వక్ఫ్‌ ఆస్తులపై కేంద్రం కన్ను

వక్ఫ్‌ ఆస్తులపై కేంద్రం కన్ను– బోర్డు అధికారాలను పరిమితం చేయాలని యోచన
– చట్ట సవరణలకు క్యాబినెట్‌ ఆమోదం
– వచ్చే వారం పార్లమెంటులో బిల్లు
న్యూఢిల్లీ : వక్ఫ్‌ ఆస్తులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం కన్నేసింది. వాటిపై వక్ఫ్‌ బోర్డ్‌కు ఉన్న అధికారాలను పరిమితం చేయాలని భావిస్తోంది. ఇందుకోసం వక్ఫ్‌ బోర్డ్‌ చట్టానికి సవరణలు చేయాలని యోచిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర క్యాబినెట్‌ శుక్రవారం 40 సవరణలకు ఆమోదం తెలిపింది. ఏదైనా ఆస్తిని ‘వక్ఫ్‌ ఆస్తి’గా పరిగణించేందు కు బోర్డుకు ఉన్న అధికారాలను కుదించాలన్న ప్రధాన సవరణ కూడా వీటిలో ఉంది. ‘చట్ట సవరణల ప్రకారం ఆస్తులకు సంబంధించి వక్ఫ్‌ బోర్డు తీసుకునే అన్ని నిర్ణయాల పైన విధిగా పరిశీలన జరుగుతుంది. తనకు చెందినవిగా వక్ఫ్‌ బోర్డు చెప్పుకునే ఆస్తులపై తప్పనిసరిగా పరిశీలన జరపాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది’ అని ఆ వర్గాలు తెలిపాయి.ఈ సవరణలకు సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వక్ఫ్‌ బోర్డు ప్రస్తుతం 8,70,000 ఆస్తులను పర్యవేక్షిస్తోంది. వీటి విస్తీర్ణం 9,40,000 ఎకరాలు. 1975వ సంవత్సరం నాటి వక్ఫ్‌ చట్టానికి సవరణల ద్వారా 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ బోర్డుల అధికారాలను బలపరిచింది. కాగా సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌లోనూ, రాష్ట్ర బోర్డుల్లోనూ మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని సవరణల్లో ప్రతిపాదించారు. ఆస్తులపై హక్కులకు సంబంధించి రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులకు విస్తృత అధికారాలు ఉన్నాయని, అనేక రాష్ట్రాల్లో ఆ ఆస్తుల సర్వేలో జాప్యం జరుగుతోందని కేంద్రం గుర్తించిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆస్తుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వాటి పర్యవేక్షణలో జిల్లా మెజిస్ట్రేట్లను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Spread the love