చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు

CCTV cameras around the ponds– ఔటర్‌ లోపలి ఆక్రమణల నమోదు
– అర్హులైన పేదలకు డబుల్‌ బెడ్‌రూంలు : మూసీ రివర్‌ఫ్రంట్‌ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపల ఉన్న చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మంగళవారంనాడాయన తన నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌, మెట్రోరైల్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపల ఉన్న చెరువుల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూంకు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. మంగళవారంనాడాయన తన నివాసంలో మూసీ రివర్‌ ఫ్రంట్‌, మెట్రోరైల్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిశోర్‌, మెట్రోరైల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, మూసీ పరివాహక ప్రాంతాలను గుర్తించి ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లను గుర్తించాలని చెప్పారు. ప్రతి చెరువు, నాలాల ఆక్రమణల వివరాలు సేకరించి, దానిపై సాధ్యమైంనంత త్వరగా పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. అక్రమణల గుర్తింపు సందర్భంగానే అర్హులైన పేదలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాంటి వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కేటాయించాలని చెప్పారు. పేదల జోలికి మాత్రం వెళ్లొద్దని అధికారుల్ని ఆదేశించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్‌ సిటీకి మెట్రోరైల్‌ మార్గంపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని కోరారు. ఓల్డ్‌సిటీ మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలన్నారు. మెట్రో మార్గాలకు భూసేకరణ, ఇతర అడ్డంకులు ఏమైనా ఉంటే వాటిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిపెట్టి, పరిష్కరించాలని చెప్పారు. ఎల్‌బీ నగర్‌ నుంచి హయత్‌నగర్‌, ఎమ్‌జీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌కు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు (డీపీఆర్‌) సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని ఆదేశించారు.

Spread the love