షేక్ హసీనాకు తాత్కాలిక ఆశ్రయంకు కేంద్రం అనుమతి!

Sheikh Hasinaనవతెలంగాణ – హైదరాబాద్
రిజర్వేషన్ల కోటా కోసం ఆందోళనలతో దేశం అల్లకల్లోలంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. భద్రత కోసం పక్కనే ఉన్న భారత్‌కు ఆమె నిన్ననే (సోమవారం) వచ్చారు. అయితే ఆమె ఇక్కడ తాత్కాలిక నివాసం పొందేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌లో ఆమె నివాసానికి తాత్కాలిక ఆమోదం మాత్రమే లభించిందని, యూకేలో ఆశ్రయం అంశం ప్రస్తుతం పెండింగ్‌లో ఉందని పేర్కొంది. హసీనా యూకేలో ఆశ్రయం పొందాలనుకుంటున్నారని, అక్కడి ప్రభుత్వం నుంచి అనుమతి దక్కే వరకు ఆమె భారత్‌లోనే ఉంటారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది. షేక్ హసీనా రాజకీయ ఆశ్రయం విజ్ఞప్తికి సంబంధించి ప్రస్తుతానికి యూకే ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ధారణ లేదని పేర్కొంది. హసీనాతో పాటు ఆమె సోదరి రెహానా కూడా యూకేలో ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారని ‘డైలీ సన్’ కథనం పేర్కొంది. కాగా హసీనాకు భారత్ పూర్తి ప్రయాణ సహకారం అందించనుందని వివరించింది.

Spread the love