కోల్‌కతా అభయ కేసులో సీబీఐ విచారణ పూర్తి చేయాలి

CBI investigation in Kolkata Abhaya case should be completed– దోషులను కఠినంగా శిక్షించాంటూ ప్రదర్శన
– 9న ధర్నాలు, ఆందోళనలకు పిలుపు
– కుట్ర బయటపెట్టాలంటూ మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ రౌండ్‌ టేబుల్‌ డిమాండ్‌
– త్వరలో గవర్నర్‌, మహిళా కమిషన్‌కు వినతులు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పశ్చిమబెంగాల్‌ కోల్‌కత్తా ఆర్‌జీకర్‌ ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్‌ అభయపై లైంగిక దాడి కేసులో సీబీఐ విచారణను సత్వరమే పూర్తి చేయాలని మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ తెలంగాణ కమిటీ డిమాండ్‌ చేసింది. పూర్తిస్థాయి విచారణ ద్వారా కుట్రను ఛేదించి దోషులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేసింది. పశ్చిమబెంగాల్‌ జూనియర్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది. ఈమేరకు ఆ సంఘం ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పదుల సంఖ్యలో మహిళలు, విద్యార్థులు, న్యాయవాదులు, మెడికోలు, డాక్టర్లు, ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు. జూనియర్‌ డాక్టర్‌ అభయకు న్యాయం చేయాలి, మహిళలకు భద్రత కల్పించాలి, ఆర్‌జీకర్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈసందర్భంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. అనంతరం ఎస్‌వీకేలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీవోడబ్ల్యూ సంధ్య , ఏఎన్‌ఎఫ్‌ఐడబ్య్లూ నాయకులు జ్యోతి, కృష్ణకుమారి, పీవోడబ్ల్యూ ఝాన్సీ, పీవోడబ్ల్యూ అనుసూయ తదితర సంఘాల నాయకులు, డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి(ఉస్మానియా), డాక్టర్‌ సమీర(మెడికో), అడ్వకేట్‌ లక్ష్మి, ఐఎఫ్‌టీ అనురాధ, పీడీఎస్‌యూ పద్మ, పీవైఎల్‌ ప్రదీప్‌, విజ్ఞాన దర్శిని రమేష్‌, సీఎంఎస్‌ అరుణ తదితరులు పాల్గొనగా వివిధ మహిళా సంఘాల నాయకులు నాగలక్ష్మి, వరలక్ష్మి, అనసూయ అధ్యక్షత వహించారు. కోల్‌కత్తా ఘటన, డాక్టర్స్‌ ఫ్రంట్‌ ఆందోళన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం, భవిష్యత్తు కార్యాచరణపై రౌండ్‌టేబుల్‌లో చర్చించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్‌ డాక్టర్స్‌ ఫ్రంట్‌ పిలుపు మేరకు ఈనెల 9న రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. కవాతులు, మానవహారాలు, నిరసన సమావేశాలు, సాంస్కృతిక నిరసన, పాటలు, నాటికల ద్వారా స్పందించి నిరసన తెలపాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్‌ డాక్టర్లకు సీనియర్‌ డాక్టర్లు సంఘీభావం తెలిపి ఆందోళనల్లో భాగస్వాములు కావడాన్ని అభినందించారు. జూనియర్‌ డాక్టర్‌ అభయకేసులో సీబీఐ విచారణ నత్తనడకన సాగుతున్నదని తప్పుబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌, మహిళా కమిషన్‌కు వినతిపత్రాలు ఇవ్వనున్నట్టు తెలియజేశారు.
డాక్టర్‌ అభయకు అందరూ సంఘీభావం చెప్పాలని పిలుపునిచ్చారు. లైంగిక దాడికి పాల్పడిన ప్రిన్సిపాల్‌ ప్రతిష్టాత్మక సంస్థలో పోస్టింగ్‌ ఇవ్వడాన్ని ఖండించారు. అభయకు మద్దతుగా గత అక్టోబరు తొమ్మిదిన 70 మందికిపైగా సీనియర్‌ డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడాన్ని స్వాగతించారు. డాక్టర్లకు పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా మోడీ ప్రభుత్వం చడీచప్పుడు చేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

Spread the love