ఒరిస్సా రైలు ప్రమాదం పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి

– క్విట్‌ ఇండియా డే సందర్భంగా దేశవ్యాప్త ఉద్యమం
– అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌
న్యూఢిల్లీ : ఒరిశా రైలు ప్రమాదం తర్వాత కూడా కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తు న్నదని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ విమర్శించారు. తెలంగాణ, ఏపీ భవన్‌లో మీడియాతో బి.వెంకట్‌ గురువారం మాట్లాడారు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంలో మృతిచెందినవారిలో అత్యధికమంది జనరల్‌ బోగీల్లో వున్న పేదలు, కార్మికులు, కూలీలేనని తెలిపారు. వారిలోనూ వలస కార్మికులే అధికమని చెప్పారు. అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కష్టజీవులు మరణిస్తే కేంద్రం కనికరం లేకుండా వ్యవహరి స్తున్నదనీ, వారి శ్రమతో వస్తున్న సంపద మీద ఉన్న ప్రేమ, వారి ప్రాణాలపై లేదని విమర్శించారు. సాధారణ ప్రజలు ఎక్కే రైళ్లను కుదిస్తూ సంపన్నులకు అనుకూలమైన రైళ్లను కేంద్రం ప్రారంభిస్తున్నదని విమర్శించారు. జనరల్‌ బోగీలను కుదించి ఏసీ బోగీలను ఏర్పాటుచేస్తున్నారని, రైల్వే వ్యవస్థను మోడీ ప్రభుత్వం ఉన్నత వర్గాల వారి కోసం మార్చేసిందని విమర్శించారు. రైలు ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలు పెంచాలనీ, కరోనా అనంతరం రద్దు చేసిన సాధారణ ప్రజలు ఎక్కే పాసింజర్‌ రైళ్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని రైల్వే బోర్డు అధికారులను వ్యవసాయ కార్మిక సంఘాల బృందం కలిసే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. గత 50 రోజులుగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనను విస్మరించి దోషులకు అండగా నిలిచిన మోడీ ప్రభుత్వం చర్యలను వ్యవసాయ కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు.
కేంద్రం ప్రకటించిన ఎంఎస్‌పీ రైతులకు ఉపయోగకరంగా లేదు
స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులకు అనుగు ణంగా రైతుల పంటలకు ఎంఎస్‌పీకి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయాన్ని ప్రయివేటికరించేలా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లు, కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘం క్విట్‌ ఇండియా డే సందర్భంగా దేశవ్యాప్త ప్రచార ఉద్యమం నిర్వహిస్తుందని తెలిపారు.

Spread the love