– విచారణకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా.. అందుకు న్యాయస్థానం సమ్మతించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒక రోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు విధించింది. అలాగే, విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది డిసెంబర్లో హైదరాబాద్‌లోని కవిత నివాసంలోనే సీబీఐ అధికారులు ఆమెను మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించనున్నట్టు సమాచారం. గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం, అప్రూవర్‌గా మారినవాళ్లు, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు సమాచారం.