– మత రాజకీయాలను బీజేపీ రెచ్చగొడుతోంది
– సీిఎం, డిప్యూటీ సీిఎం
– ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలి : సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
ఏలూరు : తిరుమల తిరుపతి దేవస్థానాన్ని (టిటిడిని) హైజాక్ చేసి తన గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని, దీన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ కనకదుర్గ ఆలయాలతోపాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలనూ తన వశం చేసుకుని పెత్తనం చేస్తుందని ఎపి రైతు సంఘం పూర్వ రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ(ఎం)ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ అధ్యక్షతన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో రాష్ట్ర స్థాయి రైతు సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తొలిరోజు వి.శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. టిటిడిలో నెలకొన్న లడ్డూ సమస్య మతం రంగు పులుముకుని ఉన్మాదంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తమ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుండగా, బిజెపి నాయకులు సిబిఐకి అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రూ.వేల కోట్లు ఆదాయం వచ్చే టిటిడిని లాగేసుకోవాలని చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కుంపటి రగిలించి మత రాజకీయాలు చేయాలని బిజెపి చూస్తోందన్నారు. పార్టీల మధ్య గొడవ మత రాజకీయాల కుట్రకు దారి తీస్తోందని, ఇది దేశానికి మంచిది కాదని తెలిపారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ ఏ ఉద్దేశంతో చెబుతున్నారో అర్థం కావట్లేదన్నారు. సంప్రదాయాలను అందరూ గౌరవించాలని, అదే క్రమంలో వర్ణాశ్రమం, అంటరానితనం, స్త్రీల పట్ల వివక్ష వంటి వాటిని వ్యతిరేకించాలని పేర్కొన్నారు. అంతేతప్ప, ‘మేము శాసిస్తాం. మీరు అమలు చేయండి’ అనే రీతిన ఉండకూడదన్నారు. రాష్ట్రంలోని నాయకులు కేంద్రానికి అవకాశం ఇచ్చే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు.
దీన్ని పవన్‌కల్యాణ్, ఆయన అనుచరులు గుర్తించాలని, రాష్ట్రాన్ని యుపిగా మార్చే అవకాశం ఇవ్వకూడదని అన్నారు. రాష్ట్రంలో ప్రజల మధ్య శాంతి, సామరస్యాలు ఉన్నాయని తెలిపారు. వాటిని చెడగొట్టి మతోన్మాద విస్తరణకు అవకాశం ఇవ్వకూడదన్నారు.
రైతు ఆదాయం పెరిగితేనే దేశాభివృద్ధి
మోడీ ప్రభుత్వ విధానాలు రైతులను చిదిమేస్తున్నాయని వి.శ్రీనివాసరావు తెలిపారు. కంగనా రనౌత్ మాటలు బిజెపి నాయకులకు రైతులపైగల ద్వేషానికి నిదర్శనమన్నారు. దేశం అభివృద్ధి చెందుతోందంటూ మోడీ చెబుతున్న మాటలు పచ్చి అబద్దాలని తెలిపారు. రైతు సంపద ఎక్కడ పెరిగిందని ప్రశ్నించారు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లోకి వెళ్తోందన్నారు. గిట్టుబాటు ధర చట్టం చేసి అమలు చేస్తానని చెప్పిన మోడీ… రైతులను మోసం చేశారని వివరించారు. కార్పొరేట్ల కోసం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారన్నారు. గిట్టుబాటు ధర చట్టం చేసి దానిని అమలు చేయని వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. రైతుల ఆదాయం పెరిగితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. 30 ఏళ్ల క్రితం వ్యవసాయ రంగంలో 62 శాతం మంది ఉండేవారని, ఇప్పుడు అది 50 శాతానికి పడిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో ఈ పదేళ్లలో నాలుగున్నర లక్షల ఎకరాల వ్యవసాయ భూమి తగ్గిపోయిందన్నారు. ఇది అభివృద్ధా? వినాశనమా? అని ప్రశ్నించారు. సహకార, పంచాయతీ వ్యవస్థలను కేంద్రం తమ చేతుల్లో పెట్టుకుంటోందని, రైతులు తమ హక్కుల కోసం పోరాడితే కేసులు పెడుతోందని తెలిపారు.