదువు సదువుకున్నవు…. నీకు కీడు అంటే ఏందో తెలవదా….!” అని తల గోక్కుంటూ ”అరె అక్క గీ మజ్జల మన గూడెంలో ఎంతమంది సచ్చిపోయిండ్లో నీకు ఎరుకైతలేదా… పడుచు పడుచు పోరగాండ్లు ఎందరు పీనిగలెళ్లినరు. గా… రాణి గాడు సచ్చి నెల కూడా ఎళ్ళకముందే గాని నాయన సచ్చి గా… ఇంట్లోనే రొండు సావులయినరు. అరే ఏం తెలవనట్టు గట్లడుగుతున్న వేందక్కా…” అన్నాడు ఒకింత ఆశ్చర్యంగా ముఖం పెట్టి.
”హా తెలుసు. అయితే ఏంటి? ఊరన్నాక జనాలు ఉండరా, జనాలన్నాక చచ్చిపోరా… తమ్మి?” అంది జయ నాగేష్‌ వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ.
”యే… ఏమో… పో….అక్క. మీ సదువుకున్నోళ్లతోని మేమేడ మాట్లాడలేత్తం కానీ.. ఎల్లుండి అయితే అందరి తోటి వండక తిననైతే రాండ్లీ… నలుగురితోటి నారాయణ. కులం తోటి గోవింద అనాలి కదా అక్క…. అందరం పోతున్నాం, మీ ఒక్క ఇల్లు రాకుంటే మిమ్ములను కులం నుంచి ఎలేత్తరు. ఓ… జయక్క యాది మరువకు…!” అనుకుంటూ వెళ్లిపోయాడు నాగేష్‌.
‘ఇంకెప్పుడు మారుతారు వీళ్ళు’ అని మనసులోనే ఒక నిట్టూర్పు తీసి ఇంటి పనిలో నిమగం అయ్యింది జయ.
ఉదయాన్నే వాకిలి ఊడుస్తున్న జయను చూసి ”వాకిలి ఊడ్వొద్దు జయా… తొందరగా బయటికి ఎళ్లు అందరూ ఎళ్లిపోయిండ్రు… మీ అన్న కోడిని తెత్తనని పోయి అటే పోయిండు. ఇంత పొద్దు ఎక్కింది జల్దిన రాండ్లీ….” అనుకుంటూ వంట సామాన్లు సరిదిన గంప నెత్తుకుని వెళుతుంది జయకు వదిన వరుస అయ్యే రాజమణి.
వంటలకు వెళ్లి వచ్చిన తెల్లవారి గూడెం నడిబొడ్డున సవర్లచ్చమ్మ గుడి దగ్గర శాంతి పూజకు ఏర్పాట్లు చేశారు కుల పెద్దలు. స్కూలుకి వెళ్లడానికి హడావిడిగా తయారవుతుంది జయ.
”బావా ఓ బావా…” అంటూ పెద్ద మేతరి చిన్న కొడుకు శ్రీనుతో పాటు ఇంకా ఇద్దరు యువకులు వచ్చారు. న్యూస్‌ పేపర్‌ చదువుతున్న స్వామి వెళ్లి గేటు తీసి ”ఏందో శ్రీను దారితప్పి వచ్చినవు” అన్నాడు నవ్వుతూ.
‘ ‘ఏ…. గట్లంటవేంది బావా…” అంటూ ఒక వెకిలి నవ్వు విసిరాడు శ్రీను. ”అది కాదోరు… పండగ మామూళ్లకో… వినాయకుని చందాలకో… తప్ప ఇంకెప్పుడూ ఇటుపక్క కనబడవు కదా… ఇప్పుడు పండుగలు ఏమీ లేవు కదా. మబ్బు లేని వానలా ఏదో పని లేనిదే నువ్వు రావు కదా….” అన్నాడు స్వామి చనువుగా.
‘యే….నీ పరాషికానికేంది కానీ… మా అక్క ఏం చేస్తుంది బావా నౌకరికి పోయిందా ఏంది ఇంత పొద్దుగాలనే…” అన్నాడు శ్రీను ఇంట్లోకి తొంగి చూస్తూ.
‘పోలేదు పోలేదు.. తయారవుతుంది” అంటూనే ”జయా… మీ తమ్ముళ్లు వచ్చారు టీ తీసుకురా” అంటూ కేక వేశాడు స్వామి.
”ఒద్దొద్దు బావా… ఇప్పుడు అంత టైం లేదుగానీ జల్దిన నువ్వూ, అక్క్కా సవర్లచమ్మ గుడి కాడికి రండి. అక్కడ గూడెం గూడెం పూజలు చేస్తుంటే మీరేంది ఇంట్లోకి వెళ్లి బయటికి రావట్లేదు నిన్న సుత వండక తిన రాలేదు. నీ మీద అందరూ గరం గరంగా ఉన్నరు. ఊరికి కీడు వచ్చిందంటే ఇంత బుగులు లేదు.. ఎంత చెప్పినా చెవి మీద పేను బారట్లేదు మీకు…” అంటూ గొంతులో ఆవేశాన్ని నింపుకున్నాడు శ్రీను.
”కీడు లేదు ఏం లేదు మేం అలాంటివి నమ్మం” అన్నాడు స్వామి తెగేసినట్టు. ”అయితే మిమ్ములను పెద్ద మేతర్లు పిలుసుకొని రమ్మన్నారు. ఆడికి వచ్చి మాట్లాడండి” అన్నాడు శ్రీను కొంచెం దవాయింపుగా. ”మేమెందుకు వస్తామోయి మేం రాం…” అన్నాడు స్వామి లోపల నుండి తన్నుకొస్తున్న ఆవేశాన్ని తమయించుకుంటూ.
‘అయితే గూడెంలో ఇల్లు ఎందుకు పట్టుకున్నారు అన్నాడు” శ్రీను ఆవేశంగా.
”అంటే ఈ ఊరేమన్నా మీరు కొనిపెట్టిండ్రా” అన్నాడు స్వామి కోపంగా.
”మీ రాగండి” అంటూ బయటకు వచ్చిన జయ ”మనం అందరిలోకి వెళ్లి మాట్లాడుదాం రండి…” అంది కాళ్లకు చెప్పులేసుకుంటూ.
అందరూ కలిసి జనాల మధ్యలోకి వెళ్లారు. టెంట్‌ కింద హోమం ముందు మంత్రాలు చదువుతూ పంతులు, హోమం చుట్టూ ముందు వరుసలో పెద్దమనుషులు, వారి వెనుక వరుసలో మిగిలిన పురుషులు, ఆఖరి వరుసలో ఆడవాళ్లు, పిల్లలు కూర్చొని ఉన్నారు. జయ, స్వామిను చూడగానే అక్కడున్నవాళ్లు ”రండి రండి నాయన రండి…. ఇప్పటికే ఆలస్యం అయ్యింది పూజ కూడా అయిపోయింది. మీరు పూజలో కూర్చొని ఉంటే మీ మీద ఉన్న కీడు తొలిగిపోయేది కదమ్మా….” అన్నాడు పంతులు జయ వైపు చూస్తూ ఒక కింత విసుగ్గా.
‘ఇప్పుడు ఇక్కడ పూజలో కూర్చున్న వారందరి మీద కీడు తొలిగిపోయినట్టే నా పంతులుగారు” అన్నాడు స్వామి నిష్ఠురంగ.
”అంతేగా….” అన్నాడు పంతులు కుల పెద్దల వంక ఒరగంట చూస్తూ. ”అంతే…. అంతే…. మరి పంతులు ఎట్లా చెప్పితే అట్లనే. ఇప్పుడు గూడెంలో ఉన్న అందరం వంటలకు పోయినం. పూజలో కూకున్నం… మీ ఒక్క ఇంటోల్లే రాలేదు. మీ కీడు పోలేదు ఇప్పుడు ఎట్లా…. ఊరంతా ఓ దారైతే చదువుకున్నమని చెప్పి మీదో దారాయే… అందుకని మిమ్ములను పంచాయతీలకు గుంజినం” అన్నాడు పెద్ద మేతరి అందరు వైపు చూస్తూ.
”అయితే ఏంది ఇప్పుడు? మేం రాకపోతే మా కీడు మాతోనే ఉంటుంది కదా. మీకు కీడు అయితే పోయింది కదా. మరి మళ్లీ పంచాయతీ ఏముంది” అంది అందరి వైపు తిరిగి చూస్తూ.
”పంచాయతీ ఎందుకంటే ఎట్లా అక్క. మీ కీడు మీతోనే ఉంటే మాకెందుకు బాధ మీ కీడంతా మల్ల ఊరందరి మీద పడితే ఏం చేయాలి? కులం కట్టడి అంటే కట్టడి మీదనే ఉండాలె కదా… ఇంటికి రొండు వెయ్యిల రూపాయలు జమ చేసి శాంతి పూజలు చేయించిందంతా మీరు చేయబట్టే అంతా ఉత్తదే అయింది. మిమ్ములను కులం నుంచి ఎలేసుడే ఇంకా ఆగేదే లేదు…” అన్నాడు గుక్క తిప్పుకోకుండా శ్రీను.
”ఎట్టెట్టా…. మేం పూజలో పాల్గొనకపోతే మా కీడు మీ మీద పడుతుందా? మరి మొత్తం ఊరంతా వంటలకు గాని, పూజకు గాని రాలేదుగా. మరి ఊరందరినీ ఊరు నుండి వేలేస్తారా…!” అన్నాడు స్వామి తనను తాను తమాయించుకుంటూ.
”అరే…. గట్టెట్ట బావా…. ఊరందరి ముచ్చట మనకెందుకు. మన గూడెంలో మన కులపోళ్లకే కీడు..” అన్నాడు ప్రపంచంలోని విషయాలన్నీ తనకే తెలుసు అనుకునే ఎంకటి.
”కేవలం మన మాదిగ కులం వాళ్లు, మన గూడెం వరకే ఎందుకుంటుంది కీడు? మన గూడెంలో వేరే కులం వాళ్లు కూడా ఇల్లు కట్టుకొని ఉంటున్నారుగా. మరి వాళ్లు కూడా ఈ ఊరిలో భాగమే కదా…” అంది జయ విస్మయంగ.
”మన గూడెంలోనే నెలకొక్కడు పిట్టలోలే లేచిపోతుండ్రు. ఇంకా పదిమంది దాంక మంచాన పడ్డారు అప్పుడు ఇప్పుడు అన్నట్టుగా ఉన్నాయి వాళ్ల ప్రాణాలు. మీకేమో మా బాధలు చాదస్తంగా కనబడుతున్నాయి. ఎంత చదువుకున్నోళ్లు అయితే మాత్రం గింత అద్వానంగా వాదిస్తుండ్రేంది బిడ్డ” అన్నాడు పెద్ద మేతరి ఒకంత విచారంగా.
”మేం చదువుకున్న వాళ్ళం కాబట్టే వాస్తవాలు మాట్లాడుతున్నాం బాబారు” అంది జయ అందరి వైపు పరికించి చూస్తూ.
”ఏం వాస్తవమో ఏందో. అందరూ మీరు చెప్పింది వినాలంటే ఎవ్వరూ వినరిక్కడ. మేం కులమంతా ఒక్క కట్టడిగా ఉంటే మీరేమో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు” అన్నాడు ఎంకటి ముఖం కందగడ్డల మార్చుకుని.
”ఇష్టం వచ్చినట్టు కాదు, మేం చెప్పేది నిజం…! నిజం మాత్రమే చెపుతున్నాం. చనిపోయిన వాళ్లంతా యువకులు నడీడు వాళ్లే. మేం కాదనడం లేదు, కానీ… ఎలా చనిపోయారు…. ఎందుకు చనిపోయారు…. అనేది మాత్రం మీరు ఆలోచించరు. వారందరూ చనిపోయింది మీరు నమ్ముతున్న కీడు వల్ల మాత్రం కాదు” అంటూ ఒక్క నిమిషం ఆగింది జయ.
‘కీడు కాక మరేంటి’ అన్నట్టు గుర్రుగా చూస్తున్నారు అందరు.
చనిపోయిన వారందరిలో వివిధ రకాల జబ్బుల వల్ల కొందరు, రాత్రింబవళ్లు తేడా లేకుండా సారాయి తాగి టైం కు తిండి తినకుండా బీడీ, సిగరెట్‌, పాన్‌ పరాక్‌, గుట్కాలు తింటుంటే ఆరోగ్యాలు పాడుగాక మరేం అవుతుంది. ఒంట్లో కొంచెం సుస్తీ చేయగానే హాస్పిటల్‌కి వెళ్లి డాక్టర్కు చూపించుకోకుండా ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించే వరకు చేతబడులని, మంత్రాలని, తాయత్తులని బాగు చేయించుకోవడం, తిప్పి పోయాడాలు, వన భోజనాలు, శాంతి పూజలు, హోమాలు అంటూ మూఢనమ్మకాల ముసుగులో మునిగిపోతుంటే మనుషుల ఆరోగ్యాలు క్షీణించి పోక బాగుపడతారా…! నేను, నా భర్త ఎన్నిసార్లు మిమ్మల్ని చైతన్యం చేయాలని చూసినా మా మాట వినకపోగా పైపెచ్చు మమ్మల్ని శత్రువులుగా చూస్తూ, అవకాశం దొరికితే మా మీద లేనిపోనివి మోపి గొడవలు చేసి రివేంజ్లు తీర్చుకోవాలని ఎన్ని సార్లు చూడలేదు? మీరెన్ని కుట్రలు చేసినా మీ అమాయకత్వాల్ని చూసి జాలిపడ్డాం కానీ ఇకమీదట మీ మూఢనమ్మకాలు, కట్టుబాట్లు మా మీద రుద్దితే మిమ్మల్ని సమర్థించేదే లేదు….” అంది జయ తెగేసినట్లు.
‘యేహే.. గాళ్లతోటి ముచ్చటేంది?’ అంటూనే ”ఇగో సామి.. మీరు మా మాట లెక్క చేయట్లేదు. మీ కర్మ మీరే అనుభవిస్తారు. వారం తిరగకుండానే మీకే ఏదైనా కీడు జరుగుద్ది. అప్పుడు మీరే ఏడుస్తరు’ అన్నాడు ఇంకులు పూజారి వైపు ఓరగంట చూస్తూ.
”కీడు జరగవచ్చు అని నిమ్మలంగా అంటావేంది నాయనా.. తప్పకుండా జరుగుద్ది…” అన్నాడు వెకిలిగా నవ్వుతూ పూజారి.
”అదేం జరగదు. మేం అదేం నమ్మం. ఒకవేళ జరిగితే అది ప్రమాదం, అనారోగ్యం వల్లనో అనుకుంటాం తప్ప మీరు అనుకుంటున్న కీడు వల్ల కాదు…” అన్నారు స్వామి దంపతులిద్దరూ ఒక్కసారే. మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం. మానవుడు అంబరాన్ని చుంబిస్తూ చంద్రమండలాన్ని చుట్టేసి వస్తున్నాడు. కంప్యూటర్‌ యుగంలో ఉండి మూఢనమ్మకాలతో ముందుకు పోకుండా తిరోగమనం పాలు కావడం కడుసోచనీయం. సైన్స్‌ ఎంతో అభివృద్ధి అయింది. ఆధునిక వైద్య పరికరాలతో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలతో వైద్యం అందుబాటులో ఉంది. అయినా మీరు ఈ మూఢనమ్మకాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అనవసరమైన వాటికి అధిక ఖర్చులు పెట్టి, అప్పుల్లో కూరుకొని, ఉన్న ఇల్లు వాకిళ్ళను కూడా అమ్ముకొని నిలువ నీడ లేకుండా చేసుకుంటున్నారు..” అంది బాధతో కూడిన ఆవేశంతో జయ.
”ఓ… జయమ్మా.. నీ ఇంట్లో వారం తిరగకుండనే ఏదో ఒక చెడు జరిగితే నీకు అప్పుడు తెలుస్తది. గ్యారెంటీగా జరుగుద్ది నేను అగ్రిమెంట్‌ రాసిస్త. మీ ఇంట్లో కీడు జరగకపోతే ముక్కు నేలకు రాస్త. మరి కీడు జరిగితే నేను చెప్పినట్టు ఈ ఊరు మా గూడెం వదిలిపెట్టి పోతారా…” అన్నాడు ఎంకటి కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ రోషంగా.
”ఊరు వదిలిపెట్టి పోవాలా…” అంటూ వారి అమాయకత్వపు మాటలకు లోలోపలే నవ్వుకుంటూ, ”సరే ఎంకటి నువ్వు చెప్పినట్టే వింటాం. కానీ మరి మన గూడెంలో మా ఇంట్లో తప్ప ఇంకెవరికి ఏ కీడు జరగదుగా…” అన్నాడు స్వామి చిరునవ్వుతో.
”జరగదు గాక జరగదు. మేం పంతులు చెప్పినట్టు వంటలకు పోయినం, శాంతి పూజలు చేయించి కీడంతా పోగొట్టుకున్నం” అన్నాడు శ్రీను ఒకింత గర్వంగా.
”అయితే మా ఇంట్లో తప్ప మీ అందరి ఇండ్లలో ఎవరింట్లోనైనా ఎలాంటి చెడైనా జరిగితే…” అంది ప్రశ్నార్ధకంగా శ్రీను వైపు చూస్తూ జయ.
”ఏంది అక్క అడ్డంగా వాదిస్తున్నవ్‌… అగ్రిమెంట్‌ రాస్తే ఓడిపోయి ఊరి నుండి వెళ్ళిపోవాలని భయపడుతున్నావా..” అన్నాడు శ్రీను గర్వంగా చూస్తూ. ”అదేం లేదు శ్రీను. మేం ఓడిపోతే మేమే ఊరును విడిచి వెళ్ళిపోతాం. కానీ మీరు ఓడిపోతే మేం ఏది చెప్పినా వింటారా…” అన్నాడు స్వామి నిచ్చలమైన చూపులు అందరి వైపు సారిస్తూ.
”మీ మాట అంటే మమ్ములందరిని ఊళ్ళో కెళ్ళి వెళ్ళగొడతారా ఏంది…” అన్నాడు పెద్ద మేతరి అనుమానంగా. అనుమానం ఎందుకు చిన్నాయనా. వాళ్లే ఓడిపోయి ఊరిడిసి వెళ్లిపోతరు. మనం పంతులు చెప్పినట్టు అన్ని చేసినం కదా, మనకు భయం ఎందుకు” అంటూ ‘ప్రతిరోజు వీళ్ళు ఊరిని ఉద్ధరించే మాటలు మనకు చెపుతారు’ అంటూ చిన్నగా పెద్ద మేతరి చెవిలో ఊదాడు ఎంకటి.
అయితే అగ్రిమెంట్‌ రాసుకుందాం అని, వారం టైంలో ఇంట్లో ఏదైనా కీడు జరిగితే జయ కుటుంబం ఊరు వదిలిపోయేటట్టుగా, అలా కాకుండా, గూడెంలో ఎవరికైనా ఏమైనా జరిగితే జయ చెప్పినట్లు గూడెం వాళ్ళు వినాలని అగ్రిమెంట్‌ రాసుకున్నారు.
ఈ వారం రోజులు గడిస్తే జయ దంపతులను ఊరి నుండి వెళ్లగొట్టే శుభ ఘడియల కోసం తహతలాడుతున్నారు గూడెం వాళ్ళు. ఈ విధంగానైనా తన వాళ్లలో మూఢత్వాన్ని పారద్రోలి వారి బతుకులు బాగు చేయాలనే తపనతో జయ దంపతుల ఆలోచనలతో రెండు రోజులు గడిచాయి. మూడవరోజు అర్ధరాత్రి ఒక్కసారిగా కుక్కలు మొరుగుతున్నాయి. ఏడుపులు పెడ బొబ్బలు వినపడుతున్నాయి. గూడెం నడిబొడ్డున ఉన్న పెద్ద మేతరి కొడుకు ఉపేందర్‌ చనిపోయాడు. మద్యం తాగి తాగి సరైన భోజనం చేయక టీబీ బారిన పడి, లోపల అవయవాలన్నీ దెబ్బతిని ఎముకల గూడుగా మారిన ఉపేందర్‌ బతుకుకో భరోసా ఇచ్చాడు పంతులు శాంతి పూజతో.
తెల్లవారి అంతిమ సంస్కారాలు ముగించుకొని అందరూ ఇళ్లకు చేరకముందే మైసయ్య కోడలు చంద్రమ్మ చనిపోయిందని వార్త విన్న గూడెం వారందరూ దు:ఖ సముద్రంలో మునిగిపోయారు. ఇద్దరి ఇళ్లల్లో దశదినకర్మలు అయిపోయే వరకు జయ దంపతులు వారికి సహాయ సహకారాలు అందించారు.
”జయా… ఇదేంది బిడ్డా…. ఇట్లయింది… ఇన్ని పైసలు ఖర్చు పెట్టుకుని పంతులు చెప్పినట్టు చేసినం” అంటూ తల పట్టుకున్నాడు పెద్ద మేతరి.
”ఇప్పటికైనా మేం చెప్పినట్టు వినండి మామ..” అన్నాడు స్వామి అనునయంగ. ”ఏం చేయాలో చెప్పండి బిడ్డ” అన్నాడు నిస్సత్తుగా పెద్ద మేతరి. ”ఈరోజు సాయంత్రం చిన్నా పెద్ద అందర్నీ మన గూడెం నడిబొడ్డున జమ చేయండి” అంది జయ.
”గట్లనే బిడ్డ” అంటూ ”శీను…. ఓరి శీను… ఇటు రారా…” అంటూ శ్రీను అని పిలిచి ”ఇల్లులు తిరిగి అందరిని పొద్దుగూకంగా సవర్లచ్చమ్మ దగ్గరికి ఇంటిల్లాదులు పిల్ల మేకతో రావాలని చెప్పి రాపో…” అంటూ హుకుం జారీ చేశాడు పెద్ద మేతరి.
అనుకున్నట్టుగానే అగ్రిమెంట్‌ పేపర్లతో గూడెం పెద్దలు, జయ దంపతులు గూడెంలోని జనం చిన్న పెద్ద ఒక దగ్గర జమ కాగానే… ”మీరందరూ నాకు ఆత్మీయులు. మీలో మార్పు తీసుకురావాలని మేం ఎంతో తపనతో ఇక్కడే ఇల్లు కట్టుకొని సమాజంలో మనం కూడా ఒకరం, మనం కూడా గౌరవంగా జీవించాలని తెలిపి, మిమ్మల్ని మార్చాలని కంకణం కట్టుకున్నాం… కానీ మీరందరూ మొండిగా వాదిస్తూ వచ్చారు.. ఇకనైనా మేం చెప్పినట్లు వింటారని ఆశిస్తున్నాం” అంటూ అందరి వైపు ఒకసారి చూపులు మళ్ళించింది జయ.
జయ మాటలు వినకుండా అడుగడుగునా వాళ్లను అవమానించినందుకు సిగ్గుతో నేలను తాకుతున్నాయి కొందరి చూపులు. అందర్నీ ఊరి నుండి ఎక్కడ వెళ్ళగొట్టిస్తుందో అని కొందరు భయంతో చూపులను పక్కకు పక్కకు తిప్పుకుంటున్నారు.
”మనం రాసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం నేను ఏది చెప్పినా మీరు కాదనకూడదు. మేం మూఢనమ్మకాలతో కాలం గడపవద్దని ఎంత చెప్పినా వినకుండా మీకు నచ్చినట్టు మీరు చేశారు. కానీ ఇప్పుడు మేుం చెప్పినట్టు మీరు వినాలి. విని తీరాలంతే…. లేకపోతే ఊరుకునేదే లేదు…” అంది ఆవేశంగా జయ.
”సరే జయ.. మమ్ములందరినీ ఏం చేస్తావో చెయ్యి. ఇప్పుడు పట్టు నీ చేతులున్నది” అంది విస్మయంగా పెద్దమేతర భార్య ఎల్లమ్మ.
”రేపు ఉదయం 8 గంటలకల్లా మన గూడెంలోని ఆడ,మగ పిల్లలందరినీ తయారుచేసి ఉంచండి. కొత్త బట్టలు కావలసిన అవసరం లేదు. శుభ్రంగా ఉతికిన బట్టలు వేయండి. మనం ఉన్నంతలోని శుభ్రంగా ఉంటూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సమాజంతో పాటు మనం ముందుకు పోవాలి. ఇక ఈరోజు నుండే అందరూ తాగుడు మానేసి వారి వారి పనులు సవ్యంగా చేసుకోవాలి” అంది జయ బాధ్యతగ.
అనుకున్నట్టుగానే పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారికి ఉచిత పుస్తకాలు స్కూల్‌ యూనిఫామ్‌ ఇప్పించింది జయ. చదువు మధ్యలో ఆపేసిన పిల్లల్ని కూడా మళ్లీ రీ అడ్మిషన్‌ ఇప్పించింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారందరినీ ప్రభుత్వ వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించింది. మూడు నాలుగు సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేర్పించింది. ఆడ మగ తేడా లేకుండా అందరూ పని చేసుకుని డబ్బులు సంపాదించి వాటిని పొదుపు చేసుకొని సమాజంలో గౌరవంగా జీవించాలని మార్గదర్శనం చేసింది జయం.
వీధిలైట్ల కిందికి అందరిని పిలుచుకొని రాత్రి సమయంలో పిల్లలకు, పెద్దలకు పుస్తకాలలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించడం మొదలుపెట్టింది జయ.
”చదువుకుంటేనే మన బతుకులు బాగుపడతాయని మీరు ఎంత చెప్పినా అప్పుడు వినలేదు. అజ్ఞానంతో పూర్తిగా మూసుకుపోయిన మా కళ్ళు ఇప్పుడు తెరుచుకున్నాయి. ఇప్పటి సంది మీరెట్ల సెప్పితే అట్లనే ఇంటమ్‌..” అంటూ స్వామి వైపు ప్రేమగా చూసాడు ఎంకటి.
”అవును… అవున”ంటూ మూకుమ్మడిగా గొంతు కలిపారు అందరూ.
”దూరపు కొండలు నునుపెక్కువని, దగ్గర ఉంటే దొగ్గలి కూరకు గొరగారని ఊకెనే అనలేదు పెద్దళ్ళు…. మన గూడెంలో మనతోపాటుగా కూలీనాలీ చేసి ఆడపిల్లల్ని సక్కగ సదివించుకున్నరు జయ వాళ్ళ అమ్మానాయనలు. అయినా వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించలేదు. వాళ్ళ పిల్లలు మన కండ్ల ముందే ఎదిగి మనకు మంచి సెయ్యాలని ఎన్ని ఏండ్ల సంది తాపత్ర పడుతున్నరు.
అయినా మనం వాళ్ళ మాటలను ఇనకుంట వాళ్ళని ఎన్నోసార్లు బాధపెట్టినం. ఇప్పటి సందైనా వాళ్ళ మాట అందరం ఇందాం …!” అంటూ అందరి వైపు చూపులు సారించాడు పెద్ద మేతరి.
”ఇప్పటికైనా మీలో మార్పు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన బ్రతుకులు మారాలంటే చదువు చాలా అవసరం. విద్య వలన విజ్ఞానం పెరిగి మంచికి చెడుకు తేడా చూపిస్తుంది. విలువలతో జీవించడం సాధ్యమవుతుంది. అందుకు అందరూ వారి పిల్లలను చదివించాలి, మన చీకటి బ్రతుకుల్లో విద్యా దీపాన్ని వెలిగించుకొని అంతరాలన్నింటినీ ఎదుర్కొంటూ విజయం వైపు అడుగులు వేయాలి. కాలంతోపాటు మనం ముందుకు సాగిపోతూ మన భావితరాలకైనా మంచి భవిష్యత్తు అందించాలి…” అంటూ చిన్నారులందరినీ దగ్గరికి తీసుకుంది జయ.
”ఇప్పటి సంది తాగుడు బంద్‌ చేస్తం పిల్లల్ని చదివించుకుంటం… సోమరితనం మానేసి కష్టపడి పనిచేసి, మూఢనమ్మకాలతో అడ్డగోలు ఖర్చులు పెట్టకుండా పొదుపు చేసుకుని మా జీవితాలను మీరు కోరుకున్న విధంగా అందరికీ ఆదర్శంగా నిలుపుకుంటాం అక్క…” అంటూ తన చేతిలోనే అగ్రిమెంట్ను చింపి పారేశాడు శ్రీను.
పిల్లల కేరింతలు పెద్దల ఆనంద హేళల మధ్య అక్కడి వాతావరణం వెల్లివిరిసింది. జయ కళ్ళలో ఆనందభాష్పాలు నిండుకుండలా నిండుకొని జలజల జలపాతంలా పుడమి తల్లిని హత్తుకున్నాయి.
– డా|| తాళ్ళపల్లి యాకమ్మ, 9704226681

]]>
ఎల్లమ్మ చెట్టు https://navatelangana.com/ellama-tree/ Sun, 17 Mar 2024 01:56:51 +0000 https://navatelangana.com/?p=250682 మా ఇంటి వెనకాల మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. దాన్ని మేం దుబ్బ చేను అంటాం. దాని కింది భాగంలో ఒక బావి ఉంది. ఆ బావి పక్కన ఒక గిన్నె చెట్టు, మేడిచెట్టు ఉన్నాయి. బాయి గడ్డ మీద వామన గుంటలు తీశాం. అప్పుడప్పుడూ నేను, అన్నయ్య వామన గుంటలు ఆడతాం. మేడి, గిన్నె పండ్లు పండినప్పుడు రాలుపుకొని తింటాం. మా స్నేహితులకు కూడా పెడతాం. దుబ్బు చేనుకు, మా ఇంటికి మధ్య పెద్ద వేప చెట్టు ఉంది. దాన్ని మా తాత, పెళ్ళయిన కొత్తలో, తనకు ఇచ్చిన నూటా ఇరవై రూపాయల కట్నంతో గుర్తుగా ఆ భూమి కొనగానే వేశాడట. దాని కింద ఎల్లమ్మ గుడి ఉంది. అందుకే దాన్ని, ఎల్లమ్మ చెట్టు అంటుంటాం. మా తాత కాలంలోనే ఎల్లమ్మ గుడిని నిలిపారట. చుట్టూ నాలుగు బండలు, మధ్యలో ఒక రాయి పెట్టి, ఆ రాయే ఎల్లమ్మ తల్లి అని చెప్పారు. నాకు నమ్మాలనిపించలేదు. ఎందుకంటే దేవత అంటే, కాళ్లు చేతులు తల ఉండాలి కదా! అదేమీ లేకుండా ఉట్టిదే ఒక రాయి పెట్టి దానినే ఎల్లమ్మ అంటుంటారు. జనమంతా నమ్ముతుంటారు. ప్రతి ఏడాది ఎల్లమ్మ తల్లికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి, బోనం చెల్లిస్తారు. ఆ చిన్న గుడికి సున్నం వెయ్యమంటే తాటి మట్టను మూరెడు నరికి, మెత్తగా దంచి భ్రష్‌ లా చేసి నేనే సున్నం వేస్తాను. అప్పుడప్పుడు తాతయ్య మంచం తీసుకుని వెళ్లి వేప చెట్టు కింద వేసుకొని పడుకుంటాడు. ఎందుకలా అంటే, ”మీ నాయనమ్మ చెప్పింది రా. వేప చెట్టు గాలి చాలా మంచిదట ఆరోగ్యానికి. టి.బి., కేన్సర్లను రానీయ దంట అందుకే ఇక్కడ రోజు కొద్దిసేపు..” అనేవాడు.
ప్రతి ఏడాది శ్రావణమాసంలో ఆ దేవతకు పెట్టుకుంటాం. అంతేకాదు, పంట తయారు కాగానే నాన్న ఒక కోడిపుంజును కోసి, ఆ కోడి నెత్తురును పొలం మీద చల్లుతాడు. దాని తలకాయ, కాళ్ళని వేప చెట్టుకు కడతాం. మా పిల్లి వెళ్లి ఆ తలకాయ కాళ్ళని శుభ్రంగా భోంచేస్తుంది. ఎల్లమ్మ తల్లి అంటే మా చుట్టుపక్కల పొలాల వాళ్ళకి కూడా ఎంతో భక్తి . వాళ్లూ కోళ్ళను కోస్తారు. అందు వల్ల దిగుబడి బాగా వస్తుందని రైతుల నమ్మకం. ఆ ఎల్లమ్మ చెట్టు మీద కాకులు కొంగలు, గోరువంకలు అనేకం గూళ్లు కట్టుకొని కాపురాలు చేస్తుంటాయి. ప్రతి రోజూ తెల్లవారుజామున ఆ చెట్టు మీద నుంచి కాకులు కావు… కావు… మని గోలగోలగా అరుస్తుంటాయి. వాటి అరుపులతో మా బజారు వాళ్ళంతా మేలుకుని, ఆడవాళ్ళు ఊకి చల్లడం, మగవాళ్ళు పొలానికి పోవడం చేస్తుంటారు. సాయంత్రం కాస్త మసక చీకటి కమ్మే వేళకు ఎక్కడెక్కడో తిరిగిన పక్షులన్నీ ఆ చెట్టు మీదకు చేరుకుంటాయి. అవి గోలగోలగా అరుస్తూ పోట్లాడుకుంటుంటాయి. నాకైతే, వాటి అరుపులకు మెలకువ వచ్చి చిరాకేస్తుంది. ”ఇంకా ఎంత సేపు పడుకుంటావురా. లేచి చదువుకో” అని తాతయ్య అదిలింపులు మొదలవుతాయి. ఇంక లేవక తప్పదని, లేస్తాను పక్క మీద నుంచి. నిద్ర కళ్ళతోనే పుస్తకం పడతాను.
చాలా సార్లు మా పిల్లి రహస్యంగా వేప చెట్టు ఎక్కి, దాని మీద వాలే పిట్టల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసింది. ఎప్పుడూ దొరక లేదు. కానీ ఓ సారి ఓ ఊర పిచ్చుక దొరికింది దాని నోటికి. సంతోషంగా పట్టుకొని వచ్చి, మా నడిమింట్లో పెట్టి, కొద్దిసేపు ఆడుకున్నాక తిందామనుకుంది. అది ఎలకను పట్టుకున్నప్పుడల్లా, అలాగే నోటితో పట్టుకుని వచ్చి ఇంట్లో పెడుతుంది. దాన్ని వదిలేసి, అది భయంతో పరిగెత్తగానే, దాని మీదకు దూకి కాళ్లతో అదిమి పట్టి నోటితో పట్టుకుంటుంది. మళ్ళీ వదిలి పెడుతుంది. పట్టుకుంటుంది. అలా కొద్ది సేపు ఆడుకున్నాక ఎలుకను శుభ్రంగా భోంచేస్తుంది. అలాగే ఊర పిచ్చుకతో కూడా ఆడాలనుకుంది. కాళ్ల మధ్యనున్న పిట్టను వదిలిపెట్టగానే, అది బుర్రుమని ఎగిరిపోయింది. మా పిల్లి వెర్రి మొఖం వేసి, పిట్ట వెళ్ళిన వైపు చూస్తూ ఉండిపోయింది .
మా నాయనమ్మ మా గ్రామంలో డిగ్రీ లేని డాక్టర్‌. ఎవరికే అనారోగ్యాలు కలిగినా ముందు నానమ్మ దగ్గరికే వస్తారు. విరోచనాలు అవుతుంటే, మా ఇంట్లో ఉన్న ఆరె చెట్టుకు ఉన్న చెక్కను దంచి రసం తీసి పెరుగుతో తినమని చెబుతుంది. అలా ఎందరికో విరోచనాలు నయమయ్యాయి. తమ్ముడికి నడుం వద్ద పెద్ద కంచర అయింది. వేపాకు దంచి, కంచర మీద దట్టంగా రాసి, అర్ధగంట ఆరాక వేడి నీటితో స్నానం చేయించింది. అలా నాలుగు రోజులు చేయగా గాయం మానుపుండు పడింది. ఒక్కటని కాదు, ఇంటి పక్క నరేశ్‌ మలంలో పురుగులు పడుతున్నాయని, వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినప్పుడు, వేప రసం చేసి తాగమని ఇచ్చింది. పురుగులు అన్ని పడిపోయాయని రాములమ్మ వచ్చి చెప్పింది. ‘మట్టి తింటే పురుగులు పడతాయిరా. ఏమన్నా తినాలనిపించినప్పుడు నా దగ్గరకు రా. మా ఇంట్లో వేయించిన కందులు, పెసలు ఉంటాయి. అవి పెడతాను తిందువు’ అని చెప్పింది. కానీ వాడు వచ్చేవాడు కాదు. డబ్బా కొట్ల వెంట నూగు జీడీలు, బొంగుండలు కొనుక్కొని తినేవాడు. మా పక్క పొలం పాపయ్య కూతురుకు పేనుకొరికి, సగం నెత్తి గుండైంది. నాయనమ్మ చెప్పిన చిట్కా వైద్యంతో అమ్మాయి కురులు, మళ్ళీ దట్టంగా పెరిగాయి నిగనిగ లాడుతూ. పేనుకొరుకుడు పోవడంతో వెంటనే సంబంధం కుదిరింది. అత్తగారింటికి వెళ్ళేప్పుడు వచ్చి, పాదాలకు నమస్కరించి వెళ్లింది. ఇలాంటివి నాయనమ్మ డెబ్బై రెండేళ్ల జీవితంలో ఎన్నో…
మా తాతకు మధుమేహం ఉంది. మా నాయనమ్మ వేపాకును ఉండలు చేసి రోజు ఒక ఉండను పచ్చిపాలతో మింగించేది. దీనితో షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుండేది. తాతయ్య అప్పుడప్పుడు బూరెలు, ఇంట్లో పెట్టిన స్వీట్లు నాయనమ్మ చూడకుండా తినేవాడు. చూస్తే చివాట్లు పెడుతుందని. కానీ, ఎలాగో తెలిసేది. తాతయ్య తల వాచి పోయేది.
మా ఇంటి పక్కన కనకయ్య, వాస్తు పరంగా వేపచెట్టు సరైన చోటులో లేదని, సిద్ధాంతి చెప్పాడని పెద్ద చెట్టును కొట్టి వేశాడు. నాన్న ఆ చెట్టుకున్న వేపపుల్లలు విరుచుకున్నాడు. రోజూ వేపపుల్ల వేసుకొని, పొలంలోకి వెళ్లి బొంగలుదొక్కటం, గండ్లు ఉంటే పూడ్చడం చేసేవాడు. నోరూ శుభ్రమయ్యేది ఆ సమయంలో. ఆ రోజు వేపచెట్టు కొమ్మలని విడిగా తీసి, కొమ్మలకున్న ఆకునంతా బస్తాలకు దూశాడు. అది ఎండగానే, బురద పొలంలో దాన్ని చల్లాడు. ఎందుకలా చేశావని నాన్నని అడిగాను. ”మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది రా. క్రిమి సంహారి కూడా” అన్నాడు. అంతేకాదు, ఎండాకాలంలో అన్నయ్యకు, నాకు చెరో ఖాళీ ఎరువుల బస్తా ఇచ్చి, వేపకాయలు ఏరుకొని రమ్మన్నాడు. అమ్మా నాన్న కూడా వేపకాయలని ఏరారు. ఊరు పక్కనే ఉన్న సీతారామారావు గారి పన్నెండు ఎకరాల తోట చుట్టూ వేపచెట్లు చాలా ఉన్నాయి. ఎండాకాలం వేపకాయలు కాసి, నేలపట్టనట్లు కింద రాలుతాయి. మేం ఏరిన వేపకాయలు బస్తాల్లో నింపి, నాన్న పెరట్లో నిలవ చేశాడు. పొలం కరిగట్టుకు ముందు, మెత్తగా దంచి పొలంలో చల్లాడు. రోగాలు రావు. దిగుబడి పెరుగుతుందన్నాడు . నిజంగా ఆ ఏడాది ఎక్కువే దిగుబడి వచ్చింది.
మా అన్నయ్యకు ఒకసారి చేలో కాలికి రాయి తగిలి పెద్ద గాయమైంది. పట్నం వెళ్ళి వైద్యం చేయించాలి అన్నాడు నాన్న. ”వద్దురా నేను నయం చేస్తాగా” అని నాయనమ్మ, గాయాన్ని శుభ్రంగా కడిగి వేపాకు నూరి కట్టు కట్టింది. నాయనమ్మ చేతి మహత్యమో, అన్నయ్య దృఢకాయుడు కావడం వల్లనో గాయం ఇరవై రోజుల్లోనే శుభ్రంగా మానిపోయింది. ఉగాది నాడు చాలామంది వచ్చి, వేప ప్రసాదం తయారు చేయడానికి మా వేప చెట్టుకున్న పూతను కోసుకొని పోతారు. నెలకోసారి నాయనమ్మ, చిన్నవేపాకు ఉండలు చేసి నాతో మింగిస్తుంది. ”కడుపులో పేగులన్నీ శుభ్రమైతాయి రా. ఎటువంటి చెత్త చెదారం నిలువ ఉండదు” అని చెప్పేది.
మా ఊరి బోనాల పండుగకు, అమ్మ నైవేద్యం వండి, ఆ కుండకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి, చుట్టూ వేప మండలు కట్టి, ఊరిలోని ముత్యాలమ్మ గుడి దగ్గరికి నైవేద్యం తీసుకెళుతుంది. శ్రావణమాసంలో గ్రామ దేవతలకు పెట్టాలనుకున్నప్పుడు, మేకపోతు మెడలో వేపాకు కట్టిన దండలే వేస్తారు. మాదిగలు డప్పు చప్పుళ్ళు చేస్తూ, బైండ్ల వాళ్ళు కొమ్ముబూరలు ఊదుతూ పోతును ఊరేగిస్తుంటే, పిల్లలమైన మేం ఆనందంగా దాని వెంట తిరుగు తుంటాం. మా వేప చెట్టు కింద అప్పుడప్పుడు, జంగాలు, గంగిరెద్దుల వాళ్ళు కుల పంచాయతీలు చేసుకుంటూ ఉండేవారు. ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణాలు చేపించేవారు. ఆ పంచాయతీలు జరిగినన్ని రోజులు మా ఇంటిదాకా కల్లు, సారా వాసన బాగా వచ్చేది.
ఒకసారి మియాసాబనే చెట్లను కొని, కోసి అమ్మే వర్తకుడు వచ్చి, ”మీ వేపచెట్టును కొంటాను. అమ్ముతావా సుబ్బన్నా ..? తలుపు చెక్కలకు దర్వాజాలకు బాగా పనికొస్తుంది” అన్నాడు నా ముందే.
”అది ఎల్లమ్మ చెట్టు. అంటే ఎల్లరకు అమ్మే. మాకు కులదేవత. మమ్మల్ని కాచి రక్షించేది ఆ మహాతల్లే. కన్నతల్లిని, దైవాన్ని ఎవరైనా అమ్ముకుంటారా…?” అని ప్రశ్నించాడు. దీనితో ఆ వ్యాపారి, తిరుగు మాట్లాడకుండా తలవంచుకొని వెళ్ళిపోయాడు.
ఇంత గొప్ప చెట్టు కనుకనే ఐక్యరాజ్యసమితి వారు వేప చెట్టును 21వ శతాబ్దపు చెట్టుగా ప్రకటించారు. దేశాదేశాల వాళ్ళు ఈ చెట్టుని విలువైనదిగా గుర్తించి, జాగ్రత్తగా పెంచుతున్నారు. పండుగలప్పుడు మా ఇంటిల్లిపాది చెట్టు కిందకు చేరి, నైవేద్యం పెట్టి దండం పెడతాం. ఎల్లమ్మకు పెడుతున్నామో, వేప చెట్టుకు పెడుతున్నామో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

– పుప్పాల కృష్ణమూర్తి, 99123 59345

]]>
ధన్ను! https://navatelangana.com/dhannu/ Sat, 09 Mar 2024 16:55:02 +0000 https://navatelangana.com/?p=245308 Dhannu!వెండి నాణాలు చెలామణిలో ఉన్న రోజులు అవి. అప్పట్లో అర్ధ రూపాయిని దహిలి అని, పావలాను పొలి అని గ్రామీణులు చెప్పుకొంటూ ఉండేవారు. ధన్ను ఆ గ్రామంలో అందరి తలలో నాలికలా ఉండేది. పిన తల్లిగా వ్యవహారించబడేది.
‘దేవుడు ఆడదాన్ని మొదట్నుంచే దహిలి లా పుట్టించాడు. మొత్తం రూపాయిగా జీవించే ఆడోళ్ళ జీవితమే వేరు. తనకిష్టమైన మొగుడు దొరకడం… అదో అదష్టం. కాని అలాంటి వారిని తను చూడలేదు… వారి గురించి విననూ లేదు! ఇండ్లల్లో దహిలిలే దహిలిలు. ఇద్దరు ముగ్గురు అడపిల్లల్ని కనేసి… లోకం విడిచి వెళ్లిపోయారు… తల్లులు’ ధన్ను తరచుగా అమ్మలక్కలకు చెప్పే మాటలివి.
‘ధన్ను నోరు తో గెలవ లేం. గయ్యాళి నోరు’ అని ఆమె వెనుకాల చెప్పుకొంటూండే వారు. కాని ధన్ను ఎదుట మాత్రం అందరి నాలికలు పిడచకట్టుకపోతాయి! ఒక్క ముక్క కూడా ఆమెకు వ్యతిరేకంగా ఎవరి నోట్లోంచి బయటికి వెలువడదు!
ఓ సారి కేసరు నశ్రీశీ వటతీషఆమె మొహం మీదనే ఓ విషయం అడిగింది మొహమాట పడకుండా! ధన్ను ఆమెను బాగా మందలించింది. కేసరు చెవులు పట్టుకుంది.
”చెల్లెమ్మా రాత్రికి నీ దహిలి కూడా నా దహిలి లాగే చెలామణిలో ఉంటుంది” లో స్వరం లోనే చెప్పింది. ఆ తర్వాత ధన్ను ఆ ఊరిలోని ఆడవాళ్లందరికి దీని గురించి చెబుతుంది. కేసరు సిగ్గుతో కొన్ని వారాల వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు.
మరో అమ్మాయి గురించి చెబుతూ, ”చూడరాదు! మనూరి పెద్దోడి దగ్గర, తన ముసలి మొగడి దగ్గర చెల్లని దహిలిని, ఆంబోతులాంటి తన మరదితో చెల్లించుకుంది. ఆమె దురుసు నోరుకు ఆ ఊరిలోని ఆడవాళ్లందరు జడుసుకునే వారు. అంతటితో ఆమె ఆగలేదు. వరుసబెట్టి మరికొన్ని రహస్యాలు బయట పెట్టేది. చిమ్ము గాడి బ్లుంతును ఎవరు మరచి పోయారు. పెద్ద గర్వంగా పల్లకీ లోంచి దిగింది. ఏడవ నెలలోనె ఆమెకు ఓ అబ్బాయి పుట్టాడు… వడాచు గాడి ఆడది నాలెగేండ్ల నుంచి మొగుడి మొహం చూడ లేదు కాని నాటు మందు ఉడికించి ఉడికించి తాగుతూండేది.
ధన్నుకు ఊరిలోని మిగతా ఆడవాళ్ల గురించి తెలియక పోయిన వాళ్ల అమ్మాయిల పేర్లను లెక్కించేది.
”నువ్వు పెద్ద తెలివైనదానిలా తిరుగుతున్నావ్‌. నీ కులుకుల కూతురుకు పగ్గం వెయ్యి. సింధువు తో దహిలిని మార్చుకొంటూ తిరుగుతుంది… ఓరు! నువ్వు ధర్మనె! వీరు పెండ్లెందుకు చేయవ్‌? అది గురుద్వారే తమ్ముడితో పొలాల్లో చండులాడుతుంది… ఇంకా… ఇలా… ఇలా ఆమె చెప్పుకొంటూనే ఉంటుంది.
ఊరి ఆడవాళ్లందరు చెంప లేసుకోసాగారు. ఆ తర్వాత ఎవ్వరూ కూడా ఆమె నోటి దురుసుతనానికి భయపడి ఆమె జోలికి వెళ్లేవారుకాదు. కాని వాళ్లకు ఆమె తో అప్పుడప్పుడు ఏదో విధంగా పని పడుతూనే ఉండేది. వాళ్ల పిల్లలకు పడిశం పడితే ధన్ను దగ్గరికి వచ్చేవాళ్లు. ఆమె నీళ్లలో సోంప్‌ మరగ పెట్టి, ఆ నీళ్లు తాగించేది. పిల్లలు అన్నం తినకపోయినా, జ్వరం వచ్చినా గత్యంతరం లేక వాళ్లు ధన్ను దర్వాజ తలుపులు తట్టే వారు. ధన్ను వేడి నెయ్యిలో తన బొటన వేలు, చూపుడు వేలు పెట్టి నెయ్యి తీసి పిల్లల గొంతు పై రాసేది. రెండవ రోజు ఆ పిల్లాడు ఆడుకునేవాడు!
ధన్ను పుట్టు పూర్వోత్తరాలెవరికీ తెలియవు. ఆమె తలిదండ్రులెవరు? ఆమె మతమేమిటి! ఆమె బంధువులెవరో? అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. కాని ఆమె ఓ మంచి కుటుంబానికి చెందినదని చెప్పుకొంటుంటారు.
ధన్ను తన యుక్త వయసులో ఒకరి మీద మనసు పారేసుకుంది. కాని అతడు తన ఇంట్లోంచి గెంటివేయబడడ్డవాడు. చూపుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నా, పని పాటల్లేకుండా ఆవారాలా తిరిగేవాడు, దద్దమ్మ. ఓ రెండు వారాలు ఆమెతో గడిపి, ధన్నును ఎక్కడైనా అమ్మేద్దామనుకున్నాడు. ధన్ను తెగించి, ”నేను వెళ్లేముందు నా కొంగు ముడిలో దాచుకొన్న దహిలి (వెండి నాణెం)ను మార్పించి నీ జేబులు నింపి వెళ్లడమెందుకు?” సూటిగా ప్రశ్నించింది. ఆమె కోపం తారస్థాయికి చేరుకుంది. ధన్నుకు జన్మనిచ్చిన వారితో గాని లేదా పారిపోయి వచ్చిన వాడితో గాని ఆమెకు ఎలాంటి సంబంధాలూ లేవు!?
ఓ ఊరి గాలివార్త ప్రకారం ఓ చిన్న జమీందారు ధన్ను పై మనసు పారేసుకొని తనింట్లోకి తెచ్చుకున్నాడు. కాని ఇంట్లో తన కొడుకుల గొడవలతో సాగ లేక ఆమె కోసం తనింటి వాళ్లెవ్వరికి తెలియకుండా రెండెకరాల భూమి కొన్నాడు. ఆమె పేరున ఆ భూమిని ఉంచాడు. అంతేకాదు ఆమె కోసం వేరుగా ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. అతడు జీవించి ఉన్నంత వరకు ధన్ను బాగోగులు చూసుకునే వాడు. కొన్నాళ్ల తర్వాత అతడు చనిపోయాడు. ధన్ను తన విధిగా, తన తీరుగా బతక సాగింది.
ధన్ను తనలో తానే అనుకొంటుండేది, ‘బెంగెందుకు బేబే! రూక (వెండినాణెం) కొంగుకు ముడి వేసుంది. అవసరమున్నప్పుడు మార్పించుకొంటాను.’
ఒక సారి ఓ యువకుడు ధన్నుకు దగ్గరగా కూర్చుని అడిగాడు, ”నీ దహిలి చూపించు ఎలా పెట్టావో!”
ధన్ను అతడి గొంతు పై గట్టిగా చేతి తో నొక్కి పెట్టి అంది. ”పద చూపిస్తాను…నీ అమ్మ షల్వార్‌లో ఉంది…!” ఆ తర్వాత ఆ ఊరిలోని ఏ మొగాడికి కూడా ఆమె వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేక పోయింది.
ధన్ను ధైర్య సహాసాలతో జీవించసాగింది.
కాలక్రమంలో ధన్ను మిలమిలాడే వయసు బలహీన పడసాగింది. కాని ఆమె ముక్కుపుడక ఆమె స్వభావంలా ప్రకాశిస్తూనే ఉంది. కండ్లెదురుగా పొలాలలో నాగలితో దున్నుతున్న దశ్యాన్ని చూడసాగింది. దొరసానిలాంటి పొగరుతో జీవించసాగింది.
ఓ సారి ధన్ను జబ్బు పడింది. ఇరవై ఒక్క రోజుల తర్వాత తగ్గుముఖం పట్టింది. ధన్నుకు తన ఆరోగ్యం మీద నమ్మకం క్షీణించసాగింది. ఒక రోజు ఆమె దగ్గర్లోనే ఉన్న పట్టణంకు వెళ్లింది. వెంట తన పొలం, ఇంటి కాగితలను తీసుకొని వెళ్లింది.
ఊరిలో పుకారు మొదలైంది. ధన్ను వీలునామా రాయించిందని!
కొన్ని రోజులకు ముందు ఓ సాయంత్రం సీము పొలాల నుంచి ఇంటికి రాసాగింది. పటేలు కొడుకు బాగా సారా తాగి తడబడుతున్న కాళ్లతో దూరం నుంచి సీము ను చూశాడు. ఆమె దారికి అడ్డుపడ్డాడు. అటు వైపు నుంచి కాకతాళియంగా ధన్ను కూడా అదే మార్గంలో రాసాగింది. సీము ఆమెను చూసి గట్టిగా అరిచింది సహాయం కోసం. ధన్ను ఆగమేఘాల మీద పరుగెత్తుకొంటూ ఆమె దగ్గరికి చేరింది. ఆమెను సురక్షితంగా ఆమె ఇంటివరకు దిగబెట్టింది. ఈ సంఘటనతో సీము కొద్దిగా చనువు తీసుకొని, సహాసించి అడిగింది, ”అమ్మోరు! (పిన్ని) నీ పొలాన్ని ఎవరికో రాసిచ్చవ్‌ అని విన్నానే! ఎవరికే”
ధన్ను మొహం కోపంతో ఎర్రగా మారింది.
”అవును బిడ్డా! నీకిప్పుడు పిన్ని గుర్తుకొచ్చింది!? నీ అమ్మ నేను కవలలుగా పుట్టాం. అందుకే నేను నీకు పిన్ని నయ్యాను. అవునా?”
ధన్ను స్వరం విని సీము భయపడిపోయింది.
కోప్పడతావెందుకు పిన్ని! జనాలనుకొంటున్నారు. నువ్వు నీ ఆస్తిని గురుద్వారే పేరున రాశావు అని. నేనిలాగే ఊరికే అడిగాను. చెప్పుకోవాలంటే నువ్వు పుణ్యం పనే చేశావ్‌”.
ధన్ను ఆమె పై నిప్పురవ్వల్లాంటి వర్షం కురిపించింది. గురుద్వారే తమ్ముడు తోడేలు. మొదట్నుంచే వాడు హల్వా తింటున్నాడు. వాడి కోసం హల్వా తెచ్చిపెట్టడానికి మీ అమ్మలున్నారుగా! మీ పిన్ని ఇలాంటి మంచి పనులు చేయదు.”
సీము చెవులు మూసుకొని అక్కణుంచి పలాయన మంత్రం పఠించింది. ఆ తర్వాత ధన్నుతో ఈ విషయం గురించి ఆరా తీయడానికి ఎవరి దగ్గర దమ్ముల్లేకుండా పోయాయి.
దన్ను తన భవిష్యత్తేమిటో తెలుసుకున్నట్లుగానే తనింకా ఎన్ని రోజులుండగలదో కూడా తెలుసుకుంది. అమెకు కొన్ని రోజుల తర్వాత మళ్లి జబ్బు పట్టుకుంది. ఈ సారి ఊర్లో ఉన్న వారందరికి ఆమె బతికే నమ్మక సన్నగిల్లింది.
ఓ రోజు ఊరిలోని ఓ పెద్దావిడ ధైర్యం జేసి, ఆమె చెవిలో నెమ్మదిగా అంది, ”గతం గతహ ధన్ను! చివరి ఘడియలోనైన ఒప్పుకుంటే ఒరిగేదేవిమీ లేదు. రామా… రామా… నామం జపించని వాళ్లు కూడా.. మనసులో తలచుకున్న వైకుంఠం వెళ్లిపోతారు…”
ధన్ను తన చివరి ఘడియలలో కూడా నవ్వుతు అంది, ”భగత్నె! నా గురించి బెంగెందుకు పడతావ్‌? ధర్మరాజుకు నా లెక్క చెప్పుకుంటాను. నా కొంగులో ముడిపడి ఉన్న ఈ దహిలిని మార్చుకో… నా నా లెక్క ముగించు అని అంటాను”
భగతి తన రెండు చెవుల్లో వేళ్లు పెట్టుకొని ధన్ను ఇంట్లోంచి బయటికొచ్చింది.
రెండవ రోజు మధ్యాహ్నం దన్ను చనిపోయింది.
ధన్ను కర్మ అయ్యాక ఊరి పెద్దలు ఆమె ట్రంకు పెట్టెను తెరిచారు. అందులో ఉన్న వీలునామ దొరికింది. ధన్ను తన పొలాన్ని/ భూమిని ఊరులో బడి కోసం రాయించింది. అందులో ప్రత్యేకంగా రాయించిన ఒక నోట్‌ కూడా ఉంది- ‘నాకున్న ఒకే ఒక కోరిక… అమ్మాయిలకు ఓ నాలుగు అక్షర ముక్కలు నేర్పాలి. వారి జీవితం బజారుపాలు కాకుండా ఉండాలి’.
– మొహ్మద్‌ అమ్జద్‌ అలీ,
00 966 507662638

మూల రచయిత్రి : అమతా ప్రీతం
తెలుగు అనువాదం : అమ్జద్‌

]]>
నీలికళ్లు https://navatelangana.com/blue-eyes/ Sat, 02 Mar 2024 19:33:09 +0000 https://navatelangana.com/?p=240328 ఆసుపత్రిలో అవుట్‌ పెషెంట్స్‌ హడావిడి తగ్గింది. ఒకసారి సిసి కెమేరాలో చూశాడు డాక్టర్‌ మూర్తి. ఇంకా ఇద్దరు వున్నారు. లంచ్‌ టైం కూడా దాటిపోయింది. ఇలా సమయం మీరిపోవడం ఎక్కువ సార్లే జరుగుతుంది. ‘ఈ ఇద్దరినీ చూడటం అయిపోతే…. అన్ని రూమ్సు లోకి ఒక రౌండ్‌ వేసి, లంచ్‌కి వెళ్లొచ్చు’ అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రం ఆరున్నరకు ఓపి.
అనుకున్నట్లుగానే వారిని పంపివేసి, ఒక గది తరువాత మరొకటి చూసుకుంటూ… చివరి గదిలోకి వచ్చాడు. అతని వెంట డ్యూటీ సిస్టర్‌ ఉంది. బెడ్‌కి కట్టి ఉన్న కేస్‌ షీట్‌ తీసుకుని చూడసాగాడు. ఇంతలో కాంపౌండర్‌ హడావుడిగా లోపలికి వచ్చాడు.
”సార్‌! కొత్త పేషంట్‌… తీసుకోమంటారా?” అంటూ..
”కేస్‌ ఏంటి” అడిగాడు.
”ఏమో సార్‌ మనిషి రొప్పుతోంది, నీరసంగా కూడా ఉన్నట్టుంది…..” బదులిచ్చాడు.
ఇతను కొత్తగా, ఈ మధ్యలోనే చేరాడు. అనుభవం తక్కువ.
”ఒకసారి జానీని వెళ్లి చూసి చెప్పమను” పురమాయించాడు మూర్తి.
కొన్నిసార్లు పోలీసు కేసు అయ్యే సందర్భాలు ఉంటాయి. పేషెంట్స్‌ని కాపాడటం కోసమని రిస్క్‌ తీసుకుంటే, పోలీస్‌ స్టేషన్‌ వెంట తిరగాల్సి వస్తుంది. అలాంటప్పుడు ముందు స్టేషన్‌కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. జానీ మూడు నాలుగేళ్ల నుంచి ఇదే హాస్పిటల్‌లో పని చేస్తున్నాడు. అతనయితే వివరాలు తెలుసుకోగలడు. కావలసిన ఏర్పాట్లు చూసుకోగలడు.
”అలాగే సార్‌…” అతను వెళ్లిపోయాడు.
” సార్‌! పోలీసులకు రిపోర్ట్‌ చేసే కేసు కాదు. వాళ్లు మన వద్దకు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళే… ఎమర్జెన్సీ రూమ్‌లో బెడ్‌ ఎలాట్‌ చేయమని రిసెప్షన్‌లో చెప్పాను” అంటూ జానీ వచ్చాడు.
”గుడ్‌, గుడ్‌, అలాగే కానీ.. అర్జెన్సీ ఉందా?” ఓ పేషెంట్‌ కేస్‌ షీట్‌ చూస్తూ అడిగాడు.
”ఫరవాలేదు సార్‌. కానీ… పేషంట్‌ పక్కన ఉన్న పెద్దావిడ హడావిడి చేస్తోంది” అంటుండగానే అరవై ఏళ్ల పెద్దావిడ రూంలోకి వేగంగా వచ్చింది. అక్కడే ఉన్న సిస్టర్‌, ఆమెను పేషెంట్‌ గదిలోకి రానిచ్చినందుకు డాక్టరు కోప్పడతారేమో అని భయపడుతూ… ఆమెని ఓ చేతితో పట్టుకొని వెనక్కి లాగుతోంది.
”అయ్యా… ఆ అమ్మి నా బిడ్డె. మిడిగుడ్లు వేసుకుని ఎట్లనో సూస్తంది. సిన్న సప్పుడు ఒస్తే ఓపదు, గింత ఎలుతురు ఓపదు. ఒకటే వళ్ళు నొప్పులంటాంది. పొద్దట్నుంచి కాలు సేయి కూడా బిగసకపోతున్నాయంట…” సిస్టర్‌ చేతిని విదిలించుకోడానికి ప్రయత్నిస్తూ, గబ గబా చెప్పింది.
ఆ లక్షణాలన్నీ వింటూనే మూర్తికి దాదాపు అర్ధమై పోయింది కేస్‌ గురించి. ఈవిడని కూడా చూసినట్లే అనిపిస్తోంది. అయినా ప్రతి రోజూ వచ్చే పేషెంట్లలో ఎందరినని గుర్తు పెట్టుకుంటాడు. అప్పటికీ అతనికి జ్ఞాపకశక్తి కాస్త ఎక్కువే.
చేతిలో ఉన్న కేస్‌ షీట్‌ని వదిలేసి ”వస్తున్నా అమ్మా!.. టెన్షన్‌ పడకు…” సముదాయిస్తూ సిస్టర్‌కు కొన్ని సూచనలు ఇచ్చి గదిలో నుండి బయటికి వచ్చాడు. ఎమర్జెన్సీ రూమ్‌ వైపుకు నడిచాడు.
డాక్టరుతో పాటు నడుస్తూనే ఆమె ఆదుర్దా నిండిన గొంతుతో మాట్లాడుతూనే ఉంది… అతను ఆమె చెప్పేది వింటూనే గదిలోకి వచ్చి నేరుగా పేషెంట్‌ వద్దకు వెళ్ళాడు.
ఆమె చేతినందుకొని పల్స్‌ చూస్తూ ”నీ పేరేమిటమ్మా?” అని అడిగాడు.
”సాయిత్రి… డాట్రు గారూ” గొంతు బలహీనంగా ఉంది, కానీ స్పష్టంగా ఉంది. పేరు వింటూ ఆమె వైపు పరిశీలనగా చూశాడు. ఆ మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతున్న నీలి కళ్ళు, స్వచ్చంగా…. కానీ ఇప్పుడు ఆ కళ్ళలో చూపు, గాలి తాకిడికి అల్లాడుతున్న కొవ్వొత్తి మంటలా కదులుతోంది.
”ఇంతకు ముందు కూడా వచ్చినట్లున్నావ్‌… ఏమైంది?” అన్నాడు.
సావిత్రి బదులిచ్చే లోగానే ఆమె తల్లి ”రంగబాబూ, డాట్రు గారొచ్చారు.” అంటూ పెద్దగా కేకేసింది. అప్పటివరకూ రిసెప్షన్‌ రూంలో టీవీ ముందు కూచున్న రంగబాబు అది వింటూనే గబగబా గదిలోకి వచ్చాడు.
”నా అల్లుడు బాబూ..” ఆమె చెప్పింది.
అతన్ని చూస్తూనే గుర్తు పట్టాడు మూర్తి. ఓ పల్లెటూర్లో వైద్యం చేస్తుంటాడు అతను. కొంతకాలం కిందట అతను ఒకసారి మూర్తిని కలిశాడు కూడా. ఆ సందర్భంలోనే అతనంటే అయిష్టం కూడా ఏర్పడింది. అయిష్టం కలిగించిన వాళ్ళని, కోపం తెప్పించిన వాళ్ళనీ త్వరగా గుర్తిస్తుంది మనస్సు. అలా అని వాళ్ళతో శతృత్వం ఉండనక్కరలేదు.
అవసరమైన టెస్టులు మాత్రమే చేయించడం, అవసరమైన మందులు మాత్రమే రాసే పద్ధతి వల్ల, మిగిలిన ఆసుపత్రులతో అయ్యే ఖర్చుతో పోలిస్తే మూర్తి దగ్గర అయ్యే ట్రీట్మెంట్‌ ఖర్చు చెప్పుకోదగినంత తక్కువ.
భార్య ఆ స్థితిలో ఉంటే అతను అంత నింపాదిగా ఉండటం మూర్తికి కాస్త ఆశ్చర్య మనిపించింది. పైగా కాస్త వైద్యం కూడా తెలిసినవాడేనాయే!… అతని వైపు చూశాడు. అతని కళ్ళలో నిర్లక్ష్యం సింహాసనం వేసుకుని మరీ కూచుంది. ఇతనిలో ‘ఏదో తేడా ఉంది’ అనుకుంటుండగానే, వీరు క్రితం సారి ఎందుకు వచ్చారో మూర్తికి గుర్తు వచ్చింది.
రెండు నెలల కింద…. సాయంత్రంఏడూ, ఎనిమిది మధ్యలో…. ఇప్పుడొచ్చిన ముగ్గురే అప్పుడూ వచ్చారు.
ఆ రోజు కూడా ఓపీ తక్కువగా ఉంది. తన టేబుల్‌ పై ఉన్న ‘ది లాన్సెట్‌’ మేగజైన్‌ లో పేజీలు తిరగేస్తున్నాడు. మూర్తి.
తలుపు వద్ద చప్పుడైంది. నెమ్మదిగా తలుపు తెరచుకొని వస్తున్న వాళ్ళను చూస్తూనే, ”ఏమైందమ్మా……. అంటూ పేషెంట్‌ కూచోడానికి స్టూల్‌ ముందుకు జరిపాడు.
”ఇది నా కూతురయ్యా, సాయిత్రి. మాపటేల దీన్ని కుక్క కరిచింది….. పక్కన ఉన్న అమ్మాయిని స్టూలు మీద కూచోబెడుతూ చెప్పింది పెద్దావిడ.
”అవునా…. ఎక్కడా?…” అంటూ సావిత్రి వైపు చూశాడు.
నిండా పాతికేళ్ళుండవు. బక్క పలచటి మనిషి. చిన్న వయసుకే పెళ్లి చేశారు కాబోలు, బాధ్యతల బరువులు మొఖంలోనే కనపడుతున్నాయి. కానీ వాటికంటే.. ఆమెలో కొట్టొచ్చినట్టు కనపడేవి మెరిసే వెడల్పాటి కళ్ళు. నీలి కళ్ళు… స్వచ్ఛమైన తెలుపు మధ్యలో మిలమిలా మెరుస్తున్నాయి. ఆమె అమాయకత్వాన్ని చెప్పడానికి ఆ కళ్లను చూపిస్తే చాలు, మరేం రుజువులవసరం లేదు. అలసట నిండిన ఆ కళ్ళల్లో, గడ్డిపోచల మధ్యలో నిలువెత్తు మొక్కలా బతుకు పట్ల అశ… బయటికి తొంగి చూస్తోంది.
గాయం చూశాడు. బాగా లోతుగా దిగిన కుక్క కరిచిన గాట్లు…
కాంపౌండర్ని పిలిచి.. గాయాన్ని క్లీన్‌ చేయమని చెపుతూ…
”ఇంట్లో పెరిగే కుక్కేనా?..” అడిగాడు.
”మాకు కుక్క లేదు డాట్రు గారూ !” సావిత్రి బదులిచ్చింది.
”మీ ఇంట్లో అనే కాదు, ఎవరింటిలోనైనా… అంటే….. అదేనమ్మా… పెంపుడు కుక్కా? ఊర కుక్కా? .. అని” నవ్వుతూన్న మూర్తి వైపు, సావిత్రి అయోమయంగా చూసింది.
”పోనీ.. కరిచిన కుక్క ఎలా ఉంది? పిచ్చికుక్క మాదిరిగా ఉందా?”
”సరిగా సూడలేదు ..”
”పోనీ.. దాన్నేమన్నా అన్నావా? అనుకోకుండా కాలు తగలడమో.. తోక తొక్కడమో….”
మామూలు కుక్కలు వాటి జోలికి పోతేనే కరుస్తాయి. కానీ… పిచ్చికుక్క అయితే రెచ్చగొట్టకుండానే కనపడ్డ వారినల్లా కరుస్తుంది. జంతువుల్ని కూడా. తద్వారా వాటికి కూడా రేబీస్‌ సోకుతుంది. అదే పాలు ఇచ్చే పశువులయితే, పాలు కాగబెట్టుకొని వాడే అలవాటు వల్ల రేబీస్‌ వచ్చే ప్రమాదం తప్పిపోతుంది.
”గడ్డి తెద్దావని, గడ్డివాము దగ్గరకు వోయినా… మోపు ఎత్తుకొనొస్తుంటే.. అంతే… ఎక్కడ్నించి ఉరికొచ్చిందో? కాలట్టుకుంది” రంగబాబు వైపు భయంగా చూస్తూ… మాటల కోసం పదాలు పేర్చుకుంటోంది.
”పిచ్చి కుక్క గాదు. మంచి కుక్కే” అన్నాడు రంగబాబు జోక్యం చేసుకుంటూ.
”ఇంట్లో పది మోపులు తెచ్చి వెట్టించుకోయే అంటే యినదు… ఇంటికి అంత దూరంలో గడ్డి వాములెట్టుకుంటే ఇప్పుడు జూడు ఏవయిందో?” సావిత్రి తల్లి గట్టిగానే గొణుగుతోంది.
”యహే… ఆగండి… ఒకటే గోల..” అని రంగబాబు కసురుకుని డాక్టరుతో ఏదో చెప్పబోయాడు.
”కరిచినప్పుడు నువ్‌ అక్కడే ఉన్నావా?”
లేనన్నట్టు తలుపాడు అతను.
”కుక్క కరిచింది ఆమెని, వివరాలు నీకెలా తెలుస్తాయి? ఆమెని చెప్పనివ్వు. కుక్క కరిస్తే చేసే ఫస్ట్‌ ఎయిడ్‌ నీకు తెలియదా… అలాగే తీసుకొచ్చినవ్‌…. నువ్వు కాసేపు బయట ఉండు” మూర్తి గట్టిగా అన్నాడు.
అతను విసుక్కుంటూ వెళ్లిపోయాడు.
మొత్తం వివరాలు విన్నాడు. ”అమ్మా… కుక్క పిచ్చిదో మంచిదో తెలియకపోతే అంచనా వేయడం కష్టం. అది పిచ్చికుక్క అయితే మాత్రం మరీ ప్రమాదం. ఇప్పటికి ఇంజెక్షన్‌ చేస్తాను. తరువాత ఏం చేయాలో మీ ఆయనకు చెప్తాను” అని చెప్పి ప్రాథమిక చికిత్స చేసి పంపి, రంగబాబుని లోపలికి రమ్మని కబురు చేశాడు.
లోపలికి వచ్చిన అతన్ని చూస్తూ గోడకున్న గడియారం వైపు చూశాడు మూర్తి. ఎనిమిదిన్నర దాటింది. ప్రభుత్వాసుపత్రిలో డాక్టరు అందుబాటులో ఉండకపోవచ్చు అనుకుని…
”చూడు రంగబాబూ… నీకు తెలుసు కదా….” అనడానికి అన్నాడు కానీ మూర్తికే నమ్మకం లేదు.
‘కుక్క కరిచిందని తెలిశాక కూడా, కనీస ప్రాథమిక చికిత్స లేకుండా భార్యను తీసుకొచ్చాడు…. మరి ఊళ్లో ప్రాక్టీస్‌ ఎలా చేస్తున్నాడో… చేస్తే ఎంతమందిని ఆగం చేస్తున్నాడో” అనుకుంటూ… కొనసాగించాడు.
”కుక్క కరిస్తే మునుపటిలా బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు లాంటివి ఏమీ లేవు. ఇప్పుడు వైద్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఒక ఇంజక్షన్‌ చేస్తాను కదా.. మళ్లీ మూడు రోజులకు ఒకటి, ఏడు రోజులకు ఒకటి, పద్నాలుగు రోజులకు ఒకటి చేయాలి. సావిత్రిని చూస్తే ఇమ్యూనిటీ తక్కువనిపిస్తోంది… కాబట్టి ఇరవై ఎనిమిది రోజులకు కూడా ఒక బూస్టర్‌ డోస్‌…. మొత్తం ఐదు ఇంజక్షన్లు చేయించుకుంటే ప్రాణానికి ప్రమాదం ఏమీ ఉండదు. ఇక్కడైతే ఖరీదు చేయాల్సి ఉంటుంది. అదే ప్రభుత్వాసుపత్రిలో అయితే ఇంజెక్షన్స్‌ ఉచితంగా చేస్తారు.” అని వివరంగా చెప్పాడు.
”కుక్క మంచిదా? పిచ్చిదా? అనేదాని మీదా, అది శరీరంపై కరిచిన చోటు మీదా… ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది. కుక్క మంచిది కాకపోతే రేబీస్‌ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకైనా మంచిది ఆ కుక్కను ట్రేస్‌ చేయండి. ఇంతకీ రేబీస్‌ అంటే తెలుసా.. ఇది ఒక వైరస్‌. రేబీస్‌ ఉన్న జంతువు యొక్క లాలాజలంలో ఉంటుంది. అక్కడ్నుండి అది మనలను కరిచినపుడు గాయం ద్వారా నరాల గుండా మనలోకి ప్రవేశిస్తుంది. తద్వారా మెదడులోకి చేరుతుంది. అక్కడికి చేరిన తరువాత వైరస్‌ కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుంది. ఆ దశలో వచ్చే దాన్నే రేబిస్‌ అంటాం. గొంతు కండరాల అతి తీవ్ర సంకోచ వ్యాకోచాల కారణంగా హైడ్రో ఫోబియాతో పాటు, చాలా విపరీత లక్షణాలు వస్తాయి. దానికి ప్రత్యేకంగా చికిత్స అంటూ లేదు. పేషెంట్‌ చనిపోవడమే….. ఏమైనా వాక్సిన్‌ని, నిర్ణీత సమయం ప్రకారం తీసుకుంటేనే ప్రాణం నిలబడుతుంది” హెచ్చరించాడు.
ఆరెంపీ గా చేస్తున్నాడు కదా తెలిస్తే మంచిదని సాధ్యమైనంత వివరంగా చెప్పాడు.
డాక్టరు చెప్పిందానికి పెద్దగా ఆలోచించకుండానే స్పందించాడు…
”ఇప్పటిది మీరు చేయండి. తరువాతవి నేను నేను గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో చేయిస్తాను” అని రంగబాబు వెళ్లిపోయాడు. అలా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడిలా వచ్చారు.
జరిగిన విషయం అర్థమైంది మూర్తికి. రంగబాబు నిర్లక్ష్యంపై కోపం వస్తోంది… తెలిసి తెలిసీ ఒక ప్రాణాన్ని రిస్క్‌లో పెట్టాడు. వస్తున్న కోపాన్ని అణచిపెట్టుకుని రంగబాబు వైపు చూశాడు.
”ఏం కాదు చెప్తున్నాగా… ఏడవకు” భార్యను, అత్తను గదమాయిస్తున్నాడు అతను. తల్లి కూతురి వైపు చూస్తోంది. సావిత్రి మూర్తి వైపు బేలగా చూస్తోంది.
ఆమె నీలికళ్ళు గదిలో పడుతున్న ఆ తక్కువ వెలుతురును కూడా భరించలేనట్టు వణుకుతున్నాయి.
”ఇంతకీ ఏమైంది? ఏవో రిమ్మలో… సొమ్మలో వచ్చినట్లున్నారు. అంతే గదా… డాక్టర్‌?” తాపీగా అంటున్నాడు రంగబాబు. మూర్తికి మండిపోయింది.
”సావిత్రికి అయిదు డోసులు ఇంజెక్షన్లు చేయించాలని చెప్పానా నీకు?” మూర్తి గట్టిగా అన్నాడు రంగబాబువైపు చూస్తూ.
”అ… అన్నారూ..”
”ఒకటి ఇక్కడ చేయించావు. మిగిలిన నాలుగు డోసులు తరువాత చేయిస్తానని అన్నావుగా… చేయించలేదా?”
”ఎందుకు చేయించలేదూ… చేయించానుగా! ఏమే.. ఆసుపత్రికి తీసుకుపోలేదా?” అంటూనే సమాధానం కోసం ఆగకుండా ”చేయించాను” ఇంకా నా పూచీ ఏమీ లేదనట్టు అన్నాడు.
”నాలుగు సార్లెప్పుడూ… ఒక్కసారే కదా వోయింది?” సావిత్రి, ఆమె తల్లి ఒకేసారి అన్నారు.
”హా.. మీరు మర్చిపోయుంటారు.. తీసుకెళ్లాను.” … అతని గొంతులో గట్టిదనం లేదు.
”ఇప్పుడయి సేయనందుకేనా యీ జబ్బొచ్చింది?” సావిత్రి తల్లి అడిగింది.
ఇక గుప్పిట మూయడం వల్ల లాభం లేదని అర్థమైంది మూర్తికి.
”అవుననిపిస్తోందమ్మా! కుక్క కరిస్తే రేబిస్‌ అనే వ్యాధి వస్తుంది. ఇంకో మూడు ఇంజక్షన్లు చేస్తే ప్రమాదం తప్పి, ప్రాణాల మీదికి రాకపోయేది” నిస్సహాయంగా అన్నాడు.
”అంటే… నే.. సచ్చి పోతానా బాబూ?” సావిత్రి స్పష్టంగా అంది.
మనం చేయగలిగే చిన్నపనైనా కొన్ని సార్లు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది. ఖచ్చితంగా చనిపోతారని తెలిసిన తరువాత కూడా… ఆ విషయాన్ని ఆ వ్యక్తికే చెప్పాల్సి రావడం అందులో ఒకటి.
అయినా ఎవరో బలవంతంగా తిప్పుతున్నట్టు తలాడించాడు మూర్తి.
అసందిగ్ధత తల ఊపడంలో ఉన్నా, అసలు విషయం మాత్రం సావిత్రికి అర్థమైంది. ఆమె తల్లికి కూడా. కూతురి స్థితికి ఆమె కళ్ళు నీటి కుండలవుతున్నాయి.
కానీ….. సావిత్రి కళ్ళు పొడి బారుతూ… ఎరుపుకి మారుతున్నాయి.
రంగబాబు వైపు చూపు నిలబెట్టి చూసింది.
అతను రెండడుగులు వెనక్కి వేసి డోర్‌ వైపు చూస్తూ జేబుల్లో చేతులు పెట్టుకుని నిలబడ్డాడు.
”ఒరేరు..” గట్టిగా అంది సావిత్రి.
నరకాసురుడిని చంపేముందు సత్యభామ వేసిన కేక అలాగే ఉండి ఉంటుంది. ఆ గొంతులో కాఠిన్యానికి మూర్తి కూడా ఉలిక్కిపడ్డాడు.
”ఒరేరు నిన్నేరా…” భర్త వైపు చేయి చూపుతూ మళ్ళీ గట్టిగా పిలిచింది.
ఎన్నడూ తనవైపు కనీసం సూటిగా చూడటానికి భయపడే భార్య… ఒక్క పూర్తి వాక్యం అయినా ఎదురు మాట్లాడలేని అతివ…
నమ్మలేనట్లు చూస్తూ ఏదో అనడానికి నోరు తెరిచాడు రంగబాబు.
”ఏరు, నోర్ముయ్యరా కుక్కా… ఇట్టా రా …”.
సావిత్రిని ఎప్పుడూ అలా చూడని రంగబాబు చటుక్కున నోరు మూసుకొని ఆమె బెడ్‌ కి కాస్త దూరంలో నిలబడ్డాడు.
రంగబాబుకి లోపల లోపల భయంగా ఉంది. ‘అందరూ చస్తే దెయ్యం అవుతారంటారు. చూడబోతే ఇది బతికి ఉండగానే దెయ్యం అయిందా….’ అతని నోరు తడారి పోయింది.
”ఏరా! ఏ రోజైనా నిన్నిబ్బంది పెట్టిననా… తాగి తందనాలాడితే ఎదురు మాటన్ననా?… ఏ ఏళకొచ్చినా వండిపెట్టాను. ఊరంతా తిరిగి వైజ్జమే సేస్తన్నవో, బలాదూరే తిరుగుతున్నవో… పైగా నువ్వు డాక్టర్‌ గిరీ సేస్తన్నావ్‌ గా… గవర్నమెంటాసుపత్రిలో ఉత్తిగనే ఇచ్చే మందిప్పియ్యడానికేమి రోగం…” ఆయాసపడుతూ కాస్సేపు ఆగింది.
”పందిలాగా పక్కలో బొర్లి ఇద్దరు పిల్లల్ని పుట్టించినవ్‌. ఒక్క రూపాయి కొంపకు ఇవ్వకున్నా నా రెక్కలతో పిల్లలను, నిన్ను సాదినా. నువ్‌ సంపాదించినయి నీ బొందకే… నా దగ్గరున్నయి నీ బొందకే గొట్టుకున్నవ్‌. నీ సోకులూ, నీ తాగుడూ, నీ తిరుగుడే గానీ….. నే.. ఓ బట్టడగలే… ఓ నగడగలే.. అసలు నోరు తెరిచి నీ గురించి ఎవ్వరికీ జెప్పలే… కనీసం మా యమ్మకు కూడా చెప్పలే. .నీ నోట్ల పురుగులు వడ.. నీ తనువు నాశనం గాను.. నీ పాపాలే నన్నిట్ల తీస్క పోతున్నరు. నే బోతే నా పిల్లలేమైపోవాలే…..” సావిత్రి నోటి నుండి ఫిరంగి గుండ్లలాగా మాటలు వస్తున్నారు.
ఇన్నాళ్ల నుండి లోపల ఉన్నదంతా లావాలాగా బైటికి ప్రవహిస్తోంది. ఆ సెగ అక్కడున్నవారికి తగులుతోంది. రంగబాబు మొఖం పాలిపోయింది. అతని గుండె కొట్టుకోవడం అతనికే వినపడుతోంది. బయటకు వెళ్లబోయాడు.
”ఒరేరు.. బజార్జెంట తిరిగి తినేటోడా …ఆగు.. ఎటు బోతున్నవ్‌” సావిత్రి గద్దించింది. బయటికి పోతున్న వాడల్లా ఆగిపోయాడు. దించిన తల ఎత్తడం లేదు. రెండు కాళ్ళ మీద టన్నుల బరువున్నట్లు శిలలా…..
అంతే! అణిగి ఉన్న ఆడదాని దగ్గరే మగవాడి దాష్టీకం. అదే ఆడది ఎదిరిస్తే పిల్లిలా మారిపోతాడు. కాకపోతే ఆ పిల్లి లక్షణం, బూడిద పొయ్యిలో ముడుచుకునే కుక్క మాదిరే!-
”డాట్రు గారూ… ఇది నా పిల్లలకు… అంటుకుంటదా?” సావిత్రి వేగంగా ఊపిరి పీల్చుకుంటూ అడిగింది.
”లేదమ్మా లేదు… ఇది అలాంటి అంటు వ్యాధి కాదు. మనిషి నుండి మనిషికి అంటుకోదు….” కాస్త వివరంగా చెప్పబోయాడు మూర్తి.
”అలా అంటుకునేదున్నా బాగుండు. ఈడిని ఇప్పుడే నాశనం జేద్దును.” అని కాసేపు ఆగి…
”నేను ఇంటికెల్లి బోతానయ్యా…” అంటూ చేతులు జోడించింది.
రంగబాబు వైపు అసహ్యంగా చూస్తూ అంది. ”ఇంటికి వోదాం పా …”
ఇంటికి వెళ్ళగానే ”అమ్మా…” అంటూ ఇద్దరు పిల్లలు పరుగెత్తుకొచ్చారు.
ఇంటి వసారాలో వేసిన మంచంపై సావిత్రిని ఆమె తల్లి పడుకోబెట్టింది.
నోటి వెంట చొంగలు కారుతున్న కూతురిని చూస్తుంటే… ఆమెకు గొంతులో నుండి ఏడుపు తన్నుకొచ్చింది. మనవలను చూసి కష్టం మీద బిగపట్టుకుంది.
పిల్లలను ఎందుకైనా మంచిదన్నట్లు.. భారంత దూరంలోనే ఉంచింది సావిత్రి. ఆమెతల్లి మనవళ్లను ఒడిలో పొదుపుకుని నిట్రాడులా బిగిసుకుపోయి కూతురు వైపు చూస్తోంది.
సావిత్రి మాత్రం రెప్ప గొడితే మాయమైపోతారేమో అన్నట్లు పిల్లల వైపే చూడసాగింది. నీలికళ్ళ చల్లని చూపుని అతి కష్టం మీద నిలుపుతోంది. ‘నేను మాయమైనా నా చూపు మిమ్ములను కాపాడుతుంద’న్నట్లు…..
ఈ హడావుడికి చుట్టుపక్కల ఇళ్లవాళ్లు వచ్చారు. పేరు పేరునా వచ్చిన వాళ్ళను పలకరిస్తూ… చూపు పిల్లలపైనుండి పక్కకు తిప్పకుండానే అప్పగింతలు పెట్టసాగింది. అక్కడ ఉన్న వాళ్ళ కళ్ళూ… గుండెలూ బరువెక్కాయి. పిల్లలు వెక్కివెక్కి ఏడుస్తున్నారు.
కళ్ల నుండి నీళ్ళు గారి రెప్పలపై బరువు తగ్గుతుంది…. మరి గుండెల్లో అంతకంతకూ పెరుగుతున్న బరువు..
అందరి చూపులు సావిత్రి వైపు, సావిత్రి చూపులు తన పిల్లల వైపూ… గంటా…రెండు గంటలూ….. సావిత్రి నీలి కళ్ళల్లో పిల్లలు నిలిచిపోయారు.
– ఆనాడు ఆ సావిత్రి భర్త ప్రాణాల కోసం యముని వెంటపడింది. కానీ ఉదాసీనతతో భర్తే సావిత్రి పాలిట యముడయ్యాడు.
బొందిలో ఉన్నంతసేపే ప్రాణం. అదే బయటికి వస్తే… అదీ గాలే! సావిత్రి ప్రాణం బయటి గాలిలో భాగమయింది. అందరూ ఒక్కసారే గొల్లుమన్నారు.
అప్పుడే… సరిగ్గా అప్పుడే… పెళ్ళు పెళ్ళుమన్న చప్పుడు… దానితో పాటు రంగబాబు నోట్లోనుండి అరుపు ఒక్కసారే కలగలిసిపోయి బయట పడ్డాయి. అందరూ ఆ చప్పుడు వైపు చూశారు. సావిత్రి తల్లి… ఆమె చేతిలో అతడి జుట్టు… పెనుగులాడుతున్నాడు.
అప్పటివరకూ సావిత్రిని ఏదో అద్భుతం కాపాడుతుందని అనుకుందేమో…. కానీ జరిగింది మనసుకు పట్టినాక ఆమెలోని తెగింపు బయటపడింది.
ఆమెతో పాటు అక్కడున్న వారు ఆ తెగింపుని ఆవాహనం చేసుకొని ఆ మృగం వైపుకు కదిలారు. విషయం తెలుసుకున్న మూర్తి గట్టిగా నిట్టూర్చాడు.
‘మొదటి సారి వచ్చినప్పుడే పరిణామాల గురించి నేరుగా సావిత్రికే చెప్పాల్సిందేమో…’ ఆవేశపడుతున్నప్పుడు వెడల్పుగా మారిన ఆమె నీలికళ్ళు, చుట్టూ ఎరుపు రంగూ… అతని కళ్ల ముందు కదలాడాయి.
– బాడిశ హన్మంతరావు, 9908486615 

]]>
తీయని బంధం https://navatelangana.com/an-unbroken-bond/ Sat, 24 Feb 2024 16:48:44 +0000 https://navatelangana.com/?p=235104 తీయని బంధంఅర్ధరాత్రి అయింది. దిగ్గున మంచం మీద నుండి లేచాను. బెడ్‌ లైట్‌ వెలుగు తూనే ఉంది. చుట్టూ చూశాను. అలివేణి నిద్రపోతోంది. ‘హమ్మయ్య’ అనుకున్నాను. చడీ చప్పుడు కాకుండా మంచం మీద నుండి జాగ్రత్తగా దిగాను.
గోడ గడియారంలో తిరుగుతున్న ముల్లుల శబ్దం బాగా వినబడుతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అలా వినబడుతుంది కదా అనిపించింది. హాల్లోకి వచ్చాను. వెనక్కి చూశాను. అలివేణి ఇంకా పడుకునే ఉంది. నా పనికి ఆటంకం లేదనుకంటూ హాల్లో నుండి ముందుకు కదిలాను.
పిల్లి కంటే మెల్లగా అడుగులు వేస్తూ వంటగదిని చేరాను. దగ్గరగా వేసిన తలుపును నెమ్మదిగా తీశాను. లైటు వేశాను. గోడమీదే తచ్చాడుతున్న బల్లి నన్ను చూసి పక్కకు తప్పుకుంది. ‘బల్లి చూసినా అలివేణితో అది చెప్పలేదుగా’ లోపల నవ్వుకుంటూ అలమారు తలుపు తీశాను.
అక్కడ పెట్టెలో ఉన్న తీపి వంటకాల ను చూడగానే జిహ్వ లేచొచ్చింది. లాలాజలం ఊరింది. కాకినాడ కాజాలు, ఆత్రేయపురం పూత రేకులు లాంటి తీపి వంటకాలెన్నో..ఒక్కటేమిటి? అన్నీ చవులూరించేవే. అనకూడదు కానీ, తీపి అంటే ఎంతిష్టమో నాకు.
నలభై ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలో పని చేసి, పదవీ విరమణ చేసిన నాకు ఏ రోగమూ లేదు. ఏమిటో? రిటైర్‌ అయ్యాక ఖాళీ ఎక్కువైంది.
రెండు కాళ్లూ నెల రోజులుగా విపరీతంగా లాగడం మొదలు పెట్టాయి. అరికాళ్ళు తిమ్మిరెక్కడం, ఆకలి ఎక్కువ వేయడం, ఇన్ని మార్పులు ఒకేసారి వచ్చాయంటే శారీరకంగా ఏదో మార్పు జరిగినట్టే. ఆ మార్పే…నాకు మధుమేహం రావడం.
డాక్టర్స్‌ వాకింగ్‌ ‘తప్పద’న్నారు. స్వీట్స్‌ తినడం ‘తప్ప’న్నారు. కాఫీ షుగర్‌ లేకుండా తాగమన్నారు. ఇన్నాళ్లూ పిల్లలకు పాఠాలు చెప్పిన నాకు, వాళ్ళు జాగ్రత్తలు చెబుతూ పాఠం చెప్పేసరికి నవ్వుకున్నాను. డిగ్రీ లు తీసుకున్నారు కదా. వాళ్ళకేం? వాళ్లేన్నైనా చెబుతారు. ఆరు దశాబ్దాలుగా తీపి అలవాటైన నాలుకకు, తీపి చూపించకుండా ఉండగలమా? ఉండ తరమా?
కానీ, ‘చక్కెర లేకుండా చక్కగా బతికేస్తా!’ అంటూ ఇంట్లో వాళ్ళందరి ముందూ చక్కెర శపథం చేసాను. ఇక ఆరోజు నుండీ నాకు కష్టాలు మొదలయ్యాయి. చక్కెర లేని కాఫీతో న్యూస్‌ పేపర్‌ చదవలేక పోతున్నాను. తీయని తీపి బాధలు కాఫీతో మొదలు.
అలివేణి బొబ్బట్లు చేయడంలో నేర్పరి. బూరెలు వండితే బుట్టలో పడి పోవాల్సిందే. కాజా చేస్తే కాకినాడ దిగి రావాల్సిందే. అన్నీ చేస్తుంది. అడిగిన వెంటనే పెడుతుంది. ఇప్పుడవన్నీ బంద్‌ చేసేసింది.
జీడిపప్పు లేకపోయినా, పాయసం తాగేయచ్చు. కానీ చక్కెర లేని పాయసం తాగడం అంటే… పెద్ద శిక్షే అనిపించింది.
మొన్న మనవడి పుట్టిన రోజున.. ఇంటిల్లి పాదీ చక్కెరతో చేసిన చిక్కని పాయసం తాగారు. నాకు మాత్రం షుగర్‌ లెస్‌ అంటూ ఇచ్చారు. ఒక్క చెంచాడు బలవంతంగా తాగినా కూడా గొంతు దిగలేదు. నాలుక ముందుకు రావడం లేదు.
ఎవరూ చూడకుండా సింక్‌ లో షుగర్‌ లెస్‌ పాయసం పారపోసి.. అందరి ముందూ పాయసం తాగినట్టుగా నటించాను.
”అలివేణీ.. ఒక్క చెంచాడు చక్కెర ఉన్న పాయసం ఇవ్వవే” గోముగా అడిగాను.
అలివేణి నా కేసి జాలిగా చూస్తూ, ”మనవడి పుట్టినరోజు కదా!” అంటూ ఒక్కటే ఒక్క చెంచాడు ఇచ్చింది.
అంతే నా నాలుక బుట్ట తీయగానే బుసకొట్టే పాములా ముందుకు వచ్చింది. తీపిని ఆస్వాదించింది.
”తీపి లేకుండా బతికే బతుకూ. ఒక బతుకేనా?” అనిపించింది ఆ క్షణంలో.
అప్పటి నుండీ… రక్తం రుచి మరిగిన పులి లా.. ఇంట్లో వాళ్ళందరి కళ్లు కప్పి.. వాళ్ళు పడుకున్న తర్వాత గోడ దూకి వచ్చే దొంగలా సమయం కోసం ఎదురు చూడసాగాను. మొన్న ఆదివారం మధ్యాహ్నం.. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నప్పుడు వంటింట్లోకి పోయాను. ఇదే సరైన సమయం అనుకుంటూ కాజా నోట్లో పెట్టొకోబోయాను. అంతే… పోలీసులా మా అబ్బాయి వచ్చాడు. ‘నాన్నా’ అంటూ అరిచాడు.
”పెద్దవారు! మేము తప్పు చేస్తే మాకు బుద్ధి చెప్పాలి. మీరే తప్పు చేస్తే ఎలా?” అంటూ కాజాను లాక్కున్నాడు.
అప్పుడు అలివేణి కేసి సూటిగా చూడలేక తల దించుకుంటూ బయటకు నడిచాను.
”అమ్మా! ఇకనుండీ స్వీట్స్‌ ఇంట్లో చేయకు. అభి కోసం బయట ఎన్నో దుకాణాలు ఉన్నాయి. అక్కడ కొంటాను” అన్న మా వాడి స్వీట్‌ వార్నింగ్‌ నా దృష్టి దాటిపోలేదు.
ఆ రోజు నుండీ కొడుకు, కోడలు, అలివేణి విడతల వారీగా వళ్ళంతా కళ్ళు చేసుకుని నన్ను గమనించ సాగారు. పగటిపూట తీపి తినడం ‘పగటి కలే’ నని నాకు అర్ధమైంది.
సాయంత్రం అలవాటులో భాగంగా ఈవినింగ్‌ వాక్‌ కోసం గాంధీ పార్కుకు బయలు దేరాను. అప్పటికే రోజూ నాతో పార్క్‌లో వాకింగ్‌ చేసే నా మిత్రులు… నా వయసే ఉన్న నారాయణ, మిలట్రీలో పనిచేసి రిటైరైన అచ్యుతం, రెవెన్యూలో పని చేస్తున్న సత్యం నా కోసం అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. పార్కులో గాంధీ బొమ్మకు ఒక వైపుగా నిల్చొన్నారు.
”ఏం పురుషోత్తం? చక్కెర వ్యాధి వచ్చిందట గా” అచ్యుతం అడిగాడు. నాతో కలిసి నడుస్తూ.
”పన్నెండేళ్ళు దాటాకా యవ్వనం, అరవై ఏళ్లు దాటాకా చక్కెరవ్యాధి రావడం కామన్‌. ఇందులో వింతేముంది?” నా వెనకే నడుస్తున్న నారాయణ నన్ను సమర్ధిస్తున్నట్టుగా అన్నాడు.
”మరి.. మీ వయసూ అరవై దాటింది కదా. మీకింకా రాలేదే?” నారాయణను దాదాపు వెక్కిరిస్తున్నట్లుగా అడిగాడు అచ్యుతం.
”అది నా అదృష్టం” ఏం చెప్పాలో తెలియక అలా అనేశాడు నారాయణ.
అంటే పురుషోత్తం, నేనూ దురదృష్ట వంతులమా?” వెంటనే చెక్‌ పెట్టాడు అచ్యుతం.
ఇక లాభం లేదనుకుని ఒక నవ్వు నవ్వాడు నారాయణ.
అచ్యుతం నాతో, ”పురుషోత్తం! పొరపాటున కూడా లడ్డు, గిడ్డు.. అంటూ గడ్డి కరవకు. జిహ్వ లాగితే జిందగీ మొత్తం క్లోజ్‌. జాగ్రత్త చాలా అవసరం.”
అచ్యుతం మాటలతో జేబులో ఉన్న, మడతకాజాను మడత పెట్టి తెచ్చుకున్న కవర్‌ ను జాగ్రత్తగా బైటకు తీసాను.
”యూజ్‌ మీ” అని ఉన్న డస్ట్‌ బిన్‌ బొమ్మలో పడేసి చేతులు దులుపుకున్నాను.
కాసేపు అందరం కలసి నవ్వుతూ నడిచాం. గంట తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలు దేరాం.
”పురుషోత్తం… వ్యాధికి మనం లొంగకూడదు. ఆ వ్యాధే మనకు లొంగాలి. నన్ను ఆదర్శంగా తీసుకో!” మంటూ మళ్ళీ జాగ్రత్తలు చెప్పాడు అచ్యుతం.
”ఆ! ఒకటి రెండు సార్లు తింటే చచ్చిపోతామా?” అంటూ అచ్యుతం మాటలను మనసులో తేలికగా తీసి పారేశాను.
ఎప్పుడూ లేనిది, నారాయణ నా వెంట వస్తూంటే, ”ఈ రోజు నా కూడా, నా దారిలో వస్తున్నావ్‌. ఏమిటి స్పెషల్‌?” అడిగాను.
”నువ్వు డస్ట్‌ బిన్‌లో మడత కాజా పడేయడం చూసాను” అన్నాడు భుజంపై చేయి వేస్తూ.
”ఏం? అలివేణికి ఆ విషయం వచ్చి చెబుతావా?” చిరుకోపంతో అడిగాను.
”ఉడుక్కోకురా! నువ్వెళ్లే దారిలో బద్రి స్వీట్‌షాప్‌ ఉంది కదా”
”ఉంటే?”
”ఇంటికి చుట్టాలొచ్చారు. స్వీట్స్‌ కొని ఇంటికి పట్టుకెళ్లాలి” కారణం చెప్పాడు.
”అదే షాపులో స్వీట్స్‌ కొని..జిహ్వ కు తృప్తి కలిగేలా తినాలనుకున్నాను.
వీడి పుణ్యమా అని అది కూడా తీరడం లేదు. ఈ అర్ధరాత్రి ఇంట్లో వాళ్ళ కన్ను గప్పైనా సరే స్వీట్స్‌ తినాలని నిర్ణయించు కున్నాను. అదే ఆలోచనతో అందరికంటే ముందుగా పడుకున్నట్లుగా నటించాను.
పంచాంగంలో మంచిరోజు కోసం ఎదురు చూసినట్టుగా అర్ధరాత్రి దాటాకా.. లేచి నా జిహ్వ చాపల్యం తీర్చుకోవాలని అనుకున్నాను. నరం లేని నాలుక కోరిక తీర్చాలనుకున్నాను.
చేతిలో జారిపోయే పూత రేకును తీసుకోగానే లాలాజలం ఊట బావిలా ఊరింది. తీపి తినకుండా బతకడం కంటే తీపి తిని చచ్చిపోయినా జన్మ ధన్యమైనట్టే ననిపించింది. పూతరేకు నోట్లో పెట్టబోయాను. అంతే!
”తాతయ్యా” అంటూ ఆరేళ్ళ నా మనవడి పిలుపు.
కాపీ కొడుతూ పరీక్ష రాసే పిల్లాడు టీచర్‌కు పట్టిబడినట్లుగా , నా అభీ కి అడ్డంగా దొరికి పోయానని పించింది.
”దొంగతనం తప్పు” అంటూ రోజూ కథల్లో చెబుతావు. అటువంటిది.. నువ్వు దొంగలా ఇలా చేయవచ్చా?” వాడు అమాయకంగా నాకేసి చూస్తూ అడిగాడు.
”ఆరి! భడవా! బామ్మ పక్కన పడుకున్నావనుకున్నాను. ఎప్పుడు లేచావ్‌?”
మాట మారుస్తూ అడిగాను.
వాడు నా చేతిలోనున్న పూతరేకు లాక్కుంటూ.. ”రాత్రి నేను నీ కథ వింటూ పూతరేకు తింటుంటే …నువ్వు నాకేసి విచిత్రంగా చూశావు. నా కంటే ముందుగా పడుకున్నావు. అనుమానం వచ్చింది. అందుకే లేచాను!” అన్నాడు.
నేను ఒక్కసారిగా మోకాళ్ళ పై వంగుతూ.. అభీ ని దగ్గరకు తీసుకున్నాను.
”ఒక్క స్వీట్‌ తింటాను. ఎవ్వరితో చెప్పకు. ఈ రోజు నీకు మరో గొప్ప కథ చెబుతాను. సరేనా” అంటూ లంచం ఇవ్వబోయాను.
”తాతయ్యా! నాకు రోజూ నువ్వు చెప్పే కథలు ఇష్టం. బడిలో స్నేహితులకు కూడా చెబుతాను. నీతో ఆడుకోవడం ఇంకా ఇష్టం. ఇలా నువ్వు తీపి తింటే.. నీకు జబ్బు ఎక్కువవుతుందని బామ్మ చెప్పింది. తినకుండా చూడమని కూడా అంది.
”ఒక్కటి తింటే ఏమీ కాదు” అంటూ వాడిని వారించాను.
”కడవలో పాలు పాడై పోవడానికి ఒక్క ఉప్పు రాయి చాలని” ఒక కథలో నాకు నువ్వే చెప్పావు.
నువ్వంటే నాకిష్టం. నువ్వుంటేనే ఇష్టం” అన్నాడు.
”నువ్వు ఎన్ని చెప్పినా, స్వీట్స్‌ తింటాను” మనవడితో అన్నాను.
”అయితే తాతయ్యా! సృష్టి లో బాగా తీయ నైనది ఏది?” అడిగాడు.
”సమాధానం చెబితే తినవచ్చా?” చిన్న పిల్లాడిని, ‘చిన్న పిల్లాడి’లా అడిగాను.
”ఓ!తప్పకుండా!” అన్నాడు.
”తేనె” అని చెప్పాను.
”మరి తేనె కన్నా తీయనిది?” మళ్ళీ అడిగాడు.
”స్నేహం” ఠక్కున చెప్పాను.
స్నేహం కన్నా తీయనిది పెడతాను. స్వీట్స్‌ తినకుండా ఉంటావా?” మాట ఇమ్మన్నుట్టుగా చేయి చాపుతూ అడిగాడు.
”ఏమై ఉంటుందా? నన్న ఆత్రంలో ”అయితే పెట్టు” అన్నాను.
అంతే.. అమాంతం వాడి చిట్టి పెదాలతో నా చెక్కిలిపై ముద్దు పెట్టాడు. అసలు కన్నా వడ్డీ తీపి. కొడుకు కన్నా మనవడు మరింత తీపి. ఇక వాడిచ్చిన ముద్దు మరింత తీపిగా అనిపించింది.
అప్రయత్నంగా కళ్ళు తడిబారాయి. నరం లేని నాలుక కంటే.. మనవడి ముద్దుతో వచ్చిన చర్మం స్పర్శ నాకు తీపి రుచి తెలిపింది.
అంతే ఆ క్షణంలో.. కృత్రిమంగా ఉండే తీపిని వదిలేసాను. ఆ రోజు నుండీ మనవడి ముద్దులో ఉన్న తీపిని ఆస్వాదించాలని అనుకున్నాను.
”మనవడా! నీ ముద్దు కంటే తీయనిది సృష్టిలోనే లేదు రా. మనది ”తీయని బంధం” అన్నాను నవ్వుతూ.
వాడి చేయి పట్టుకుని బెడ్‌ రూమ్‌ లోకి నడిచాను.

]]>
మాపటి మల్లెలు https://navatelangana.com/our-sister/ Sat, 17 Feb 2024 17:18:02 +0000 https://navatelangana.com/?p=230460 మాపటి మల్లెలు”మమ్మీ.. చూడు..”
పిల్లల యూనిట్‌ టెస్ట్‌ పేపర్స్‌ దిద్దుతున్న నేను నవ్వుతూ తలెత్తి శృతి కేసి చూసాను.
నాలుగేళ్ల శృతి బుజ్జి చేతులలో ఏదో భద్రంగా పట్టుకొని బుడిబుడి నడకలతో నా దగ్గరకి వచ్చింది.
”ఏంటి బంగారు” లాలనగా అడిగాను.
బుజ్జి చేతులు విప్పి చూపింది. ముదురు రాణీ పింక్‌ రంగులో చక్కని పూలు. మా చిన్నప్పుడు వాటిని ‘చంద్రకాంత పూలు’ అనే వాళ్ళం. అప్పట్లో రాణీ పింక్‌, తెలుపు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అందులో బోలెడు రంగులు కనిపిస్తున్నాయి.
”అబ్బా, ఎంత బాగున్నాయో” ఆశ్చర్యం చూపిస్తూ అన్నాను.
శృతి ముఖం వెలిగిపోయింది.
”మీనమ్మ ఇచ్చింది” పూలని భద్రంగా పట్టుకుని మురిపెంగా చూస్తుంది శృతి.
”ఏం పూలంటారు?”
”మీనమ్మ చెప్పలేదు” బిక్కమొఖమేసింది శృతి.
”నేనడుగుతానులే” బుజ్జగించే ప్రయత్నం చేసాను.
ముడిపడిన నొసలు సరిచేసుకొని, జాగ్రత్తగా ఆ పూలను బల్లమీద పెట్టి, తన బొమ్మలకేసి పరుగెత్తింది శృతి.
”అమ్మ, టీ..” మినమ్మ కప్పు తెచ్చింది.
”నువ్వు ఈ పూల పేరు చెప్పలేదట” నవ్వుతూ అన్నాను.
”శృతి పాప అందా” అడిగింది మీనమ్మా.
టీ తాగుతూ తలూపాను.
”మేము చిన్నప్పుడు చంద్రంకాత పూలు అనేవాళ్లం” నేనే చెప్పాను.
”ఆ పేరు తెలియదు. ఇక్కడ ‘మాపటి మల్లెలు’ అంటారు. సాయంత్రం పూసి, ఉదయానికి వాడిపోతాయి కదా, అందుకే” విడమరచి చెప్పింది మీనమ్మ.
ఖాళీ కప్పు తీసుకొని ఆమె వెళ్ళాక, అప్రయత్నంగా నా కళ్ళు పూలవైపు మళ్ళాయి.
చిక్కని రాణీ రంగులో ఏంతో అందంగా, సున్నితంగా ఉన్నాయి పూలు.
‘మాపటి మల్లెలు’ సన్నగా గొణిగినట్టు అన్నాను.
నిజమే, సాయంత్రం ఎంతో అందంగా ఉంటాయి, ఎండ తగిలే సరికి వాడిపోతారు.
నాకళ్లు శృతి వైపు మళ్ళాయి. తన బొమ్మలతో ఆటలో మునిగి ఉంది. అప్రయత్నంగా ఒక నిట్టూర్పు వదిలాను.
ఈసారి పూలమీదకు మళ్ళిన నా కళ్ళకి, నా చెల్లెలు నందన ముఖం కనిపించింది.
నందన నాకన్నా మూడేళ్లు చిన్న. అమ్మ నాన్నలకి మేమిద్దరమే పిల్లలం. మగపిల్లాడు లేడని అందరూ అన్నా నాన్న పట్టించుకోలేదు. తను, అమ్మ పొలం చేస్తూ, ఆడపిల్లల్ని చక్కగా చదివించాడు.
నేను టీచర్‌ ట్రైనింగ్‌ చేసి జిల్లా పరిషత్‌ టీచర్‌గా స్థిరపడ్డాను. నందన మాత్రం ఇంజనీరింగ్‌ అని సిటీ వెళ్ళడానికి సిద్ధపడింది. నాన్న ఏ మాత్రం సందేహించకుండా చెల్లిని అదే చదువుకి పంపాడు.
నాలుగేళ్ల చదువు, కాలేజీ స్నేహాలు, సిటీ జీవితం అన్నీ నందన మీద చాలా ప్రభావం చూపాయి. సెలవులని ఇంటికి రావడం నెమ్మదిగా తగ్గిపోయింది. చదువనీ, ప్రాజెక్ట్‌ అనీ మరేదో అనీ నెమ్మదిగా ఇంటికి దూరమైంది.
నాలుగేళ్ల చదువు పూర్తయి, ఏదో ఉద్యోగం అనీ, ఇంటికి రావడం మానేసింది. తనకే ఆందోళన కలిగి ఒకసారి గట్టిగా నిలదీసింది. నెమ్మదిగా గుట్టు విప్పి చెప్పింది నందన.
కాలేజీలో ఒక అబ్బాయి ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటాం అనీ, అయితే ఇంకా కొంతకాలం పడుతుందని….
నాకయితే భయమేసింది కానీ నందన చాలా ఖచ్చితంగా చెప్పింది. అతను మోసం చేయడు అన్న నమ్మకంతో, అమ్మా నాన్నలకి ఒప్పించే బాధ్యత నాకే అప్పచెప్పింది.
నెలలు గడుస్తున్నా, నందన దగ్గరనుండి కబురులేదు. రెండు రోజులు స్కూల్‌కి సెలవులు వస్తే, నేనే సిటీకి వెళ్ళాను. నందన ఉండే పీజీ హాస్టల్‌ దగ్గర తను అక్కడ ఉండటం లేడని చెప్తే, మరల తెలియని భయమేసింది.
మరెక్కడ వెతకాలి అని దిగాలుగా చూస్తుంటే, ఒక అమ్మాయి చిన్నగా తనచేతిలో ఒక చిన్న స్లిప్‌ పెట్టీ, వడివడిగా వెళ్ళిపోయింది.
ఆ స్లిప్‌లో ఒక అడ్రస్‌.. ఆటో మాట్లాడుకొని, బయలుదేరాను.
ఆ ఏరియా పేరు వినగానే ఆటో వాని ముఖం మారింది. కానీ మాట్లాడకుండా నడిపాడు.
ఒక అరగంట తరువాత ఇంచుమించు మురికివాడ లాంటి ఏరియా దగ్గర ఆపాడు. అతనికి డబ్బు చెల్లించి ఒక అడుగు ముందుకేసి, చుట్టూ చూసాను. ఇళ్ళు ఒకదానికి ఒకటి ఆనుకొని ఉన్నాయి. పాతబడిన గోడలు, పెయింట్‌ వేయక చాలా కాలమైనట్టున్నాయి.. మొత్తానికి, ఆ వాతావరణం నాకు ఆందోళన, అనుమానం కూడా కలిగించింది..
నా చేతిలోని స్లిప్‌ మీదున్న నంబర్‌ మరల ఒకసారి చూసుకొని, గోడలమీద రాసిన నంబర్లను చూసుకుంటూ ముందుకు నడిచాను. అప్పటికి నెమ్మదిగా మధ్యాహ్నం అవుతున్నా, ఆ ఇళ్ళల్లో ఎక్కడా అలికిడి లేదు. అసలు ఎవరైనా ఉన్నారా అని సందేహం కలిగింది. ఒక అయిదారు ఇళ్ళు దాటాక, నేను వెదుకుతున్న ఇల్లు దొరికింది.
మూసిన తలుపు, మురికి గోడలు, నిశ్శబ్దం.. ఇవన్నీ మనసును కలవర పెడుతున్నా, తలుపుకున్న గొళ్ళెం గట్టిగా తట్టాను. కొన్ని నిముషాల నిశ్శబ్దం తరువాత, భళ్ళున తలుపు తెరుచుకుంది.
”ఏమిటీ… పొద్దునే వస్తారు. సాయంత్రం గానీ మేం సిద్దం కామని తెలీదా?” ఆవలిస్తూ, చెరిగిన జుట్టు ముడి వేసే ప్రయత్నం చేస్తూ అడుగుతుంది ఒక మధ్య వయస్సు మనిషి.
నన్ను చూస్తూనే ఆవిడ చిరాకు తగ్గింది..”ఎవరు మీరు, ఏం కావాలి?” అడిగింది.
నందన ఇక్కడ ఎందుకు ఉంటుంది అనుకుంటూ… ”నందన..” అని చిన్నగా అన్నాను.
”ఓ, ఆ పిల్లా.. నీకేమవుతాది?”
నేను మౌనంగా ఉండిపోయాను.
”సరే, నాకెందుకు.. మంచం పట్టి పది రోజులు. నాకు బేరం లేనిది, మందులు కొనడం కుదరదు. మందులకు డబ్బులిస్తే చూపిస్తా…” తలుపు రెక్కకి ఆనుకొని అడిగింది.
మారుమాట్లాడకుండ పర్స్‌లోంచి అందినంత డబ్బు తీసి ఆమెకి అందించాను. మెరుస్తున్న కళ్ళతో అందుకుని, జాకెట్లో దోపుకుంటూ, చేత్తో సైగ చేసింది. సందేహంగా ఆమె వెనక లోపలికి నడిచాను. పగలే అయినా లోపల చీకటిగా ఉంది. చీకటితోపాటు ఒకలాంటి గబ్బు వాసన… కడుపులో తిప్పుతున్న ఫీలింగ్‌. చీర చెంగుతో ముక్కు మూసుకుంటూ, ఆమెను అనుసరించాను.
గదుల్లో గదుల్లోంచి ఆమె వెనకాల నడుస్తూ, చుట్టూ చూడటానికి కూడా భయపడ్డాను. ఇటువంటి ప్రదేశంలో నందిని ఉండదు, ఆ అమ్మాయి పొరబడింది అనీ మనసులో ఏదో ఆశ! ఒక మూలగా ఉన్న తలుపు మూసిన గది ముందు ఆగి, వెళ్లు అన్నట్లు సైగ చేసి ఆమె వెను తిరిగింది..
నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుంది.. నెమ్మదిగా తలుపు తోసాను. లోపల నా చెల్లెలు వుండకూడదు అని నా మనసు పదేపదే కోరుకుంటుంది.
ఒక పక్కగా ఉన్న చిన్న కిటికీ నుండి పడుతున్న మసక వెలుతురులో, కిటికీ పక్కన మంచం కనిపించింది. మిగతా గదిని పరిశీలించే ఉద్దేశం నాకు లేదు. అందుకే తిన్నగా మంచం వద్దకు నడిచాను.. దుప్పటి కప్పుకున్న ఆకారం. స్పష్టంగా కనిపించటం లేదు. సరిగ్గా ముఖం మీద మాత్రం నీడ పడుతుంది.
నా కళ్ళు ఆత్రంగా వెతికేలోగా,” అక్కా” అంటూ సన్నని స్వరం… గుండె జారిపోయింది…
నోట మాట రాక నిలిచిపోయిన నేను, మరోసారి ”అక్కా, నువ్వేనా” అన్న మాటలకి ఉలిక్కి పడ్డాను.
”వందనా” ఇంకా అయోమయంగా అడిగాను..
”అక్కా, ఇక్కడికెలా వచ్చావు?” నందన బలహీనమైన స్వరంతో అడిగింది.
”ఆ ప్రశ్న నేను అడగాలి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఏమిటిది?” కళ్ళనుండి నీరు జలజల రాలాయి..
”అక్కా” భోరుమంది నందన. మంచం మీద నందన శరీరం దు:ఖానికి ఎగిసిపడే దానిబట్టి, ఆమె మంచం మీద ఉందని తెలుస్తుంది. ఎముకల గూడు మీద దుప్పటి కప్పినట్టుంది.
అక్కా చెల్లెళ్లం ఒకరినొకరు కావలించుకొని ఎంతసేపు ఉన్నామో తెలియలేదు.. నా మనసులో ఎన్నో ప్రశ్నలు.
నెమ్మదిగా నందినిని నా చేతుల్లో నుంచి తప్పించి, ఒకసారి తేరి చూసాను. నందిని ఎముకల గూడులా ఉంది. కానీ పొట్ట మాత్రం పెద్దగా ఉంది. నా చూపు పొట్టమీద ఆగడం గమనించి, నందిని నెమ్మదిగా వెనక్కి జరిగి గోడకి చేరపడింది.
”నా బుద్దిహీనతకి బహుమానం అక్కా…పెళ్లి చేసుకుంటాననినీ నమ్మించి, వాడుకున్నంత వాడుకుని, ప్రెగెన్సీ అనీ చెప్పగానే, పిన్ని ఇల్లు అని చెప్పి, ఇక్కడ పెట్టి, మాయమైపోయాడు…” కిటికీలో నుండి బయటకు చూస్తూ నిర్లిప్తంగా చెప్పింది.
”ఎవరతను, నాకు చెప్పు. నేను మాట్లాడుతాను” అనునయంగా చెప్పాను.
నిర్జీవమైన నవ్వు నవ్వింది నందిని.
”ఆ అవకాశం లేదక్కా.. అమెరికా వెళిపోయాడు..”
”అయినా పరవాలేదు. కంప్లైంట్‌ పెడదాం.. వివరాలు చెప్పు” బతిమాలి అడిగాను.
”వద్దక్కా, ప్రేమలేదు అని తెలిసాక, మళ్ళా అతనితో కలవడం అనవసరం అక్కా..” స్థిరంగా చెప్పింది.
ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న దృఢ సంకల్పం అర్ధమై, మౌనంగా ఉండిపోయాను..
”సరే, పద..ఇంటికి వెళదాం..”
”వద్ధక్కా, నాన్న నామీద పెట్టుకున్న నమ్మకం చంపేశా. ఏ ముఖం పెట్టుకొని నాన్నని కలవగలను..” కళ్ళవెంట నీళ్ళు జలజల రాలాయి.
”అదేం ఫరవాలేదు. నువ్వులేచి బయల్దేరు.”
”నాకు ఇప్పుడు ఏడో నెల అక్కా..” నా ముఖంలోకి సూటిగా చూస్తూ అంది నందిని.
”ఇంటిదగ్గర బాగుంటుంది. పద పద” హడావిడి చేసాను.
”అక్కా… నన్ను క్షమించు. నేను రాలేను” భోరుమంది.
నాకేమీ తోచలేదు. నందిని నా మాట వినేలా లేదు. అలా అని తనని అక్కడ వదిలి వెళ్ళే ప్రసక్తి లేదు. ఏడ్చి ఏడ్చి నందిని మగత నిద్రలోకి జారుకుంది.
ఏమీ పాలుపోక మంచం మీద ఒక పక్కగా కూర్చుని, ఫోన్‌ తీసి చూసాను. రెండు మిస్డ్‌ కాల్స్‌. భార్గవ నుండి. భార్గవ నాకు బి.ఇడి లో పరిచయం. నాలాంటి కుటుంబ నేపథ్యం.. అందువల్ల ఇద్దరం ఇష్టపడ్డం. కానీ నందిని కూడా స్థిరపడ్డాక, పెళ్లి విషయం మాట్లాడాలని అనుకున్నాం.
భార్గవ సిటీలోనే గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో పనిచేస్తున్నాడు. ఫోన్లో భార్గవ పేరు మీద బట్టన్నొక్కి, కాల్‌ చేసాను. రెండో రింగుకే పలికాడు.
”సారీ భార్గవ, నీ కాల్స్‌ మిస్‌ అయ్యాను” ముందుగా చెప్పాను.
”ఫరవాలేదు.. బిజినా?” అడిగాడు.
”నేను సిటికే వచ్చాను. నీతో మాట్లాడాలి. రాగలవా?” అడిగాను.
”మరో పది నిముషాల్లో లంచ్‌ టైమ్‌.. ఎక్కడికి రావాలి?” అడిగాడు.
అడ్రస్‌ చెప్పాను. భార్గవ వైపు కొంత నిశ్శబ్దం.
”హలో” నెమ్మదిగా పిలిచాను.
”ఆ ఏరియాలో నీకేం పని చందనా? అది అంత మంచి ఏరియా కాదు”
”నువ్వు వస్తే చెపుతాను. రాలేను అంటే ఫరవాలేదు..” స్థిరంగా చెప్పాను. భార్గవ సందేహం నాకు అర్థమైంది. కానీ నందన, భార్గవ కంటే నాకు నందనే ముఖ్యం.
”అరగంటలో అక్కడ ఉంటా” భార్గవ ఫోన్‌ కట్‌ చేసాడు.
తరవాత భార్గవ రావడం, పరిస్థితి అర్ధం చేసుకోవడం జరిగింది. నందిని ని భార్గవకి తెలిసిన వర్కింగ్‌ వుమన్స్‌ హాస్టల్‌ లో పెట్టి, అక్కడ వార్డెన్‌ కి అప్పజెప్పాం.
తరువాత రెండు నెలలు… ఇంట్లో విషయం తెలియకుండా, తరుచుగా సిటీలో క్లాసులని చెప్పి వస్తూ…నందినిని జాగ్రత్తగా చూసుకున్నాం.. భార్గవ కూడా చేతనైనంత హెల్ప్‌ చేసాడు.
అంతా బాగుందనుకున్న సమయంలో నాన్నకి పక్షవాతం… పొలం పనులు చేయలేక పొలం కౌలు కిచ్చారు. నాన్నని చూస్తూ, సపర్యలు చేస్తూ, అమ్మ నిద్రలోనే గుండె నొప్పితో ప్రాణం విడిచింది.
చెల్లికి ఈ విషయం చెప్పలేక, చెల్లి విషయం నాన్నకి చెప్పలేక సతమతమై ఉక్కిరబిక్కిరయ్యాను. నాన్న మధ్యమధ్యలో చెల్లి గురించి అడిగినా, సెలవు దొరకటం లేదని చెపుతూ గడిపాను.
ఒకరోజు స్కూల్లో ఉండగా భార్గవ నుండి ఫోన్‌.. హడావిడిగా సిటీ కి పరుగెత్తాను. నందినికి నొప్పులు మొదలైతే, హాస్పిటల్‌ కి తీసుకువెళ్లారు. నెలలు నిండక ముందే పాప పుట్టింది. నందిని బల్ల మీద ప్రాణం వదిలింది. ఇంక్యుబటర్‌లో ఉన్న పసి గుడ్డును అయోమయంగా చూసాను. భార్గవ నా పక్కనే ఉన్నాడు. బేలగా అతని ముఖంలోకి చూస్తే, ధైర్యం చెప్పాడు. నాన్నకి చెప్పకుండానే నందిని దహన సంస్కారాలు ముగించి ఇంటికి వచ్చాను.
నాన్న తనలో తనే మాట్లాడుకుంటున్నారు. మరుసటి రోజు భార్గవని ఇంటికి పిలిచి, నాన్నకి పరిచయం చేసాను.
”చెల్లి… చెల్లి” అంటూ తడబడుతున్న నాలికతో అడిగాడు.
”చెప్పాను, వస్తుంది” అనీ అబద్దం చెప్పి, రెండు రోజుల తరువాత రిజిస్టర్‌ ఆఫీస్‌లో పెళ్లి చేసుకున్నాం.
చిన్న పాపని మరో పది రోజులైనా హాస్పిటల్‌లో ఉంచాలన్నారు. తరువాత చిన్ని శృతిని ఇంటికి తెచ్చి, నాన్నకి చూపాను. అర్ధం కానట్లు చూసాడు.
”మేము పెంచుకుంటాం. అమ్మానాన్న లేరు” వివరించాను.
నాన్న సంతోషంగా తలూపాడు. ఆ రకంగా శృతి నా కూతురైంది. భార్గవ శృతిని చాలా గారం చేస్తాడు. శృతికి ఏడాది నిండకముందే నాన్న కాలం చేసాడు.
భార్గవ, నేను ప్రస్తుతం సిటీలోనే ఉద్యోగాలు చేస్తున్నాం. కానీ ఏదో వంకన నా ఆలోచన నందిని మీదకి మల్లుతుంది. నందిని వేసిన తప్పటడుగు శృతి పాలిట శాపం కాకుండా, నేను భార్గవ నిలుచున్నాం. కానీ ఈ కాలపు పిల్లల తొందరపాటు పనులకి ఇలాంటి శృతులు ఇంకా చాలామంది బలవుతున్నారు.
తెలిసీతెలియని వయస్సులో, సినిమాల ప్రభావం వల్ల ఆకర్షణను ప్రేమనుకొని, ఆడపిల్లలు పక్కదారి పడుతున్నారు. జల్సా చేసుకుని అబ్బాయిలు ముఖాలు చాటేస్తున్నారు. అది మామూలే! ఎక్కడో ఒకరు భార్గవ లాంటి వాళ్లు ఉంటారు. అలాగే అందరు పసివాళ్లు, శృతిలా అదృష్టవంతులు కాలేరు.
నందిని లాంటి ఆడపిల్లలు ‘మాపటి మల్లెల’లాగా, ఒక్కసారి విరబూసి వాడుతున్నారు.. రోజులు ఎంత మారినా, మగవానికి ఆడది విలాస వస్తువు లెక్కే! అభం శుభం తెలియని చంటి బిడ్డలు అనాధలుగా రోడ్లపాలవ కూడదు.. ఆధునికత పేరుతో సంప్రదాయాలు, కట్టుబాట్లు మరచి మాపటి మల్లెలు కావద్దు అని నా స్టూడెంట్స్‌కి, తెలిసిన పిల్లలందరికీ చెపుతాను. కానీ నా చెల్లెలు నాకు తిరిగి రాదు….
– మృదుల పోరెడ్డి
6303909565

]]>