రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతోంది

Center is copying state government schemes– బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే మెదక్‌ మరింత అభివృద్ధి : మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-పాపన్నపేట
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వినూత్న పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు పొరుగు రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని వైద్యా ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. శుక్రవారం మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌ రెడ్డి ఆయన సొంత గ్రామమైన యూసుఫ్‌ పేటలో మంత్రి హరీశ్‌రావు సమక్షంలో తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కేరళ, పంజాబ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు చూసి ప్రశంసించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని సైతం ప్రధానమంత్రి కాపీ కొట్టారన్నారు. మెదక్‌ అభివృద్ధి కేవలం పద్మా దేవేందర్‌ రెడ్డితోనే సాధ్యమవుతుందన్నారు. కొంతమంది నాయకులు డబ్బుతోనే గెలుస్తామనుకుంటున్నారని, మెదక్‌ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఎవరూ కొనలేరని తెలిపారు. మెదక్‌ జిల్లా కేసీఆర్‌ ఆశీస్సులు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి కృషితో దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో మెదక్‌ ప్రాంతవాసులు ఘనాపూర్‌ ఆనకట్ట సాగునీటి కోసం ధర్నాలు చేసి జీపులు కట్టుకొని హైదరాబాద్‌ వెళ్లేవారని, అప్పుడు కానీ సింగూరు నీరు ఘనాపూర్‌ ఆనకట్టకు వదిలే వారు కాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తెచ్చి సింగూరు నీళ్లను మెదక్‌ జిల్లాకే వాడుకునేలా జీవో తెచ్చారని, దీంతో సింగూరు కింద ఘనాపూర్‌ ఆనకట్ట పరిధిలో రెండు పంటలు పండుతున్నాయని తెలిపారు. అప్పట్లో వ్యవసాయం దండగా అన్న నాయకుల నోటి నుంచి వ్యవసాయం పండుగ అనేలా ముఖ్యమంత్రి చేశారన్నారు. ఉచిత కరెంటు మేమే ఇచ్చామని రేవంత్‌ రెడ్డి చెబుతున్నారని, అది ఉత్త కరెంటేనని ఎద్దేవా చేశారు. అప్పట్లో కరెంటు లేక సాగు నీరు అందక ఎకరాల కొద్ది పంట ఎండిపోయేదని, ప్రస్తుతం ఎక్కడ గుంట కూడా ఎండటం లేదన్నారు. తెలంగాణలో వేరే పార్టీని గెలిపిస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కరెంటు ఉండటం లేదని చెప్పారు. మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ రెడ్డి మెదక్‌ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తాము శశిధర్‌ రెడ్డి శాసనసభలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకసారి మెదక్‌ పట్టణంలో ప్రధానమంత్రి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించగా శశిధర్‌ రెడ్డి తాము ఒక వేదికపై ఉన్నామ ని మంత్రి గుర్తు చేశారు. వీరి ఆధ్వర్యంలో మెదక్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎ స్‌ బలోపేతం అవుతుందని, విజయం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Spread the love