– 1950లో తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధం : సీఆర్‌ఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మతం మారిన దళితులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష కొనసాగిస్తున్నదని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మతాలకతీతంగా రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో సివిల్ రైట్స్ ఇన్షియేటివ్ ఇంటర్నేషనల్ (సీఆర్‌ఐఐ) ఆధ్వర్యంలో డేనియల్ ఆఫ్ ఫ్రీడమ్ టూ దళిత్ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్ జాన్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మధు, ఐఏఎస్ అధికారి రాణి కుముదుని, సుప్రీంకోర్టు న్యాయవాది ఫ్రాంక్లిన్ థామస్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తదితరులు హాజరై మాట్లాడారు. దళిత కులాల్లో జన్మించి మతం మారిన కారణంగా రిజర్వేషన్లు మార్చడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని అన్నారు. దేశంలో ఏ మతంలో లేని విధంగా కేవలం దళితులు మతం మారిన వెంటనే వారి రిజర్వేషన్లను తొలగించడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 1950లో తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. సచారి కమిషన్ నుంచి మొదలుకుని నేటి బాలకిషన్ కమిషన్ వరకు 70 ఏండ్లుగా దళిత క్రైస్తవులు అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కాలయాపనకు కమిషన్లు వేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దళిత క్రైస్తవులందరూ ఐక్యంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని వక్తలు పిలుపు నిచ్చారు. మత పరమైన రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతున్న బాలకిషన్ కమిషన్ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో.క్రైస్తవులంతా వారి ముందు తమ వాదనను బలంగా వినిపించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.