సింగరేణి మెడపై కేంద్రం కత్తి

Center sword on Singareni's neck– వందేండ్ల సంస్థను బీజేపీ, కాంగ్రెస్‌ బొందపెడుతున్నయి
– ఎన్డీయే చర్యలకు రేవంత్‌ ప్రభుత్వం మద్దతు
– ఈ విషయంపై సీఎం ఎందుకు స్పందించటం లేదు
– కేసుల భయమా..? మరేదైనా కారణమా..? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎనిమిది ఎంపీ సీట్లను బీజేపీ, మరో ఎనిమిది స్థానాలకు కాంగ్రెస్‌కు అప్పజెపితే… ఆ రెండు పార్టీలూ కలిసి తెలంగాణకే తలమానికమైన సింగరేణిని ఖతం పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. బొగ్గు గనుల వేలం పేరిట ఆ సంస్థ మెడపై కేంద్రం కత్తిని వేలాడదీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తదితరులతో కలిసి కేటీఆర్‌ విలేకర్ల సమావేశం నిర్వహించారు. వందేడ్ల చరిత్ర ఉన్న సింగరేణిని బొందపెట్టేందుకు మోడీ సర్కారు ప్రయత్నించటం దారుణమన్నారు. కేంద్రానికి వత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో మోడీ సర్కారుకు మద్దతు పలుకుతోందని దుయ్యబట్టారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ప్రధానికి లేఖ రాసిన రేవంత్‌… ఇప్పుడు సీఎం హోదాలో ఎందుకు వ్యతిరేకించటం లేదని ప్రశ్నించారు. ఆయన ఎందుకు మౌనం దాల్చుతున్నారని నిలదీశారు. కేసుల భయమా..? లేక మరేదైనా కారణమా..? అని ఎద్దేవా చేశారు. పదేండ్ల బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణలోని బొగ్గు గనులను వేలం వేయటానికి కేంద్రం సాహసించలేకపోయిందని కేటీఆర్‌ ఈ సందర్భంగా చెప్పారు. అప్పట్లో మాజీ సీఎం కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాయటంతో వాటి జోలికి రాలేదని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పరిస్థితి అంతా తారుమారైందని వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో రెండు కోల్‌ బ్లాకులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థ అయిన మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు, ఒడిశాలో రెండు లిగ్మైట్‌ గనులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థలకు ఇచ్చారని తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా వేలం విషయమై అభ్యంతరం తెలిపితే…ఎలాంటి వేలం లేకుండానే అక్కడి లిగ్మైట్‌ గనులను కేటాయించారని వివరించారు.ఆ మూడు రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ని సింగరేణికి మాత్రం ఎందుకు గనులు కేటాయించటం లేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు లేవనే కారణంతో, నష్టాల బూచి చూపి, దాన్ని ప్రయివేటీకరించేందుకు కేంద్రం పావులు కదిపిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో సింగరేణికి కూడా అదే దుస్థితి ఎదురుకానుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే బొగ్గు బ్లాకుల వేలానికి కేంద్రం పూనుకుందని వాపోయారు. ఈ వేలం ప్రక్రియలో ఎందుకు పాల్గొంటున్నా రో చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికులు సైతం ఈ దుర్మార్గంపై ఆలోచించాలనీ, సంస్థను కాపాడుకునేందుకు నడుం బిగించాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి అయిన కిషన్‌రెడ్డి.. తెలంగాణకు ఏదో చేస్తారనుకుంటే, ఆయన ఇచ్చే రిటర్న్‌ గిఫ్ట్‌ సింగరేణిని ప్రయివేటీకరించటమేనా..? అని ఎద్దేవా చేశారు. లోక్‌సభలో బీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్యం లేకపోవటంతోనే కేంద్రం ఇలాంటి చర్యలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ గద్దలకు బొగ్గు గనుల ను కేటాయిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ‘నాలుగు న్నరేండ్ల తర్వాత మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేస్తాం, ఇప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం… అందువల్ల వేలంలో పాల్గొనే వాళ్లు ఆలోచించుకోవాలి…’ అని కేటీఆర్‌ ఈ సందర్భంగా సూచించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రెండు, మూడు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

Spread the love