ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై విచారణ చేపట్టిన సీబీఐ

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ఘటనపై విచారణ చేపట్టిన సీబీఐన్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్ర నగర్‌ ప్రాంతంలోని కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో ముగ్గురు సివిల్‌ సర్వీసెస్‌ అభ్యర్థులు మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీబీఐ విచారణ చేపట్టింది. విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ (ఎంసీడీ) అధికారులపై చర్య తీసుకోవటంలో విఫలమైనందుకు ఢిల్లీ హైకోర్టు అక్కడి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత సీబీఐ మంగళవారం ఆలస్యంగా ఈ విషయంలో కేసును తిరిగి నమోదు చేసింది. ఈ అంశంపై గతవారం సీబీఐ విచారణకు ఆదేశిస్తూ.. నగరంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఢిల్లీ ప్రభుత్వ అసమర్థతపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌, న్యాయమూర్తి తుషార్‌ రావు గెడెలతో కూడిన ధర్మాసనం సంఘటన స్వభావాన్ని బట్టి దర్యాప్తుపై ప్రజలకు అనుమానం రాకుండా చూసేందుకు విచారణను బదిలీ చేసింది. గతనెల 27న స్థానికంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రౌస్‌ ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ కోచింగ్‌ సెంటర్‌లోని బేస్‌మెంట్‌ లైబ్రరీ వరదల్లో మునిగిపోవడంతో తాన్యా సోని(21), శ్రేయా యాదవ్‌(25), నెవిన్‌ డెల్విన్‌(29) మునిగిపోయి ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటన కోచింగ్‌ సెంటర్‌ వెలుపల నిరసనలకు దారితీసింది. పోలీసులు భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోచింగ్‌ సెంటర్‌ సీఈవో, యజమాని అభిషేక్‌ గుప్తా (41), ఇన్‌స్టిట్యూట్‌ కోఆర్డినేటర్‌ డీపీ సింగ్‌ (60)లను అరెస్టు చేశారు. వరద ఘటనపై విచారణకు కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్యానెల్‌ తన నివేదికను 30 రోజుల్లో సమర్పిస్తుందని మంత్రిత్వ శాఖ వివరించిన విషయం విదితమే.

Spread the love