సీబీసీ చెక్కభజన..

– జనం సొమ్ముతో బీజేపీ ప్రచారం
– 113 రోజుల్లో సుమారు రూ.39 కోట్ల వ్యయం
– ‘మోడీ గ్యారంటీ’ కోసం కోట్లు ఖర్చు
ముంబయి : అది ప్రభుత్వ పథకాలు, ప్రణాళికలను గురించి ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (సీబీసీ). కానీ అది తన విధులను గాలికి వదిలేసి పాలక బీజేపీ సేవలో తరిస్తోంది. ఎన్నికలకు ముందు ఆ పార్టీ కోసం గూగుల్‌ యాడ్స్‌లో పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. గత నవంబరులోనే దేశంలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. అదే అదనుగా భావించిన బీజేపీ భారీ స్థాయిలో రాజకీయ ప్రకటనలు గుప్పించడం ప్రారంభించింది. అది కూడా ప్రభుత్వ సొమ్ముతో. అంటే ‘సొమ్మొకడిది…సోకొకడిది’ అన్న మాట. ఇందుకోసం సీబీసీ సేవలను ఉపయోగించుకుంది.
‘మోడీ కీ గ్యారంటీ’ అనేది మోడీ వ్యక్తిగత హామీ. కానీ దానికి సీబీసీ ప్రచారం కల్పించింది. మోడీ కీ గ్యారంటీ అనే ట్యాగ్‌లైన్‌తో నవంబర్‌ మూడో వారం నుంచే గూగుల్‌లో బీజేపీ ప్రచారం ప్రారంభించింది. అదే సమయంలో మరో సంస్థ దాదాపు అదే తరహా ప్రచారం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం మొదలు పెట్టింది. దానికి ‘మోడీ సర్కార్‌ కీ గ్యారంటీ’ అని పేరు పెట్టింది. అయితే కొన్ని నెలల పాటు కొనసాగిన ఆ వీడియో ప్రకటనలో మోడీ గ్యారంటీ అనే చెప్పుకున్నారు.
కాంగ్రెస్‌ ఫిర్యాదు
ఈ ప్రకటనలు బీజేపీ నుంచి రాలేదు. అలా వచ్చి ఉంటే అభ్యంతరం ఏముంటుంది? ప్రభుత్వ ప్రచార సంస్థ సీబీసీ.. ఈ ప్రకటనల బాధ్యతను భుజాన వేసుకుంది. ఆ ప్రచారానికి వెచ్చించిన సొమ్మంతా పన్ను చెల్లింపుదారులదే. సీబీఐ ప్రకటనలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నా యని, ఆ సంస్థ పాలక పక్షం ప్రచారం కోసం ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ మార్చి 22న ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. బీజేపీ ప్రచారం కోసం ప్రజాధనాన్ని ఉపయోగించడంపై అల్‌ జజీరా ఛానల్‌ విచారణ చేపట్టింది.
రికార్డు స్థాయిలో సీబీసీ ఖర్చు
సుమారు నాలుగు నెలల వ్యవధిలోనే గూగుల్‌ ప్రకటనల కోసం సీబీసీ రూ.38.7 కోట్లు ఖర్చు చేసిందని అల్‌ జజీరా తేల్చింది. నవంబరులో ఆన్‌లైన్‌ వేదికపై ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టిన ఆ సంస్థ మార్చి 15 వరకూ దానిని కొనసాగించింది. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవడంతో ఈ ప్రచారానికి బ్రేక్‌ పడింది. ఆ కాలంలో గూగుల్‌లో ప్రకటనల కోసం అధిక మొత్తం వెచ్చించిన సంస్థగా సీబీసీ రికార్డు సృష్టించింది. రెండో స్థానంలోబీజేపీ రూ.31.4 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా 113 రోజుల పాటు సీబీసీ ప్రచారం కొనసాగింది. 2018 జూన్‌ నుంచి ఈ ఏడాది మార్చి 15 వరకూ… అంటే సుమారు ఆరేండ్లలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ పెట్టిన ప్రకటనల ఖర్చు రూ.27.5 కోట్లతో పోలిస్తే కేవలం 113 రోజుల్లో సీబీసీ పెట్టిన వ్యయం 41 శాతం అదనం.
మోడీ కీ పరివార్‌ వెనుక…
సీబీసీ ఇచ్చిన అనేక ప్రకటనలు నినాదాలతో నిండిపోయాయి. అవన్నీ బీజేపీకి ఉపకరించే సందేశాలే. తటస్థంగా ఉండాల్సిన ప్రభుత్వ సంస్థలను బీజేపీ తన ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ప్రతిపక్షాలు ఎంతగా ఆరోపించినప్పటికీ కమలదళం పట్టించుకోలేదు. ప్రధానికి ఓ కుటుంబం అంటూ ఏదీ లేదని, ఆయన తన భార్యను వదిలేశారని, పిల్లలు లేరని మార్చిలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ విమర్శించారు. దీనిపై ఆఘమేఘాలపై స్పందించిన బీజేపీ నేతలు తమ సామాజిక మీడియా ప్రొఫైల్స్‌ను మార్చేశారు. తమ పేర్ల పక్కన ‘మోడీ కీ పరివార్‌’ (మోడీ కుటుంబం) అని చేర్చారు.
వ్యక్తిగత ప్రకటనల కోసం…
‘మోడీ కీ గ్యారంటీ’ పేరుతో సీబీసీ ప్రకటనలు విడుదల చేసింది. యూట్యూబ్‌, గూగుల్‌ యాడ్స్‌లో కూడా ‘మోడీ కీ పరివార్‌’ పేరిట ప్రకటనలు ఇచ్చింది. ఈ వ్యక్తిగత ప్రకటనల కోసం సీబీసీ పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. సాయుధ దళాలతో కలిసి మోడీ దీపావళిని జరుపుకున్నట్లు మార్చి 9న ఓ ప్రకటన వచ్చింది. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ ప్రకటన కోసం సీబీసీ రూ.5.50 లక్షలు ఖర్చు చేసింది. తొలి దశ పోలింగ్‌కు వారం రోజుల ముందు బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసింది. అందులో మోడీ ఫొటో, కాషాయ రంగులు, మోడీ కీ గ్యారంటీ నినాదం ఉన్నాయి. ప్రజాధనంతో సీబీసీ ఇచ్చిన ప్రకటనల్లోనూ ఇవన్నీ ఉన్నాయి.
బీజేపీ ముందుచూపు
ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ప్రయోజనాలను ప్రచారం చేయకూడదని, అవి విధిగా ప్రభుత్వ కర్తవ్యాలకు సంబంధించినవై ఉండాలని 2015లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం దీనిని ఖాతరు చేయడం లేదు. 2023 మేలో… అంటే సార్వత్రిక సమరానికి సంవత్సరం ముందు మోడీ ప్రభుత్వం సీబీసీ బడ్జెట్‌ను ఏకంగా 275 శాతానికి పెంచేసింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు తమ ప్రకటనలు, ప్రచార బడ్జెట్‌లో 40 శాతం విధిగా సీబీసీకి ఇవ్వాలని నిర్దేశించింది. తద్వారా ఎన్నికల సంవత్సరంలో ఆ సంస్థ ఆర్థిక వనరులను బాగా పెంచింది. వార్తా పత్రికలు, టీవీ, రేడియో, ఔట్‌డోర్‌ ప్రకటనలకే పరిమితమైన సీబీసీ, గూగుల్‌ వంటి డిజిటల్‌ వేదికలను కూడా ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ గత సంవత్సరం నవంబరులో ప్రభుత్వం నూతన డిజిటల్‌ ప్రచార విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో డిజిటల్‌ వేదికల్లో ప్రచార ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది. ఇవన్నీ బీజేపీ ముందుచూపుతో చేసిన పనులే.

Spread the love