న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వ హయాంలో ”క్షీణిస్తున్న ప్రజాస్వామ్యం” స్థాయికి భారత్ ప్రతిష్ట దిగజారిన సిగ్గుచేటైన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దాచిపెట్టింది. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు సీనియర్ అధికారుల నాయకత్వంలో ఇప్పటికే అండర్ కవర్ ఆపరేషన్లు ప్రారంభమయ్యాయని గార్డియన్ పత్రిక పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
లండన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే ‘ది ఎకనామిస్ట్’ ఇంటెలిజెన్స్ విభాగం ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య సూచికను రూపొందించింది. ఆ సూచికలో, వరుసగా మూడేళ్ల నుండి భారత్‌ను ‘క్షీణిస్తున్న ప్రజాస్వామ్య’ దేశంగా వర్గీకరించినట్లు వెల్లడైంది. అమెరికా ప్రభుత్వ సాయంతో పనిచేసే ‘ఫ్రీడమ్ హౌస్’ సంస్థ భారత్‌ను ‘పాక్షిక స్వేచ్ఛలు’ కలిగిన దేశంగా అంచనా వేసింది. స్వీడన్‌కి చెందిన వి-డెమ్ ఇనిస్టిట్యూట్ అయితే భారత్‌ను ‘ఎన్నికైన నియంతృత్వం’గా బహిరంగంగానే వ్యాఖ్యానించింది.
భారత్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గల పేరు ప్రతిష్టలను పోగొట్టుకుందని ఆరోపణలు వస్తుండడంతో స్పందించిన కేంద్ర మంత్రులు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని పేర్కొన్నారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం, ముస్లింలకు మినహా మిగిలిన శరణార్ధులకు పౌరసత్వాన్ని మంజూరు చేసేందుకు చట్టాన్ని చేయడం బహుశా ఇంతటి పేలవమైన ర్యాంక్ రావడానికి కారణమై వుంటాయని అధికారిక అంచనా.